*27.09.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - ఎనిమిదవ అధ్యాయము*
*అవధూతోపాఖ్యానము - అజగరము మొదలుకొని పింగళము వరకు గల తొమ్మిదిమంది గురువుల కథలు*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*8.39 (ముప్పది తొమ్మిదవ శ్లోకము)*
*తేనోపకృతమాదాయ శిరసా గ్రామ్యసంగతాః|*
*త్యక్త్వా దురాశాః శరణం వ్రజామి తమధీశ్వరమ్॥12538॥*
భగవదను గ్రహముతో నాకు ఈ వైరాగ్యము కలిగినది. ఆ స్వామి చేసిన ఉపకారమును సాదరముగా శిరసు వంచి, వినమ్రతతో స్వీకరించుచున్నాను. అందువలన విషయసుఖముల యందలి దురాశలను పరిత్యజించి, ఆ సర్వేశ్వరుని త్రికరణశుద్ధిగా శరణుజొచ్చుచున్నాను.
*8.40 (నలుబదియవ శ్లోకము)*
*సంతుష్టా శ్రద్దధత్యేతద్యథా లాభేన జీవతీ|*
*విహరామ్యమునైవాహమాత్మనా రమణేన వై॥12539॥*
ఇకమీదట ఏ పరపురుషునివైపు కన్నెత్తియైనను చూడను. ఆత్మారాముడైన ఆ పరమపురుషునితో భక్తిశ్రద్ధాపూర్వకముగా విహరింతును. ప్రారబ్ధానుసారముగా లభించిన దానితో తృప్తిపడుచు సంతోషముగా జీవింతును.
*8.41 (నలుబది ఒకటవ శ్లోకము)*
*సంసారకూపే పతితం విషయైర్ముషితేక్షణమ్|*
*గ్రస్తం కాలాహినాఽఽత్మానం కోఽన్యస్త్రాతుమధీశ్వరః॥12540॥*
సంసారకూపములోబడి, విషయసుఖములలో మునిగి వివేకమును కోల్పోయినవానిని, కాలసర్పము నోటిలో పడినవానిని ఆ భగవంతుడు తప్ప మరియెవ్వడును రక్షింపజాలడు.
*8.42 (నలుబది రెండవ శ్లోకము)*
*ఆత్మైవ హ్యాత్మనో గోప్తా నిర్విద్యేత యదాఖిలాత్|*
*అప్రమత్త ఇదం పశ్యేద్గ్రస్తం కాలాహినా జగత్॥12541॥*
సకల విషయ సుఖముల నుండి విరక్తుడై, జగత్తంతయును కాలసర్పముచే గ్రహింప బడుచుండునని ఎరిగినవాడు, అప్రమత్తుడై (మిగుల జాగరూకుడై) తనను రక్షించువాడు పరమాత్ముడు మాత్రమే అని గ్రహింపవలెను.
*బ్రాహ్మణ ఉవాచ*
*8.43 (నలుబది మూడవ శ్లోకము)*
*ఏవం వ్యవసితమతిర్దురాశాం కాంతతర్షజామ్|*
*ఛిత్త్వోపశమమాస్థాయ శయ్యాముపవివేశ సా॥12542॥*
*అవధూతయైన దత్తాత్రేయుడు ఇట్లు పలికెను* "యదుమహారాజా! ఆ పింగళయను వేశ్య ఇట్లు నిశ్చయించుకొనినదై, విటులను సంతృప్తిపఱచుచు ధనమును సంపాదింపవలెననెడి దురాశను ఫూర్తిగా వీడి, ప్రశాంతచిత్తయయ్యెను. పిమ్మట ఆమె ఎట్టి చీకూచింతా లేక కంటి నిండా నిద్రపోయెను.
*8.44 (నలుబది నాలుగవ శ్లోకము)*
*ఆశా హి పరమం దుఃఖం నైరాశ్యం పరమం సుఖమ్|*
*యథా సంఛిద్య కాంతాశాం సుఖం సుష్వాప పింగళా॥12543॥*
పింగళ పురుషులపై ఆశను వదలుకొనుటతో హాయిగా నిదురింపగలిగెను. *ఆశయే పరమదుఃఖము. వైరాగ్యమే పరమసుఖము' అనునది పింగళ వృత్తాంతమువలన గ్రహింపదగిన నీతి*.
*ఇతి శ్రీమద్భాగవతే మహాపురాణే పారమహంస్యాం సంహితాయాం ఏకాదశస్కంధే అష్టమోఽధ్యాయః (8)*
ఇది భాగవత మహాపురాణమునందలి ఏకాదశస్కంధము నందలి *అవధూతోపాఖ్యానము - అజగరము మొదలుకొని పింగళ వరకు గల తొమ్మిదిమంది గురువుల కథలు* అను ఎనిమిదవ అధ్యాయము (8)
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి