7, ఏప్రిల్ 2025, సోమవారం

మహాభారతము

 *సంపూర్ణ మహాభారతము**సరళ వ్యావహారిక భాషలో...!*

*ద్రోణ పర్వము పంచమాశ్వాసము*


*340 వ రోజు*


*భీమసేనుడి విజృంభణ*


సాయంసమయం అయింది. సాత్యకి సోమదత్తుని ఒక నిశితశరముతో కొట్టాడు. ఘటోత్కచుడు సోమదత్తుడిని ముద్గర అనే ఆయుధముతో కొట్టాడు. ఆ దెబ్బలకు సోమదత్తుడు సోలిపోయాడు. తన కుమారుడు సోమదత్తుడు సోలిపోగానే బాహ్లికుడు సాత్యకితో యుద్ధముకు తలపడ్డాడు. భీముడు బాహ్లికునితో తలపడి బాణప్రయోగం చేసాడు. బాహ్లికుడు శక్తి ఆయుధంతో భీముని కొట్టాడు. ఆ శక్తిఆయుధ ఘాతానికి భీముడు మూర్చిల్లినా వెంటనే తేరుకుని బాహ్లికుని ముద్గర అను ఆయుధముతో కొట్టాడు. ముద్గర దెబ్బకు వయోధికుడైన బాహ్లికుడు తలపగిలి చనిపోయాడు. పాండవసేనలు జయజయధ్వానాలు చేసాయి.


*భీమసేనుడి చేతిలో కురురాజకుమారులు మరణించుట*


బాహ్లికుని మరణం చూసి దుర్యోధనుడి తమ్ములు పది మంది భీముడితో తలపడ్డారు. తనను చుట్టుముట్టిన పది మంది రాకుమారులను భీముడు పది బాణములతో సంహరించాడు. అది చూసి కర్ణుని తమ్ముడు వృకరధుడు భీమునితో తలపడ్డాడు. తనను సమీపించిన వృకరధుని భీముడు ఒకే దెబ్బతో చంపాడు. తరువాత భీమునితో శకుని తమ్ములు పన్నెండు మంది తలపడ్డారు. భీముడు వారిని అవలీలగా సంహరించాడు. భీముని పరాక్రమానికి ఎదురు లేక పోయింది. భీముని ఎదుర్కొన్న వారు ప్రాణాలతో బయటపడటం కష్టమైంది. ఆ తరువాత త్రిగర్త, బాహ్లిక, శూరసేన, మాళవ, వసాతి సేనలు ఒక్కుమ్మడిగా భీమసేనుని చుట్టుముట్టాయి. అది చూసి ధర్మరాజు తన సేనలతో భీమసేనుడిని చేరి కౌరవ సేనలను చీలి చెండాడటం మొదలు పెట్టారు. కౌరవ సేన క్రమంగా సన్నగిల్ల సాగింది.


*ద్రోణుడు పాండవులను ఎదుర్కొనుట*


కురుసేన క్షీణించడం చూసి సుయోధనుడు ద్రోణునికి జరిగిన విషయం వివరించగానే ద్రోణుడు వెంటనే ధర్మరాజును ఎదుర్కొని అతడి మీద దివ్యాస్త్రప్రయోగం చేసాడు. ధర్మరాజు వాటిని సమర్ధవంతంగా ఎదుర్కొన్నాడు. ద్రోణుడు ధర్మరాజు మీద ఇంద్రాస్త్రాన్ని ప్రయోగించాడు. ధర్మరాజు తిరిగి ఇంద్రాస్త్ర ప్రయోగంతో దానిని నిర్వీర్యం చేసాడు. ద్రోణుడు దర్మజునిపై బ్రహ్మాస్త్ర ప్రయోగం చేయగా ధర్మరాజు అదే అస్త్రాన్ని ప్రయోగంచి దానిని నిర్వీర్యం చేసాడు. ఇంతలో ధృష్టద్యుమ్నుడు ద్రోణుని ఎదుర్కొన్నాడు. ద్రోణుడు అతడిని లక్ష్యపెట్టక పాంచాలసేనను సంహరిస్తూ వారిని తరిమి కొట్టాడు. అదే సమయంలో మత్స్య కేకయ సేనలు కురుసేనను చుట్టుముట్టాయి.


*కృపాచార్యకర్ణుల వాదం*


సుయోధనుడు కర్ణుని వద్దకు వెళ్ళి తన పరాక్రమం చూపమని అర్ధించాడు. కర్ణుడు " అర్జునా! అర్జునుడు, భీముడు నాకు ఒక లెక్కా ! నేను ఒక్కడినే వారిరువురిని సంహరించి నీకు ఆహ్లాదం కలిగిస్తాను " అన్నాడు. కర్ణుని మాటలు విన్న కృపాచార్యుడు " కర్ణా ! చాలా బాగా పలికావు ఈ రోజుతో పాండవులను చంపి సుయోధనుడికి పట్టం కట్టేలా ఉన్నావు. ఈ పరాక్రమం ఘోషయాత్ర సమయాన, ఉత్తర గోగ్రహణ సమయాన ఏమైంది. ప్రగల్భములు వదిలి కార్యశూరత్వం చూపించు. అయినా నీవు ఇంత వరకు పాండవులను ఎదుర్కొన్నదే లేదు వారిని ఎలా గెలుస్తావు. మనమందరం అర్జునుడి చేత ఎన్ని సార్లు ఓడిపోయాము. ఇప్పుడు అతడికి ధర్మరాజు, భీముడు, ఘటోత్కచుడు ఉన్నారు. సాత్యకి విషయం సరేసరి. వీరినందరిని నీవు ఒక్కడివే గెవడం సాధ్యమేనా ! " అన్నాడు. ఆమాటలకు కర్ణుడు రోషపడి " కృపాచార్యా ! నేను ఆడిన మాట తప్పను పాండవులను జయించి అన్న మాట నెరవేర్చుకుంటాను. మీరంతా ఎప్పుడూ పాండవులను పొగిడి కౌరవసేనలో ఉత్సాహం తగ్గిస్తున్నారు. మన సైన్యంలో నేను, ద్రోణుడు, అశ్వత్థామ, శల్యుడు మొదలైన అతిరధ మహారధులు లేరా నీ మాటలు వారిని కాని వారిని చేస్తున్నాయి. నీవు బ్రాహ్మణుడివి కనుక నీ అధిక ప్రసంగం సహించాను. ఇక ఒక్క మాట మాట్లాడినా నీ నాలుక కోస్తాను జాగర్త " అన్నాడు. తన మేనమామను దూషించడం చూసి అశ్వత్థామ క్రుద్ధుడై కత్తి తీసుకుని కర్ణుని మీదకు లంఘించాడు. సుయోధనుడు అశ్వత్థామను వారించగా కృపాచార్యుడు అశ్వత్థామను గట్టిగా పట్టుకుని " నాయనా అశ్వత్థామా ! అంతకోపం పనికి రాదు శాంతం వహించు " అని అనునయించాడు. సుయోధనుడు అశ్వత్థామను చూసి " గురుపుత్రా ! మీ అందరి లక్ష్యం పాండవులను జయించి నన్ను ఈ భూమండలానికి పట్టాభిషిక్తుడిని చేయడం. మనలో మనం కలహించుకుంటే విజయం ఎలా ప్రాప్తిస్తుంది. కర్ణుడి బదులుగా మీ అందరిని నేను క్షమాపణ అడుగుతున్నాను అతడిని క్షమించండి " అన్నాడు. ఆ మాటలకు కర్ణుడు, అశ్వత్థామ శాంతించి తిరిగి యుద్ధసన్నద్ధమైయ్యారు.


*రేపు *

*భారతంలో ఉండేది భూమిపై ఎక్కడైనా ఉంటుంది భారతంలో లేనిది భూమిపై ఎక్కడా లేదు*

*రోజూ భారతం చదవండి భగవద్ అనుగ్రహం పొందండి*

కామెంట్‌లు లేవు: