*27.09.2021 ప్రాతః కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - ఎనిమిదవ అధ్యాయము*
*అవధూతోపాఖ్యానము - అజగరము మొదలుకొని పింగళము వరకు గల తొమ్మిదిమంది గురువుల కథలు*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*8.33 (ముప్పది మూడవ శ్లోకము)*
*యదస్థిభిర్నిర్మితవంశవంశ్యస్థూణం త్వచా రోమనఖైః పినద్ధమ్|*.
*క్షరన్నవద్వారమగారమేతద్ విణ్మూత్రపూర్ణం మదుపైతి కాన్యా॥12532॥*
వెదురు కర్రలతోగూడి, వాసములపై, స్థంభములపై నిలిచియున్న గృహమువలె ఈ శరీరము ఎముకలతో నిర్మితమైయున్నది. చర్మముతో, రోమనఖములతో ఇది కప్పబడియున్నది. నశ్వరమైనది, నవద్వారములతో ఒప్పుచుండునది. మలమూత్రములతో నిండియున్నది. హేయమైన ఇట్టి శరీరమును నేను తప్ప మఱియొక ఏ స్త్రీ కోరుకొనును? సేవించును?
*8.34 (ముప్పది మూడవ శ్లోకము)*
*విదేహానాం పురే హ్యస్మిన్నహమేకైవ మూఢధీః|*
*యాన్యమిచ్ఛంత్యసత్యస్మాదాత్మదాత్కామమచ్యుతాత్॥12533॥*
జీవన్ముక్తులకు నిలయమైనది ఈ విదేహనగరము. ఈ నగరములోని వారందరిలోను నేనే పరమ మూర్ఖురాలను, దుష్టురాలను. ఏలయన, ఆత్మానందప్రదాతయు, శాశ్వతుడైన పరమాత్మను కాదని, ఇతర పురుషులను వాఛించుచున్నది నేను ఒక్కతెనే.
*8.35 (ముప్పది ఐదవ శ్లోకము)*
*సుహృత్ప్రేష్ఠతమో నాథ ఆత్మా చాఽయం శరీరిణామ్|*
*తం విక్రీయాత్మనైవాహం రమేఽనేన యథా రమా॥12534॥*
సకలప్రాణుల యందును అంతర్యామియై వెలుగొందుచుండుట వలన ఆ పరమాత్ముడు ఎల్లరకును మిగుల ప్రియతముడు *(ఆత్మాహి నిరతిశయ ప్రియః)*, హితైషి, ప్రభువు. కనుక ఆ పరమపురుషునకు నా ఆత్మను సమర్పించి (ఆత్మార్పణ గావించి) ఆ స్వామిని వశపరచుకొందును. లక్ష్మీదేవివలె ఆయనతోగూడి పరమానందమును పొందెదను.
*8.36 (ముప్పది ఆరవ శ్లోకము)*
*కియత్ప్రియం తే వ్యభజన్ కామా యే కామదా నరాః|*
*ఆద్యంతవంతో భార్యాయా దేవా వా కాలవిద్రుతాః॥12535॥*
విషయభోగములు అశాశ్వతములు. వాటిని కలిగించువారు మానవులైనను, దేవతలైనను కాలగర్భములో కలిసిపోయెడివారే. వారిని సేవించెడి భార్యలకు వారు ఏ మాత్రము సుఖములను పంచి ఇయ్యగలిగిరి? వాస్తవముగా ఎవ్వరునూ సుఖభోగముల వలన తృప్తిని పొందజాలరు.
*8.37 (ముప్పది ఏడవ శ్లోకము)*
*నూనం మే భగవాన్ ప్రీతో విష్ణుః కేనాపి కర్మణా|*
*నిర్వేదోఽయం దురాశాయా యన్మే జాతః సుఖావహః॥12536॥*
పూర్వజన్మలో నేను తప్పక ఏదో ఒక సుకృతమును చేసికొనియే యుండవచ్చును. అందువలననే సర్వేశ్వరుడైన శ్రీమహావిష్ణువు నాయెడ ప్రసన్నుడైనాడు. నా దురాశా ఫలితముగనే ఈ వైరాగ్యము కలిగినను ఇది వాస్తవముగా నాకు సుఖావహమే ఐనది.
*8.38 (ముప్పది ఎనిమిదవ శ్లొకము)*
*మైవం స్యుర్మందభాగ్యాయాః క్లేశా నిర్వేదహేతవః|*
*యేనానుబంధం నిర్హృత్య పురుషః శమమృచ్ఛతి॥12537॥*
నిజముగా నేను దురదృష్టవంతురాలనే ఐనచో నా ఈ క్లేశములవలన వైరాగ్యము కలిగియుండెడిదికాదు. నేను అదృష్టవంతురాలను కావుననే నాకు ఈ వైరాగ్యము కలిగినది. వైరాగ్యము కలుగుటవలననే మానవుడు సంసారబంధములను ఛేదించికొని, పరమశాంతిని పొందగలడు.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి