*తిరుమల సర్వస్వం 201-*
*కపిల తీర్థం -6*
*జంధ్యాలపౌర్ణమి*
ప్రతి సంవత్సరం శ్రావణపౌర్ణమి నాడు జంధ్యాలపండుగ ఆడంబరంగా జరుగుతుంది. ఆనాడు శ్రీగోవిందరాజస్వామి, శ్రీకృష్ణస్వామి, శ్రీసుదర్శన భగవానుడు, గోవిందరాజస్వామి ఆలయం నుండి వేర్వేరు పల్లకీలపై కపిలతీర్థం లోని వేణుగోపాలస్వామి ఆలయానికి వేంచేస్తారు. తదనంతరం వారికి శాస్త్రోక్తంగా యజ్ఞోపవీతాలు ధరింపజేసి; ఘనంగా హారతి, నివేదన ఇస్తారు.
కార్తీకపౌర్ణమి నాడు కూడా శ్రీగోవిందరాజుల వారు తన దేవేరులతో కలిసి వేణుగోపాలస్వామి ఆలయానికి విచ్చేసి, అభిషేకాలు, నివేదన జరిగిన తరువాత, తిరిగి గోవిందరాజస్వామి ఆలయానికి చేరుకుంటారు.
*శ్రీఆండాల్ (గోదాదేవి) ఆస్థానం*
ప్రతి సంవత్సరం కనుమపండుగ నాడు, గోవిందరాజస్వామి ఆలయం నుండి శ్రీగోదాదేవి ధరించిన పూల మాలలు తిరుమలలోని శ్రీవెంకటేశ్వరునికి పంపబడతాయి. తదనంతరం గోదాదేవి, గోవిందరాజస్వామి ఆలయం నుండి బయలుదేరి, కపిలతీర్థం వేంచేస్తుంది. అక్కడ గోదాదేవి ముత్తయిదువులకు వాయనదాన మిచ్చిన తరువాత, గోవిందరాజస్వామి ఆలయంలో గోదాదేవి ఆస్థానోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతాయి.
[పన్నెండు మంది ఆళ్వార్లలో మరో ప్రముఖ ఆళ్వారైన 'గోదాదేవి' లేదా 'ఆండాళ్' గురించి కూడా మరో ప్రకరణంలో విస్తారంగా తెలుసుకుందాం!]
*కపిలేశ్వర స్వామి వారి త్రిశూల స్నానం*
మహాశివరాత్రి సందర్భంగా జరిగే బ్రహ్మోత్సవాలలో చివరి రోజున అనగా ఫాల్గుణ అమావాస్య నాడు కపిలేశ్వరస్వామి వారి ప్రధానాయుధమైన త్రిశూలస్వామి వారికి కపిలతీర్థం పుష్కరిణిలో త్రిశూల స్నానం జరుగుతుంది. ఈ స్నానాన్ని కాంచినవారికి త్రిశూలాయుధం సర్వకాల సర్వావస్థలయందు రక్షగా ఉంటుందని, అరిషడ్వార్గాలను అదుపులో ఉంచి, కైలాసప్రాప్తికి దోహద పడుతుందని భక్తులు నమ్ముతారు.
*కార్తీకదీపం లేదా ఆకాశదీపం*
కార్తీకపౌర్ణమి నాడు, ఆలయం పై భాగాన, కొండశిఖరాలవద్ద అర్చకస్వాములు జ్యోతులను ప్రజ్వలింప జేస్తారు. అదే సమయంలో ఆలయానికి అనుసంధానింపబడి ఉన్న కొండ పైభాగాన గల పెద్దగూటిలో, తిరుపతి వాసులైన గాండ్ల కులస్థులు అఖండజ్యోతిని వెలిగిస్తారు. ఆ జ్యోతి తిరుపతి పట్టణ వాసులందరికీ దేదీప్యమానంగా దర్శనమిస్తుంది. తరువాత, స్వామి, అమ్మవార్లను పల్లకీలో కపిలతీర్థం వద్దకు ఊరేగింపుగా తెచ్చిన అనంతరం జ్వాలాతోరణం జరుగుతుంది. ఆ సందర్భంగా కపిలతీర్థం పుష్కరిణిలో వేలాది భక్తులు అసంఖ్యాకమైన ప్రమిదలను వెలిగిస్తారు.
*తెప్పోత్సవాలు*
ధనుర్మాసంలో ఆరుద్రానక్షత్రం ముందు రోజు పూర్తయ్యే టట్లుగా, ఐదురోజుల పాటు ప్రతిరోజు ప్రదోష వేళలో తెప్పోత్సవాలు జరుగుతాయి.
*చందనోత్సవసేవ*
సౌర్యమానపు మకరమాసంలో (చంద్రమానపు పుష్యం లేదా మాఘం) పూర్ణిమకు ముందు వచ్చే శుక్రవారం నాడు అమ్మవారికి చందనాలంకార సేవ జరుప బడుతుంది.
*బ్రహ్మోత్సవాలు*
ప్రతి సంవత్సరం మాఘమాసంలో మహాశివరాత్రి సందర్భంగా పది రోజులపాటు మహావైభవంగా బ్రహ్మోత్సవాలు
జరుగుతాయి.
*అన్నాభిషేకం*
కపిలతీర్థంలో అత్యంత వైభవంగా, విలక్షణంగా జరిగే ఈ అన్నాభిషేక మహోత్సవం, సౌరమానం ప్రకారం తులామాసంలో, పౌర్ణమి రోజున సంపన్న మవుతుంది. ఈ రోజును 'కపిలతీర్థముక్కోటి పేర్కొంటారు. ఆరోజు మధ్యాహ్నం అభిజిత్ లగ్నంలో, 250 కిలోల బియ్యంతో వండిన అన్నంతో కపిలేశ్వరలింగానికి అభిషేకం చేస్తారు. లింగాకృతి అంతా, పూర్తిగా అన్నమయమై పోతుంది. మిగిలిన అన్నంతో ఒక చిన్న శివలింగాన్ని తయారుచేసి తాత్కాలికంగా ప్రతిష్ఠ చేస్తారు. పోళీలు, కుడుములు, మురుకులు, సుఖియం, వడలు వంటి ఐదురకాల పిండివంటలను లవణరహితంగా తయారుచేసి అన్నలింగం యొక్క పానవట్టంపై అలంకరిస్తారు. తదనంతరం పొట్లకాయ, వంకాయ, అరటికాయ, సీమవంకాయ, బూడిద గుమ్మడికాయలను ముక్కలు కాకుండా పూర్తికాయలు గానే, ఉప్పు లేకుండా ఉడికించి; వీటిని అన్నలింగం పై సర్వాభరణాలుగా, చంద్రవంకగా, ఢమరుకంగా, త్రిశూలంగా అలంకరిస్తారు. పంచవాద్య సమ్మేళనంతో, మంగళధ్వనులతో మహా దీపారాధన జరుగుతుంది. తరువాత అన్నలింగాన్ని ఉద్వాసన చేసి, కర్పూరహారతి నిచ్చి, జలనిమజ్జనం చేస్తారు. తదుపరి, శివలింగంపై అమర్చిన అన్నాన్ని, పులుసు, కూరలతో కలిపి ప్రసాదంగా భక్తులకు పంచుతారు.
అన్నాభిషేక మహోత్సవంలో పాల్గొని, అన్నలింగ దర్శనం చేసుకొన్నట్లయితే సమస్త గ్రహదోషాలు, పూర్వజన్మల పాపాలు సంపూర్ణంగా తొలగిపోతాయని భక్తులు విశ్వసిస్తారు.
[ రేపటి భాగంలో ... *శ్రీవారి సేవకులు* గురించి తెలుసుకుందాం]
*శ్రీనివాసుని శ్రీచరణాలను సేవిద్దాం, సకల శుభాలనూ పొందుదాం*
*రచన*
*పల్లపోతు కృష్ణ బాలాజీ గారు- వాణి శ్రీ దంపతులు*
ఫోన్ నెంబర్
99490 98406
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి