🕉🕉🕉 *దేవి కథలు* 🕉🕉🕉 *కోసల దేశాన్ని పాలకుడైన ధ్రువ సింధు మహారాజు సూర్యవంశంలో జన్మించినవాడు. అతడు ధర్మాత్ముడు , సత్యసంధుడు. వర్ణాశ్రమ ధర్మరక్షణ తన కర్తవ్యంగా భావించి పాలన సాగిస్తున్న ఉత్తమ ప్రభువు. అతని రాజ్యంలో అన్ని వర్ణాలవారూ తమ తమ జాతులకు విధింప బడిన ధర్మాలను అనుకరిస్తూ, సామరస్యంతో జీవిస్తున్నారు. అతని రాజ్యంలో దొంగలు, ధూర్తులు, లోభులు, కృతఘ్నులు, డంబాచార పరాయణులు లేరు. అందరూ సద్గుణ సంపన్నులే*.
*ధ్రువ సింధునికి మనోరమ, లీలావతి అని ఇద్దరు భార్యలున్నారు. పట్టమహిషి అయిన మనోరమ సహధర్మచారిణి అనే పేరును సార్థకం చేస్తూ, అన్ని విధాలా భర్తకు అనుకూలవతిగా ఉన్న ఉత్తమ ఇల్లాలు. చిన్న భార్య అయిన లీలావతి సౌందర్య గర్వంతో భర్తను చులకన చేసేది. రాజు మాత్రం ఇద్దరినీ ఒకే విధమైన ప్రేమానురాగాలతో ఆదరించేవాడు. అయినా చిన్న భార్య పట్ల కొంచెం మోగ్గు చూపేవాడు*.
*కొంత కాలానికి ఆ రాణులిద్దరికి పుత్రసంతానం కలిగింది. రాజు తన పుత్రులిద్దరికీ జాత కర్మ, నామకరణం నిర్వహించాడు. మనోరమకు జన్మించిన పుత్రునికి 'సుదర్శనుడు' అని, లీలావతికి పుట్టిన కుమారునికి 'సుందరుడు' అని పేర్లు పెట్టాడు*.
*కాలక్రమేణ రాజకుమారులిద్దరూ పెరిగి పెద్ద వాళ్ళయ్యారు. సుదర్శసుడు శత్రుసంహారం సాగించగల బల శౌర్య ధైర్య సముపేతుడై, తన సద్గుణ సంపదచేత అందరి మనసులనూ చూరగొన్నాడు. అయినా ధ్రువసింధువు చిన్న భార్యపట్ల గల మమకారాతిశయం చేత సుందరిని పట్లనే ఎక్కువ మక్కువ చూపసాగాడు. సుదర్సనుడు రాజయ్యే శుభతరుణం కోసం ప్రజలందరూ నిరీక్షించేవారు*.
*కొంత కాలానికి ధ్రువసింధువు వేటకు వెళ్ళి, సింహాన్ని వేటాడుతూ ప్రాణాలు కోల్పోయాడు. కుల గురువైన వశిష్ఠుడు సుదర్శునుని రాజుగా నిర్ణయించాడు. మంత్రులు, పురోహితులు ప్రజలు అందరూ ఆనందంగా అంగీకరించారు. ధర్మబుద్ధి గలవాడు, శాంతస్వబావుడు, పరిపాలనకు తగిన ధైర్యసాహసాలు గల వాడు అయిన సుదర్శనుడే రాజు కానున్నాడని దేశ ప్రజలంతా సంతోషించారు*.
*అల్లుని మరణవార్త తెలిసి లీలావతి తండ్రి యుధాజిత్తు, మనోరమ తండ్రి వీరసేనుడు కోసల దేశానికి వచ్చారు. వారిద్దరూ ఎవరికి వారు తమతమ మనుమలకే పట్టాభిషేకము చేయాలని వాదించారు. ఆ వాదన క్రమంగా హద్దుమీరి, యుద్ధానికి దారితీసింది. యుద్ధంలో యుధాజిత్తు వీరసేనుణ్ణి సంహరించాడు. లీలావతి కుమారుడైన సుందరుడే పట్టాభిషిక్తు డయ్యాడు*.
*తన తండ్రి మరణవార్త తెలిసి మనోరమ వేదన చెందింది. భర్తలేని తనకు తండ్రి అండ కూడా లేనందున రాజ్యంలో తనకు, తన పుత్రునికి రక్షణ ఉండదని భావించింది. అంతరంగికుల సహాయంతో అర్థరాత్రివేళ తన కుమారునితో కలసి నగరం విడిచి వెళ్ళింది. వారణాసి చేరి, గంగానదిని దాటి, భరద్వాజ మహర్షి ఆశ్రమాన్ని చేరుకున్నది. అక్కడి మహర్షులకు తన వృత్తాంతం విన్నవించింది. ఆమె కథ విన్న మహర్షులు ఆమెకు అభయమిచ్చి, ఆశ్రయ మిచ్చారు*.
*కొంత కాలానికి యుధాజిత్తు మనోరమ, సుదర్శనుణ్ణి వెతుక్కుంటూ భరద్వాజాశ్రమానికి వచ్చాడు. మనోరమ, సుదర్శనుణ్ణి తనకు అప్పగించవలసిందిగా కోరాడు. అప్పగించని పక్షంలో సైనికులను పంపి, బలప్రయోగం చేసి, ఆశ్రమంపై దాడి జరిపి, వారిద్దరినీ తాను తన వెంట తీసికొని పోగలనని మహర్షిని బెదిరించాడు. ఆ మాటలు విన్న మహర్షి " ఓయీ ! ధూర్తుడా ! దుర్బుద్ధితో ఆశ్రమంలో అడుగు పెట్టినట్లుయితే, నువ్వు నీ సైన్యము కూడా నామరూపాలు లేకుండా నశించి పోగలరు. " అని హెచ్చరించాడు*.
*పూర్వము వశిష్ఠుని కామధేనువును అపహరించాలని తన సైనిక బలము సహాయంతో ప్రయత్నించిన విశ్వామిత్రుడు పరాభవము పాలైన సంగతిని మహర్షి వివరించాడు. వశిష్ఠుని తపశ్శక్తి ప్రబావంతో ఆ ధేనువు శరీరం నుండి ఆయుధాలను ధరించిన సైనికుల వేల సంఖ్యలో ఆవిర్భవించి, విశ్వామిత్రుని సైన్యాన్ని సంహరించిన వృత్తాంతాన్ని వివరించి, భరద్వాజ మహర్షి యుధాజిత్తును తిరిగి పొమ్మని మందలించాడు. గత్యంతరం లేక యుధాజిత్తు వెనుతిరిగి పోయాడు*.
*కొంత కాలానికి ఆ సుదర్శనునకు ఆ మహర్షి ఉపనయన సంస్కారం జరిపించి, గాయత్రి మంత్రంతో పాటు దేవీ బీజాక్షరాలను కూడా ఉపదేశించాడు. సుదర్శనుడు శ్రద్ధాభక్తులతో, దీక్షతో దేవీ మంత్రాన్ని జపించాడు. కొన్నాళ్ళకు అతనికి దేవి ప్రత్యక్షమై ధనుర్భాణాలను, కవచాన్ని ప్రసాదించింది*.
*ఇలా ఉండగా, యుక్తవయస్కురాలైన కాశీరాజకుమారై శశికళకు ఒకనాటి రాత్రి కలలో దేవి కనిపించి " ఓ రాజకుమారీ!నీకు అన్ని విధాలా తగిన వరుడు భరద్వాజాశ్రమంలో ఉన్నాడు. అతని పేరు సుదర్శనుడు. ప్రస్తుతము రాజ్యభ్రష్టుడే అయినా, త్వరలో రాజు కాగలడు. అతడు నా భక్తుడు అతణ్ణి నువ్వు పతిగా వరించు. నీకు సమస్త సంపదలూ సకల శుభాలూ లభిస్తాయి." అని చెప్పింది*.
*తెల్లవారిన తరువాత శశికళ తన స్వప్న వృత్తాంతాన్ని తల్లి ద్వారా తండ్రికి తెలియచేసి, సుదర్శనుణ్ణి భర్తగా నిర్ణయించు కున్నానని చెప్పింది. కలలో వార్తను నమ్మలేని కాశీరాజు రాజ్యభ్రష్టుడైన వానికి తన కుమార్తెను ఇచ్చి వివాహం చేయడానికి అంగీకరించలేకపోయాడు. "రాజ్యభ్రష్టుణ్ణి భర్తగా వరిస్తానంటావేమమ్మా సర్వలక్షణ సంపన్నులైన రాజకుమారులను అన్వేషించి. నీకు స్వయంవరం ప్రకటిస్తాను. నీకు నచ్చిన వారిని పెండ్లాడి సుఖంగా ఉండు." అని పరిపరి విధాల నచ్చచెప్పాడు*.
*ఆ మాటలను అంగీకరించక, శశికళ "తండ్రీ !కలలో దేవీ చెప్పిన ఆ సుదర్శనుడే నాభర్త. దేవి చెప్పిన విధంగా భరద్వాజాశ్రమంలో ఆ లక్షణాలు గల సుదర్శనుడే ఉన్నాడో లేదో విచారించండి. నిజమైతే అతన్ని పిలిపించండి. అంతఃపురంలో రహస్యంగా మా వివాహం జరిపించండి. అలా కాని పక్షంలో నేను మరొకరిని వివాహం చేసుకునే ప్రసక్తి లేనేలేదు" అని నిష్కర్షగా తన నిర్ణయాన్ని తండ్రికి తెలియ చేసింది.*
*కాశీరాజు భరద్వాజాశ్రమానికి గూఢచారులను పంపి సుదర్శనుని సమాచారం అంతా తెలుసుకున్నాడు. దేవి కలలో కనిపించి, తన కుమార్తెకు చెప్పినదంతా యథార్థమే అని గుర్తించాడు. సుదర్శనుణ్ణి స్వయంవరానికి ఆహ్వానించి , సగౌరవంగా తన నగరానికి తీసుకు వెళ్ళాడు. సుదర్శనుడు భరద్వాజుని ఆశీస్సులను అందుకుని, తల్లితో కలసి కాశీరాజు అంతఃపురానికి చేరుకున్నాడు.*
*తెల్లవారితే స్వయంవరం. దేశదేశాల రాజులూ ఆ రాత్రి కాశీనగరంలో విడిది చేశారు. వచ్చిన వారిలో యుధాజిత్తు కూడా ఉన్నాడు. ఆ నాటి రాత్రి కాశీరాజు తన అంతఃపురంలో తన కుమార్తె అయిన శశికళను సుదర్శనున కిచ్చి రహస్యంగా వివాహం జరిపించాడు*.
*తెల్లవారితే ఈ వార్త రాజ్యమంతటా వ్యాపించింది. తమకు స్వయంవరానికి ఆహ్వానించి, శశికళకు రహస్యంగా పెళ్ళి చేయడం తమకు అవమానంగా భావించి, స్వయంవరానికి వచ్చిన రాజులందరూ కాశీరాజుపై యుద్ధం ప్రకటించారు. ఆ యుద్ధంలో సుదర్శనుడు కూడ మామగారికి సహాయంగా నిలబడ్డాడు. యుధాజిత్తునకు సుదర్శనుణ్ణి చూడగానే క్రోధమాత్సర్యాలు పెల్లుబికాయి. వీరావేశంతో సుదర్శనుణ్ణి*
*చంపబోయాడు. సుదర్శనుడు ప్రశాంత చిత్తంతో దేవిని ప్రార్థించాడు. సింహవాహనారూఢ అయిన దుర్గాదేవి ప్రత్యక్షమై, వేలాదిగా సైన్యాన్ని సృష్టించి, సుదర్శనుని పైకి, అతని మామగారి పైకి వచ్చే శత్రువు లందరినీ నాశనం చేసింది*.
*తన అల్లుని మంత్రానుష్ఠాన బలాన్ని గుర్తించి కాశీరాజు ఎంతో సంతోషించాడు. భక్తుడైన తన అల్లుని వల్ల తాను కూడా దేవిని సందర్శించ గలిగానని ఉప్పొంగిపోయాడు. అల్లుణ్ణి ఆదరించి, రాజలాంఛనాలతో కోసల దేశానికి తీసుకువెళ్ళి, అయోధ్యలో అతనికి యథావిధిగా పట్టాభిషేకం జరిపించాడు. సుదర్శనుడు దేవీ మంత్రానుష్ఠానాన్ని మరువకుండా, ఆమె అనుగ్రహంతో ధర్మబద్ధంగా పాలిస్తూ, ప్రజలకు సుఖశాంతులను కలిగించాడు. తన పుత్రునికి కలిగిన వైభవాన్ని చూచి తల్లి ఎంతో సంతోషించింది. జగన్మాతకు మనసులోనే కృతజ్ఞతలు చెప్పుకుంది*.
*కాశీరాజు తన దేశంలో దుర్గాపూజలు ఆచరించి, ప్రజలందరికీ భక్తి భావాన్ని ప్రబోధించాడు. వాడవాడలా దేవీ ఆలయాలను ప్రతిష్ఠించి, అందరూ దేవి అనుగ్రహ పాత్రులయ్యే అవకాసం కల్పించాడు*.
*దేవీ మంత్రాన్ని శ్రద్ధతో జపించినా, ఆమెను భక్తితో పూజించినా కష్టాలన్నీ తొలగి, సుఖశాంతులు కలుగుతాయనడానికి సుదర్శనుని కథే నిదర్శనం*.
🕉🔯🔯🕉☸☸🕉⚛⚛🕉
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి