27, సెప్టెంబర్ 2021, సోమవారం

యోగ మార్గము

 యోగ మార్గము :-


ప్రాచీన సనాతన ధర్మం లో యోగ మార్గం అంటే ఒంటి కాలుపై నిలబడటం, మేకుల పై పడుకోవడం,నీటి పై నడవడం,గాల్లోకి ఎగరడం , కఠోరమైన ఉపవాసాలతో శరీరాలను హింసించడం ఏమీ కాదు! ఇది స్పష్టంగా గీతలో వివరించారు శ్రీకృష్ణ పరమాత్మ. 


| కర్మయంతః శరీరస్థం, భూతగ్రామ మచేతసః

మాంచైవ అంత శ్శరీరస్తం....! |


భగవద్గీత 17. 6.


బుద్దిహీనుడైనవాడు ( అచేతన) శరీరాన్ని ఉపవాసాది హింసల ద్వారా కృశింపచేయడం వలన అంతర్యామిగా ఉన్న అతడి శరీరంలోని నన్ను కూడా హింసిస్తున్నాడు! అంటారు గీతలో శ్రీకృష్ణుడు.


అంటే ఇక్కడ ముఖ్యమైన అంశం "యోగం అంటే శరీరాన్ని శుష్కింపచేయడం కాదు! అతిగా సుఖాలతో విశృంఖలంగా శరీరాన్ని మేపడం కూడా కాదు. యక్తాహరం, తగినంత నిద్ర, తగినంత విశ్రాంతి తగినంత వ్యాయామం, నిరంతరంగా నడిచే సాధన, ఆలోచనా వంతుడై చేయాలి. అప్పుడే గత కర్మలను , వాటి వలన కలిగే కష్టసుఖాలను పూర్తిగా భస్మం చేయగలిగే యోగ సిద్ది లభిస్తుంది. దీనినే గౌతమ బుద్ధుడు కూడా "మధ్యే మార్గం " అని చెప్పారు. 


ఈ యోగంలో ముఖ్యమైన అంశం మనోనిల్చలత ! చంచలమైన మనసును నిశ్చలం చేయాలి. దాని ద్వారా ఏకాగ్రత సాధించాలి. అయితే మనసును కంట్రోల్ చేయడానికి బలాత్కారంగా ప్రయత్నించడం మాత్రం సబబు కాదు .. రకరకాలుగా పరిగేత్తే మనసును శ్వాస ద్వారా ఏకస్థం చేయాలి. ఇదే క్రియాయోగం గా చెబుతారు. 


ప్రశాంత మనసు గల వ్యక్తికి శ్వాస కూడా ప్రశాంతంగా సౌమ్యంగా నడుస్తుంది. భ్రూమధ్య దృష్టిని అనుసంధానం చేస్తూ శ్వాసను సుషుమ్నా నాడి ద్వారా భ్రూ మద్యానికి చేర్చి, ఎలాంటి ఆలోచనలు చేయకుండా నకించిదపి , చింతమేత్ తాను అనే ప్రజ్ఞ యందు దృడ నిష్టుడు కావాలి.ఈ విధంగా శ్వాస ద్వారా మనసును , మనసు ద్వారా బుద్దిలోకి ప్రవేశించి ఆ బుద్దిని తన ఆత్మ యందు ప్రవేశపెట్టి దాని ద్వారా యోగి సమాధి స్థితుడు అవుతాడు. 


ఇలా అంతర్దృష్టితో సర్వప్రంపంచాన్ని తానుగా భావించిన దివ్యదృష్టి భగవంతుని అనుగ్రహం తో లభిస్తుంది. ఇటువంటి దివ్యదృష్టి శాశ్వతంగా ఉంటుంది. సర్వజీవుల యందు కదలాడే చైతన్యమే పరమాత్మగా దర్శించగలుగుతాఢు. కోరికలు విడిచి ఆత్మ పరిశుద్ది కోసమే నిత్య కర్మలను చేస్తూ లభించిన దానితోనే సంతృప్తి పొంది జీవిస్తాడు యోగి! ఈ విధంగా ప్రారబ్ద కర్మ క్షయం అవగా ఆ యోగి చేయవలసిన కర్తవ్యం ఏం మిగలదు. విశ్వవ్యాపియైన విశ్వాత్మకు తన కర్మల ద్వారా శరణాగతి చేసి అంతర్దృష్టి తో సర్వస్వాన్ని చూస్తూ అందరి జీవులలో వెలిగే ఆ జగదీశ్వరుడిని దర్శిస్తాడు. అలాంటి యోగికి బయటి విశ్వమే పరమాత్మగా సాక్షాత్కరిస్తుంది. ఈ విధమైన సాధన మన నిత్యజీవితాన్ని విడిచి పారిపోయే సన్యాసం కాదు. సహజంగానే పండు పండి ఫలంగా మిగిలి, మిగతా కర్మఫలాలను అన్నింటినీ త్యాగం చేయగలుగుతారు. 


నిర్వాణ పరమాం మత్సంస్థాం అదిగఛ్ఛతి " సంగ్రహంగా ఇది ఉపదేశ సారం. 


ఈ పరిపూర్ణ లక్ష్యాన్ని చేరేలోగా మనిషి శరీరం, మనసు పవిత్రం కావడం కోసం ,కష్టనివారణ కోసం "యజ్ఞదాన తపస్సు" అనే కర్మలను వేదాలు ఏర్పాటు చేశాయి. 


మనిషి జీవన విధానంలో అవసరమైన అనేక ప్రయోజనాల కోసం కూడా అనేక శాస్త్రాలను ఋషులు ప్రసాదించారు. అవి అన్ని కూడా సనాతన ధర్మం లో భాగమే! ఆరోగ్యం కోసం ఆయుర్వేదం. దేవత అనుగ్రహం కోసం, దుష్ట గ్రహ నివారణ కోసం మంత్రశాస్త్రం, సుఖదుఃఖాలను నియమించుకోవడం కోసం మంచి చెడు కాలాలను తెలిపే జ్యోతిష్యం శరీరంలోని నాదానుసంధానం ద్వారా విశ్వంలోని ఓంకారం తో లయం చేసే సంగీత శాస్త్రం సామవేదం , గాంధర్వవేదం అలాగే నిత్యజీవితంలో కావాల్సినవి సంపాదించుకునే అర్థ శాస్త్రం ... సమాజాన్ని అన్ని వర్గాలనూ సుఖవంతంగా నడిపే సామాజిక ధర్మం, భార్యా భర్తలను వారి ప్రవృత్తులను అనుసరించి కావాల్సిన స్వేచ్చను ఇచ్చే గార్హస్థ్యధర్మము ( కామశాస్త్రం) , గృహ నిర్మాణానికి వాస్తు, భగవంతుని ఆరాధన కోసం ఆగమ శాస్త్రం...ఇలా అనేక విద్యలను ప్రసాదించింది సనాతన వేధం. వీటిని అన్నింటినీ సమన్వయ దృష్టితో అద్యయనం చేయాలి. 


సశేషం

9542552784


గమనిక :- ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే పోస్ట్ చెయ్యబడింది. ప్రత్యక్షంగా గానీ పరోక్షంగా గాని ఎవరిని ఉద్దేశించి కాదు

కామెంట్‌లు లేవు: