7, ఏప్రిల్ 2025, సోమవారం

*శ్రీమద్ భాగవతం

 ☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

         *శ్రీమద్ భాగవతం*

              *(98వ రోజు)*

   *(నిన్నటి భాగం తరువాయి)*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

            *కృష్ణావతారం* 

             *శ్రీకృష్ణ లీల*

          *గోవర్థగిరిధారి*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

*యాదవులంతా ఇంద్రయాగం చేయాలనుకున్నారు. సంభారాలు సమకూర్చున్నారు. హడావుడి పడసాగారు.*


*గమనించాడది కృష్ణుడు.‘‘ఎందుకిదంతా’’ అడిగాడు.*


*‘‘ఇంద్రుడు మేఘాలకు అధిపతి. ఆ దేవుడు సంతృప్తి చెందితే వర్షాలు బాగా పడతాయి. వర్షాలు బాగా పడితే కరువు కాటకాలు ఉండవు.’’ అన్నారు నందాదులు.*


*‘‘అలాగా’’ అన్నాడు కృష్ణుడు. నవ్వుకున్నాడు. ఇంద్రుడే వర్షం కురిపిస్తున్నట్టూ, అతని దయాదాక్షిణ్యాలతోనే బతుకుతున్నట్టుగా ఉన్న యాదవులందరికీ కళ్ళు తెరిపించాలనుకున్నాడు కృష్ణుడు. అలాగే ఇంద్రుడికి కూడా గర్వభంగం చేయాలనుకున్నాడు.*


*జగద్రక్షకుడు తనకంటే వేరొకరు లేడనీ, ఉండడనీ లోకానికీ తెలియజేప్పేందుకు నడుము బిగించాడు. ఇంద్రయాగం చేయవద్దని చెప్పాడు కృష్ణుడు.*


*‘‘యాగం చేయకపోతే ఇంద్రునికి కోపం రాదూ?’’ అడిగారు.*


*‘‘వస్తే రానీ, ఏం చేస్తాడు? వర్షాలకీ ఇంద్రుడికీ ఎలాంటి సంబంధమూ లేదు. సత్వరజస్తమో గుణాలే లోకకారకాలు. ఈ జగత్తు ఇలా ఆవిర్భవించిందంటే దానికి రజస్సే కారణం. మేఘాలు రజోగుణ కారణంగానే ఉద్భవిస్తాయి. వాటి స్వభావసిద్ధంగా వర్షిస్తాయి. ఇంద్రుడికి ఇందులో సంబంధం ఏముంది?’’ అడిగాడు కృష్ణుడు.*


*‘‘అవును ఏముంది? లేదు లేదు.’’ అనుకున్నారు పెద్దలు.*


*‘‘సర్వం కర్మవశం. ఆ కర్మ దైవాధీనం. ఎవరి కర్మానుసారంగా వారు సుఖదుఃఖాలు అనుభవిస్తారు.’’ అన్నాడు కృష్ణుడు. ఇంద్రయాగం అనవసరం అన్నాడు.‘‘మనకూ మన గోగణాలకూ, బృందావనాది ఈ అడవులకూ గోవర్థనగిరి ప్రాణాధారం. సమస్త ఓషధులను అందజేస్తూ ప్రాణాధారంగా ఉన్న ఆ గోవర్థనగిరిని పూజించండి. పుణ్యం పురుషార్థం లభిస్తాయి, అంతేగాని ఇంద్రుడికెందుకు యాగం?’’ అడిగాడు కృష్ణుడు. సంభారాలన్నీ గోవర్థనోత్సవానికి తరలించమన్నాడు. ఎంత వైభవంగా గోవర్థనోత్సవం జరిపిస్తే అంత వైభవంగా శుభాశీస్సులు అందుకోవచ్చన్నాడు.*


*కృష్ణుడు చెబితే తిరుగేముంది. అలాగేనన్నారు యాదవులు. ఇంద్రయాగం మానుకున్నారు. వైభవంగా గోవర్థనోత్సవాన్ని జరిపేందుకు పూనుకున్నారు. అంతా బళ్ళు కట్టుకుని, బయల్దేరారు. పాలు, పెరుగు, వెన్న, నెయ్యి కావిళ్ళకెత్తారు. ఉప్పు, పప్పు, బియ్యం, కూరలు బళ్ళకెత్తారు. వేదమంత్రాలు బ్రాహ్మణులు పఠిస్తోంటే, మంగళవాద్యాలు మోగుతోంటే గోవర్థనపర్వతాన్ని సమీపించారంతా. హోమాలు చేశారు. పూజించారు. బ్రాహ్మణులకు భూరిదక్షిణలూ, దానాలూ ఇచ్చారు. గోపూజ చేశారు. తర్వాత గోవర్థనగిరిని పూజించారు. బలులిచ్చారు.*


*కృష్ణుడప్పుడు తన దేహాన్ని పెంచి, గోవర్థనగిరి తానేనన్నట్టుగా ఆ బలులన్నింటినీ స్వీకరించాడు. గోవర్థనగిరికి ప్రదక్షిణ చేశారు యాదవులు. నృత్యగానాలతో, క్రీడలతో ఆనందించారు. గోవర్థనోత్సవం ముగిసింది.*


*తనకు యాగం తలపెట్టి, యాగం చెయ్యలేదు. పైగా గోవర్థనగిరికి పూజలు చేశారు. కృష్ణుడు చెబితే తలలూపారంతా. సహించలేకపోయాడు ఇంద్రుడు. యాదవుల పొగరణచాలనుకున్నాడు. జ్ఞానాన్ని కోల్పోయాడతను. కృష్ణుణ్ణి సామాన్య మానవునిగా తలచి, గోకులాన్ని సర్వనాశనం చేసేందుకు కోపంతో పిడికిలి బిగించాడు.*


*అతని వద్ద సంవర్తక మేఘగణాలు ఉన్నాయి. జగత్తును అంతం చేసే మేఘాలవి. వాటిని ప్రళయేతర సమయాల్లో విజృంభించకుండా బంధిస్తారు. కట్లు విప్పితే వాటిని పట్టశక్యం కాదు. జగత్తంతా అల్లకల్లోమయిపోతుంది. కావాల్సింది అదే అనుకున్నాడు ఇంద్రుడు. ఆ మేఘగణాలను పిలిచాడు.*


*‘‘మీరు వెళ్ళి గోకులంపై వర్షించండి. గోపాలురనూ, గోగణాలనూ సర్వనాశనం చేసేయండి. నేనీలోపు ఐరావతం అధిరోహించి వస్తాను.’’ అన్నాడు. సరేనన్నాయి సంవర్తకమేఘాలు. గోకులం మీద విరుచుకుని పడ్డాయి.*


*(తర్వాత కథ రేపు చెప్పుకుందాం )*


*ఓం నమో భగవతే వాసుదేవాయ॥*

☸️☸️☸️☸️☸️☸️☸️☸️☸️

కామెంట్‌లు లేవు: