18, జులై 2021, ఆదివారం

సాధనకు సమయం?*

 *సాధనకు సమయం?*

    🕉️🌞🌎🏵️🌼🚩

                  

 *పడకగదిలో తన మంచంపై పడుకుని ఉన్న రాధాకృష్ణ ఏదో అలికిడి కావడంతో ఉలిక్కిపడి కళ్ళు తెరిచి చూశాడు. అతని ఎదురుగా ఒక దివ్యకాంతి ప్రకాశిస్తూ కనబడింది. చూస్తూండగా ఆ కాంతి ఒక స్త్రీ రూపాన్ని దాల్చింది.* *దేదీప్యమైన కాంతులను వెదజల్లుతున్న ఆ స్త్రీమూర్తి సాక్షాత్తు ఆ జగన్మాతేనని గ్రహించిన రాధాకృష్ణ, "అమ్మా!" అంటూ ఆ తల్లి పాదాలపై పడాలని అనుకున్నాడు. కాని, మంచంపై అతనిని ఎవరో కట్టేసినట్లు అనిపించడంతో ఒక్క అంగుళం కూడా కదలలేకపోయాడు. 'ఏమైంది నాకు?' అనుకుంటూ రాధాకృష్ణ తన వంక తాను ఒకసారి చూసుకుని ఆశ్చర్యపోయాడు.* *అతని శరీరం బక్కచిక్కిపోయి, చర్మం ముడతలు పడిపోయి ఉంది. లేచేందుకు ఏమాత్రం ఓపిక తనలో మిగలలేదని, తన అంత్యకాలం సమీపించిందని అర్థం చేసుకున్న రాధాకృష్ణ ఆ పరమేశ్వరి వంక చూస్తూ, "తల్లీ! నన్ను నువ్వే* *కాపాడాలి... నాకు నీ వద్దకు రావాలని ఉంది!" అన్నాడు.* 


“అవును, కుమారా! నాకూ నిన్ను నాతో తీసుకెళ్లాలని ఉంది కానీ, నీవు ఈ జన్మలో చేసిన పుణ్యం అందుకు సరిపోయేటట్టు లేదు. అదే నా బాధ", అంది జగన్మాత విచారంగా.  


"అమ్మా! నేను ఇప్పటివరకూ ఎవ్వరికీ కష్టం కలిగించకుండా ఉన్నానే... అది సరిపోదా?" అడిగాడు రాధాకృష్ణ. 


“సరిపోదు, నాయనా! నువ్వు నాతో రాగలిగేందుకు కావలసిన అర్హతను పొందాలంటే నీకు లభించిన మానవ జన్మను భగవత్సేవకు అంకితం చెయ్యాలి. నేను నీకిచ్చిన ఈ తొంబై అయిదు సంవత్సరాలలో నువ్వు ఏనాడూ నా సన్నిధిలో దీపం కూడా వెలిగించినట్టు లేవు" అంది పరమేశ్వరి. 


"నిజమేనమ్మా! నువ్విచ్చిన సుఖాలను అనుభవించానే తప్ప ఇన్నాళ్లు నిన్నెలా సేవించాలో నేనసలు ఆలోచించలేదు. నన్ను మన్నించమ్మా... నాకు ముక్తిని ప్రసాదించు తల్లీ," అని అమ్మను వేడుకున్నాడు రాధాకృష్ణ.


"సరే నాయనా! నా బిడ్డవు కాబట్టి నీకొక చివరి అవకాశం... నీకు కచ్చితంగా పది నిమిషాల వ్యవధి ఇస్తున్నాను. ఈ పది నిమిషాలలో నీకు తోచిన విధంగా నన్ను సేవించి, నాతో వచ్చేందుకు అర్హతను సంపాదించు, నాయనా!" అంది పరమేశ్వరి. 


“ఆహా... అమ్మా! నువ్వు కరుణామయివి. నేను ఈ అవకాశాన్ని తప్పకుండా సద్వినియోగం చేసుకుంటాను" అని అమ్మను ఎలా సేవించాలా అని, ఆలోచనలో పడ్డాడు రాధాకృష్ణ. 

'పత్రం, పుష్పం, ఫలం, తోయం' అన్నారు కాబట్టి పెరటిలో ఉన్న నాలుగు పుష్పాలు కోసుకుని వచ్చి అమ్మ పాదాలపై వేద్దామనుకున్నాడు రాధాకృష్ణ. లేచే ప్రయత్నం చేసినప్పుడు కానీ రాధాకృష్ణకి అతడు లేవలేని స్థితిలో ఉన్నానని గుర్తుకు రాలేదు. చేతులు జోడించి అమ్మనుగూర్చి ప్రార్థన చేద్దామని రాధాకృష్ణ తన రెండు చేతులను ఒక దగ్గరకు అతికష్టం మీద తీసుకుని వచ్చాడు. నరాల బలహీనతవల్ల చేతులు వణికిపోయాయి. రెండు నిమిషాలన్నా నమస్కార ముద్రను నిలపలేకపోయాడు రాధాకృష్ణ. 

తనకు తెలిసిన పాటను సంగీత సేవగా భావిస్తూ శ్రావ్యంగా పాడదామని రాధాకృష్ణ అనుకున్నాడు. కానీ, వృద్ధాప్యం వల్ల గొంతులో కఫం అడ్డుపడి పాడలేకపోయాడు.


'ఇక నావల్ల కాదమ్మా! నువ్వే దారి చూపించు' అని అమ్మవంక దీనంగా చూశాడు రాధాకృష్ణ. 


"అయ్యో నాయనా! నువ్వు పడుతున్న అవస్థను చూడలేకపోతున్నాను. పోనీ నీకు వచ్చిన స్తోత్రంతో నన్ను స్తుతించు." అడిగింది జగజ్జనని.


 "అలాగేనమ్మా!" అంటూ రాధాకృష్ణ తను చిన్నప్పటినుండీ విన్న శ్లోకం ఒకటి టకాటకా చెప్పేశాడు కానీ అతని పళ్ళన్నీ ఊడిపోవడంవల్ల ఆ శ్లోకంలో చాలా పదాలు స్పష్టంగా పలకలేకపోయాడు. అందువల్ల కొన్ని పదాల అర్థాలు కూడా మారిపోయాయి.


 "పోనీలే నాయనా! నన్ను చూసి నా రూపాన్ని వర్ణించు... తృప్తి చెందుతాను" అంది ఆ తల్లి. 


రాధాకృష్ణకు వయసు వల్ల చూపు బాగా మందగించింది. తన కళ్ళను ఎంత చిట్లించి చూసినా అమ్మ రూపు స్పష్టంగా కనబడలేదు. 


"నాయనా! నా చుట్టూ ఉన్న తరంగాలు నా బీజాక్షరాన్ని నిరంతరం ప్రతిధ్వనించేలా చేస్తాయి. జాగ్రత్తగా విను" అంది జగన్మాత. 

రాధాకృష్ణ తన డెబ్భైయ్యవ ఏటనే వినికిడి శక్తిని కోల్పోవడంతో చెవులు రిక్కించి విన్నప్పటికీ తనకు ఎటువంటి శబ్దమూ వినబడలేదు. 


'అమ్మా! ఇప్పుడేం చెయ్యనూ?' అన్నట్టు అమ్మవంక చూశాడు రాధాకృష్ణ.


"ఇక ఆఖరి ప్రయత్నంగా నీ మనసు ఒక రెండు నిమిషాలపాటు నాపై లగ్నం చెయ్!" అంది తల్లి. 


రెండు నిమిషాలు ప్రయత్నించిన తర్వాత, "మహానీయులకు సైతం మనసును ఏకాగ్రచిత్తముతో నీపై నిలపడం సులభం కాదు. నావంటి అల్పునికి అదెలా సాధ్యపడుతుంది అమ్మా? నావల్ల కాదు" అని అన్నాడు రాధాకృష్ణ దీనంగా. 


జగన్మాత రాధాకృష్ణకు ఇచ్చిన పది నిమిషాల గడువు ముగిసింది. 


"అమ్మా నిన్ను ఏ విధంగానూ సేవించలేకపోయాను" అని కడు దుఃఖంతో అన్నాడు రాధాకృష్ణ. పశ్చాత్తాపంతో అతని కళ్ళ వెంట నీళ్లు ధారాపాతంగా కారిపోతున్నాయి. 


"ఇదంతా నీ స్వయంకృతం, నాయనా! నువ్వు తరించడానికే నికీ మానవజన్మ లభించిందన్న విషయం నువ్వు విస్మరించావు. నీ పేరు చెప్పినప్పుడల్లా నా నామాన్ని స్మరించావు కనుకనే ఈ విధంగానైనా నీకు నా దర్శన భాగ్యం కలిగింది. భగవద్విషయాలను జీవిత చరమాంకంలో తెలుసుకోవచ్చులే అని అనుకోవడం అవివేకం. నీకు మానవజన్మ లభించిన దగ్గరినుండి ప్రతి నిమిషం అమూల్యమే, నాయనా! భగవద్భక్తికి బాల్యంలోనే బీజం పడాలి. జీవితం చివర్లో సత్యాన్ని గ్రహించినా, చేసేందుకు శరీరం సహకరించకపోయే ప్రమాదం ఉంది. సమయం విలువను తెలుసుకో... ఇకనైనా మేలుకో అని చెప్పి ఆ దివ్యకాంతి అంతర్థానమయ్యింది. 


"అమ్మా... అమ్మా! నాకు నువ్వు కావాలి" అని ఏడుస్తూ నేలపై పడ్డాడు రాధాకృష్ణ.


అంతలో, "నాయనా రాధా! నేనురా నీ అమ్మను. కలేమైనా కన్నావా? లే నాయనా లే" అంటూ, నిద్రపోతూ మంచంపై నుండి కిందపడ్డ రాధాకృష్ణను అతని తల్లి లేవదీసింది.


రాధాకృష్ణ కళ్ళు నులుముకుంటూ తనకొచ్చినది కల అని తెలిసి ఆశ్చర్యపోయాడు. కలలో జగన్మాత చేసిన బోధను గుర్తుచేసుకుంటే రాధాకృష్ణకు తను చేస్తున్న తప్పులన్నీ తెలియవచ్చాయి. తనకు పాతకాలం నాటి పేరు పెట్టినందుకు పెద్దలను నిందించిన సందర్భాలూ గుర్తుకు వచ్చాయి. 


రోజూ ఇంట్లోని పెద్దవాళ్ళు వెంటపడితే కానీ స్నానం చెయ్యని రాధాకృష్ణ ఆ రోజు పూర్తిగా తెల్లవారకమునుపే స్నానం ముగించి, ఇంట్లోని దేవుని మందిరం దగ్గరకు వెళ్లి, భగవంతునికి భక్తిగా నమస్కరించి, ఆ తర్వాత తన బామ్మవద్దకు వెళ్లి, "బామ్మా! ప్రతిరోజూ నీతో గుడికి రమ్మని నన్ను అడుగుతూ ఉంటావుగా... ఇవాళ నువ్వు గుడికెళ్లేటప్పుడు చెప్పు నేను కూడా వస్తాను" అని అన్నాడు రాధాకృష్ణ. 


ఎప్పుడూ - నేనింకా చిన్నవాడిని! నాకప్పుడే గుళ్ళూ, గోపురాలూ, భగవంతుడూ, భక్తి ఎందుకే బామ్మా?" అంటూ చిరాకుపడే తన పన్నెండేళ్ల మనవడు రాధాకృష్ణలో అకస్మాత్తుగా వచ్చిన మార్పును చూసి ఆశ్చర్యపోతూ, 'అమ్మా పరమేశ్వరీ! ఇన్నాళ్ల నా ప్రార్థనను విన్నావా తల్లీ' అని అనుకుంటూ ఆనందపడిపోయింది రాధాకృష్ణ బామ్మ.✍️


        🌷🙏🌷

సేకరణ. మానస సరోవరం 👏

కామెంట్‌లు లేవు: