26, సెప్టెంబర్ 2021, ఆదివారం

మొగలిచెర్ల

 మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి లీలలు..


*ఆర్థికభారం..అన్నదానం..*


"అప్పులన్నీ..ఒక్క నయాపైసా కూడా బాకీ లేకుండా..అణా పైసలతో సహా..తీర్చేసానండీ..ఇప్పుడు ప్రశాంతంగా వున్నాను..మూడు నెలల క్రితం వరకూ ఒక్క క్షణం కూడా మనసుకు శాంతి అనేదే లేకుండా నరకం అనుభవించాను." అన్నారు విశాఖపట్నం నుంచి వచ్చిన శ్రీ చింతా సుధాకర్ గారు..


శ్రీ సుధాకర్ గారు MBBS చదివి, హోమియోపతి లో MD పట్టా తీసుకున్నారు..విశాఖపట్నం లో డాక్టర్ గా పనిచేస్తున్నారు..కొన్ని సంవత్సరాల పాటు విదేశాలలో కూడా పని చేసి వచ్చారు..ఆ సమయం లో ఆర్ధికంగా స్థిరపడ్డారు కూడా..ఒక ఇల్లు కట్టుకున్నారు..భార్యా పిల్లలతో ఏ లోటు లేని జీవితం గడుపుతున్నారు..అనుకున్న విధంగానే జీవితం సాఫీగా జరిగిపోతూ వుంటే మనిషికి దైవం గుర్తుకు రాడు..శ్రీ సుధాకర్ గారు కూడా తన వద్ద ఉన్న డబ్బుతో ఏదైనా చేయాలని ఆలోచన చేసి..తనకు అవగాహన లేని కొన్ని వ్యవహారాలలో డబ్బు పెట్టుబడి పెట్టారు..అందులో భారీగా నష్టం వచ్చింది..తాను కూడబెట్టుకున్న డబ్బే కాక..అప్పుతెచ్చి మరీ పెట్టుబడిగా పెట్టింది కూడా పూర్తిగా నష్టపోయారు..కేవలం తన వృత్తి మీద వచ్చే సంపాదన తో తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టుకుంటూ కాలం వెళ్లదీయాల్సిన పరిస్థితి దాపురించింది..ఇల్లు అమ్మివేసి, అప్పుతీరుద్దామనుకున్నారు..కానీ సుధాకర్ గారి పరిస్థితి ఆసరాగా తీసుకుని..ఇంటిని అతి తక్కువ ధరకు కొంటామని కొందరు ప్రయత్నం చేశారు..ఆ ధరకు అమ్ముకోలేక..అప్పులవాళ్లకు సమాధానం చెప్పుకోలేక సుధాకర్ గారు సతమతం అవసాగారు..


"మీరు ఫేస్బుక్ లో పోస్ట్ చేస్తున్న స్వామివారి లీలలను ప్రతి నిత్యం చదువుకునే వాడిని..కానీ ఒకతట్టు ముప్పైలక్షల రూపాయల అప్పు నెత్తిన ఉన్నది..అప్పిచ్చిన వాళ్ళు ప్రతిరోజూ ఫోన్ చేసి తమ బాకీ తీర్చమని అడుగుతున్నారు..దిక్కుతోచని స్థితిలో ఈ స్వామివారి కి మనసులోనే మొక్కుకొని..మొగలిచెర్ల కు ప్రయాణమై వచ్చేసానండీ..ఆరోజు మీరు ఇక్కడ లేరు..నేను ఉదయాన్నే మందిరానికి వచ్చి..స్నానాదికాలు ముగించుకొని..శ్రీ స్వామివారి వద్ద పూజ చేయించుకున్నాను..పూజారి గారి అనుమతి తీసుకొని శ్రీ స్వామివారి సమాధి వద్దకు వెళ్లి..నా కష్టాలన్నీ చెప్పుకున్నాను..ఆరోజు మధ్యాహ్నం ఇక్కడే భోజనం చేశానండీ..అప్పుడే నిర్ణయం తీసుకున్నాను..తండ్రీ నా కున్న ఆర్ధిక బాధల నుంచి నన్ను విముక్తుడిని చేస్తే..నీ సన్నిధిలో అన్నదానం చేస్తానని..మనస్ఫూర్తిగా మొక్కున్నాను..ఎందుకనో శ్రీ స్వామివారు పరిష్కారం చూపుతారనే నమ్మకం కలిగిందండీ..నేను ఇక్కడినుంచి విశాఖపట్నం చేరిన మూడోరోజు..మా ఇల్లు కొనడానికి వచ్చారండీ..స్వామివారి లీల అప్పుడే కనబడింది..నేను ఊహించిన దానికన్నా ఎక్కువ ధరకు కొంటామని చెప్పారండీ..చెప్పడమే కాదు..అప్పుడే ఐదు లక్షలు అడ్వాన్స్ కూడా ఇచ్చారండీ..అంతా కలలో జరిగినట్లు జరిగిపోయింది..మరో నెలకల్లా మరో ఇరవై లక్షలు ఇచ్చారండీ..నా అప్పులన్నీ తీర్చేసానండీ..అందరికీ చెప్పుకున్నాను..ఆ మొగలిచెర్ల దత్తాత్రేయుడే నాకు అండగా నిలబడ్డాడని..ముందు స్వామివారి వద్ద మొక్కుకున్నాను కదండీ..అందుకని ఈరోజు అన్నదానం చేయడానికి వచ్చానండీ.." అని చెప్పుకొచ్చారు..


సుధాకర్ గారు శ్రీ స్వామివారి సమాధిని మనసారా దర్శించుకున్నారు..దగ్గరుండి మరీ అన్నదానం చేశారు..తనకు ఎప్పుడు బుద్ధి పుడితే అప్పుడు నేరుగా శ్రీ స్వామివారి వద్దకు వస్తానని పదే పదే చెప్పి వెళ్లారు..ఒక్కొక్కరి అనుభవం ఒక్కో విధంగా ఉంటుంది..భక్తుడికి, స్వామివారికి మధ్య అన్యులెవరూ వుండరు.. వారి వారి భక్తి విశ్వాసాలే వారికి ఫలితాలను కలుగ చేస్తాయి..


సర్వం..

శ్రీ దత్తకృప!.


(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..లింగసముద్రం మండలం.. ప్రకాశం జిల్లా..పిన్: 523 114..సెల్..94402 66380 & 99089 73699).

కామెంట్‌లు లేవు: