23, సెప్టెంబర్ 2020, బుధవారం

**మహాభారతము**

 **దశిక రాము**




నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమమ్ /

దేవీం సరస్వతీమ్ వ్యాసం( చైవ ) తతో జయముదీరయేత్.//


91 - అరణ్యపర్వం.


మార్కండేయమహర్షి కలియుగ ప్రభావం గురించి ధర్మరాజుకూ, పరివారానికీ, శ్రీకృష్ణుని సమక్షంలో వివరిస్తున్నాడు.


కలియుగాంతంలో, సకాలంలో ఋతువులు తమధర్మం నిర్వర్తించవు. యజ్ఞయాగాదులు లేకపోవడం వలన దేవతలకు హవిస్సులు అందవు. వర్షాలు సకాలంలో కురవవు. నాణ్యమైన విత్తనాలు దొరకవు. , భూసారం క్షీణిస్తుంది. క్రూరమృగాలు యథేచ్ఛగా గ్రామాలలోకి వచ్చి ప్రజలను హింసిస్తుంటాయి. అనావృష్టి వలన, ఆకలికి తట్టుకోలేని బలహీనులంతా నశిస్తారు.


ఒక్కసారిగా ఏడుగురు సూర్యులు ఉదయించినట్లుగా ఉష్ణం ప్రసరించి నదులలో సాగరాలలో జలాలు పీల్చివేయబడతాయి. చెట్లు, పచ్చికట్టెలు కూడా యెండిపోతాయి. సంవర్థకమనే అగ్ని వాయువుతో యేకమై విశ్వమంతా వ్యాపించి దేవలోకాలని కూడా భయభ్రాంతులని చేస్తుంది. 


ఆకాశంపెద్దపొగతో నిండిపోయి, కారుమేఘాలు వ్యాపిస్తాయి. ఉరుములూ మెరుపులతో భయంకరమైన వర్షం కుండపోతగా కురిసి, విశ్వమంతా జలమౌతుంది. సంవర్తకాగ్ని అందులో లీనమైపోతుంది. 12 సంవత్సరాలు ఆవిధంగా జలధారలతో విశ్వం నిండిపోతుంది.


అంతా సద్దుమణిగిన తరువాత, శ్రీమన్నారాయణుని నాభికమలంలో నుంచి బ్రహ్మదేవుడు ఆ జలధారాలలో నుండి వచ్చిన గాలిని పీల్చుకుని, యోగనిద్రలో వుంటాడు. 


ఈ విశ్వమంతా నీటిలో మునిగిపోగా, నేను ఒక్కడినే( మార్కండేయ మాహర్షి ), దిక్కుతోచక జలాలలో యీదుకుంటూ చాలాదూరంప్రయాణించి, ఒక పెద్దమర్రిచెట్టును చూశాను. దాని కొమ్మలమధ్యలో ఒక హంసతూలికాతల్పం వుంది. దానిమీద అతి సుందరమైన ముఖవర్ఛస్సుతో, కలువపూలవంటి కన్నులతో వున్న ఒక పసిబాలుని చూసాను. ఇక్కడ మర్రిచెట్టు యేమిటీ ! ఈ బాలుని దర్శనమేమిటీ !! అని నేను ఆశ్చర్యపడుతుండగా, అవిసెపూవురంగుతో వున్న ఆబాలుని, శ్రీవత్సవక్షంతో ప్రకాశిస్తున్నవాడిని చూస్తుండగా, 'మార్కండేయా ! నీవు చాలా అలసిపోయావు. నాలో విశ్రమించు. ' అని ఆబాలుడు అన్నట్లుగా వినిపించింది. ఆబాలుడు తన నోరు తెరవగా, సంభ్రమంగా నేను ఆ నోటిలోనికి ప్రవేశించాను.  


ఆ నోటిలోనుండి ఉదరం లోనికి వెళ్ళగానే, అందులో సమస్తభూమండలం నాకు కనిపించింది. గంగా యమునలను చూశాను. హిమగిరులను చూశాను. యజ్ఞయాగాలు నిర్వహిస్తున్న బ్రాహ్మణులను చూశాను. యేమని చెప్పను ఆ అద్భుతం, ధర్మరాజా ! ఆద్యంతాలు లేని ఆ ఉదరం నన్ను యెంతో అబ్బురపరిచింది.


అలా నేను బాలుని ఉదరంలో తిరుగుతుండగా, ' మార్కండేయా అలసట తీరిందా, విశ్రాంతి తీసుకున్నావా ' అని బాలుడు అడిగినట్లుగా వినిపించింది. ' స్వామీ ! బాలుని రూపం లో వున్న నీవెవరో తెలుసుకున్నాను. నేనెక్కడున్నానో నాకే తెలియని అయోమయ స్థితిలో వున్నాను. ' అన్నాను.


తన విశ్వరూప రహస్యాన్ని బాలునిరూపంలో వున్న మహావిష్ణువు మార్కండేయునికి వివరించాడు. ఏ దేవతలూ చూడని రహశ్యాలు నీవు చూశావు. ' బ్రహ్మదేవుడు యోగనిద్ర చాలించిన తరువాత, నేను అతనిలో లీనమై ఆయన సృష్టి చెయ్యడానికి ప్రేరేపిస్తాను. సృష్టి మొదలయ్యే వరకూ, నారూపాన్నే దర్శిస్తూ, నన్నే ధ్యానిస్తూ విశ్రాంతి తీసుకో ! ' అని చెప్పాడు నారాయణుడు. 

అని కొద్దిసేపు నిశ్శబ్దం తరువాత, తనకళ్ళు తుడుచుకుంటూ, పులకించిన దేహంతో ఆనందబాష్పాలు నిండిన కళ్ళతో,అందరినీకలయజూశాడు, మార్కండేయమహర్షి.  


ధర్మరాజా ! ఇంకొక రహశ్యం మీకందరికీ చెబుతున్నాను. శ్రద్ధగా వినండి. ఆనాడు నేను మర్రిచెట్టు మీద చూసిన బాలుడే, మన కంటి ముందున్న ఈ శ్రీకృష్ణుడు. ఆ విషయం తెలుసుకుని మసలినవారు ధన్యులు. ' అని మార్కండేయమహర్షి శ్రీకృష్ణునికి సాష్టాంగ నమస్కారం చెయ్యగా, మిగిలిన అందరూ అనుసరించారు.


స్వస్తి.


వ్యాసానుగ్రహంతో మరికొంత రేపు.

🙏🙏🙏

సేకరణ



**హిందూ సాంప్రదాయాలను పాటిద్దాం**

*మన ధర్మాన్ని రక్షిద్దాం**


**ధర్మో రక్షతి రక్షితః**

🙏🙏🙏

కామెంట్‌లు లేవు: