19, జులై 2021, సోమవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..


*అమ్మ చెప్పిన మాట!*


శ్రీ స్వామివారి మందిర ప్రాంగణంలో భక్తులు ప్రదక్షిణ చేయడానికి ఓ ఐదారు అడుగుల వెడల్పుతో కాలిబాట లాగా ఉండేది..మిగిలిన స్థలమంతా గడ్డి మొలచి..అందులో పల్లేరు కాయల ముళ్ళతో నిండిపోయి ఉండేది..ఈ పరిస్థితి 2004 సంవత్సరం నాటిది..అప్పటికి నేను ధర్మకర్త గా బాధ్యతలు తీసుకొని నాలుగు రోజులు కూడా కాలేదు..ఆ ప్రక్క ఆదివారం రోజున..గాలిచేష్ట లతో బాధపడుతున్న భక్తులు..ఆ ముళ్ల మీదే కేకలు వేసుకుంటూ పరిగెడుతున్నారు..వారున్న మానసిక స్థితిలో..వారికి ముళ్ళు గ్రుచ్చుకున్నా పెద్దగా బాధ పడటం లేదు కానీ..చూస్తున్న మా కందరికీ చాలా కష్టంగా అనిపించింది..


ఆ ప్రక్కరోజే మనుషుల ను మాట్లాడి..ఆ స్థలమంతా శుభ్రంగా చేయించాను..మొత్తం ప్రాంగణం మంతా నాపరాయి పరిపించాలని సంకల్పించాను..సుమారు యాభైవేల రూపాయలు అవుతుందని ఒక అంచనాకు వచ్చాము..ఈ మొత్తం ఎక్కడి నుంచి తీసుకు రావాలి?..భక్తుల నుంచి చందాల రూపంలో తీసుకుందామని మా సిబ్బంది సలహా ఇచ్చారు..సలహా బాగుంది కానీ..నాకున్న ఇబ్బంది ఏమిటంటే..నేను గబుక్కున ఎవ్వరినీ ఏదీ అడగలేను..


మొగలిచెర్ల లోని మా ఇంటికి వచ్చి..మా అమ్మగారైన ప్రభావతి గారితో సమస్య చెప్పాను.."అమ్మా..భక్తుల బాధ చూడలేకుండా వున్నాను..దెయ్యం పట్టిన వాళ్ళు..గాలి చేష్ట తో బాధపడేవాళ్లు..ఇతర మానసిక జబ్బులున్న వాళ్లు..అందరూ ఆ ముళ్ల లోనే పొర్లాడుతున్నారు..చూస్తుంటే చాలా ఇబ్బందిగా ఉన్నది..అందుకనే ఈరోజు మొత్తం శుభ్రం చేయించాను..ఇక నాపరాయి పరిపిస్తే..బాగుంటుందని ఆలోచిస్తున్నాను..దేవస్థానం వద్ద అంత డబ్బు లేదు..నేనేమో ఎవ్వరినీ చందాలు కావాలని అడగలేను..నా మొహమాటం నాది..ఏం చెయ్యాలో పాలుపోవటం లేదమ్మా.." అన్నాను..


అమ్మ నన్ను తన దగ్గరగా కూర్చోమని చెప్పి.."నువ్వు ఒక మంచి పని చేద్దామని సంకల్పించావు..అది అందరు భక్తులకూ ఉపయోగకరంగా ఉంటుంది..నువ్వు ఎవ్వరినీ ఏమీ అడగవద్దు..ఒక ముఖ్య సూత్రం చెపుతున్నా విను..నేరుగా ఆ స్వామి సమాధి వద్దకు వెళ్ళు.. నిన్ను నువ్వు ఆయనకు శరణాగతి చేసుకో..ఇప్పుడే కాదు..ఎప్పుడు నీకు సమస్య వచ్చినా..ఆ సమాధి ముందు మోకరిల్లు.. అంతా స్వామివారు చూసుకుంటారు..కాకుంటే ఇందులో ఇంకొక అభ్యంతరం ఉంది..ఏ కోరికా నీ స్వార్ధానికి కోరుకోకు!!.. అలా కోరుకున్నావో..అది జరగదు..నువ్వు మరికాస్త బాధపడటం తప్ప మరేమీ రాదు..రేపుదయాన్నే శుచిగా..నువ్వూ..నీ భార్యా..ఇద్దరూ మందిరానికి వెళ్ళండి..ఆ సమాధి వద్ద మనస్ఫూర్తిగా మీలోని వేదనను చెప్పుకోండి..ఆ తరువాత అంతా ఆ స్వామివారే చూసుకుంటారు.." అన్నది..


ఆ మాటలు తారకమంత్రం లా నా మీద పనిచేసాయి..ప్రక్కరోజు ఉదయం ఎనిమిది గంటలకల్లా నేనూ మా ఆవిడా ఇద్దరం శ్రీ స్వామివారి మందిరానికి వెళ్ళాము..ఆరోజు మంగళవారం..మందిరం లోని బావి వద్దకు వెళ్లి..ఆ బావిలోని నీళ్లను కొద్దిగా నెత్తిమీద చల్లుకుని..ప్రధాన మంటపం లోకి వచ్చాము..ఇంతలో..

"అయ్యా!..మీకోసం ఉదయం ఆరు గంటల నుంచీ ఒకాయన ఎదురు చూస్తున్నాడు..ఒక్క నిమిషం ఆయనతో మాట్లాడి వెళ్ళండి.." అని మా సిబ్బందిలో ఒకరు చెప్పారు..


సరే అన్నాను..ముందు మంటపంలో అతను కూర్చుని ఉన్నాడు..రమ్మని పిలవగానే గబ గబా వచ్చాడు..ఒక ఐదు నిమిషాల పాటు పరిచయాలయ్యాక.."అయ్యా..ఈ మొత్తం ప్రాంగణం అంతా రాళ్లు పరిపించాలని అనుకున్నాను..మా వాళ్ళు ఒంగోలు లో వున్నారు..భూములు కొని..అమ్మే వ్యాపారం చేస్తున్నారు..ఇళ్ల స్థలాల వ్యాపారమూ చేస్తున్నారు..మీరొప్పుకుంటే..వాళ్ళతో మాట్లాడి పని మొదలు పెట్టిస్తాను.."అన్నాడు..


ఒక్కక్షణం నోట మాట రాలేదు..మేము ఇంకా శ్రీ స్వామివారి సమాధి వద్దకు కూడా పోలేదు..మా మనసులోని కోరిక అక్కడ చెప్పుకోనూ లేదు..మా అమ్మగారు చెప్పినట్టు శరణాగతి చెందనూ లేదు..కానీ..మా ఆలోచన ఆ స్వామివారు పసిగట్టేశారు..పిలువకముందే స్వామివారు పలుకుతున్నారనిపించింది..


అమ్మ చెప్పిన మాట అక్షర సత్యమై కూర్చుంది.."ఏ కోరికా స్వార్ధానికి కోరుకోకు!!" అని ఆమె హెచ్చరించింది..ఇప్పటి కోరిక భక్తులకు సంబంధించింది..


వచ్చినతను నా అనుమతి కోసం చూస్తున్నట్టు వున్నాడు..నిజానికి మధ్యలో నేను ఎవరిని?..నిమిత్తమాత్రం గా వున్నాను..అంతే!..మా దంపతులము శ్రీ స్వామివారి సమాధికి సాష్టాంగ నమస్కారం చేసుకున్నాము..


"సరే !.. మీరు అనుకున్న విధంగా చేయండి!.." అన్నాను..ఆమాట చెప్పిన వెంటనే..ఆయన సెలవు తీసుకొని వెళ్ళిపోయాడు..ఆరోజు జరిగిన విషయమంతా అమ్మకు చెప్పాను..ఆవిడ నవ్వింది..మరో మూడు నెలలకు..ప్రాంగణం అంతా నాలుగు లక్షలు ఖర్చుపెట్టి పాలరాయి పరిపించారు..ఎక్కడి యాభై వేలు?..ఎక్కడి నాలుగు లక్షలు?..పల్లేరు కాయల ముళ్ళతో ఉన్న మందిరప్రాంగణం.. పాలరాయి తో నిండిపోయింది..


ఆరోజు నుంచీ ఈనాటిదాకా అమ్మ చెప్పిన ఆ మాటలు మా హృదయాల్లో ప్రతిధ్వనిస్తూ ఉన్నాయి..


సర్వం..

దత్తకృప.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్: 523114.. సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: