23, సెప్టెంబర్ 2020, బుధవారం

**సౌందర్య లహరి**

 **దశిక రాము**




**శ్రీశ్రీశ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామి వారి భాష్యం**


ఆరవ శ్లోక భాష్యం - మూడవ భాగం


యోద్ధలు సామాన్యంగా పెద్దపెద్ద మీసాలతో కండలు తిరిగి చూడటానికి భయం కలిగించే విధంగా ఉంటారు. మన్మథునికి రూపమే లేదు. పోనీ వసంతుణ్ణి ప్రకృతిని బట్టి గుర్తించవచ్చు. ఈ అంగాలన్నీ ఉన్న “అంగి” అయిన మన్మథుని ఏరకంగానూ గుర్తింపశక్యంకాదు. ఆయనను గుర్తించడానికి వీలుకాదు కానీ అందరిలోను ప్రవేశించి వారిని తన అదుపులో పెట్టుకొంటాడు. ఏం విచిత్రం – ప్రపంచాన్నంతా జయించే యోద్ధ ఇంతటి బలహీనుడు.


త్రిపురాసుర సంహారానికి పరమేశ్వరుడు బయలుదేరేటప్పుడు మేరు పర్వతం విల్లుగా, వాసుకి అల్లెతాడుగా, వాసుదేవుడు బాణంగా, బ్రహ్మదేవుడు రథసారధిగా ఏర్పాటు చేయబడింది. ఎంతటి బలిష్టమైన ప్రయత్నమో చూడండి. అయితే పరమశివుడు వీనిని వేటినీ ఉపయోగించలేదు. ధనుష్ఠంకారం లేదు, బాణప్రయోగం లేదు, భుజష్ఫాలనము లేదు. బాహాబాహిగా ముష్టాముష్టిగా తలబడటమూ లేదు, ఈశ్వరుడు కేవలం అట్టహాసం చేశాడు. ఎందుకా నవ్వు ? “అరె! పరాశక్తి నాలో ఉండగా నాకు సహాయంగా ఇన్ని సంభారాలు అమర్చబడ్డాయే” అన్న అలోచన వచ్చి ఆయనకు నవ్వు వచ్చింది. ఆ అట్టహాసానికి త్రిపురాసురులు మాడి బూడిదైపోయారు. పరమేశ్వరునికి బలిష్ఠమైన ఆయుధాలున్నా వాటిని ఉపయోగించుకోలేదు. మన్మథుడు బలమనే మాటకు ఎంతో దూరమైన ఆయుధాలతో యుద్ధం గెలుస్తాడు. ఈ ఇద్దరి గెలుపుకూ కారణం ఒక్కటే. పరాశక్తి పరమేశ్వర హృదయాంతర్గత అయి అక్కడ యుద్ధాన్ని గెలిపించింది. కేవలం తనక్రీగంటి చూపు ద్వారా ప్రసరింప చేసే కటాక్షం వలన మన్మథుని విశ్వవిజేతను చేస్తోంది.


మన్మథుడే శరీరం లేనివాడు. అతడి ఆయుధాలా అత్యంత బలహీనములు. అయినా ప్రపంచాన్నంతా గెలుస్తాడు. అతడికి కాల్బలమా, ఆశ్వికదళములా, గజ బలమా ఏమున్నాయి. పేరుకు వసంతుడొకడు చెలికాడు లేక సామంతుడు. అతడి గెలుపుకు కారణం అంబిక యొక్క కొంచెం దయ – శివుని విషయంలో వలే ఆమె హృదయంలో కూర్చోలేదు. పోనీ కనులన్నా పూర్తిగా తెరిచి దయాప్రసాదం చేయలేదు. ఇది అనిర్వచనీయమైన దయ అంటారు ఆచార్యులవారు. “కామపికృపాం” – వారు అంబికని హిమగిరి సుతా అని సంబోధిస్తారు. ఆమె క్రీగంటి చూపువలన కలిగిన దయాప్రసాదం వలన ఎందుకూ కొఱగాని మన్మథుడు “జగదిదం సర్వం విజయతే” రస ప్రపంచాన్నంతా జయిస్తున్నాడు.


ప్రపంచానికి చెందిన మాయా విలాసమైన వాటన్నిటికీ ఆమె ఒక్క క్షణం క్రీగంట ప్రసారం చేసే దయ చాలు. అన్నీ సిద్ధిస్తాయి. త్రిపురాసుర సంహారమంటే స్థూల సూక్ష్మ కారణ శరీరాల్ని, మిగిలిన మహాకారణాన్ని (బ్రహ్మయొక్క) తిరస్కరించడం. అంటే నిష్ప్రపంచ స్థితిని పొందడం, అది అంబిక సంపూర్ణంగా అతనిలో ఉంటేనే సాధ్యమౌతుంది. త్రిపురాసురుని కాల్చినవాడే మన్మథునీ కాల్చివేశాడు. మన్మథునికి అంబిక క్రీగంట ప్రసారం చేత లభించిన దయ, పరమేశ్వరుడు ఆమె నుండి పొందిన సంపూర్ణ అనుగ్రహం ముందు నిలవలేదు.


మన్మథుణ్ణి అంబిక విజేతను చేసిందనే విషయంలోనే మనకు కథ ఆగిపోలేదు. మనం మన్మథుణ్ణి జయించాలి. మన్మథుని దగ్ధం చేసినపుడు అంబిక అతని హృదయంలో ఉండి సంపూర్ణానుగ్రహం చూపిన విషయం మనం జ్ఞప్తిలో ఉంచుకోవాలి. మనకు ఆమె అనుగ్రహం కావాలి. ఆమె సృష్టించిన శక్తి ఆమెవల్లనే నాశనమవుతుంది. ఇక్కడ ఆచార్యులవారు అంబిక చేత సృష్టించబడిన శక్తి గురించి మాట్లాడుతున్నారు.


ఇట్టి ఉన్నతమైన ఉద్దేశ్యంతోనే అంబిక మన్మథునికి బలిమిలేని ఆయుధం ఇచ్చింది. అతడు ఈ సృష్టినంతటినీ ఒక ఆటపట్టిస్తున్నప్పటికీ అది తన ప్రతిభకాదనీ అంబిక కటాక్షమనీ క్షణక్షణం గుర్తుకు వస్తూనే ఉంటుంది. ఇతనికి అహంకారం జనించరాదనే దయచేతనేమో అంబిక అంతటి బలహీనమైన ఆయుధాలనిచ్చింది.


(సశేషం)


కృతజ్ఞతలతో🙏🙏🙏


#KanchiParamacharyaVaibhavam #కంచిపరమాచార్యవైభవం

#ParamacharyaSoundaryaLahariBhashyam

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: