కృష్ణ పరమాత్మా.....
నీవు ఒక్క క్షణం కనిపించకపోయినా మా బతుకులు అంధకారమయ్యా ...అంటూ కృష్ణుడిపై తమకు గల ప్రేమను అనురాగాన్ని భక్తిని చాటుకుంటున్నారు ద్వారక ప్రజలు.....
.పరమాత్మ చిరునవ్వులు చిందిస్తూ అందరినీ ఆప్యాయతతో పలకరిస్తూ పురవీధిగుండా ముందుకు సాగుతున్నాడు....
***
అంధకారవైరి యపరాద్రి కవ్వలఁ
జనిన నంధమయిన జగముభంగి
నిన్నుఁ గానకున్న నీరజలోచన!
యంధతమస మతుల మగుదు మయ్య."
***
సూర్యభగవానుడు పశ్చిమ పర్వతం చాటుకు పోయి నప్పుడు జగత్తు అంతా అంధకార బంధుర మైనట్లు నీవు కానరాకుంటే, మేము కటిక చీకటిలో పడి కొట్టుమిట్టాడు తుంటాము.”
***
ఈ విధంగా ద్వారాకానగర ప్రజలు పలుకుతున్న భక్తి బంధురమైన మాటలు వీనులవిందుగా వింటు న్నాడు కృష్ణ పరమాత్మ, ద్వారక మొత్తం కృష్ణపరమాత్మ దర్శనానికి తరలివచ్చింది. వారందరినీ శ్రీకృష్ణుడు వందనాలతో, అభివాదాలతో, కౌగిలింతలతో, కరస్పర్శలతో యథోచితంగా గౌరవిస్తూ నెమ్మదిగా అడుగు ముందుకు వేస్తూ ద్వారకానగర రాజమార్గం వెంట నడుస్తున్నాడు..
***
కలుముల నీనెడు కలకంఠి యెలనాఁగ-
వర్తించు నెవ్వాని వక్షమందు;
జనదృక్చకోరకసంఘంబునకు సుధా-
పానీయపాత్ర మే భవ్యుముఖము;
సకలదిక్పాలకసమితికి నెవ్వాని-
బాహుదండంబులు పట్టుఁగొమ్మ;
లాశ్రితశ్రేణి కే యధిపుని పాదరా-
జీవయుగ్మంబులు చేరుగడలు;
**
భువనమోహనుండు పురుషభూషణుఁ డెవ్వఁ
డట్టి కృష్ణుఁ డరిగె హర్మ్యశిఖర
రాజమాన లగుచు రాజమార్గంబున
రాజముఖులు గుసుమరాజిఁ గురియ.
**
ఏ మహానుభావుని వక్షస్థలంలో సిరిసంపదలు కురిసే నారీ శిరోమణి శ్రీదేవి నర్తిస్తూ ఉంటుందో, ఏ మహాత్ముని పావనవదనం ప్రేక్షకుల నయనచకోరాలకు అమృతం చిందే వెన్నెల పాత్రమో, ఏ మహనీయుని భుజాదండాలు సర్వదిక్పాలకులకు పట్టుకొమ్మలో, ఏ మహితాత్ముని పాదపద్మాలు ఆశ్రితులకు అండదండలో, ఏ మహాపురుషుడు భువనమోహనుడో అట్టి పురుషోత్తముడు, శ్రీకృష్ణుడు, సౌధశిఖరాలపై విరాజిల్లే రాజీవలోచనలు కుసుమరాజి కురిపించగా రాజమార్గంలో వెళ్లసాగాడు.
🏵️పోతన పదం🏵️
🏵️మహిత పథం🏵️
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి