20, జులై 2022, బుధవారం

కోమలాంగా - శీతలాంగా

 కోమలాంగా - శీతలాంగా


1958వ సంవత్సరం. పరమాచార్య స్వామివారు చాతుర్మాస్యం తరువాత మాంబళం శ్రీ జి.వి. కళ్యాణరామ అయ్యర్ గారి ఇంట్లో ఎంతోకాలం బస చేశారు. అప్పుడు మైలాపూర్ లో ఒక ప్రముఖ ప్రవచనకారులు రోజూ ప్రవచనం చెప్పేవారు. ఒకరోజు నేను కూడా ప్రవచనానికి వెళ్లాను. ఆయన అప్పయ్య దీక్షితుల శ్లోకాన్ని ఇలా చెప్పాడు.


మౌళౌ గంగాశశాంకౌ కరచరణతలే కోమలాంగా భుజంగా 

వామే భాగే దయార్ద్ర హిమగిరి దుహితా చందనం సర్వగాత్రే, 

ఇత్థం శీతం స్రభూతం కసక సభా నాథ! సోఢుం క్వశక్తిః ? 

చిత్తే నిర్వేదతప్తే యది భవతి న తే నిత్యవాసో మదీయే.


దాన్ని ఇలా వివరించారు.


నీ తలపై గంగ మరియు చంద్రుడు. కాళ్ళు చేతులపైన చల్లని సర్పాలు. నీ ఎడమవైపేమో దయాసముద్రుని అయిన హిమవంతుని కూతురు, నీవేమో ఒళ్ళంతా చల్లని చందనం పూసుకున్నావు. ఓ కనకసభాపతీ! అంత చల్లదనాన్ని ఎలా భరిస్తున్నావు? నేను చేసిన తప్పుల వల్ల వెచ్చగా ఉండే న హృదయ కుహరంలో శాశ్వతంగా నివసించు తండ్రీ.


నాకు శ్లోకంలో ఎందుకో కాస్త తప్పు అనిపించింది. కోమలమైన సర్పాలకు చల్లని వస్తువులపైన ఉండడమెందుకు? ఇన్ని చల్లని వస్తువుల మధ్యన కోమలమైన సర్పములు ఎందుకు? చల్లదనం ఉంటే కోమలత్వం ఎందుకు పోతుంది?

కోమలాంగా భుజంగా - కాదు కాదు; బహుశా శీతలాంగా భుజంగా అనునదే ఇక్కడ సరైన ప్రయోగమేమో?


మరుసటిరోజు మహాస్వామి వారితో మాట్లాడడానికి సమయం దొరికినప్పుడు, చూచాయగా నా అభిప్రాయాన్ని తెలిపాను. ‘శీతలాంగా’ అన్న పద ప్రయోగాన్ని పరమాచార్య స్వామి వారు మెచ్చుకున్నారు.


ఆ ఉపన్యాసకుణ్ణి రమ్మని కబురుచేసి, వారి ఉపన్యాసాన్ని ఎంతో మెచ్చుకున్నారు స్వామివారు. “మౌళౌ గంగా శ్లోకాన్ని అద్భుతంగా వివరించారని తెలిసింది. ఈ పిల్లవాడు కూడా దాన్ని విన్నాడు . . .” అని మొదలుపెట్టి రాత్రి తొమ్మిది గంటల నుండి మధ్యరాత్రి దాకా వివిధ కోణాల్లో ఈ శ్లోకం గురించిన వివరణ ఇచ్చారు స్వామివారు.


“కోమలాంగా అన్న పదం కాకుండా శీతలాంగా అన్న పదం సరిగ్గా కుదురుతుంది అని ఈ అబ్బాయి ఆలోచన. అదే సరి అయినది అని నాకు కూడా అనిపించింది. ఇప్పటినుండి దాన్ని శీతలాంగా భుజంగా అని అచ్చు వేయిద్దాము” అని తమ నిర్ణయాన్ని తెలిపారు స్వామివారు.


నాకు మరియు ఇతర విద్వాంసులకు కలిగిన ఆనందం వర్ణనాతీతం. నేను చెప్పిన ఒక పదాన్ని స్వామివారు గుర్తించి దాన్ని ఆచరణలో పెట్టిన విధానాన్ని తలచుకుంటేనే నాకు ఒళ్ళు పులకిస్తుంది.


--- బ్రహ్మశ్రీ రామకృష్ణ దీక్షితర్, కంచి శ్రీమఠం విద్వాన్. మహా పెరియవాళ్ - దరిశన అనుభవంగళ్ 1


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।


టెలిగ్రామ్ ఆప్ ద్వారా కంచి పరమాచార్య వైభవం పొందాలనుకునేవారు ఈ టెలిగ్రామ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వగలరు.


t.me/KPDSTrust


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

కామెంట్‌లు లేవు: