*26.09.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - ఎనిమిదవ అధ్యాయము*
*అవధూతోపాఖ్యానము - అజగరము మొదలుకొని పింగళము వరకు గల తొమ్మిదిమంది గురువుల కథలు*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*8.26 (ఇరువది ఆరవ శ్లోకము)*
*ఏవం దురాశయా ధ్వస్తనిద్రా ద్వార్యవలంబతీ|*
*నిర్గచ్ఛంతీ ప్రవిశతీ నిశీథం సమపద్యత॥12525॥*
ఇట్లు క్షణక్షణము పెల్లుబుకుచున్న పేరాసతో ఆ పింగళ నిద్రను మాని ద్వారముకడనే విటునికొరకు ఎదురుతెన్నులు చూచుచు నిలబడియుండెను. ఫలితము కనబడకపోవుటతో ఏమియు తోచక ఇంటిలోనికి వెళ్ళుచు వచ్చుచుండెను. ఇంతలో అర్ధరాత్రి గడచిపోయెను.
*8.27 (ఇరువది ఆరవ శ్లోకము)*
*తస్యా విత్తాశయా శుష్యద్వక్త్రాయా దీనచేతసః|*
*నిర్వేదః పరమో జజ్ఞే చింతాహేతుః సుఖావహః॥12526॥*
ఎంతకును ఆమెలో ధనాశ చావకుండెను. ఎదురుచూచి ఎదురుచూచీ నోరు ఎండిపోవుచుండెను. ముఖము వాడిపోవుచుండెను. ఆమెలో అనుక్షణము దైన్యము ఆవరించుచుండెను. అప్పుడు ఆమెలో గొప్ప వైరాగ్యము జనించెను. ఎంతయో చింతాగ్రస్తురాలయ్యెను. కడకు వైరాగ్యమతోపాటు ఇవి అన్నియును కలిసి ఆమె శ్రేయస్సునకే కారణములయ్యెను.
*8.28 (ఇరువది ఎనిమిదవ శ్లోకము)*
*తస్యా నిర్విణ్ణచిత్తాయా గీతం శృణు యథా మమ|*
*నిర్వేద ఆశాపాశానాం పురుషస్య యథా హ్యసిః॥12527॥*
క్రమముగా ఆమె చిత్తమంతయును విరక్తితో నిండిపోయెను. అప్పుడు ఆమె 'వ్యక్తియొక్క ఆశాపాశములను త్రెంచివేయుటకు విరక్తియే (వైరాగ్యమే) ఒక ఖడ్గము' అనుచు ఒక గీతమును ఆలపించెను.
*8.29 (ఇరువది తొమ్మిదవ శ్లోకము)*
*న హ్యంగాజాతనిర్వేదో దేహబంధం జిహాసతి|*
*యథా విజ్ఞానరహితో మనుజో మమతాం నృప॥12528॥*
యదుమహారాజా! 'అజ్ఞానియైన వానినుండి మమకారములు తొలగిపోనట్లు, విరక్తి (వైరాగ్యము) కలుగనిదే దేహబంధములు (ఆశాపాశములూ) వీడవు' అనునది పింగళ పాడిన పాటలోని సారాంశము.
*పింగళోవాచ*
*8.30 (ముప్పదియవ శ్లోకము)*
*అహో మే మోహవితతిం పశ్యతావిజితాత్మనః|*
*యా కాంతాదసతః కామం కామయే యేన బాలిశా॥12529॥*
*పింగళ ఇట్లు పలికెను* నేను ఇంద్రియసుఖములకు బానిసనైతిని. అంతులేని మోహములో మునిగి తుచ్ఛుడైన పురుషునితో విషయసుఖములను కోరుకొనుచుంటిని. నేనెంత మూర్ఖురాలసు. ఇది చాలా విచారకరమైన విషయము.
*8.31 (ముప్పది ఒకటవ శ్లోకము)*
*సంతం సమీపే రమణం రతిప్రదం విత్తప్రదం నిత్యమిమం విహాయ|*
*అకామదం దుఃఖభయాధిశోకమోహప్రదం తుచ్ఛమహం భజేఽజ్ఞా ॥12530॥*
పరమానందస్వరూపుడు, సుఖప్రదాతయు ఐన పురుషోత్తముడు నా హృదయమునందే స్థిరముగా నిలిచియున్నాడు. అతడు లక్ష్మీపతియగుటవలన ధనమును కొల్లలుగా ఇయ్యగలడు. అంతేగాక చతుర్విధ పురుషార్థములను గూడ ఇయ్యగలడు. ఇట్టి ప్రభువును వీడి ఒక తుచ్ఛునికై ఆశపడుచుంటిని. అతడు నా మనోరథమును తీర్చుటకు అసమర్థుడు. అతని వలన నాకు దుఃఖము, భయము, ఆధివ్యాధులు, శోకము, మోహము ప్రాప్తించును. తెలివిలేనిదాననై అట్టి హీనుని భజింపదలచితిని కదా!
*8.32 (ముప్పదిరెండవ శ్లోకము)*
*అహో మయాఽఽత్మా పరితాపితో వృథా సాంకేత్యవృత్త్యాఽతివిగర్హ్యవార్తయా|*
*స్త్రైణాన్నరాద్యార్థతృషోఽనుశోచ్యాత్ క్రీతేన విత్తం రతిమాత్మనేచ్ఛతీ॥12531॥*
నేను నింద్యమైన వేశ్యావృత్తిని అవలంబించి నా దేహమును, మనస్సును వృథాగా క్లేశములపాలు చేసికొంటిని. స్త్రీలోలుడు, లోభులు అగు గౌరవహీనులకు ఈ శరీరమును అమ్ముకొని, ధనమును, రతిసుఖముసు కోరుకొంటిని. నేను ఎంతటి మూర్ఖురాలను?
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి