23, సెప్టెంబర్ 2020, బుధవారం

ఆదిపర్వము -28 పాండురాజు అభ్యర్ధన

 ఆదిపర్వము -28 పాండురాజు అభ్యర్ధన


కుంతీ దేవిని పిలిచి, జరిగిందంతా ఆమెకు చెప్పాడు.


“కుంతీ, సంతానం లేకుండా జీవించి ఒకటే, మరణించి ఒకటే. కావున ధర్మ మార్గం ద్వారా మనకు సంతానం కలిగేట్లు చెయ్యవా. కుంతీ నీకు ఒక విషయం చేపుతాను వినుము. పుత్రులు ఆరు రకాలు. 1. ఔరసుడు, 2. దత్తకుడు, 3. కృత్రిముడు, 4. గూఢోత్పన్నుడు, 5. అపవిధ్ధుడు, 6. క్షేత్రజుడు. వీరికి రాజ్యములో కాని ఆస్తిలో కాని భాగం ఉంటుంది.


ఇంకొక రకమైన పుత్రులు ఆరుగురు ఉన్నారు. వారు 1. కానీనుడు, 2. సహోఢుడు, 3. క్రీతుడు, 4. పౌనర్భవుడు, 5. స్వయందత్తుడు, 6. జ్ఞాతుడు. వీరు కూడా పుత్ర సమానులే కాని, వీరికి రజ్యాధికారము కాని, ఆస్తిలో భాగము కాని లేదు.


మొదట నేను చెప్పిన వారిలో ఔరసుడు, క్షేత్రజుడు ముఖ్యులు. ఔరసుడు పుట్టే యోగ్యత మనకు లేదు కాబట్టి, క్షేత్రజుడు మిగిలిన వారికంటే మేలు. దేవర న్యాయము చేత పుట్టిన పుత్రుడు ఉత్తముడు. పూర్వం కేకయ రాజుకు పుత్రులు లేరు. అప్పుడు ఆయన తన భార్యను నియోగించగా, ఆమె పుంసవన హోమం చేయించి ఉత్తమమైన ఋత్విజుల ద్వారా ముగ్గురు కుమారులను పొందింది. కాబట్టి ఔరసులు పుట్టడానికి అవకాశం లేనపుడు, క్షేత్రజులే మేలు” అన్నాడు పాండురాజు.


దానికి కుంతి “మహారాజా, మేము నీ ధర్మ పత్నులము. మనసులో కూడా పర పురుషులను తలపము. అలాంటపుడు వారితో కలిసి సంతానాన్ని ఎలా పొందగలము? కాని నీ వలననే మాకు సంతానం కలుగుతుంది.


ఎలా అంటే – పూర్వం పూరు వంశంలో వ్యుషితాశ్యుడు అనే రాజు, నూరు అశ్వమేధ యాగాలు చేసాడు. లోకంలో ఉన్న రాజులందరిని జయించాడు. కాని ఆయనకు కామం ఎక్కువ, మితి మీరి కామ సుఖాలు అనుభవించి, క్షయ రోగంతో మరణించాడు. ఆయన భార్య పక్కన కూర్చుని ఏడుస్తూ ఉంది. అప్పుడు వ్యుషితాశ్వుని శరీరం నుండి ఒక మాట వినిపించింది.


“నీవు బహిష్టు అయిన ఎనిమిదో రోజు గాని, 14వ రోజు గాని, పడక మీద పడుకొని నన్ను స్మరించుము. నేను నీతో సంగమిస్తాను, నీకు పుత్రులు కలుగుతారు” అని వినిపించింది.


ఆ ప్రకారం చేసి ఆమె ఏడుగురు కొడుకులకు జన్మనిచ్చింది. కాబట్టి పాండురాజా, నువ్వు కూడా ఆ ప్రకారం సంతానం పొందవచ్చు కదా” అని అడిగింది కుంతీ దేవి.


అది సాధ్యం కాదు అని తెలుసుకున్నాడు పాండురాజు.


“కుంతీ, ఇదివరకు స్త్రీలు, భర్తల అదుపు ఆజ్ఞలలో ఉండేవాళ్లు కాదు. వారు స్వతంత్ర ప్రవృత్తి కలిగి ఉండేవాళ్లు. భర్త అనుమతితో గాని, భర్త అనుమతి లేకుండా కాని, తమ ఇష్టం వచ్చిన వారితో కాం అసుఖాలు అనుభవించేవారు. సంతానం పొందుతుండేవారు.


ఒకరోజు మహాతపస్వి అయిన ఉద్ద్దాలకుని భార్య బహిష్టు అయింది. అప్పుడు ఒక వృద్ధ బ్రాహ్మణుడు అతిథిగా వచ్చాడు. ఆమెను చూసి, మోహించి, తనకు సంతానం కావాలని ఆమెను అడిగాడు. ఇది విని ఉద్దాలకుని కొడుకు శ్వేతకేతుడు కోపించాడు. అది ధర్మవిరుధ్ధం అని ఖండించాడు.


“ఈ రోజు నుండి స్త్రీలు ఎప్పుడూ పరపురుషుని కోరకూడదు. వివాహమైన స్త్రీలకు పరపురుషునితో సంగమం నిషిధ్ధం. దాని వలన సర్వ పాపాలు కలుగుతాయి” అని కట్టడి చేసాడు.


అప్పటి నుండి వివాహితులైన భార్యలు, తమ భర్తలతో తప్ప వేరే వారితో సంగమించడం లేదు. కాని భర్త ఆజ్ఞ ప్రకారం సంగమించ వచ్చును. భర్త ఆజ్ఞను అతిక్రమించడం దోషం. అంతే కాదు, కల్మాషపాదుడి తన భార్య దమయంతిని దేవర న్యాయం ప్రకారం పుత్రుని పొందమని నియోగించాడు. భర్త ఆజ్ఞ అతిక్రమిస్తే పాపం వస్తుందని, దమయంతి వశిష్టుని వలన, అశ్మకుడు అనే పుత్రుని పొందింది. అలాగే నువ్వు కూడా దేవర న్యాయంతో పుత్రులను పొందుము. నీకు చేతులెత్తి నమస్కరిస్తాను” అని దీనంగా అన్నాడు పాండురాజు.

కామెంట్‌లు లేవు: