**దశిక రాము**
తృతీయ స్కంధం -27
బ్రహ్మస్తవంబ
దివ్యస్వరూపా! పరమాత్మా! ఈ పాపాత్ముడైన రాక్షసుడు నా వరంవల్ల గర్వించి లోకాలనన్నిటినీ చీకాకు పరుస్తున్నాడు. ఇటువంటి దుశ్చరిత్రుని చంపకుండా ఇలా నిర్లక్ష్యం చేయడం సరి కాదు. వీనిని సంహరించు. భూదేవికి శుభం కలుగుతుంది. శుభకరా! చిన్న పిల్లవాడు చేతిలో భయంకర సర్పాన్ని పట్టుకొని ఆడుకొనే విధంగా ఈ రాక్షసరాజును చంపకుండా ఊరికే ఉపేక్షించడం మంచిదా? అంతే కాక...పుణ్యాత్మా! ఈ అభిజిత్తు ముహూర్తంలోనే (మిట్ట మధ్యాహ్నమే) రాక్షసుని చంపకపోతే ఆ తరువాత రాక్షసులవేళ అయిన సాయంకాలం వస్తుంది. ఆ సమయంలో రాక్షసుల మాయాబలం వృద్ధి చెందుతుంది. అప్పుడు చంపడం సాధ్యం కాదు. కావున సాధుజనులకు మేలు చేసే సంకల్పంతో ఇప్పుడే వీనిని చంపు.” అని ఈ విధంగా పల్కిన బ్రహ్మ మాటలు విని విష్ణువు, దేవతలంతా చూస్తుండగా మందహాస వదనారవిందంతో ఒప్పుతూ రాక్షసుని ఎదుట నిలబడి...విష్ణువుయొక్క తెల్ల తామరల వంటి కన్నులు రోషంతో ఎఱ్ఱతామరల వలె కాగా తన పెను గదాదండంతో ఆ రాక్షసుని దవడపై తీవ్రంగా మోదాడు. వాడు ఆ దెబ్బను తట్టుకొన్నాడు.
ఆ హిరణ్యాక్షుడు వెంటనే భయంకరమైన గదను పట్టుకొని విచిత్ర భంగిమలతో, బాహుగర్వంతో విష్ణువును సమీపించి అతని చేతిలోని గదను సముద్రంలో పడగొట్టాడు. అప్పుడు...హరి నిరాయుధుడు కావడంతో హిరణ్యాక్షుడు యుద్ధధర్మాన్ని పాటించి పోరాటం ఆపి నిలబడి చూస్తూ ఉన్నాడు. ఆకాశమంతా దేవతల హాహాకారాలతో
నిండిపోయింది. కమలాక్షుడైన విష్ణువు రాక్షసరాజైన హిరణ్యాక్షుని యుద్ధధర్మానికి, అపార శౌర్యస్ఫూర్తికి మిక్కిలి ఆశ్చర్యపడినా పట్టుదల విడువలేదు.భూమిని ఉద్ధరించిన విష్ణువు ఆ రాక్షసరాజును వధించడం కోసం తన మనస్సులో సుదర్శన చక్రాన్ని స్మరించాడు. ఆ చక్రం దైత్యుల వంశమనే మహారణ్యాన్ని దహించే జాజ్వల్యమానమైన దావానలం. ఎల్లప్పుడు జయజయ శబ్దాలతో ప్రతిధ్వనించే దిక్చక్రం కలది. సర్వదా ఆశ్రయించేవారికి రక్షణ కలిగించేది. సమస్త భూమండలాన్ని పాలించేది. ఆ సుదర్శనచక్రం ప్రచండ సూర్యమండలం వలె తీవ్రంగా వెలిగిపోతున్నది. చెలరేగుతున్న అగ్నిజ్వాలలతో కోపంతో ఉన్న సమస్త శత్రువుల అడ్డులేని అహంకారమనే అంధకారాన్ని అణచివేస్తున్నది. సహింపరాని రివ్వురివ్వుమనే ధ్వనులతో సాగరఘోషను చులకన చేస్తున్నది. అది సమస్త దేవతలచేత పొగడబడుతూ, అనంత కాంతులతో విరాజిల్లుతూ, తన కాంతులతో బ్రహ్మాండాన్ని నింపుతూ వేగంగా వచ్చి విష్ణువు కుడిచేతిని అలంకరించింది. రాక్షసవైరి యైన విష్ణువు ఆ చక్రాన్ని ధరించి ఆకాశంనుండి దేవతలు జయజయ ధ్వానాలు చేస్తుండగా హిరణ్యాక్షునికి ఎదురుగా నడిచాడు. చక్రాన్ని ధరించి అమితోత్సాహంతో వస్తున్న ఆదివరాహమూర్తిని చూచి హిరణ్యాక్షుడు పెదవులు తడుపుకుంటూ, మొక్కవోని శౌర్యంతో, ధైర్యం చెడక భయంకరమైన గదతో కొట్టాడు.హిరణ్యాక్షుడు విసిరిన గదను విష్ణువు ఆనందంగా మందహాసం చేస్తూ ప్రక్కన పడేవిధంగా కాలితో తన్నాడు.ఈ విధంగా గదను దూరంగా తన్ని హిరణ్యాక్షునితో విష్ణువు ఇలా అన్నాడు. రాక్షసరాజులలో నీచుడవు. పెద్ద గద పట్టుకొని మహాబలవంతుడ నని గర్వించి యుద్ధరంగంలో నన్నెదిరిస్తున్నావు. రారా!” అని పలుకగా హిరణ్యాక్షుడు చెలరేగి గదతో విష్ణువును కొట్టాడు. ఆయన ఆ గదను గరుత్మంతుడు పామును పట్టినట్లుగా ఒడిసిపట్టుకొన్నాడు. హిరణ్యాక్షుడు తన బలం విష్ణువు యొక్క అడ్డులేని శౌర్యం ముందు ఎందుకూ పనికిరాదన్న సంగతి మనస్సులో తెలిసికూడ దురభిమానంతో ఎదిరించాడు. అప్పుడు...రాక్షసుడు ప్రళయాగ్నిలాగా భయంకరంగా మండుతున్న శూలాన్ని అందుకొని యజ్ఞవరాహ రూపంలో ఉన్న విష్ణువుపై వేశాడు. సద్బ్రాహ్మణునిమీద చాపల్యంతో ప్రయోగించిన చేతబడిలాగా; ఇంద్రుడు తన వజ్రాయుధంతో గరుత్మంతుని రెక్కలోని ఈకను మాత్రమే త్రుంచ గలిగినట్లు; హిరణ్యకశిపుని అంతటి శూలమూ వ్యర్థమైపోయింది. విష్ణువు తన చక్రాయుధంతో ఆ శూలాన్ని మధ్యలోనే చటుక్కన రెండుగా ఖండించాడు. అది చూసి దేవతలకు సంతోషం చెలరేగింది; రాక్షసులకు సంతోషం క్షీణించింది.ఆ సమయంలో రాక్షసుడు తన శూలం చక్రాయుధం చేత ఖండింపబడటం చూచి...
ఆ రాక్షసుడు కోపంతో మండిపడి కఠోరమైన తన పిడికిలితో విష్ణువును పొడిచాడు. హరి పూలదండ తాకిన ఐరావతం వలె కలత చెందక విరాజిల్లాడు. ఆ రాక్షసుడు విష్ణువుమీద కోట్లకొలది మాయలు ప్రయోగించాడు. భూమండలమంతా దుమ్ము రేగి చీకటితో నిండిపోయింది. మేఘాలు భయంకరంగా రాళ్ళను, మలమూత్రాలను, కుళ్ళిన ఎముకలను, రక్తప్రవాహాన్ని కురిపించి చీకాకును కలిగించాయి. ఇంకా...భూతాలు, పిశాచాలు, డాకినులు జుట్టు విరబోసుకొని, భయంకరమైన కరకు కోరలతో, దౌడలతో, ఎఱ్ఱని కన్నులతో గుంపులుగా ఆకాశంలో నిల్చి ఆయుధాలు ధరించి, పెద్దగా కేకలు వేస్తూ యక్ష రాక్షస సైన్యాలతో కూడి కనిపించాయి. అప్పుడు...కాలత్రయంలో చరించగలవాడైన ఆ యజ్ఞవరాహ రూప విష్ణువు ఆ రాక్షసరాజు మాయను నిరోధించగల ఆయుధాలలో అగ్రగణ్యమైన తన చక్రాయుధాన్ని ప్రయోగించాడు. విష్ణువు ప్రయోగించిన ఆ చక్రం యొక్క సూర్యకాంతి భూమండలమంతా నిండి ఆ మాయావి అయిన రాక్షసుడు ప్రయోగించిన మాయాచక్రాన్ని అతడు చూస్తుండగా అణచివేసింది.
ఆ సమయంలో ఇక్కడ....తన భర్త అయిన కశ్యప ప్రజాపతి చెప్పిన మాటలు తప్పవేమో అని దితి అనుకొంటుండగా హిరణ్యాక్షుని పతనాన్ని సూచిస్తున్నట్లుగా ఆమె పాలిండ్లనుండి రక్తధారలు ప్రవహించాయి. అప్పుడు ఆ రాక్షసుడు కృతఘ్నునికి చేసిన ఉపకారం లాగా తాను ప్రయోగించిన వందల కొలది మాయలు హరిమీద పనిచేయక విఫలం కాగా మొక్కవోని శౌర్యంతో విష్ణువును సమీపించి రెండు చేతులు చాచి అతని వక్షస్థలాన్ని బలంకొద్ది పొడచి బాధపెట్టాడు. విష్ణువు తప్పించుకొని ప్రక్కకు తొలిగాడు. రాక్షసుడు విజృంభించి బలమైన పిడికిలితో వరాహమూర్తిని పొడిచాడు. హరి అలసిపోక కోపంతో భయంకరమైన ఆకారం కలవాడై ఇంద్రుడు వృత్రాసురుణ్ణి సంహరించిన విధంగా వజ్రాయుధం వంటి తన అరచేతితో మోటుగా నున్న రాక్షసుని నడుముపైన తీవ్రంగా కొట్టాడు. ఆ దెబ్బకు హిరణ్యాక్షుడు గిరగిర తిరిగి కన్నులు తేలిపోగా సోలిపోయి ఎట్టకేలకు తేరుకొని ఎదుట నిలబడ్డాడు. అప్పుడు....
🙏🙏🙏
సేకరణ
**ధర్మము-సంస్కృతి*
🙏🙏🙏
**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**
*మన ధర్మాన్ని రక్షిద్దాం**
**ధర్మో రక్షతి రక్షితః**
🙏🙏🙏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి