23, సెప్టెంబర్ 2020, బుధవారం

*ఆయనతో మైత్రి*



మనిషికి... పుట్టిన క్షణం నుంచి చివరి క్షణాల వరకూ ఓ నేస్తం కావాలి. నేస్తం అంటే- ఓ తోడు, ఓ ఆనందం, ఒక భరోసా. వయసుకు, డబ్బుకు, హోదాకు సంబంధం లేని అందమైన అనుబంధం స్నేహం. అందుకే దానికి పరిమితుల్లేవు. పరిధులు అంతకంటే లేవు. అవసరాల పట్ల, అంతస్తుల పట్ల ఆసక్తులుండవు. అంతరాల అంచనాలుండవు. లింగభేదాలుండవు. వయోపరిమితులంతకంటే లేవు. భార్యాభర్తలు, తల్లీ బిడ్డలు, ఇరుగు పొరుగులు, దేశాలు, దేశాధినేతలు... స్నేహానికి ఎల్లలు లేవు. కష్టంలో, సుఖంలో, అవమానంలో, ఆనందంలో... సమతూకంగా పాలుపంచుకునే నిస్సంకోచ భరోసా అయిన భాగస్వామి- మిత్రుడు. చిన్ననాటి స్నేహమైతే మరీ మధురం.


రామ సుగ్రీవులు, శ్రీరామ గుహులు, కృష్ణ కుచేలురు, కృష్ణార్జునులు, రాధాకృష్ణులు... స్నేహశీలురు, స్నేహపాత్రులు. శ్రీకృష్ణుడికి గోపికలతో ఉన్న అనుబంధంలోని రహస్యం స్నేహమే. గోవులు, గోపాలురు, గోవర్ధనగిరి, నెమలి ఈకలు, పిల్లన గ్రోవి... ఆయన స్నేహ మాధుర్యంతో తడిసి పులకించిన జాబితా పెద్దదే. రాధతో ఆయన ప్రేమలోని కీలక అంశం స్నేహమే. మేనత్త కుంతితో, బావ అర్జునుడితో, చెల్లెలు ద్రౌపదితో ఆయనకున్న బంధుత్వం కంటే స్నేహభావమే ఎక్కువ. ఆయన స్నేహమాధుర్యం వల్లే కష్టాలు వాళ్లకు నీళ్లలో నావలా అనిపించాయి. జీవితంలోని బరువును తేలిక చేసే దివ్యౌషధం- స్నేహం.


రాముడైతే రాక్షసులతోనూ స్నేహం నెరిపాడు. వానరులైతే ఆయన ఆత్మీయ మిత్రులు. సుగ్రీవుడితో అగ్నిసాక్షిగా మైత్రీ బంధాన్ని స్థాపన చేసుకున్నాడు రాముడు.


స్నేహం అంటే ఇరువురు వ్యక్తులు, అభివ్యక్తుల అందమైన అల్లిక. మనోభావాల సుమమాలిక. ఒక వృక్షం- దాన్ని అల్లుకున్న పూలతీగ. ఒక రాకా చంద్రుడు- ఆయన్ని పరివేష్ఠించిన వెన్నెల మడుగు. ఎవరు వారో, ఎవరు వీరో తెలీదు. ఎవరు ఎవరైనా కావచ్ఛు ఇటు అటైనా, అటు ఇటైనా తలకిందులైనా ఆ రెంటి కలయిక ఒక అద్భుత ఆవిష్కరణ.


బాల్యంలో అమ్మ- పుట్టిన క్షణమే దొరికే నేస్తం. నిజానికి పుట్టకముందే స్నేహహస్తం అందించేందుకు తయారుగా ఉండే ‘సిద్ధ స్నేహితురాలు’ అమ్మ. ఆపై కాస్త ఎదిగాక తన ఈడు పిల్లలు, పెళ్ళయ్యాక జీవిత భాగస్వామి, ఆ తరవాత... పిల్లలు, వృద్ధాప్యంలో వారి పిల్లలు. ఏ వయసులోనైనా, ఎవరితోనైనా స్నేహం ఒక ఆగిపోని ఆనందపు వెల్లువ. ఊపిరి సలపని ఉత్సాహపు ఉప్పెన.


దురదృష్టవశాత్తు స్నేహానికీ గండిపడే ప్రమాదం ఉంటుంది. ఆటంకాలు పొంచి ఉంటాయి. తల్లి మరణించవచ్ఛు స్నేహితులు వివిధ కారణాలతో దూరం కావచ్ఛు జీవిత భాగస్వామితో మనస్పర్థలు రావచ్ఛు విడిపోనూ వచ్ఛు పిల్లలు, మనవలు... కారణం ఏదైనా జీవితంలో ఏ అనుబంధమూ శాశ్వతం కాదు.


కానీ ఆ ‘ఒక్కరితో’ స్నేహం, ఆ అనుబంధం ఎప్పటికీ చెదరనిది. చెరిగిపోనిది. తరిగిపోనిది. తెగిపోనిది. మనం వద్దనుకున్నా, దూరం జరిగినా నీడలా వెన్నంటి ఉండే ప్రియమైన నేస్తమది. నీ జీవితం ఉన్నంతవరకు, నీ శరీరం నిలిచినంత వరకు. ఇంకా ఆత్మానుసంధానం చేసుకుంటే... ఎప్పటికీ. ఎన్ని జన్మలకైనా అదే అనంతుడితో అనుబంధం. సాకేత రాముడితో స్నేహం. ఎట్టి పరిస్థితుల్లోనూ మిగిలిన వారిలా మనకు దూరం కాని, ఆయన అమృతస్నేహం గుర్తించని వారు దురదృష్టవంతులే!

కామెంట్‌లు లేవు: