20, జులై 2022, బుధవారం

ఆధిక్యత కులం..(

 :-ఆధిక్యత కులం..(M.N.Srinivas) :-

ప్రతీ చోటా ఏదో ఒక కులం రాజకీయ, సామాజిక, ఆర్థిక రంగాలలో ఆధిపత్యం ప్రదర్శించడం అనే దృగ్విషయం పై ప్రముఖ సోషియాలజిస్ట్ M.N.శ్రీనివాస్ తన

 'సోషియల్ ఛేంజ్ ఇన్ మాడరన్ ఇండియా'  మరియు ఇతర పుస్తకాలలో చర్చించాడు.  'ఆధిక్యత కులం' భావనను తన  కర్ణాటక లోని గ్రామీణ ప్రాంతాల్లో పరిశీలన తరువాత ఆయన రూపొందించారు.

     M. N. శ్రీనివాస్ కర్ణాటక లోని 'రాంపూర్ 'అనే గ్రామంలో  జరిపిన అధ్యయనంలో 'ఆధిక్యత కులం ' అనే భావనను  గ్రహించి ప్రతిపాదించారు. ఆయన ఉద్దేశ్యం లో  గ్రామీణ ప్రాంతంలో ఈ 'ఆధిక్యత కులం 'అనేది ప్రముఖ పాత్ర వహిస్తోంది.ప్రతి గ్రామంలోనూ ఒక ఆధిక్య కులం ఉంటుంది.ఆ ఆధిక్య కులం ఆ గ్రామం లోని అన్ని వ్యవహారాలను కంట్రోల్ చేస్తూ ఉంటుంది .

ఆధిక్య కులం లక్షణాలను  M.N.శ్రీనివాస్ గారు  తెలియచేశారు.

*ఆ గ్రామంలో అధిక వంతు భూములు కలిగి ఉండడం.

*రాజకీయ ఆధిక్యత.

*ఆర్థికంగా ఉన్నత స్థితిలో ఉండడం.

*ఇంగ్లీష్ చదువు/పాశ్చాత్య విద్య.

*అవసరమైతే హింసను ఉపయోగించగలగడం.

*ప్రభుత్వ ఉద్యోగాలలో అధిక భాగం సంపాదించడం.

     పై లక్షణాలను M.N . శ్రీనివాస్ గారు విపులంగా తెలియజేశారు.

వారు చెప్పిన విషయాలను మనం నిత్య జీవితంలో చూడగలం.ఏ గ్రామం, ప్రదేశం, రాష్ట్రంలో చూసినా మనకు ఈ విషయాలు స్పష్టంగా అర్థం అవుతాయి.

ప్రతీ చోట ఏదో ఒక కులం ఆధిపత్యం లో ఉంటుంది.ఉదాహరణకు 

గ్రామ  వార్డు మెంబర్ , సర్పంచి ,సింగిల్ విండో చైర్మన్, ఎమ్.పి.టి.సి,జెడ్.పి.టీ.సీ.,మండలాధ్యక్షుడు,ఎమ్.ఎల్.ఏ,ఎమ్.పి.,ఇంకా ఆ పై స్థాయి పోస్ట్ లు అన్నింటిలో ఆయా ఆధిపత్య కులం వారే ఉంటారు. అన్నింటిలో కాకపోయినా చాలా వాటిలో వారే ఉంటారు.వీటిలో కొన్ని, రిజర్వేషన్లు, రాజకీయ పరిస్థితుల వలన ఇతరులకు లభించినా , తమకు అనుకూలమైన వారిని నియమించుకోవడం, లేదా నియామకం అయిన వారిని నయానో భయానో  తమకు అనుకూలంగా మలచుకొంటారు.అధికారులను కూడా తమకు అనుకూలంగా మలచుకుంటారు. వారి నిర్ణయాలను ప్రభావితం చేస్తారు. వీరు తమకన్నా పై స్థాయి రాజకీయ నాయకులను కూడా ప్రభావితం చేస్తారు. వీరి మద్దతు లేకపోతే భవిష్యత్తు లో తాము ఎన్నికలలో గెలవలేమని పైస్థాయి నాయకులకు తెలుసు. ఇక అధికారుల పోస్టింగ్ లలో తమ కులపు వారికి ప్రాధాన్యత ఇస్తారు.ప్రభుత్వ పరంగా వచ్చే అన్ని రకాల కాంట్రాక్టులు, సబ్సిడీ లు,రాయితీలు  వీరు చేజిక్కించుకుంటారు. తమకు పోటీకి వచ్చిన వారిని ఏదోవిధంగా ప్రభావితం చేసి పక్కకు తప్పిస్తారు. అలాగే ఉద్యోగ సంఘాలు, ఇతర ప్రభావ వర్గాలలో కూడా పట్టు సంపాదిస్తారు. ఊరిలో ఏ కార్యక్రమం జరిగినా వీరి ముందస్తు అనుమతి తప్పనిసరి.ఎన్నికల సమయంలో తమకు అనుకూలమైన వారికి ఓట్లు వేసే విధంగా ప్రజలను ప్రభావితం చేస్తారు.


ఇకపోతే గ్రామీణ సమాజంలో భూమికి  ఉన్న ప్రాధాన్యత చాలా ఎక్కువ. భూమి చుట్టూ అన్ని వ్యవహారాలు, జీవనోపాధి ఉంటుంది. వ్యవసాయ కూలీలు, వృత్తి పని వారు,పశు పోషకులు  భూమి పైనే ఆధారపడతారు.ఎక్కువ భూమి ఉన్న వాడు ఆ గ్రామంలో మోతుబరి కావడం సహజం. హరిత విప్లవం వచ్చిన తరువాత భూమి కల వర్గం సహజంగానే అత్యున్నత స్థాయి కి చేరిపోయింది.ఈ వర్గం ఆర్థిక పరిస్థితి కూడా ఉన్నత స్థాయికి చేరిపోయింది.రియల్ ఎస్టేట్ తదితర రంగాలలో కూడా ఆధిక్యత కలిగి ఉండడం, భూముల ధరలు పెరగడంతో వీరు  మరింత లబ్ధి పొందారు.

ఇక మిగిలిన అంశాలన్నీ ఆర్థిక, రాజకీయ పరిస్థితుల ఆధారంగా సహజంగా ఏర్పడతాయి.

కర్ణాటక లో ఒక్కలిగ, లింగాయతులు, కేరళలో నాయర్ లు మొదలైనవి  'ఆధిక్య కులాలు 'గా‌ చెప్పవచ్చును. ఉత్తర భారతం లో కుల పార్టీలు హవా చూపిస్తున్న సంగతి తెలిసిందే. అక్కడ కొన్ని కులాలకు ప్రాధాన్యత ఉంది.

ఐతే ఇటీవల కాలంలో రిజర్వేషన్లు, జనాభా పెరుగుదల, చట్ట పరమైన మద్దతు ,విద్య ,రాజకీయ చైతన్యం, తదితర కారణాల వల్ల వెనకబడిన తరగతులు, తదితర కులాలలో కొన్ని ఆయా ప్రాంతాల్లో ఆధిక్య కులాల రూపం పొందుతున్నాయని చెప్పవచ్చును.

  ఇక బ్రాహ్మణుల విషయంలో రాజరికం కాలంలో ఉన్నత స్థాయి అనుభవించిన బ్రాహ్మణులు కాలక్రమేణా అటువంటి ఆధిక్యతను ప్రస్తుత ప్రజాస్వామ్య కాలంలో క్రమక్రమంగా కోల్పోయినారని చెప్పవచ్చు.

        (సమాప్తం)

కామెంట్‌లు లేవు: