23, సెప్టెంబర్ 2020, బుధవారం

మొగలిచెర్ల అవధూత

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారితో అనుభవాలు..

పల్లకీ సేవ..పెళ్లి..


ఒకానొక శనివారం మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో..సుమారు అరవై ఏళ్లు పైబడిన దంపతులిద్దరు మొగలిచెర్ల లోని శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరానికి వచ్చారు.."ఏమండీ..ఇక్కడ రాత్రికి బస చేయడానికి వసతి దొరుకుతుందా?.." అని అడిగారు..ఉండటానికి గది ఒకటి కేటాయించాము..ఇప్పటి లాగా ముందుగానే గది అట్టేపెట్టే విధానం అప్పటికి రాలేదు..వచ్చిన వాళ్లకు అప్పటికప్పుడు ఉన్న వసతి ని బట్టి కేటాయించేవాళ్ళము..


"నా పేరు నారాయణ స్వామి..నాభార్య హేమలత..మేము కర్నూలు లో వుంటాము..నేను రెవెన్యు డిపార్ట్మెంట్ లో పనిచేసి, రిటైర్ అయ్యాను..ఇద్దరు పిల్లలు..కూతురు..కుమారుడు..అమ్మాయి వివాహం చేసుకొని అమెరికా వెళ్ళింది..అబ్బాయి బెంగుళూరు లో ఐటీ లో పనిచేస్తున్నాడు..మేము మాలకొండ క్షేత్రాన్ని దర్శించుకోవడం కోసం వచ్చాము..అక్కడికి వచ్చిన తరువాత..ఇక్కడొక అవధూత క్షేత్రం ఉందని తెలిసి..దగ్గరేకదా చూసి వెళదామని అనుకొని..ఇలా వచ్చాము.." అన్నారు ఆయన..


సాయంత్రం ఏడు గంటలకు పల్లకీ సేవ లో పాల్గొనమని చెప్పాను..శ్రీ స్వామివారి గురించి వివరాలు అడిగారు..క్లుప్తంగా తెలిపాను..ఆసక్తిగా విన్నారు..


"అయితే..ఇక్కడ మనస్ఫూర్తిగా కోరిక కోరుకుంటే నెరవేరుతుందా?.." కుతూహలంగా అడిగారు నారాయణ స్వామి గారు..తలవూపాను..భార్య వైపు సాలోచనగా చూసారు..ఏదో సందేహం ఉన్నట్లు తోచింది నాకు..చెప్పాలా?..వద్దా?..అని ఆ దంపతులు ఆలోచిస్తున్నారని అనిపించింది..నాకై నేను అడగటం బాగుండదని ఊరుకున్నాను..వాళ్ళూ ఏమీ చెప్పలేదు..పల్లకీ సేవ లో పాల్గొనడానికి ఎంత టికెట్ కొనాలి అని అడిగి..ఆ టికెట్ తెచ్చుకున్నారు..


సాయంత్రం ఏడు గంటలకు దంపతులిద్దరూ పల్లకీ సేవ లో కూర్చున్నారు..తమ గోత్ర నామాలను..పిల్లల పేర్ల తో సహా అర్చక స్వామికి చెప్పారు..పల్లకీ వద్ద పూజ పూర్తి అయిన తరువాత..పల్లకీ మందిరం చుట్టూ ప్రదక్షిణగా మూడు మార్లు త్రిప్పడానికి సమాయత్తం అవుతున్న సమయంలో..అప్పటిదాకా కూర్చుని ఉన్న నారాయణ స్వామి గారు..తన వంటి మీద ఉన్న చొక్కాను తీసివేసి..తన వయసును కూడా మర్చిపోయి..తాను కూడా పల్లకీ మోయడానికి సిద్ధపడ్డారు..ఒక ప్రదక్షిణ వరకూ పల్లకీ ని మోస్తారేమో అని భావించిన మాకు ఆశ్చర్యం కలిగేలా..మూడు ప్రదక్షిణాలు పూర్తి అయ్యేదాకా ఆయనే పల్లకీ మోసారు..పల్లకీ తిరిగి మండపం లో యథా స్థానం లో ఉంచిన తరువాత..ప్రసాదం తీసుకొని..దంపతులిద్దరూ నా వద్దకు వచ్చారు..

"ప్రసాద్ గారూ..ఆ క్షణం లో నాకు ఏమైందో తెలీదండీ..ఒక్కసారిగా ఏదో శక్తి నన్ను చెయ్యిపట్టి లాగినట్లు అనుభూతి కలిగింది..ఇక ఆగలేకపోయాను..పల్లకీ మోసాను..ఇక రేపు ఉదయం శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకోవాలి..ఏదో మహత్తర శక్తి ఇక్కడ ఉన్నదండీ..నేను రిటైర్ అయిన తరువాత..చాలా క్షేత్రాలు చూసాము..దర్శనం చేసుకున్నాము..కానీ ఇలా వళ్ళంతా పులకరించే అనుభూతి మాత్రం ఇక్కడే పొందాను.."


"మా ఇద్దరికీ ఒక సమస్య ఉన్నదండీ..మా అబ్బాయికి మంచి ఉద్యోగం ఉన్నది..సంవత్సరానికి పది పన్నెండు లక్షల జీతం వస్తుంది..ఇప్పుడు వాడికి ముప్పై ఏళ్ల వయసు..వివాహం కాలేదు..ప్రతి క్షేత్రం లోనూ అక్కడ ఉన్న దైవానికి మ్రొక్కుకుంటూనే వున్నాము..కానీ ఆ సమయం రాలేదని అనిపిస్తోంది..వాడికి ఆ మూడుముళ్ళూ పడితే..మాకు ఒక బరువు తీరినట్టు ఉంటుంది..ఇప్పుడు కూడా పల్లకీ సేవ వద్ద అదే కోరిక కోరుకున్నాము.." అన్నారు నారాయణ స్వామి గారు..


ప్రక్కరోజు ఆదివారం ఉదయాన్నే ఐదున్నర కల్లా వాళ్లిద్దరూ మందిరం లోకి వచ్చారు..శ్రీ స్వామివారి సమాధికి జరిగే అన్ని సేవలూ భక్తిగా తిలకించారు..విశేష హారతి తరువాత..ఇద్దరూ వెళ్లి శ్రీ స్వామివారి సమాధి దర్శనం చేసుకున్నారు..ఉత్సవ విగ్రహం వద్ద పూజ చేయించుకున్నారు..ప్రసాదం తీసుకొని..ఇవతలికి వచ్చి..తాము తిరిగి కర్నూలు వెళుతున్నామని..తమ కోరిక నెరవేరితే..తిరిగి స్వామివారి దర్శనం చేసుకుంటామని చెప్పి వెళ్లారు..


సరిగ్గా నెల గడిచిపోయింది..నారాయణ స్వామి గారు హేమలత గారు ఇద్దరూ వచ్చారు..ఇద్దరి ముఖాల్లో సంతోషం తాండవిస్తోంది..మొగలిచెర్ల నుంచి తిరిగి వెళ్లిన వారానికి వాళ్ళబ్బాయికి పెళ్లి సంబంధం రావడం..మరో వారానికల్లా ఆ సంబంధం కుదరడం..చక చకా జరిగిపోయాయట..ఏకంగా అబ్బాయి పెళ్లి శుభలేఖ తీసుకొని వచ్చారు..శ్రీ స్వామివారి సమాధి వద్ద ఆ శుభలేఖను ఉంచి..పూజ చేయించుకొని.."అంతా ఆ స్వామివారి కృప.. వివాహం తరువాత నూతన దంపతులను ఇక్కడికి తీసుకొని వస్తాము..ఇంత త్వరగా మా కోరిక నెరవేరుతుందని అనుకోలేదు..పల్లకీ సేవ లో చాలా మహాత్యం వుందండీ.." అని చెప్పి వెళ్లారు..


వివాహం కుదరడం కాకతాళీయమా.. లేక పల్లకీ సేవ లో పాల్గొన్నందుకు పెళ్లి జరిగిందా?..సమాధానం ఆ సమాధి లో కూర్చుని ఉన్న శ్రీ స్వామివారే చెప్పాలి..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: