*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*417వ నామ మంత్రము* 26.9.2021
*ఓం చేతనారూపాయై నమః*
శుద్ధ చైతన్య స్వరూపిణియైన జగన్మాతకు నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *చేతానారూపా* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం చేతనారూపాయై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని అత్యంత భక్తిశ్రద్ధలతో ఆరాధించు సాధకులకు ఆ పరమేశ్వరి అనంతమైన బ్రహ్మజ్ఞాన సంపదలు సంప్రాప్తించుటకు కావలసిన సాధనాశక్తిని, ధ్యాననిమగ్నతను ప్రసాదించును.
చిచ్ఛక్తి అంటే చైతన్యశక్తి. అది నిర్మలమైన చైతన్యశక్తి. అట్టి చైతన్యశక్తిరూపంలో ఉండే పరమాత్మ దేహంలో ఉన్నప్పుడు ఆ దేహానికి చలనశక్తి ఏర్పడుతుంది. 'ఏ శక్తి మాకు ధర్మ బుద్ధిని ప్రేరణచేయునదియు, సర్వచైతన్య స్వరూపురాలును, జ్ఞానస్వరూపురాలు అని యనబడుతున్నదో అట్టి విద్యకు (పరమేశ్వరికి) నమస్కరింతును అను భావముతో దేవీభాగవతమునందు మొదటి శ్లోకం చెప్పబడినది. 'గాయత్రితో ప్రారంభింపబడినదియే భాగవతము' అని మత్స్యపురాణమునందు చెప్పబడినది. అనంతకోటి జీవరాశులలోను జీవాత్మరూపంలో ఉండే పరమాత్మయే చిత్ అనగా జ్ఞానము. అటువంటి పరమాత్మ దేహంలో ఉన్నప్పుడు ఆ దేహానికి చైతన్యము కలుగుతుంది. జ్ఞానేంద్రియాలు, కర్మేంద్రియములు, మనస్సు పనిచేస్తూ ఉంటాయి. ఈ చైతన్యమే చిచ్ఛక్తియొక్క పరమధర్మము. అందుకే చైతన్యశక్తిస్వరూపమైన పరమేశ్వరియే *చేతానారూపా* యని అనబడినది. ఈ చేతానాశక్తి సర్వావస్థలయందును (జాగ్రస్వప్నసుషుప్తులయందు) ఉంటూ శరీరమందున్న ఆత్మకు పూర్వజన్మకర్మవాసనలననుసరించి కర్మలనాచరింపజేస్తూ, కర్మఫలాలను అనుభవింపజేస్తూ ఉంటుంది. చైతన్యశక్తి రూపంలో దేహమందు ఉండే పరమేశ్వరియే *చేతనారూపా* యని అనబడినది.
పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం చేతనారూపాయై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి