23, సెప్టెంబర్ 2020, బుధవారం

*శ్రీ విఘ్నేశ్వర విశిష్టత*

 **దశిక రాము**


 (6వ భాగం)


తారకాసురుడు రాక్షసులందర్నీ 

కూడ గట్టుకొని విజృంభించాడు. ముల్లోకాలనూ ఆక్రమించుకుని, కసితీరా దేవతలను చిత్ర హింసలు పెట్టసాగాడు. ఇంద్రాది దేవతలు హడలిపోయి, తమ దీనావస్థను బ్రహ్మతో మొరపెట్టుకున్నారు. ‘‘శివుడికి కుమారుడు పుట్టాలి, అతని వల్లనే తారకుడు చావాలి! అలాంటి వరాన్ని తారకుడికి ఇచ్చాను మరి. ఇంకెరివల్లా తారకాసురుడికి ఎటువంటి హానీజరగదు.

మరోవిధంగా అతడికి చావూ లేదు!''అని బ్రహ్మ చెప్పి దేవతలను వెంటబెట్టుకుని తరుణోపాయం కోసం విష్ణువు దగ్గరికి దారి తీశాడు. ‘‘సతీదేవి హిమవంతుడికి కూతురుగా పుట్టి పార్వతిగా పెరుగుతూ ఉన్నది. శివుడికి పార్వతికి పెళ్ళిజరిగేలా చూడండి!'' అని విష్ణువు చెప్పాడు. దేవతలు నారదుణ్ణి హిమవంతుడి దగ్గరికి పంపించారు.


నారదుడి ఆదేశం ప్రకారం హిమవంతుడు సతీసమేతంగా, తపస్సులో నిమగ్నుడై ఉన్న శివుడి దగ్గరికి వెళ్ళి, పూజించి తన కుమార్తె పార్వతి అతని తపస్సుకు అనుకూలంగా పరిచర్యలు చేస్తూండడానికి అనుమతించవల సిందని కోరాడు. శివుడి మౌనాన్ని అంగీకారంగా గ్రహించి హిమవంతుడు పార్వతిని శివుడికి పరిచర్యలు చేయడానికి పురమాయించాడు.


చిన్నతనం నుంచీ పార్వతికి శివుడంటే చాలా ఇష్టం. బాలపార్వతికి నారదుడు శివుడి గురించి అనేక విషయాలు చెపుతూండేవాడు. శివుడి కథలనూ, గుణగణాలనూ, మహిమలనూ పదేపదే వినడానికి కుతూహలపడుతూ ఉండేది పార్వతి. పెళ్లాడితే శివుణ్ణే పెళ్ళాడాలని ఉవ్విళ్లూరేది. అటువంటి శివుడికి పరిచర్యలు చేయడం తరుణప్రాయంలో ఉన్న పార్వతికి మహాభాగ్యంగా తోచింది.


తెల్లవారుతూండగా శివుడు తపస్సు చేస్తున్న పరిసర ప్రాంగణమంతా నెమలిపింఛపుకట్టతో తుడిచి, హిమానీ జలాల్లో మంచిగంధం కలిపి కల్లాపుజల్లి, ముత్యాల ముగ్గులు తీర్చేది. బంగారు తీగెలతో అల్లి, రత్నాలు కెంపులు పొది గిన తట్టతో శివుడికి ఇష్టమైన ఫల పుష్పాలను, మారేడు పత్రినీ, తెల్లకలువలనూ తీసుకెళ్ళి పక్కనుంచేది. బంగారు కమండలం నిండా హిమశిఖరాల నుంచి జారే స్ఫటిక జలాలను నింపి, జప మాలతో కలిపి అమర్చిపెట్టేది.

🙏🙏🙏

సేకరణ



**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: