26, సెప్టెంబర్ 2021, ఆదివారం

సంస్కృత మహాభాగవతం

 *26.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఎనిమిదవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - అజగరము మొదలుకొని పింగళము వరకు గల తొమ్మిదిమంది గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*8.17 (పదిహేడవ శ్లోకము)*


*గ్రామ్యగీతం న శృణుయాద్యతిర్వనచరః క్వచిత్|*


*శిక్షేత హరిణాద్బద్ధాన్మృగయోర్గీతమోహితాత్॥12516॥*


వనవాసియగు సన్న్యాసి విషయభోగములకు సంబంధించిన గీతములను వినరాదు. కిరాతునియొక్క సంగీతమునకు ఆకర్షితమైన హరిణము ఆ వ్యాధునిచే బంధింపబడి కడకు అసువులనే కోల్పోవును. అందువలన యతి లేదా సాధకుడు దైవమునకు సంబంధించిన గీతములను సంభాషణలను వినవలెనేగాని, గ్యామ్య-శృంగార గీతములకు చెవియొగ్గినచో, అతడు భ్రష్టుడగును.


*8.18 (పదునెనిమిదవ శ్లోకము)*


*నృత్యవాదిత్రగీతాని జుషన్ గ్రామ్యాణి యోషితామ్|*


*ఆసాం క్రీడనకో వశ్య ఋష్యశృంగో మృగీసుతః॥12517॥*


యదుమహారాజా! హరిణియొక్క గర్భమునుండి జన్మించిన ఋష్యశృంగుడు (విభాండకుని సుతుడు) తరుణీమణులయొక్క విషయభోగములకు సంబంధించిన నృత్యములను జూచుచు, మృదంగాది వాద్యములతో గూడిన గీతములను వినుచు వారికి వశుడై, వారి చేతిలో ఆటబొమ్మ అయ్యెను. గ్రామ్య-శృంగార గీతముల దుష్ప్రభావము ఎంతవరకు దారితీయునో నీవు ఎరిగినదే గదా!


*8.19 (పందొమ్మిదవ శ్లోకము)*


*జిహ్వయాతిప్రమాథిన్యా జనో రసవిమోహితః|*


*మృత్యుమృచ్ఛత్యసద్బుద్ధిర్మీనస్తు బడిశైర్యథా॥12518॥*


గాలమునకు గ్రుచ్చబడిన ఎరకు ఆశపడిన చేప ఆ గాలమునకు చిక్కుకొని తుదకు ప్రాణములనే పోగొట్టుకొనును. అట్లే అంతులేని జిహ్వచాపల్యముగల మానవుడు రోగములపాలై మృత్యుముఖమున బడును. 


*8.20 (ఇరువదియవ శ్లోకము)*


*ఇంద్రియాణి జయంత్యాశు నిరాహారా మనీషిణః|*


*వర్జయిత్వా తు రసనం తన్నిరన్నస్య వర్ధతే॥12519॥*


*8.21 (ఇరువది ఒకటవ శ్లోకము)*


*తావజ్జితేంద్రియో న స్యాద్విజితాన్యేంద్రియః పుమాన్|*


*న జయేద్రసనం యావజ్జితం సర్వం జితే రసే॥12520॥*


వివేకముగలవారు ఆహారమును భుజించుటమాని, ఇతరేంద్రియములను వశపరచుకొనవచ్చును. కాని దానివలన రసనేంద్రియము వశము గాదు. సరిగదా! భోజనేచ్ఛ ఇంకను ప్రబలమగును. కనుక రసనేంద్రియమును జయింపనంతవరకును మానవుడు జితేంద్రియుడు కాజాలడు. రసనేంద్రియమును జయించినచో అన్ని ఇంద్రియములు అతనికి వశమైనట్లే.


*8.22 (ఇరువది రెండవ శ్లోకము)*


*పింగలా నామ వేశ్యాఽఽసీద్విదేహనగరే పురా|*


*తస్యా మే శిక్షితం కించిన్నిబోధ నృపనందన॥12521॥*


యదుమహారాజా! పూర్వకాలమున విదేహ నగరమునందు *పింగళ* యను వేశ్యగలదు. ఆమె నుండియు నేను కొంత నీతిని నేర్చుకొంటిని. ఆ విషయమును వినిపించెదను ఆలకింపుము.


*8.23 (ఇరువది మూడవ శ్లోకము)*


*సా స్వైరిణ్యేకదా కాంతం సంకేత ఉపనేష్యతీ|*


*అభూత్కాలే బహిర్ద్వారి బిభ్రతీ రూపముత్తమమ్॥12522॥*


ఆ స్వేచ్ఛాచారిణి ఒకనాటి రాత్రి ఒక కాముకుని తన శయన మందిరమునకు తీసికొనపోదలచినదై, చక్కని వస్త్రాభరణములను అలంకరించుకొని (బాగుగా ముస్తాబై) గృహముఖద్వారము కడ వేచియుండెను.


*8.24 (ఇరువది నాలుగవ శ్లోకము)*


*మార్గ ఆగచ్ఛతో వీక్ష్య పురుషాన్ పురుషర్షభ|*


*తాన్ శుల్కదాన్ విత్తవతః కాంతాన్ మేనేఽర్థకాముకా॥12523॥*


*8.25 (ఇరువది ఐదవ శ్లోకము)*


*ఆగతేష్వపయాతేషు సా సంకేతోపజీవినీ|*


*అప్యన్యో విత్తవాన్ కోఽపి మాముపైష్యతి భూరిదః॥12524॥*


యదుమహారాజా! పురుషశ్రేష్ఠా! ధనమునందు పేరాసతోనున్న ఆ పింగళ ఆ మార్గమున వచ్చిపోవుచున్న ప్రతిపురుషుని చూచుచు ఇట్లు తలపోయుచుండెను. 'ఇతడు ధనవంతుడు కావచ్చును. ఈ సుందరుడు సమృద్ధిగా శుల్కమును ఇచ్చి, నాతో రమించుటకే వచ్చుచుండవచ్చును'. పురుషులనుండి పుచ్చుకొనిన శుల్కముతోనే జీవించుచుండెడి ఆ సుందరి ఆ దారిలో వచ్చి పోవుచున్న పురుషులను అందరిని పరికించి పరికించి చూడసాగెను. ఆమె ప్రతి ఒక్కరిని జూచి ఇట్లు అనుకొన దొడంగెను. 'ఇతడు ధనికుడే కావచ్చును. నన్ను పొందుటకే వచ్చుచుండవచ్చును. ఇతడు సమృద్ధిగా శుల్కమును ఈయగలిగి యుండవచ్చును'. అని ఆమె అనుచుండగనే అందరును తమదారిన తాము వెళ్మిపోవుచుండిరి.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: