18, జులై 2021, ఆదివారం

దండెం

 దండెం:


పరంధామయ్య బ్రాహ్మణ వృద్ధాశ్రమం లో చేరాడు.కొడుకు ఉన్నా వృద్ధాశ్రమం లో ఎందుకు చేరాడు అంటే చిన్న కథ ఉంది.


పరంధామయ్య భార్య పోయాక హైదరాబాద్ లో కొడుకింటికి చేరాడు.


కొడుకు ఇల్లు చక్కగా, శుభ్రంగా,విశాలమైన హాలు,ఖరీదైన సోఫా సెట్టు,పెద్ద టీ.వీ.తో అద్భుతంగా ఉంటుంది.


ఓ‌రోజు కొడుకు,కోడలు బయటికి ‌వెళ్ళారు.రాత్రి ఇంటికొచ్చేసరికి ఆలస్యమైందని పడుకున్నారు.


మర్నాడు ఉదయం హాలులో కి వచ్చి చూసి విస్తుపోయారు.హాలులో ఈ మూల నుంచి ఆ మూలకి దండెం కట్టుబడి,దానిమీద ధావళీలు,పట్టు పంచెలు,మడి పంచెలు ఆరేయ బడి ఉన్నాయి.


అది చూసి పరంధామయ్య గారి కొడుకు చిరాకు పడి, నాన్నగారూ ఈ దండెమేమిటి? శుభ్రమైన హాలు అందమంతా ‌పోయింది.మన వంటాయన తో చెబితే మీ మడి బట్టలు చక్కగా బయట ఆరేసి  పెట్టి‌ మీరు పూజ చేసుకునే టైముకి ఇస్తాడు అని పనివాణ్ణి పిలిచి దండెం తీయించేసాడు.


దాంతో అహం దెబ్బ తిన్న పరంథామయ్య కొడుకు,కోడలు ఎంత చెప్పినా వినకుండా ఎరుగున్న వారి ద్వారా వృద్ధాశ్రమంలో చేరాడు.


పరంధామయ్య తో పాటు,మరో నలుగురు చేరారు.కొత్తగా చేరిన

మెంబర్లు అందరికి వృద్ధాశ్రమం మేనేజర్ నిబంధనలు అన్నీ చెబుతూ,మీ అందరికి ఓ మనవి.


ఏమిటంటే! దయచేసి  ఎవరూ మీమీ గదుల్లో దండేలు కట్టి బట్టలు ఆరేయకండి.గదుల్లో ఆరేయడం వల్ల‌ సరిగా ఆరక ముక్క కంపు కొడుతుంది.దయచేసి సహకరించే గలరు. మా నిబంధనలు నచ్చక పోతే వెళ్ళి పోవచ్చు అని చెప్పాడు.


సాయంకాలం, స్నాక్స్ తిని,టీ తాగి‌ వృద్ధాశ్రమం ఆవరణలో కూర్చున్న పరంధామయ్య కి అంతర్మథనం ఆరంభమై,తప్పు చేశా నేమో అనిపించింది.కానీ వెనక్కి పోడానికి

అహం అడ్డొచ్చింది.


ఆలోచిస్తూ,మథన పడ్తున్న పరంథామయ్యకి నాన్నగారూ అన్న కొడుకు పిలుపు చల్లగాలి లా తాకింది.


మేనేజరుతో మాట్లాడి కొడుకు పరంథామయ్యని ఇంటికి తీసుకు పోయాడు.


ఇంటికి చేరిన పరంథామయ్య మరేనాడు తన చాదస్తాలని ప్రదర్శించ లేదు.

#జయంతి లక్ష్మీ నరసింహం#

కామెంట్‌లు లేవు: