21, అక్టోబర్ 2022, శుక్రవారం

Srimadhandhra Bhagavatham

 Srimadhandhra Bhagavatham -- 32 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


ఒకరోజున సతీదేవి అంతఃపుర పైభాగంలో నిలబడి చూస్తోంది. పైన అందరూ విమానములలో వెళుతూ వాళ్ళు ‘దక్షప్రజాపతి యాగం చేస్తున్నాడు ఆహ్వానం వచ్చింది. అందుకని మనందరం వెడుతున్నాం’ అని చెప్పుకుంటుంటే ఆవిడ విని గబగబా అంతఃపురంలోంచి క్రిందికి దిగి శివుడి దగ్గరకు వచ్చి ‘స్వామీ! పుట్టింట్లో ఏదయినా ఉత్సవము జరుగుతున్నప్పుడు ఆడపిల్ల మనసంతా పుట్టింటికి వెళ్ళాలని ఉంటుంది. మా నాన్నగారు యాగం చేస్తున్నారట. నాకు నా తండ్రిగారు చేస్తున్న యాగమునకు వెళ్ళాలని అనిపిస్తోంది. మనం కూడా యాగానికి వెళదాం’ అన్నది. తమకు ఆహ్వానం రాలేదు కదా అన్నట్లుగా శంకరుడు సతీదేవికేసి చూశాడు. ఆయన మనస్సులోని భావనను ఆమె పసిగట్టి ‘కొంతమంది పిలిస్తేనే వెళ్ళాలి కొంతమంది పిలవకపోయినా వెళ్ళాలి. తండ్రిగారి ఇంటికి పిలవకుండానే ఆడపిల్ల వెళ్ళవచ్చు అన్నది. శంకరుడు ‘దేవీ! నీవు చెప్పినది యధార్థమే. పిలుపు లేకపోయినా సరే పుట్టింటికి ఉత్సవము జరుగుతున్నప్పుడు ఆడపిల్ల వెళ్ళవచ్చు. నేను కూడా ఒక మాట చెపుతాను విను. నేను లేచి నమస్కరించ లేదని నీ తండ్రిగారు నన్నొక సభలో అవమానం చేసి మాట్లాడారు. ఇప్పటికి కూడా వారు నాయందు అనుకూల్యతతో ఉండరు. ఇప్పుడు మనం వెడితే తలుపు తీసి అసలు పలుకరించరు. వాళ్ళు మనలను చాలా దారుణముగా అవమానిస్తారు. బంధువయినా సరే ఆదరణ లేనప్పుడు ఎంతగొప్పవాడి గడప తొక్కకుండా ఆర్యులు ఉండవచ్చు వెళ్ళవద్దు’ అని చెప్పాడు. ఆవిడ ‘నాకు వెళ్ళాలని అనిపిస్తోంది’ అన్నది. శివుడు ‘అయితే నీవు వెళ్ళవచ్చు’ అన్నాడు ఆయన త్రికాలజ్ఞుడు అన్నీ తెలుసు.

తల్లి పుట్టింటికి బయలుదేరింది. ఆమె కాళ్ళకు ఉన్నటువంటి గజ్జెలు మ్రోగుతుండగా పట్టుపుట్టం కట్టుకుని బయలుదేరితే వెంటనే శివుడు సైగ చేశాడు. ప్రమథగణములు అందరూ అమ్మవారి వెంట బయలుదేరారు. అమ్మవారి పుట్టింటికి వచ్చేసరికి దక్షప్రజాపతి ఎదురుగుండా కూర్చుని ఉన్నాడు. పరవారం అంతా కూర్చుని ఉన్నారు. వృషభవాహనం దిగి సతీదేవి ఇంట్లోకి వస్తోంది. ఏ తల్లి అనుగ్రహము ఉంటే పసుపు కుంకుమలు నిలబడతాయో, ఏ తల్లి అనుగ్రహము ఉంటే ఐశ్వర్యం వస్తుందో ఆ తల్లి తన కూతురి దాక్షాయణి అని పేరుపెట్టుకుని నడిచి వస్తోంది. దక్షుడు లేవలేదు పలకరించలేదు. తండ్రి తన భర్తను నిందించాడు. వచ్చిన కూతురు మీద తండ్రి ప్రేమను చూపించలేదు. ఆమె చాలా బాధపడింది. దీనిని మణిభద్రుడన్నవాడు చూశాడు. అమ్మవారు ఉగ్రమయిన తేజస్సుతో చూస్తోంది. ఆమె సమస్తబ్రహ్మాండములను కాల్చివేయగల శక్తి. ప్రమథగణములు చూసాయి. విచ్చుకత్తులు పైకి తీసి ఈ దక్షుడిని చంపి అవతల పారేస్తామన్నాయి. అమ్మవారు వారించింది. దక్షుడిని తనవద్దకు పిలిచి పరమశివుని నీ చిత్తం వచ్చినట్లు కూశావు. నీకొక మాట చెపుతున్నాను ‘ఎవరయినా శంకరుణ్ణి నిందచేస్తే వాని నాలుక పట్టి పైకి లాగి కొండనాలుక వరకు కత్తితో కోసివేయవచ్చు. అలా నీకు చేయడానికి అధికారము లేని పక్షంలో ఉత్తరక్షణం శివనింద ఎక్కడ జరిగిందో అక్కడ చెవులు మూసుకుని బయటకు వెళ్ళిపోయి ప్రాయశ్చిత్తంగా ఆ రోజు అన్నం తినడం మానివేయాలి. నువ్వు దుర్మార్గుడివి. దుష్టాత్ముడివి. శంకరుణ్ణి నిందచేశావు. నేను ఇవాళ ఒక నిర్ణయం తీసుకున్నాను. ఇకముందు నేను ఎప్పుడయినా పరమపవిత్రుడయిన శంకరుని సాన్నిధ్యంలో కూర్చుని వుంటే దాక్షాయణీ అని పిలుస్తారు. దుర్మార్గుడవయిన నీ కుమార్తెగా పిలిపించుకోవడానికి నేను ఇష్టపడను. నేను ఈ శరీరమును వదిలిపెట్టేసి అగ్నిహోత్రంలో కలిసిపోతాను’ అని పద్మాసనము వేసుకుని కూర్చుని ప్రాణాపానవ్యాన వాయువులను నాభిస్థానమునందు నిలబెట్టింది. ఆపైన ఉదానవాయువును హృదయం మీద నుంచి పైకి తీసుకువచ్చి కనుబొమల మధ్యలో నిలబెట్టి ఇంద్రియములు అన్నిటిలో నుంచి అనిలము అనే అగ్నిని ప్రేరేపణ చేసి ఆ యోగాగ్నియందు శరీరమును దగ్ధం చేసి బూడిదకుప్పయి క్రిందపడిపోయింది. సభలో హాహాకారములు మిన్నుముట్టాయి. ప్రమథగణములకు ఎక్కడలేని కోపంవచ్చి కత్తులుతీసి దక్షుడి మీద పడ్డారు. భ్రుగుడికి చాలా సంతోషం కలిగింది. వెంటనే హోమం చేసి అందులోంచి ‘రుభులు’ అనబడే దేవతలను సృష్టించి రుద్రగణములను తరిమి కొట్టించాడు. ఈ విషయములను నారదుడు వెళ్ళి శంకరునకు చెప్పాడు. ఆయన ప్రశాంతముగా ధ్యానమగ్నుడై కూర్చుని ఉన్న శంకరునకు ఎక్కడలేని కోపం వచ్చింది. శాంతమూర్తి శివుడు రుద్రుడయి ఒక్కసారి లేచి పెద్ద వికటాట్టహాసం చేసాడు. ఆ నవ్వుకి బ్రహ్మాండములు కదిలిపోయాయి. మెరిసిపోతున్న జటనొకదానిని ఊడబెరికి నేలకేసి కొట్టాడు. ఒక్కసారి అందులోంచి ఒక పెద్ద శరీరం పుట్టింది. ఆ శరీరమును చూసేటప్పటికి అందరు హడలిపోయారు. వీరభద్రావతారం ఉద్వేగముతో ఒక్కసారి దూకి శంకరుని పాదములకి నమస్కరించి బయల్దేరాడు. బయల్దేరేముందు పరమశివుడికి ప్రదక్షిణం చేసి ‘తండ్రీ! నాకు ఏమి ఆనతి?’ అని అడిగాడు. శంకరుడు ‘సతీదేవి శరీరమును విడిచిపెట్టింది. దక్షయజ్ఞమును ధ్వంసం చెయ్యి’ అన్నాడు.

వీరభద్రుడు ఒక పెద్ద శూలం పట్టుకు బయలుదేరాడు. ఆయనతో ప్రమథ గణములన్నీ వస్తున్నాయి. ఆ శబ్దమును యాగంలో వున్న వాళ్ళు విన్నారు. దక్షప్రజాపతి భార్య ఉపద్రవం వచ్చేసింది అనుకున్నది. వీరభద్రుడు రుద్రగణములతో కలిసి యజ్ఞమంటపములన్నిటినీ పడగొట్టేశాడు. పిమ్మట నందీశ్వరుడు భ్రుగువు దగ్గరకు వెళ్ళాడు. ‘ఆనాడు సభలో శంకరనింద జరుగుతుంటే కళ్ళు ఎగురవేసిన వాడివి నీవేకదా! ఇప్పుడు దానికి తగినశిక్ష అనుభవిస్తావు’ అని గడ్డం క్రింద ఎడమచెయ్యి వేసి పట్టుకొని ముంజికాయను బొటనవ్రేలు పెట్టి పైకెత్తేసినట్లు బొటనవేలితో రెండు కనుగుడ్లు ఉత్తరించేశాడు. భ్రుగుడి కళ్ళు ఊడి క్రిందపడిపోయాయి. ‘పూష’ అనే సూర్యుడు ఉన్నాడు. ‘ఏమయ్యా! నువ్వు శంకరనింద జరుగుతుంటే నోరు పెద్దగ తెరచి నవ్వావు. నీకు శిక్ష చూడు’ అని ఆయన నోటిని గట్టిగా పట్టుకుని నొక్కారు. రెండుదవడలు తెరిచి పళ్ళు పీకేశారు. ఆఖరున వీరభద్రుడు దక్షప్రజాపతి దగ్గరకు వెళ్ళాడు. ఆయనను క్రిందపారేసి గుండెలమీద ఎక్కి కూర్చుని కత్తితో కంఠమును కోసేశాడు. దక్షుని శరీరం అంతా మంత్రపూతము కంఠం తెగలేదు ఆశ్చర్యపోయాడు. ఎలా త్రుంచాలని ఆలోచించాడు. ‘ ఈ దుర్మార్గుడు శివ నింద చేసినందుకు యజ్ఞపశువు శరీరమును తుంచినట్లు తుంచేస్తానని గుండెలమీద కుడికాలు వేసి తొక్కిపట్టి తోటకూరకాడను తిప్పినట్లు కంఠమును తిప్పి ఊడబెరికి దానిని తీసుకువెళ్ళి యజ్ఞములో వెలుగుతున్న అగ్నిహోత్రములో పడేసాడు. ఆ శిరస్సు యజ్ఞంలో కాలిపోయింది. తలలేని మొండెం ఉండిపోయింది. అక్కడ వాళ్ళని రక్షించినవాడు లేదు. శివనింద ఎంత ప్రమాదకరమో, భగవంతుని యందు భేదదృష్టి ఎంత ప్రమాదకరమో వ్యాసుల వారు జాతికి భిక్ష పెట్టి చెప్తున్నారు. మనం ఈశ్వరుడిని ఒక్కడిగా చూడడం నేర్చుకోవాలి లేకపోతే పాడైపోతాము. అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరకు వెళ్ళి ‘అయ్యా! పాపకర్మ చేసాము దానివలన ఇంత ఉపద్రవం వచ్చింది. ఏమి చేయమంటావు?’ అని అడిగారు.

బ్రహ్మగారు ‘పరమేశ్వరుడికి యజ్ఞంలో హవిస్సులు లేకుండా యజ్ఞం చేశారా? ఎందుకు ఆ యజ్ఞం? మీకు ఒక్కటే మార్గం. మీరు ఎవరిపట్ల తప్పు చేశారో ఆయన దగ్గరకు వెళ్ళి కాళ్ళమీద పడండి . ఎన్నితప్పులు చేసినా కాళ్ళమీద పడితే రక్షిస్తాడు’ అని సలహా చెప్పాడు. వాళ్ళు ‘మాతో నీవు కూడా రావలసింది’ అని ప్రార్థించారు. ‘సరే పదండి’ అని బ్రహ్మగారు వారితో కైలాసం వెళ్ళారు. వీరు వెళ్లేసరికి అత్యంత ప్రశాంతచిత్తుడై ఒక రావిచెట్టు క్రింద శంకరుడు కూర్చుని ఉన్నాడు. బ్రహ్మగారు వెళ్ళి పరమశివుని ముందు స్తోత్రం చేశారు. అయ్యా! తెలియక నీపట్ల దోషం చేశారు. నీవు సాక్షాత్తు పరబ్రహ్మవు. సృస్టి, స్థితి, లయ ఈ మూడు నీయందు జరుగుతుంటాయి. తెలియని వారు ఈ రకంగా అపచారబుద్ధితో ప్రవర్తించారు. వీరిని క్షమించు’ అన్నారు.

మహానుభావుడు భోళాశంకరుడు కదా! అభయంకరుడు. ‘మీ అందరికీ నిష్కల్మష చిత్తంతో అభయం ఇస్తున్నాను.’ యజ్ఞం మధ్యలో ఆగిపోకూడదు. ఎవరు యజ్ఞము చేయాలో అటువంటి దక్షప్రజాపతికి ఈవేళ ముఖం లేదు. దక్షుని మొండెమునకు గొర్రె ముఖమును తీసుకువెళ్ళి అతికించండి. మిగిలిన యజ్ఞభాగము పూర్తిచేస్తాడు. పూష తానూ ఏదయినా తినవలసి వచ్చినపుడు యజమాని దంతములతో తింటాడు. భ్రుగునికి నేత్రములు ఇస్తాను. ఇకనుంచి తాను తినవలసినటువంటి హవిస్సులు భ్రుగువుకి కనపడతాయి. ఎవరెవరు దెబ్బలు తిన్నారో ఎవరెవరు అంగవికలురు అయ్యారో వాళ్ళందరికీ తిరిగి స్వాస్థ్యమును ప్రసాదిస్తున్నాను. ఈ యజ్ఞమును సంతోషంతో పూర్తి చేసుకోండి’ అని వరములను ఇచ్చేశాడు. దక్షప్రజాపతికి గొర్రె తలకాయ తీసుకు వెళ్ళి పెట్టారు. వెంటనే ఆయన లేచి నిలబడి పరుగెత్తుకుంటూ కైలాసమునకు వచ్చి శంకరుణ్ణి చూసి ప్రార్థన చేశాడు. ‘స్వామీ! నీవు నన్ను దండించడమును రక్షణగా భావిస్తున్నాను. దీనివలన ఇక భవిష్యత్తులో ఎప్పుడూ ఎవరూ ఇటువంటి అపరాధములు చేయకుందురు గాక! నన్ను మన్నించు’ అని నమస్కరించాడు. శంకరుడు వెళ్ళి యాగమును పూర్తిచెయ్యి అన్నాడు. తరువాత దక్షప్రజాపతి తన యజ్ఞమును పూర్తిచేసి శ్రీమన్నారాయణుని స్తోత్రంచేస్తే అప్పుడు ప్రత్యక్షం అయ్యాడు. ‘స్వామీ! నీవు యజ్ఞభర్తవి అని నమస్కరించాడు. ఎవరు దక్షయజ్ఞ ద్వంసమును చదువుతున్నారో వారికి తుట్టతుద ఊపిరి తీస్తున్నప్పుడు ఈశ్వరానుగ్రహం కలిగి శివనామమును చెప్తూ కైవల్యమును పొందగలరు. అంత గొప్ప ఫలితమును దక్షయజ్ఞ ధ్వంసమునకు ప్రకటించారు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

 Srimadhandhra Bhagavatham -- 31 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


కపిలమహర్షి పెరిగి పెద్దవాడయ్యాడు. బిందుసరోవరంలో కూర్చుని తపస్సు చేసుకుంటున్నాడు. కర్దమప్రజాపతి తన భోగోపకరణములనన్నిటిని భార్యకు ఇచ్చి వెళ్ళాడు. భర్త వెళ్ళిపోగానే ఇన్ని భోగోపకరణముల మీద దేవహూతికి వైరాగ్యం పుట్టింది. ‘నా భర్త అంతటి స్థితిని పొందాడు. నేను ఇంకా ఈ సంసార లంపటమునందు ఉండి పోయాను. నేను ఉద్ధరింపబడాలి’ అని అనుకున్నది. దేవహూతి తన కొడుకు అయిన కపిలమహర్షి దగ్గరకు వెళ్ళి ‘నేను ఇంతకాలం మోహాంధకారములో పడిపోయాను. ఈ ఇంద్రియముల సుఖములే సుఖములు అనుకొని ఈ సంసారమునందు ఉండిపోయాను. నీ తండ్రి సంసారసుఖములను అనుభవిస్తూ వైరాగ్య సంపత్తిని పొంది సన్యసించి వెళ్ళిపోయాడు. కాలమునందు నాకు కూడా సమయము అయిపోతున్నది. నేను ఏది తెలుసుకుని మోక్షమును పొందాలో అటువంటి తత్త్వమును నాకు బోధచెయ్యి’ అని అడిగింది.

కపిలుడు చెప్పడం మొదలుపెట్టాడు. దీనినే ‘కపిలగీత’ అంటారు. కపిలగీత విన్న వాళ్లకి ఇంతకాలం ఏది చూసి సత్యమని భ్రమించారో, ఆ సత్యము సత్యము కాదన్న వైరాగ్యభావన ఏర్పడడానికి కావలసిన ప్రాతిపదిక దొరుకుతుంది. ‘అమ్మా! ప్రపంచములో అనేకమయిన జీవరాశులు ఉన్నాయి. అందులో ప్రధానముగా మనుష్యజన్మ చాలా ఉత్కృష్టమైనది. ఈ దేహములు పొందిన వాటిలో ప్రాణములు కలిగినవి మొదట శ్రేష్ఠములు. చెట్లకి ప్రాణం ఉన్నా చెట్లకన్నా గొప్పతనము ఒకటి ఉన్నది. స్పర్శజ్ఞానము కలుగుట చేత వృక్షములకంటే స్పర్శ జ్ఞానము ఉన్నది గొప్పది. స్పర్శజ్ఞానము ఉన్నదానికంటే రసజ్ఞానము ఉన్నది గొప్పది. రుచి కూడా చెప్ప గలిగినటువంటి ప్రాణి గొప్పది. దానికంటే వాసనకూడా చెప్పగలిగిన భృంగములు గొప్పవి. వాటికంటే శబ్దమును వినగలిగిన పక్షులు గొప్పవి. శబ్దములు వినగలిగిన దానికన్నా అనేక పాదములు ఉన్న జంతువు గొప్పది. ఆవు, గేదె, మేక మొదలయిన నాలుగు పాదములు కలిగి సాధుత్వము ఉన్నవి గొప్పవి. నాలుగు పాదములు ఉన్న జీవికంటే శరభము రెండుపాదములు ఉన్న మనిషి సృష్టియందు చాలా గొప్పవాడు.

యథార్థమునకు ఈశ్వరుడు ఒక్కడే. అంతటా నిండి ఉన్నటువంటి పరమాత్మ దర్శనం అందరూ చేయలేరు. ఆ స్వామి పరమభక్తులయిన వారిని ఉద్ధరించడానికి ఒక మూర్తిగా వచ్చి నిలబడ్డాడు. ఒక మూర్తిని నీ హృదయ స్థానమునందు నిక్షేపించు. ఆ మూర్తిని ధ్యానం చెయ్యి. ధ్యానం అంటే ఎలా ఉండాలో తెలుసా! పరమ సంతోషంతో నీ మనస్సును ఆయన పాదారవిందముల దగ్గర చేర్చు. స్వామి సౌందర్యమును అనుభవించడం ప్రారంభిస్తే తేనె మరిగిన సీతాకోకచిలుకలా హృదయము దానియందే రంజిల్లడము మొదలు పెడుతుంది. మనస్సుకి భోగములవైపు వెళ్ళాలని అనిపించదు. ప్రయత్నపూర్వకంగా భక్తియోగమును అనుష్ఠానం చేయాలి. చేతకాకపోతే కనీసం శ్రవణం చేయడము మొదలు పెట్టాలి. ఎవరు భాగవతులతో కూడి తిరుగుతున్నాడో, ఎవరు ధ్యానము లోపల చేయగలుగుతున్నాడో, ఎవడు ఈశ్వరునియందు ఉత్సాహమును పెంచుకుంటున్నాడో వాడు పునరావృతరహిత శాశ్వత శివసాయుజ్యమును పొందుతున్నాడు’ అని చెప్పాడు.

ఆ మాటలను విన్న దేవహూతి భోగములనన్నిటిని తిరస్కరించి శ్రీకృష్ణ పరమాత్మను హృదయమునందు నిలిపి ధ్యానము చేయసాగింది. ఈశ్వర స్మరణము వలన జ్ఞానము పొంది, ఈ విషయములు వినిన తరువాత ప్రయత్న పూర్వకముగా భోగములు ఉద్ధరించేవి కావని తెలుసుకుని, వాటిని త్రోసిరాజని వైరాగ్యమును పొంది, భక్తి వైరాగ్యముల కలయిక వలన జ్ఞానమును పొంది, జ్ఞానమువలన మోక్షమును పొంది, శ్రీకృష్ణ భగవానునియందు చేరి శాశ్వతమును పొందినది. ఇది జీవులందరు విని ఉద్ధరింపబడవలసిన మహోత్కృష్టమయిన గాథ.

చతుర్థ స్కంధము – దక్షయజ్ఞం

చతుర్ముఖ బ్రహ్మగారి శరీరంలోంచి కొంత సృష్టి జరిగిందని గతంలో చెప్పుకున్నాము. ఈశ్వరుని దేహములోంచి వచ్చిన సృష్టి కొంత ఉన్నది. అందులో పదిమంది ప్రజాపతులను ఆయన శరీరమునుండి సృష్టించాడు. అటువంటి వారిలో ఆయన బొటనవ్రేలు నుంచి జన్మించినవాడు దక్షప్రజాపతి. నేత్రములలోంచి జన్మించినవాడు అత్రిమహర్షి. అత్రిమహర్షి సంతానమే ఆత్రేయస గోత్రికులు. దక్షప్రజాపతి పదిమంది ప్రజాపతులకు నాయకుడు దక్షప్రజాపతికి పదహారుమంది కుమార్తెలు. వారికి ఆయన వివాహం చేశారు. అందులో ‘మూర్తి’ అనబడే ఆవిడ గర్భం నుంచి నరనారాయణులు ఉద్భవించారు. వారే బదరీలో తపస్సు చేశారు. ఉద్ధవుడు ఉండడం, నర నారాయణులు అక్కడ తపస్సు చేయడం, ప్రహ్లాదుడు అక్కడికి వెళ్ళడం – ఇలాంటి వాటివలన బదరీ క్షేత్రమునకు అంత గొప్పతనం వచ్చింది. బదరికావనంలో తిరిగాడు కాబట్టి ఆయనకు ‘బాదరాయణుడు’ అని పేరు వచ్చింది. వ్యాసుడు అక్కడ కూర్చుని తపస్సు చేశాడు. భాగవతమును రచన చేశాడు.

బ్రహ్మ బొటనవేలునుండి ఆవిర్భవించిన దక్షప్రజాపతికి కలిగిన కుమార్తెలలో సతీదేవిని రుద్రునకు ఇచ్చి వివాహము చేశారు. దక్షకుమార్తెలలో పదిహేనుమందికి సంతానం కలిగారు. శంకరునికి సతీదేవికి సంతానం కలగలేదు. శివుడు సాక్షాత్తుగా బ్రహ్మము. అటువంటి బ్రహ్మము అయినవాడికి మరల పిల్లలు, హడావుడి ఎక్కడ ఉంటుంది? అటువంటి తత్త్వము కలిగిన శంకరుడు, దక్షప్రజాపతి చాలా అనుకూలముగా, చాలా సంతోషముగా ఉండేవారు.

ఒకానొకప్పుడు ప్రజాపతులు అందరూ కలిసి దీర్ఘసత్రయాగం చేశారు. ఎవరయితే ఋత్విక్కులుగా ఉంటారో వారే యజమానులుగా కూడా ఉండేటటువంటి యాగమునకు సత్రయాగమని పేరు. అక్కడికి బ్రహ్మగారు కూడా వెళ్ళారు. అక్కడ పరమశివుడు కూడా ఉన్నాడు. ఆ సభలోకి దక్షప్రజాపతి ఆలస్యంగా వచ్చాడు. ఆయన కత్తిచేతకూడా నరకబడడు. ఆయన శరీరం అంత మంత్రభూయిష్టం. ఆయనను చూసీ చూడడంతోనే అందరూ లేచినిలబడ్డారు. బ్రహ్మగారు, భర్గుడు మాత్రం లేవలేదు. బ్రహ్మగారు పెద్దవారు కనుక ఆయన లేవనవసరము లేదు. శివుడు బాహ్యమునందు దక్షప్రజాపతికి అల్లుడు. మామగారు పితృపంచకంలో ఒకడు. దక్షుడు లోపలి వచ్చి సభలో లేవని వాళ్ళు ఎవరా అని చూసాడు. అల్లుడు లేవకపోవడముతో కోపం వచ్చేసింది. క్రోధంతో సభలో వున్న వాళ్ళందరినీ చూసి శంకరుని చూపిస్తూ ‘వీడు ఎవడు’ అన్నాడు. అల్లుడు కదా ఎవడు అంటాడేమిటని అందరూ ఆశ్చర్యపోయారు. శివుడు నవ్వుతూ కూర్చున్నాడు. అక్కడ ఉన్నవాళ్ళు లేచి ఈయన శివుడని జవాబిచ్చారు. వీనికి శివుడని పేరు ఎవరు పెట్టారు? వీనిని పట్టుకుని శివుడని పిలిస్తే నాకు యజ్ఞోపవీతం లేని వాడికి, ఉపనయన సంస్కారం జరగని వాడికి స్వరం తెలియనివాడికి వేదము పట్టుకెళ్ళి ఇచ్చినట్టు ఉన్నదని పిస్తుంది అన్నాడు.

భయంకరమయిన శివనింద చేశాడు. ఈవిధంగా దక్షుడు ఇన్ని మాటలు అంటే మంగళం చేసేవాడు కాబట్టి ఆయన ఏమీ అనలేదు. ఆయనకు దూషణ, భూషణ రెండూ ఒక్కలాగే ఉంటాయి. అలా ఉండగలగడము చాలా గొప్ప విషయం. దక్షుడికి ఇంకా కోపం వచ్చేసింది. దక్షుడు తన పరిధిని దాటిపోయాడు. ఇన్ని మాటలన్నా నీవు పలకలేదు. లేవలేదు నమస్కరించలేదు. ఇకనుంచి జరిగేటటువంటి యజ్ఞయాగాది క్రతువులయందు నీకు హవిర్భాగము లేకుండుగాక’ అని శపించాడు. శివుణ్ణి దక్షుడు తిడుతుంటే భ్రుగువుకు సంతోషం కలిగింది. ఇవన్నీ చూసిన నందీశ్వరునకు ఎక్కడలేని కోపం వచ్చింది. శంకరుని పట్టుకుని ఇంతంత మాటలు అంటాడా? నేనూ శపిస్తున్నాను దక్షుడిని. దక్షుడు నుండి సంసారమునందు పడిపోవుగాక! కామమునకు వశుడగుగాక! అని శాపము ఇచ్చాడు. నందీశ్వరుడు శాపం ఇచ్చేసరికి భ్రుగువుకు కోపం వచ్చింది. ఆయన లేచి ఎవరయితే ఈ భూమండలం మీద శంకరుని వ్రతమును అవలంబిస్తారో, అటువంటి వారిని అనుసరించి ఎవరు వెడతారో వారు వేదమునందు విరక్తి కలిగి వేదమును దూషించి కర్మకాండను నిరసించి వారందరూ కూడా జడులై విభూతి పెట్టుకుని జటలు వేసుకుని ఉన్మత్తుల వలె భూమిమీద తిరిగెదరు గాక! అని వేద విరుద్ధమయిన స్థితిని వారు పొందుతారని శాపం ఇచ్చేశాడు. సభలో పెద్ద కోలాహలము రేగిపోయింది. నవ్వుతూ లేచి శివుడు ఇంటికి వెళ్ళిపోయాడు. సతీదేవి ఎదురువచ్చింది. శంకరుడు సభలో జరిగిన సంగతి ఏమీ ఆమెకు చెప్పలేదు. కొన్నాళ్ళయి పోయింది. ఇపుడు ‘నిరీశ్వర యాగం’ అని కొత్త వ్రతం మొదలుపెట్టాడు. దానికి బృహస్పతి సవనమని పేరు పెట్టాడు. దానికి ముందుగా వాజపేయం చేశాడు. వెళ్ళకపోతే ఏమి శపిస్తాడో అని ఆ యాగమునకు అందరూ వెడుతున్నారు. అతడు చేస్తున్న యాగం మామూలుగా చేయడము లేదు. శంకరుడి మీద కక్షతో చేస్తున్నాడు. శ్రీమహావిష్ణువు, బ్రహ్మగారు రాలేదు.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

 Srimadhandhra Bhagavatham -- 34 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu

నారదుని మాటలు విన్న ధృవుడు తప్పకుండా చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు. భగవంతుని ఆరాధన చేసేవాడు. అయిదవ నెల వచ్చేసరికి ఈ పిల్లవాడి నిష్ఠకి కుడికాలు బొటన వేలు తీసి భూమిమీద పెట్టేసరికి భూమండలం అంతా అటు ఒరిగిపోయింది. వాని తపశ్శక్తికి భూమండలం అటూ ఇటూ ఒరగడం ప్రారంభమయింది. ఇలా అపారమయిన తపస్సు చేస్తున్నాడు. దేవతలు అందరూ భూమండలమే కంపించి పోతున్నదని బెంగ పెట్టుకుని గబగబా వైకుంఠమునకు వెళ్ళి ప్రార్థన చేశారు. దేవతలకు ఇపుడు ఒక సంకట పరిస్థితి వచ్చింది. అదే ఒక యౌవనములో ఉన్నవాడు తపస్సు చేస్తుంటే ఒక అప్సరసను తపస్సు భంగం చేయమని పంపిస్తారు.

ఐదేండ్ల పిల్లవాడయిన ధృవుడి దగ్గరికి ఎవరిని పంపిస్తారు? వీనిని ఎలా నిగ్రహించాలో వాళ్లకి అర్థం కాలేదు. దేవతలు స్వామి దగ్గరకు వెళ్ళి స్వామీ! మీరు ఒక్కసారి బయలుదేరి వెళ్ళండి’ అన్నారు. పరమాత్మ ఒక్క నవ్వు నవ్వి ‘ఎవడురా నా గురించి ఇలా తపించినవాడు. వాడిని చూడడానికి పొంగిపోతూ వెడుతున్నాను’ అని లక్ష్మీ సహితుడై, గరుడవాహనారూఢుడై భూమండలమునకు వచ్చాడు. ధృవుడు కళ్ళు విప్పి చూశాడు. ఎవ్వరికీ దర్శనం ఇవ్వని స్వామి, మాంస నేత్రములకు గోచరము కాని స్వామి, ధృవుడికి దర్శనం ఇచ్చాడు. ఈ పిల్లవానికి నారాయణ అని పిలవడం కానీ, స్తోత్రం చేయడం కానీ రాదు. వాని కోరిక ఏమిటో వానికే తెలియదు. స్వామిని పైనుంచి క్రిందికి క్రిందనుంచి పైకి చూస్తూ అలాగే ఉండిపోయాడు. స్వామి ‘వీడు ఇలానే కూర్చుంటాడు. వీనికి స్తోత్రం చేయడం నేనే నేర్పుతానని సమస్తవేదములు ఉపనిషత్తులు వీనికి భాసించుగాక అని నాలుగు అడుగులు ముందుకు వచ్చి తన చేతితో శంఖమును తీసి ధృవుని శిరస్సు మీద ఉంచాడు. ధృవుడు ఎంతో భాగ్యమును పొందాడు అందుకే ద్వాదశినాడు ధృవచరిత్ర వింటే అజ్ఞానం దగ్ధం అయిపోతుంది.

ఆ శంఖం తలకి తగిలింది. అంతే! ధృవుడు పొంగిపోయి స్తోత్రం మొదలుపెట్టాడు. స్వామీ నీవు కనపడ్డావు కాబట్టి నేను ఒకటి అడుగుతున్నాను. జన్మజన్మాంతరములకు నాకు కావలసింది ఎప్పుడూ మనస్సంతా ఈశ్వరుని మీద రమిస్తూ ఆఖరుకి దేహం పడిపోతున్నప్పుడు కూడా ఈ శరీరం పడిపోతున్నదని మృత్యుభయమును పొందకుండా ఆఖరిశ్వాసలో కూడా నిన్నే తలుచుకుంటూ పొంగిపోయే లక్షణం ఉన్నటువంటి మహాభాగవతులు నిన్నే పొందుతున్నారు. వారు నీలో ఐక్యం అయిపోతున్నారు. అటువంటివారితో నాకు సాంగత్యం ఇప్పించు తండ్రీ’ అని అడిగాడు. స్వామి ‘నీవు చాలా గొప్ప స్తోత్రం చేశావు. పెద్ద పదవి కావాలని బయలుదేరావు. కానీ ఆ పెద్దపదవి ఎవరికీ ఇవ్వరు. ఇంత చిన్నవాడివి ఆ పదవి ఏమిటో తెలియకుండా ఇంత తపస్సు చేశావు. అందుకే ఆ పదవిని నీకు ఇచ్చేస్తున్నాను. ఆ పదవి ధర్మము, అగ్ని, కశ్యపుడు, సప్తర్షులు, కాలము, నక్షత్ర మండలము, ఋతువులు, సూర్య, చంద్రాదిగ్రహములు ఈ బ్రహ్మాండములు ఏది కదలకపోతే దానిని ఆధారంగా చేసుకుని రంగులరాట్నం తిరిగినట్లు తిరుగుతాయో అటువంటి ధృవమండలం క్రింద నిన్ను మార్చేస్తున్నాను. నీవు ధృవమండలమై వినువీధిన వెలుగుతుంటే నిన్ను ఆధారం చేసుకుని సమస్త జ్యోతిశ్చక్రము తిరుగుతూ ఉంటుంది. ఆ పదవిని నీకు అనుగ్రహిస్తున్నాను. ఇప్పుడే కాదు ఇప్పుడు నీవు ఇంటికి వెళ్ళు. నీకు భవిష్యత్తు కూడా చెపుతున్నాను. నీ తమ్ముడు, పిన్ని మరణిస్తారు. నీకు రాజ్యాభిషేకం జరుగుతుంది. తదనంతర కాలమందు నీకు వైరాగ్యం పూర్ణముగా సిద్ధించి తపస్సు చేస్తావు. నిన్ను అటువంటి ధృవమండలమునకు తీసుకువెళ్ళి తరువాత నాలో ఐక్యం చేసుకుంటాను. ఇదే నీకు చిట్టచివరి జన్మ’ అని చెప్పి స్వామి అంతర్ధానమయిపోయారు.

ధృవుడు అయ్యో! ఇంత తపస్సు చేస్తే ఇదా నాకు ఫలితం’ అనుకోని ఏడుపు ముఖంపెట్టుకుని చిన్నబుచ్చుకున్న ముఖంతో ఇంటికి బయలుదేరాడు. దీనిని చూసి నారదుడు సంతోషించాడు. ఆయన ఉత్తానపాదుడి దగ్గరకు వెళ్ళాడు. ఉత్తానపాదుడు ఎదురువచ్చి స్వాగతం పలికి అర్ఘ్యం ఇచ్చి లోపలి తీసుకువెళ్ళి కూర్చోబెట్టాడు. ఉత్తానపాదుడు కొంచెం బాధగా ఉన్నాడు. నారదుడు ఉత్తనపాదుని ‘అంత బాధగా ఉన్నావేమిటని అడిగాడు. దానికి ఉత్తానపాదుడు ‘ఏమి చెప్పుకోను. నాకు ఇద్దరు భార్యలు. పాపం ధృవుడు కూడా నా కొడుకే. వాడు నా తొడ మీద కూర్చుంటానన్నాడు. సురుచిని చూసిన భయంచేత వానిని నా తొడమీద కూర్చోపెట్టుకోలేదు. సురుచి వారిని నారాయణుని గూర్చి తపస్సు చేయమన్నది వాడు తపస్సు చేయడానికని అడవులకు వెళ్ళిపోయాడు. నా మనస్సుకి గాయము అయింది’ అన్నాడు. నారదుడు ‘నీ కుమారుని గురించి నీవు బాధపడుతున్నావు. కానీ ఇవాళ నీ కొడుకు ఏ స్థితిని పొందాడో తెలుసా! ఏ మహాపురుషుని కేవలం క్రీగంటి చూపుల చేత సమస్త బ్రహ్మాండములు రక్షింపబడుతున్నాయో, దేవతలు అందరూ రక్షింపబడుతున్నారో, సృష్టి, స్థితి, లయములు జరుగుతున్నాయో, ఎవరు హేలగా ఈ బ్రహ్మాండములను సృష్టి చేసి కాపాడుతున్నాడో అటువంటి వాని అనుగ్రహము పొంది నీ కొడుకు వరములను పొందాడు’ అని చెప్పాడు. ఈ మాటలు విని ఉత్తానపాదుడు పొంగిపోయాడు.

ఈలోగా ధృవుడు రాజ్యంలోకి వస్తున్నాడని కబురు వెళ్ళింది. తండ్రి పొంగిపోయాడు. పెద్ద ఉత్సవం చేశాడు. సునీతిని తీసుకువచ్చాడు. ఉత్సాహంతో ఎదురు వెళ్ళాడు. తన కొడుకు వరములు పొంది వచ్చాడని కాదు ఉత్తానపాదుడి సంతోషం. తనకొడుకు అడవులకి వెళ్ళి తిరిగి ఏ ఆపద లేకుండా తిరిగి వచ్చాడని సంతోషం. కొడుకును చూడగానే గట్టిగా కౌగలించుకున్నాడు. ఆ కౌగిటిలోంచి జారిపోయి తండ్రి పాదముల మీద పడి శిరస్సుతాటించి తండ్రికి నమస్కరించాడు ధృవుడు. తండ్రి ‘చిరాయుర్దాయం కలుగుతుంది – ఆయుష్మాన్ భవ’ అని ఆశీర్వచనం చేసి బాలుడిని ఎత్తుకుని కౌగిలించుకున్నాడు.

ఇదీ మర్యాద. అంతేకానీ అమ్మ దగ్గరకు వెళ్ళి ‘అమ్మా! ఈయనను ఇన్నాళ్ళనుండి ఎలా భరిస్తున్నావమ్మా’ అని వెర్రిజోకులు తండ్రి మీద వేసేటటువంటి దుష్ట సంస్కారం అసలు ఈ జాతికి తెలియదు. ఎవడో దౌర్భాగ్యుడయిన రచయిత రాసి మనదేశాన్ని నాశనం చేశాడు.

రాజ్యంలోని ప్రజలు అందరూ పిల్లవానికి పట్టాభిషేకం చేయమని అడిగారు. ఉత్తముడు కూడా అంగీకరించాడు. అక్కడికి సునీతి, సురుచి ఇద్దరూ వచ్చారు. ధృవుడు ఇద్దరికీ శిరస్సు వంచి నమస్కరించాడు. ఇద్దరూ ఆశీర్వచనం చేశారు. ధృవుడికి పట్టాభిషేకం జరిగింది.

సురుచి కుమారుడయిన ఉత్తముడు ఉత్తరదిక్కున వున్న హిమాలయ పర్వతముల మీదికి వెళ్ళాడు. అక్కడే ఉత్తముడు ప్రాణములు కోల్పోయాడు. కొడుకు మరణించాడన్న వార్త విని సురుచి అరణ్యములో ప్రయాణిస్తూ కార్చిచ్చు పుట్టి అందులో కాలిపోయి మరణించింది. భాగవతులతో జాగ్రత్తగా ప్రవర్తించక పోతే ఎంత ప్రమాదం వస్తుందో ధృవోపాఖ్యానం మనకి చెప్పింది.

తదనంతర కాలమందు ధృవునికి వివాహం జరిగింది. ‘శిశుమారుడు’ అనే ప్రజాపతికి ఒక కుమార్తె, పేరు భ్రమి. ఆమెను ధృవుడు వివాహం చేసుకున్నాడు. ఆమెయందు ధృవునికి ఇద్దరు కుమారులు జన్మించారు. ఒకడిపేరు వత్సర, రెండవ వాని పేరు కల్ప. తరువాత వాయుదేవుని కుమార్తె అయిన ‘ఇళ’ ను పెళ్ళి చేసుకున్నాడు. ఆమెయందు ఉత్కళ అనే కుమారుడు జన్మించాడు. వేరొక కుమార్తె కూడా జన్మించింది. నిజమునకు ఇవన్నీ ఆయన పొందబోయే పదవి అర్హతలు. ఆయన కదలకుండా ధృవపథమై ఉంటాడు. మిగిలినవన్నీకదులుతుంటాయి. సృష్టి ఉండాలంటే వాయువు ఉండాలి. అందుకని వాయువు కూతురుని వివాహం చేసుకున్నాడు. భ్రమి అంటే కదులుటని అర్థం. జ్యోతిశ్చక్రమునందు సూర్యమాన చాంద్రమానములచేత తిథులు, నక్షత్రములు బ్రహ్మాండమునందు కాలములో కదులుతూ ఉంటాయి. కదులుతున్న కాలమునకు కదలని తాను ఆధారభూతుడై ఉంటాడు. కాలమునకు హద్దు ‘వత్సర’ – అంటే మనం ఒక సంవత్సరమును కాలమునకు ముందు ప్రమాణంగా చెప్తాము. అందుకని వత్సరం ఒక హద్దు. యుగాంతము అయిపోయిన తర్వాత హద్దు కల్పము.

ఉత్తముడిని ఒక యక్షుడు సంహరించాడని తెలుసుకుని ఆగ్రహించి యుద్ధానికి బయలుదేరాడు. రథం ఎక్కి హిమాలయ ప్రాంతమునకు వెళ్ళి కుబేరుని సైన్యమయిన యక్షులతో విశేషమయిన యుద్ధం చేశాడు. ఆ యుద్ధంలో కొన్ని వేలమంది యక్షులను చంపేశాడు. తదుపరి నరనారాయణాస్త్రమును ప్రయోగించడానికి మంత్రమును అనుష్ఠానం చేస్తున్నాడు. ఆ సమయంలో తాతగారయిన స్వాయంభువ మనువు కనపడి ఒకమాట చెప్పాడు. ‘నీవు పొందబోయే పదవి ఏమిటి? నువ్వు చేసిన పని ఏమిటి? నీవు ఇటువంటి పని చేయకూడదు. ఇప్పటివరకు నువ్వు చేసిన సంహారము చాలు. నా మాట విని నారాయణ అస్త్రం ఉపసంహారం చెయ్యి. నువ్వు చేసిన సంహారము చాలు. నువ్వు నీ ధనుస్సు పక్కన పెట్టి రాజధానికి వెళ్ళిపో’ అన్నాడు. ధ్రువుడు తాతగారు చెప్పిన మాట విన్నాడు.

https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage

instagram.com/pravachana_chakravarthy

 Srimadhandhra Bhagavatham -- 35 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


ధృవుడు తిరిగి అంతఃపురమునకు వెళ్ళిపోతుంటే కుబేరునికి ఈ వార్త తెలిసింది. తాతగారు చెబితే ఇంత కోపమును కుబుసం వదిలినట్లు వదిలేసి ధ్రువుడు ఇంటికి వెళ్ళిపోతున్నాడని తెలుసుకున్నాడు. పెద్దల మాటలు విన్న పిల్లలు ఎటువంటి వరములు పొందుతారో చెపుతుంది ధృవోపాఖ్యానం.

కుబేరుడు వచ్చి ‘నీకు ఎంతో కోపం వచ్చిందట, కొన్ని వేలమంది యక్షులను సంహరించావట. అంతకోపంతో ఉన్నా మావాళ్ళు నీమీద కలియబడుతుండగా తాతగారు వచ్చి ఇంకా యుద్ధం చేయకు అనేసరికి ఆయన మాటవిని యుద్ధం మానివేశావు. నీలాంటి వానిని చూడడము నాకు మిక్కిలి సంతోషమును కలిగించింది. నీకు కావలసిన వరం కోరుకో ప్రసాదిస్తాను’ అన్నాడు. ధృవుడు ‘ నా బుద్ధిలో చిన్న వైక్లబ్యం వచ్చింది. నేను ఎంతో పాపపు పని చేశాను. అందుకని నీవు నాకు వరం ఇస్తే ఏ వరం ఇస్తావో తెలుసా! నా బుద్ధి రాత్రనక పగలనక ఏ కాలమునందు కూడా భగవంతుని పాదారవిందముల నుండి విస్మరణము లేని నామము చెపుతూ తరించి పోయేటటువంటి భక్తి నాకు నిర్హేతుకముగా నీవరము చేత కటాక్షింపబడుగాక’ అని అడిగాడు. ఇదీ వ్యక్తి కోరుకోవలసింది. కుబేరుడు సంతోషముతో వరమును ధృవునకు అనుగ్రహించాడు. దానితో ధృవుడు అపారమయిన భక్తి సంపన్నుడు అయిపోయాడు. రాజ్యమును పరిపాలించాడు. కుమారుడికి పట్టాభిషేకము చేశాడు. బదరికాశ్రమమునకు చేరి కూర్చుని తపస్సు చేశాడు. ఆ సమయంలో ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. ఒక చిత్రవిచిత్రమయిన విమానం ఒకటి వచ్చి ఆ పర్వత శిఖరం మీద దిగింది. వారు నీలమేఘము వంటి శరీరము కలిగి శంఖ చక్ర గద పద్మములను పట్టుకుని తాను అయిదవ ఏట చూసిన శ్రీమన్నారాయణుడు ఎలా ఉంటాడో అటువంటి స్వరూపములతో ఇద్దరు పురుషులు అందులోంచి నడిచి వచ్చారు. ధృవుడు వాళ్ళను చూసి ఆశ్చర్యపోతూ లేచి వాళ్లకి నమస్కరించి మీరు ఎవరు? ఎందుకు వచ్చారు?’ అని అడిగాడు. వాళ్ళు ‘మరచిపోయావా! ఐదేండ్ల వయసులో నీవు తపస్సు చేయగా స్వామి వరం ఇచ్చారు. నీ శరీరం పడిపోయే రోజు వచ్చింది. నిన్ను మేము ధ్రువ మండలమునకు తీసుకువెళ్ళాలి. స్వామి నీకోసం విమానం పంపారు. మేము విష్ణుపార్షదులము వచ్చి విమానం ఎక్కమ’ని అన్నారు.

ధృవుడు జ్ఞానియై తనే శరీరమును వదిలిపెట్టాడు. మృత్యువు శిరస్సు మీద పాదము పెట్టి విమానంలోకి ఎక్కాడు. అది లోకములను దాటి వెళ్ళిపోతోంది. ఆశ్చర్యంగా ఆ లోకములన్నింటి వంక చూస్తున్నాడు. విమానంలో కూర్చుని అనుకున్నాడు ‘ఓహోహో ఏమి లోకములు! ఇంతమంది ఇన్ని బాధలు పడి పుణ్యములు పొంది, పుణ్యములు అయిపోయిన తరువాత క్రింద పడిపోయి ఇంత అల్లర్లు పడిపోతున్నారు. అయిదు నెలలు తపస్సు చేస్తే నా స్వామి నాకు ఇటువంటి స్థితి ఇచ్చారు. పెద్దపదవి అంటే ఏమో అనుకున్నాను. సప్తర్షులు, కశ్యపుడు, ధర్మము, అగ్నిహోత్రము, జ్యోతిశ్చక్రము తిరుగుతున్న మండలమునకు నేను ధృవస్తంభమునై వెలుగొందబోతున్నాను. ఇంతమంది నా చుట్టూ తిరుగుతూ ప్రదక్షిణం జరుగుతూ ఉంటుంది. నేను నిరంతరం విష్ణులోకదర్శనం చేస్తూ ఉంటాను. ఎంత అదృష్టవంతుడిని’ అనుకుని ఈ అదృష్టమునకు కారణము ఎవరని ఆలోచించాడు. ‘మనసులో దీనికి కారణం మా అమ్మ. ఆనాడు మా అమ్మ నన్ను నారాయణుని గూర్చి తపస్సుకు వెళ్ళమని చెప్పింది. ఆమె మాట నన్ను ఈ స్థితికి తీసుకువెళ్ళింది. కానీ ఆ పిచ్చితల్లి ఎక్కడ ఉన్నదో’ అనుకున్నాడు. అనుకునే సరికి ఈ విషయమును పార్షదులు గ్రహించారు. ‘నిన్నీ స్థితికి తీసుకువచ్చింది కాబట్టే శ్రీ మహావిష్ణువు నీకన్నా ముందు ఆవిడ విమానం నడుపమని చెప్పారు. కిటికీలోంచి బయటకు చూడు’ అన్నారు. ధృవుడు బయటకు చూశాడు. ముందు విమానంలో దివ్యమైన తేజోవిరాజితయై సునీతి వెళ్ళిపోతున్నది. ఆవిడ శ్రీమన్నారాయణుడి లోకి వెళ్ళిపోయింది. ధృవుడు ధృవ మండలమునకు చేరుకొని తదనంతరము స్వామివారి లోనికి లీనమై పోయి పరబ్రహ్మము సాయుజ్య మోక్షమును పొందాడు.

ఇంతటి అద్భుతమయిన ఈ ధృవోపాఖ్యానం ఎవరైతే పరమ భక్తితో వింటారో వారందరికీ కూడా ఉత్తరక్షణం అప్పుడే అక్కడే ఆ క్షణంలోనే పాపనాశనము జరిగి శ్రీమన్నారాయణుని అనుగ్రహం కటాక్షింపబడుతుంది. ఒకవేళ అల్పాయుర్దాయంతో మృత్యువు తరుముకు వస్తుంటే మృత్యువు ఆగి ఆయుర్దాయం కలుగుతుంది. గ్రహముల వలన ఉద్రిక్త ఫలితము రాబోతుంటే అటువంటి ఫలితములు ఆగిపోయి శుభమును పొందుతారు, కీర్తిని ఇస్తుంది.

3. పృథు చరిత్ర:

ఒకానొక సమయంలో ఈ దేశమును అంగరాజు పరిపాలిస్తూ ఉండేవాడు. ఆయన మహా ధార్మికుడు. కేవలము ధర్మానుష్టానము తప్ప ఎన్నడు అధర్మము చెయ్యని వాడు. అటువంటి అంగరాజు ఒకసారి అశ్వమేధయాగం చేస్తున్నాడు. ఆ సందర్భముగా దేవతలను అందరిని పిలిచి హవిస్సులు ఇస్తున్నాడు. ఆ రోజులలో స్వాహా అంటూ ఆ దేవతలను పిలిస్తే ఆ దేవత వచ్చి ఎదురుగా కూర్చుని హవిస్సును అగ్నిముఖంగా పుచ్చుకుని నోట్లో వేసుకుని వెళ్ళేవారు. అక్కడ ఉన్నటువంటి ఋషులు మంత్రములతో దేవతలను ఆవాహన చేస్తున్నారు. ఒక్క దేవత రాలేదు! ఏ దేవతా రాకపోతే అంగరాజు ఆశ్చర్యపోయాడు. ‘ఎందుచేత ఇలా జరిగింది’ అని ఋషులను అడిగాడు.

ఋషులు ‘వేదము స్వరప్రకటము. మా స్వరమునందు దోషము లేదు. కానీ వారు రావడము లేదంటే వారు నీయందు అప్రసన్నులై ఉన్నారు. నీలో ఏదో దోషం ఉండి ఉండాలి. నీ చరిత్రను పరిశీలిస్తే నీయందు ఎక్కడా దోషం కనపడడము లేదు. ఏ దోషం ఉన్నది అని విచారణ చేయాలి’ అన్నారు. ఆయనలో గల దోషం గురించి విచారణ చేశారు. అంగమహారాజు అనపత్య దోషంతో బాధపడుతున్నాడు. అంటే ఆయనకు సంతానం లేదు. అందుచేత యజ్ఞములో ఆయన ఇచ్చిన హవిస్సులు తీసుకోవడానికి దేవతలు రాలేదు. ఋషులు ‘నీకు ఇప్పుడు ఉత్తరక్షణం సంతానం కలగాలి. గతజన్మలో నీవు చేసిన పాపములు ప్రతిబంధకముగా ఉండడం వలన ఈ జన్మలో నీకు సంతానము కలగలేదు. ఈ ప్రతిబంధకమును తీసివేయాలి. శ్రీమన్నారాయణుడు ప్రసన్నుడు కావాలి. దానికి మేము యాగం చేస్తాము. ఆ యాగము చేత శ్రీమహావిష్ణువు తృప్తిపడితే నీకు సంతానం కలుగుతుంది’ అన్నారు.

అంగమహారాజు శ్రీ మహావిష్ణువు ప్రీతికొరకు యాగం చేశాడు. యాగం పూర్తవగానే అందులోనుంచి బంగారు వస్త్రములను ధరించి చిత్ర విచిత్రములైన మాలలు వేసుకుని చేతిలో బంగారుకలశమును పట్టుకుని ఒక పురుషుడు యజ్ఞగుండం లోంచి ఆవిర్భవించాడు. ఆ పురుషుడు ‘అంగరాజా! ఈ పాయసపాత్రలో ఉన్న పాయసమును నీ ధర్మపత్ని చేత తినిపించు. నీకు అనపత్య దోషం పోయి సంతానం కలుగుతుంది’ అని చెప్పాడు. పాయసపాత్ర తీసుకువెళ్ళి భార్యకి ఇచ్చాడు. ఆవిడ పేరు సునీథ. ఆవిడ భర్తృ సంగమము చేతనే సంతానమును పొందింది. తేజస్సు అంగరాజు తేజస్సే ఇప్పుడు అది ప్రజోత్పత్తిని చేసింది. కారణమేమి? ఇన్నాళ్ళు ఎందుకు చేయలేక పోయింది? అనగా ప్రజోత్పత్తిని చెయ్యడానికి వీలు లేనటువంటి స్థితి పాపము ఇన్నాళ్ళు సంతానము కలుగకుండా చేసింది. ఇపుడు ఆ విఘ్నం పోయి సంతానం కలగడానికి కావలసిన యోగ్యత సిద్ధించింది. కానీ క్షేత్రశుద్ధి జరుగలేదు. క్షేత్రమునందు దోషం ఉన్నది. ఆమె మృత్యువు పుత్రిక కావటం చేత యాగమునందు ఉద్భవించినటువంటి ప్రజాపత్య పురుషుడు ఇచ్చినటువంటి ప్రసాదము తిన్నప్పటికీ కుమారుడు వ్యగ్రస్వభావము కలిగినటువంటి వాడు జన్మించాడు. వానికి ‘వేనుడు’ అని పేరు వచ్చింది.

జన్మతః వచ్చిన బుద్ధి బోధకు మారడం చాలాకష్టం. వేనుడు ప్రతిరోజూ నిష్కారణంగా వేటకు వెళ్ళి కుందేలు పిల్లల దగ్గరనుంచి లేళ్ళు జింకల వరకు చంపేసేవాడు. ఆ చంపడములో అర్థం లేదు. అతను వేటనుండి తిరిగి వస్తున్నప్పుడు క్రీడా మైదానంలో ఆడుకునే పిల్లలను చూసేవాడు. ఆడుకుంటున్న పిల్లలను బడిత పుచ్చుకుని వారు చచ్చిపోయేవరకు కొట్టేవాడు. వాడు సంతోషంగా వెళ్ళిపోయేవాడు. ఇలాంటి పిల్లవాడిని రోజూ దగ్గర కూర్చోపెట్టుకుని అంగరాజు ధర్మబోధ చేసేవాడు. ఈయన అలా చెపుతుంటే కొడుకు కనుబొమలు ఎగురవేసేవాడు. తండ్రి పట్ల మర్యాద ఉండేది కాదు. మరల తెల్లవారి లేవడం పాపకృత్యములు చేయడం. ఒకరోజు రాత్రి తండ్రి ప్రాణం విసిగిపోయింది. ఒకరోజు భార్య, కొడుకు నిద్రపోతున్నారు. అంగరాజు మాత్రం నిద్ర పట్టక ‘నా జీవితమునకు ఏమి సార్ధకత? నా కొడుకు సత్ప్రవర్తన కలిగిన వాడై నా తరువాత సింహానమును అధిష్ఠించి రాజ్యపాలనము చేసి చక్కగా నాకు పేరు తెచ్చి నా శరీరము పడిపోయిన తరువాత గయలో శ్రాద్ధం పెట్టాలి. అలా నన్ను ఉద్ధరించాలి. నాకు ఇంత దుష్దుడు పుట్టాడు. ఇలాంటి కొడుకు ఉన్న నాకు రాజ్యం ఉంటే ఎంత? సింహాసనం ఉంటే ఎంత? రోజూ వీడికి చెప్పుకునే కన్నా ఎక్కడికో పోయి ఈశ్వరారాధన చేసుకుని మట్టిలో కలిసిపోతే మంచిదనుకుని విరాగియై అన్ని భోగములు కలిగినటువంటి అంతఃపురమును, భార్యను, బిడ్డను విడిచి పెట్టి గురువులకు కూడా చెప్పకుండా తానొక్కడే కాలినడకన నడిచి అరణ్యములోకి వెళ్ళిపోయాడు. మరునాడు అంతఃపురంలో రాజు కనపడలేదు. వారు ఆయన తల్లిగారయిన సునీథతో మాట్లాడి వేనుడికి పట్టాభిషేకము చేశారు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

 Srimadhandhra Bhagavatham -- 33 by Pujya Guruvulu "Pravachana Chakravarthy" , "Vachaspathy" Brahmasri Chaganti Koteswara Rao Garu


ధ్రువోపాఖ్యానం:


భాగవతంలో ధృవోపాఖ్యానం అనే ఒక ఉపాఖ్యానం ఉంది. మీరు క్రతువు చేసేటప్పుడు ఒక పుణ్యదినం నాడు ఒక వ్రతం చేయాలి అంటే మనస్సు అక్కడ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. కొన్ని కోట్లజన్మల తరువాత ఎప్పుడో ఎవడో ఒక్క మనుష్యుడు మాత్రమే ఈశ్వరుని అనుగ్రహం పొందిన వాడు మాత్రమే ద్వాదశినాడు ధృవోపాఖ్యానమును వింటున్నాడు. ద్వాదశినాడు ధృవోపాఖ్యానం వింటే ఎన్నో మంచి ఫలితములు వస్తాయి. ఎన్నో గ్రహములు ఉపశాంతి పొందుతాయి. ఎంతో మేలు జరుగుతుంది. మనిషి జీవితంలో ధృవుని వృత్తాంతమును వినాలి. భాగవతాంర్గతముగా వినడం అనేటటు వంటిది మరింత గొప్పవిషయం. ద్వాదశినాడు కానీ, పౌర్ణమి నాడు కానీ, అమావాస్య నాడు కానీ దినక్షయమునందు కానీ, అసురసంధ్యవేళ కానీ ధృవచరిత్ర వింటే చాలా మంచిది. సుందరకాండ తెలియని వారు ఎలా ఉండరో అలా ధృవోపాఖ్యానం, ప్రహ్లాదోపాఖ్యానం తెలియని వారు ఉండరు.

ధృవచరిత్ర ఒక ఆశ్చర్యకరమయిన సందర్భము. మైథునసృష్టి జరగడం కోసమని బ్రహ్మగారు తన శరీరంలోంచి శతరూపనే స్త్రీ స్వరూపమును, స్వాయంభువ మనువనే పురుషస్వరూపమును సృష్టి చేశారు. వారిద్దరిని సృష్టి చేయమని బ్రహ్మగారు ఆదేశించారు. వారికి ఆకూతి, దేవహూతి, ప్రసూతి అనే ముగ్గురు కుమార్తెలు, ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడనే ఇద్దరు కుమారులు కలిగారు.

ఉత్తానపాదుడికి మొదటి భార్య సునీతి, రెండవ భార్య సురుచి. ఆ ఇద్దరు భార్యలతో చాలా సంతోషముగా ఉత్తానపాదుడు జీవితమును గడుపుతున్నాడు. ఉత్తాన పాదుడు అంటే పైకి కాళ్ళు ఉన్నవాడు. సునీతి ఎప్పుడూ నీతి చెపుతూ ఉంటుంది. సునీతికి ఒక కుమారుడు, సురుచికి ఒక కుమారుడు కలిగారు. సునీతి కుమారుడు ధృవుడు. సురుచి కుమారుడు ఉత్తముడు. సాధారణంగా ఎవరికయినా జ్ఞానం పట్ల వైరాగ్యం పట్ల మమకారం ఎప్పుడు ఎప్పుడు కలుగుతుంది? అసలు భోగం అనుభవిస్తే వైరాగ్యం అనే మాట వస్తుంది. భోగమే అనుభవించని వాడికి వైరాగ్యం అనే మాటకు అర్థం లేదు. రాజు యిన ఉత్తానపాదుడికి సురుచియందున్న ప్రేమ సునీతియందు లేదు. సునీతియందు లోపల గౌరవం ఉన్నా సురుచికి లొంగిపోయిన వాడవడం చేత సునీతిని గౌరవించలేడు. ఒకనాడు ఒక ఆశ్చర్యకరమయిన సంఘటన జరిగింది. ఒకనాడు అంతఃపురంలో ఉత్తానపాదుడు కూర్చుని ఉన్నాడు. పక్కన సురుచి నిలబడి ఉన్నది. సురుచి కొడుకయిన ఉత్తముడు తండ్రి తొడమీద కూర్చున్నాడు. సునీతి కొడుకయిన ధృవుడు పరుగుపరుగున వచ్చాడు. అతనికి కూడా తండ్రి తొడమీద కూర్చోవాలని కోరిక కలిగింది. తండ్రి ధృవుని తన తొడమీద ఎక్కించుకోలేదు. తండ్రికి కొడుకు మీద ప్రేమలేక కాదు. సురుచి ప్రక్కన ఉండడం వలన ధృవుని తన తొడమీదకి ఎక్కించుకోలేదు. ఒకసారి సురుచి వంక చూశాడు. ఆవిడ ఒక గమ్మత్తయిన మాట అంది. ‘నీవు నిజంగా తండ్రి తొడమీద కూర్చునే అదృష్టం పొందిన వాడవయితే నా కడుపున పుట్టి ఉండేవాడివి. నీకు ఆ భాగ్యం దక్కదు’ కేవలం ఆభిజాత్యముతో ఈమాట అన్నది. సురుచి మళ్ళీ ‘నా కడుపున పుట్టడం అంటే మాటలు కాదు. నా కడుపున పుట్టాలి అంటే ఎంతో అదృష్టవంతుడవయి ఉండాలి. నా కడుపున పుట్టలేక పోయిన వాడు తండ్రి తొడమీద కూర్చోవాలంటే ఏమి చేయాలో తెలుసా? ఇంద్రియములకు లొంగని వాడయిన అధోక్షజుడయిన శ్రీమహావిష్ణువు పాదారవిందములను సంసేవనం చేయాలి. అపుడు ఆయన అనుగ్రహిస్తాడు’ అన్నది. నిజమునకు శ్రీమన్నారాయణుని అనుగ్రహం ఉన్నది కాబట్టి ధృవుడు సునీతియందు పుట్టాడు. ధ్రువుడు ఏడుస్తూ వెళ్ళిపోయాడు. అమ్మ వాడిని ఎందుకురా ఏడుస్తున్నావు’ అని అడిగింది. జరిగిన విషయం అంతఃపురకాంతలద్వారా తెలుసుకున్నది సునీతి. ఆవిడ కొడుకును చూసి ‘నాయనా! మీ నాన్న తొడ ఎక్కనివ్వలేదని ఏడుస్తున్నావు కదా! నువ్వు గత జన్మలలో చేసుకున్న పాపమే ఇవాళ నిన్ను ఏడిచేటట్లు చేసింది. నీ పినతల్లి కాని, నేను కాని, నీ తండ్రి కాని నీ బాధకు కారణం కాదు. నువ్వు చేసుకున్న పాపకర్మయే నీ దుఃఖమునకు కారణం. నిజంగా నీ తండ్రి తొడ ఎక్కి కూర్చోవాలన్న కోరిక నీకు ఉంటే నీ తండ్రి మనస్సును అలా మార్చగల ఈశ్వర పాదములు పట్టుకోవాలి. నీవు అరణ్యములకు వెళ్ళి శ్రీమన్నారాయణుని గూర్చి ధ్యానం చెయ్యి. ఆయన అనుగ్రహం కలిగిందంటే నీ తండ్రి అంకసీమ చేరగలుగుతావు’ అని చెప్పింది.

పిల్లవాడయిన ధృవుడు ‘అమ్మా! అయితే ఇప్పుడు నేను బయలుదేరతాను. శ్రీమన్నారాయణుని గురించి తపస్సు చేస్తాను. ఆ స్వామి అనుగ్రహమును పొందుతాను’ అన్నాడు. లోకకళ్యాణము చేసే నారదమహర్షి వచ్చి ‘నాయనా! నీవు ఎక్కడికి వెడుతున్నావు?’ అని అడిగాడు. ధృవుడు ‘నేను అడవికి వెళుతున్నాను. నారాయణుని గూర్చి తపస్సు చేస్తాను’ అన్నాడు. నారదుడు నవ్వి ‘నీకు నారాయణుని గురించి తపస్సు దేనికి? అని అడిగి ‘ఈ బుద్ధి నీకు నిలబడుగాక!’అని పరమ పావనమయిన తన చేతిని ధృవుని శిరస్సునందు ఉంచాడు. పిమ్మట నారదుడు ధృవుని ‘నారాయణుడు కనపడితే ఏమిచేస్తావు? అని అడిగాడు. ధృవుడు ‘అన్నిటికన్నా చాలా పెద్ద పదవి కోరతాను’ అన్నాడు. నారదుడు ఏ పెద్ద పదవిని కోరతావు’ అని అడిగాడు. ‘ఏమో నన్ను అడగకండి. నాకు ఏ పెద్ద పదవి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ముందు నేను ఆయనను చూడాలి ఆయనతో మాట్లాడాలి. ఆయన ఇవ్వగలడని అమ్మ చెప్పింది ఆయన గురించి తపస్సు చేస్తాను ఆయన వస్తారు. పెద్ద పదవి కావాలని అడుగుతాను. దానిని పొంది తిరిగి వస్తాను’ అన్నాడు.

నారదుడు నవ్వి ‘నీవు పొందేదేమిటో నీకు తెలియదా! పెద్ద పదవిని పొందుతావా! అందుకు నేనొకటి చెప్తాను విను. నారాయణుడి కోసం వెళ్ళిన వాళ్ళు చాలామంది ఉన్నారు. ఇంద్రియములను జయించే ప్రయత్నంలో వెళ్ళి కూర్చుని తపస్సు చేసిన వాళ్లకి, రాత్రింబవళ్ళు బొటనవ్రేలు మీద నిలబడి తపస్సు చేసిన వాళ్లకి, అంతంత కష్టములు పడినవారికి, శ్రీమన్నారాయణ దర్శనం అవలేదు. నీవు నీకు నేనొక పెద్ద సూత్రం చెపుతాను. దానిని నీవు మనసులో పెట్టుకో. అలా చేస్తే నీకు మనస్సునందు కలిగినటువంటి ఖేదము పోతుంది. నీ కన్నా చాలా గౌరవింపదగినటువంటి పెద్దలు కనపడినట్లయితే నువ్వు వాళ్ళని గౌరవించి నమస్కరించి ఆదరించు సంతోషించు. నీకన్నా ఎక్కువ ఈశ్వర విభూతి ఉన్నవాళ్ళు కనబడితే వాళ్ళని చూసి ఎప్పుడూ అసూయపడకు. సంతోషంతో వారిని చూసి నమస్కరించు. నీతో సమానమయిన విభూతి ఉన్నవారితో మిత్రత్వం చెయ్యి. తక్కువ విభూతి వున్న వాళ్ళు కనిపిస్తే వాళ్ళు కూడా పైకిరావాలని ఈశ్వరుని కోరుకుని కారుణ్యంతో ప్రవర్తించు. ఈ మూడూ గుర్తు పెట్టుకుంటే నువ్వు చక్కగా వృద్ధిలోనికి వస్తావు. ఇక ఇంటికి వెళ్ళు’ అన్నాడు.

ధృవుడు అన్నాడు ‘మీరు చెప్పిన మాటలు వినడానికి చాలా సొంపుగా ఉన్నాయి. నేను పుట్టుక చేత క్షత్రియుడిని కదా! నాకు కొంచెం పౌరుషం ఎక్కువ. మా పిన్ని నన్ను అంతమాట అన్నది. నా మనస్సు ఎంతో గాయపడింది. శ్రీమన్నారాయణ సందర్శనమనే రసాయనమే మా పిన్ని మాటలనే ఈ లోపల కలిగినటువంటి వ్రణమును మాన్పగలదు. శ్రీహరి కనపడతాడా లేదా అనే బెంగలేదు. నేను వెళ్ళి తపస్సు చేస్తాను” అన్నాడు. గురువు పట్టుదలను గుర్తించి ‘నాయనా! నీవు యమునానది ఒడ్డున నిరంతరము శ్రీమన్నారాయణుని పాదస్పర్శ కలిగిన మధువనము అనే ఒక గొప్ప వనం ఉన్నది. నువ్వు అ వనమునకు వెళ్ళి అక్కడ యమునానదిలో స్నానం చేసి శుచియై ఆచమనం చేసి కూర్చో. నీ మనస్సును నిగ్రహించు. భగవంతుడు నాకెందుకు కనపడడని పట్టు పట్టు. పువ్వు లేదా నాలుగు ఆకులు, ప్రధానముగా తులసి తెచ్చుకో. స్వామివారి మూర్తిని నీటిలో కానీ, పవిత్ర ప్రదేశములో కానీ పెట్టి వీటితో పూజ చేయడం ప్రారంభించు. ఏది దొరికితే అది నివేదన చెయ్యి. మితంగా ఆహారం తీసుకో. ఎవ్వరితోనూ మాట్లాడకు. ఈశ్వరుని యందే మనస్సు పెట్టు. నీకు నారాయణుడు కనపడతాడు. నీకు నేను ద్వాదశాక్షరీ మంత్రోపదేశం చేస్తున్నాను. దీనిని ఏడురోజులు నిష్టతో చేసేసరికి నీకు దేవతలు కనపడతారు’ అని చెప్పాడు.

నారదుని మాటలు విన్న ధృవుడు తప్పకుండా అలాగే చేస్తానని చెప్పి గబగబా నడుచుకుంటూ అరణ్యమునకు వెళ్ళిపోయాడు.


https://www.facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage


instagram.com/pravachana_chakravarthy

కామెంట్‌లు లేవు: