27, సెప్టెంబర్ 2021, సోమవారం

నేరము - శిక్ష'

 🌹🌹🌹🌹🌷🌷🌹🌹🌹🌹

Madabhushi Sridhar

SSpds1remd · 

Shared with Public

గుంటూరు మురళీ కృష్ణ గారు గొప్ప వాస్తవాన్ని కథరూపంలో వ్రాసారు. చదివి తీరవలసిన కథ. వారికి అభినందనలు.

'నేరము - శిక్ష'

*

కోర్టులో ముద్దాయి నిలబడి ఉన్నాడు. అప్పటికే అనేక సంవత్సరాలనుండి విచారణ జరుగుతోంది. వాయిదాల మీద వాయిదాలు పడుతూ చివరకు వాదనలు ముగిసి తీర్పు చెప్పే రోజు వచ్చింది.

అప్పటికే పది మంది మారి పదకొండో పి.పి. గారు, పోలీసులు కోర్టు హాలులో కూర్చుని ఉన్నారు.

ఇంతలో జడ్జి గారు వచ్చే సూచనగా "సాయ్_లెన్స్" అని అరిచాడు కోర్టు బంట్రోతు.

అందరూ లేచి నిలబడ్డారు జడ్జి గారికి గౌరవ సూచకంగా, ముద్దాయి తప్ప. (ఎందుకంటే అతడు ఆల్రెడీ నిలబడే ఉన్నాడు కాబట్టి).

కాల్ వర్క్ అయ్యేసరికి పదకొండున్నర అయింది. బెంచి గుమాస్తా "C.C.196 of 98 .... రాములు వర్సెస్ టూ టౌన్ పోలీస్ ఫర్ జడ్జ్ మెంట్" అన్నాడు.

ముద్దాయి రాములు నిబ్బరంగా జేబులు చేతిలో పెట్టుకుని నిలబడ్డాడు.

జడ్జి గారు గొంతు సవరించుకున్నారు ....

"ప్రాసిక్యూషన్ వారి వాదనలు, ముద్దాయి తరఫున ఎవరూ లేకపోవడంతో ప్రభుత్వం వారు నియమించిన లాయరు గారి వాదనలు విన్న తరువాత ముద్దాయిని దోషిగా నిర్ణయిస్తూ రెండేళ్ళ కఠిన కారాగార శిక్ష విధించడమైనది" అన్నారు.

అప్పుడు ముద్దాయినుండి దోషి పాత్రలోకి మారిన రాములు "అయ్యా, నాదొక మనవి .... ఆలకిస్తారా?" అనడిగాడు.

"ఏంటదీ?" అని అడిగారు జడ్జి గారు.

"నేరం జరిగి 23 సంవత్సరాలు అయింది. అసలు నేను చేసిన నేరం ఏమిటో కూడా గుర్తు లేదు. బహుశా రాంగ్ రూట్ లో వస్తున్న ఒక మోటార్ సైకిల్ని గుద్దిన సంఘటనే అయుంటుంది" అని ఆగాడు రాములు.

"ఔను, అదే .... అతను చనిపోయాడు. అందుకే రెండేళ్ళ కఠిన కారాగార శిక్ష విధిస్తున్నాను. ఫైను వెయ్యలేదు, సంతోషించు" అన్నారు జడ్జి గారు.

"తమరు మహానుభావులండయ్యా, నా మీద దయ చూపించారు. అలాగే మరికొంత దయ చూపిస్తే .... " అంటూ నసిగాడు రాములు.

"ఏఁవిటదీ?" అన్నారు జడ్జి గారు కుతూహలంగా.

"నేను ఆ రోజునుండి ఈ రోజు వరకు జైల్లోనే ఉన్నాను. అంటే 1998 నుండి నేటివరకు అంటే 23 సంవత్సరాలు జైలులోనే ఉన్నాను. మీరు వేసింది రెండేళ్ళ జైలు శిక్ష .... " అంటూ ఆగాడు రాములు.

"నువ్వు ఇప్పటికే శిక్ష అనుభవించావు కాబట్టి ఈ రెండేళ్ళ శిక్ష కూడా పూర్తయినట్లే. నీవు విడుదల అవడానికి కావలసిన ఉత్తర్వులు జారీ చేస్తాను" అన్నారు జడ్జి గారు.

"సంతోషం బాబు గారు, కానీ నన్ను అనవసరంగా 21 సంవత్సరాలు జైల్లో ఉంచేసారు .... "

"నీ తరఫున బెయిల్ ఇప్పించడానికి ఎవరూ ముందుకు రాలేదు. అందుకే అలా ఉండిపోయావు" అన్నారు జడ్జి గారు.

"ఔనయ్యా, నాకు బెయిలు ఇప్పించడానికి సూరిటీలు అడిగారు. ఒక్కొక్కరు యాభైవేలు పూచీకత్తు కట్టాలన్నారు. అంత సొమ్ము ఉన్నవాళ్ళెవరు నాకు తెలియదు. అందుకే బెయిలు రాలేదు" అన్నాడు రాములు.

"దానికి కోర్టు ఏం చేస్తుంది?" అన్నారు జడ్జి గారు.

"నిజమేనయ్యా, అది కోర్టు తప్పు అని నేను అనడం లేదు. నా బీదరికమే కారణం. కానీ అయ్యా, ఒక్క మాట. రాంగ్ రూట్ లో ఒక వ్యక్తి అనుకోకుండా వస్తే లోడు లారీ ఆపడం ఎవరి వల్లా కాదు. అందుకే లారీ ఆపలేకపోయాను. ఒక వేళ సడన్ బ్రేక్ వేస్తే లోడు లారీ తల్లకిందులై నేను చనిపోయేవాడిని. అందుకే బ్రేకు వెయ్యలేదు .... "

"కానీ నీ వల్ల ఒక నిండు ప్రాణం పోయింది. ఒక కుటుంబం వీధిన పడింది" అన్నారు జడ్జి గారు.

"నిజమేనయ్యా, ఒక నిండు ప్రాణం కాపాడటానికి, ఒక కుటుంబం వీధిన పడకుండా ఉండటం కోసమే నేను బ్రేకులు వెయ్యలేదు. నేనే కనుక సడన్ బ్రేక్ వేసుంటే లోడు లారీ తల్లకిందులై నేను చనిపోయేవాడిని. నేను పోతే నా కుటుంబం వీధిన పడేది. ఆ చనిపోయిన కుఱ్ఱాడికి ఇన్సూరెన్సు డబ్బులు వచ్చాయి. కుటుంబం వీధిన పడలేదు. కానీ ఇరవై మూడేళ్ళుగా లాయరుని పెట్టుకునే స్థోమతు లేక, ప్రభుత్వం నియమించిన లాయరు సరిగ్గా పట్టించుకోక, ఉన్న ఒకే ఒక ఆధారం అయిన లారీని కోర్టు కస్టడీలో ఉండిపోయింది. అప్పటినుండి అది కోర్టు ఆవరణలో వానకు తడుస్తూ, ఎండకు ఎండుతూ, స్పేరు పార్టులు, సీట్లు, స్టీరింగుతో సహా మాయమైనాయి. చేసిన నేరానికి రెండేళ్ళ శిక్ష వేసారు. కానీ రాంగ్ రూట్ లో వచ్చి ప్రమాదానికి కారణమైన వ్యక్తికి ఇన్సూరెన్సు వచ్చింది. ఏ తప్పు లేని నాకు రెండేళ్ళ శిక్ష కోసం ఇరవై మూడేళ్ళు జైల్లోనే ఉన్నాను. ఇప్పుడు బైటకు వెళ్తే నా కుటుంబానికి తిండి దొరికేదెలా? లారీ కోర్టు కస్టడీలోనే ఉన్నది ఇంత కాలం. మరి దాని బాగోగులు చూసుకోవలసిన బాధ్యత కోర్టు వారికి లేదా? నేరం చేసింది నేను, నా లారీ కాదు కదా? మరి దాన్నెందుకు పాడు పెట్టారు అయ్యగారు? కనుక జడ్జి గారిని నేను కోరుకునేదేమిటంటే ఇరవై మూడేళ్ళలోనుండి శిక్షా కాలం అయిన రెండేళ్ళు మినహాయించి మిగతా ఇరవై ఒక్క సంవత్సరాలకు నేను జైలుకి వెళ్ళకుంటే ఎంత సంపాదించేవాడినో అంత నష్ట పరిహారం, ఒక కొత్త లారీ ఇప్పిస్తే ఇరువైపులా న్యాయం జరిగినట్లు ఉంటుంది" అంటూ చేతులు జోడించాడు రాములు.

ఒక్క నిముషం కోర్టు హాలు అంతా మౌనంగా ఉండిపోయింది.

ఆ తరువాత కూడా కోర్టు మౌనంగానే ఉండిపోయింది ....

(ఎందరో అండర్ ట్రయల్స్ విచారణకు నోచుకోక శిక్షా కాలంకంటే రెండు రెట్లు, మూడు రెట్ల కాలం జైల్లో పడి ఉంటూ వాళ్ళ కుటుంబాల సంగతి గాలికి వదిలేసిన న్యాయ వ్యవస్థ, ప్రభుత్వం దీనికి సమాధానం చెప్పదు).

రచన : అధరాపురపు మురళీ కృష్ణ, గుంటూరు

తేది : 25-09-2021

కామెంట్‌లు లేవు: