..
దశరథుడు కౌసల్య గృహము చేరి పరిపరివిధాలుగా ఆలోచిస్తూ ,కన్నీరు మున్నీరుగా విలపిస్తూ ఉన్నాడు.శోకంతో కృశించిపోయిన భర్తను చూస్తూ కౌసల్య కూడా దుఃఖము ఆపుకోలేక బిగ్గరగా ఏడ్వసాగింది.అడవిలో వారి అవస్థలు తలుచుకుంటున్నప్పుడల్లా వారి గుండె కరిగి కన్నీరై కాల్వలై ప్రవహించసాగింది.
.
అంతులేని వేదన ,అలపులేని రోదన
అలుపుసొలుపూలేకుండా ఒకటే దుఃఖము!
కౌసల్యాదేవి భవనము రోదనధ్వనులతో నిండిపోయి ఉన్నది.
.
సుమిత్రాదేవి ఈ ఏడుపులు పెడబొబ్బలు చూసింది !
.
ఏమైందని ఏడుస్తున్నారు మీరంతా ! రాముడంటే ఎవరనుకున్నారు?
పురుషులలోశ్రేష్ఠుడు,సకలసద్గుణసంపన్నుడు,మహాబలశాలి,
అతడు అనుసరించేది ధర్మమార్గము .
ఆ మార్గములో స్థిరంగా నిలిచి వున్నవాడి గురించి ఆందోళన ఎందుకు?
అన్నతోటి లక్ష్మణుడున్నాడు ,సీతకూడా అరణ్యవాసములోని కష్టాలన్నీ తెలిసే స్వయంగా వెళ్ళింది.
.
రాముడు ధర్మమూర్తి
ఆయనను సూర్యుడు తనకిరణములతో బాధింపడు
వాయువు ఆయన శరీరాన్ని ఎప్పుడూ ఆహ్లాదకరంగానే తాకుతుంది
రాత్రిపూట నిద్రించే రామునికి చంద్రకిరణస్పర్శ ఆయన కన్నతండ్రి స్పర్శ అంత ఆనందంగా వుంటుంది
.
లోకంలో అలాంటి వీరుడింకొకడు లేడు అంతటి మహావీరుడు అరణ్యంలో కూడా స్వంత ఇంటిలో ఉన్నట్లు ఉండగలడు!
.
రాముడి యందు లక్ష్మి,శౌర్యము,మంగళప్రదమైన బలము ఉన్నాయి అరణ్యవాసాన్ని ఏ విధమైన శ్రమలేకుండా పూర్తిచేసుకుని హాయిగా తిరిగివస్తాడు.
.
ఓ కౌసల్యా!
రాముడెవరనుకున్నావు?
సూర్యుడికి సూర్యుడు
అగ్నికి అగ్ని
ప్రభువులకు ప్రభువు
సంపదలకు సంపద
కీర్తికి శ్రేష్టమైన కీర్తి
ఓర్పుకు ఓర్పు
దేవతలకు దేవత
సకల భూతములకు భూతశ్రేష్ఠుడు
అనన్యసామాన్యము,అనితరసాధ్యమూ అయిన సామర్ధ్యము కలవాడు !
అట్టి రాముడు అరణ్యములో ఉంటేనేమి ?
అయోధ్యలో ఉంటేనేమి?
ఎక్కడైనా ఒకటే ఆయనకు!
.
ఓ కౌసల్యా! రాముడు తిరిగి వచ్చి నీ పాదాలకు నమస్కరించి
రాజ్యలక్ష్మితో,సీతాలక్ష్మితో,మహాలక్ష్మితో మహావైభవంగా ఉండటాన్ని నీవు కనులారా కాంచుతావు !
.
ఏడవకు,ఏడవుకు రామమాతా ఏడవకు !
రాబోయే రోజులలో రాముడే అయోధ్యకు ఏడుగడ!
.
NB.
రాముడి గురించి సంపూర్ణముగా తెలుసుకొన్న మహాతపస్విని సుమిత్రామాత! అందుకే మారుమాటాడకుండా చిరునవ్వుతో కొడుకును రామునివెంట పంపింది. రాముడి సామర్ధ్యం తెలిసి విలపించకుండా ప్రశాంతంగా ఉన్న ధీరోదాత్తురాలైన వనిత సుమిత్ర ..
.
జానకిరామారావు వూటుకూరు గారి
సౌజన్యం తో ....
*ధర్మధ్వజం*
హిందు చైతన్య వేదిక
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి