26, సెప్టెంబర్ 2021, ఆదివారం

అందమైన పత్రిక..!*

 *పుత్రిక..నీ జీవితాన అందమైన పత్రిక..!*


నువు పోతే కర్మ 

చేసే కొడుకు 

బ్రతికున్నప్పుడు 

నీ ఖర్మకి నిన్నొదిలేస్తే 

అక్కున చేర్చుకుని 

ఓదార్చేది ఆడపిల్ల..

కొడుకు ఉద్ధరిస్తాడనేది కల్ల

కూతురే ఇప్పుడు 

కొడుకై వర్థిల్లుతున్నది జగమెల్ల..!


కూుతురంటే....

నీ ఇంటి సిరి..

నీ పాలి జాబిల్లి..

నీ జీవితాన మహారాణి

పుట్టుకతోనే నీ యువరాణి..


అమ్మ వెళ్ళిన 

తర్వాత అంత ప్రేమగా 

నీకు ముద్ద పెట్టే..

ముద్దు పెట్టే తోడు లేదని 

బాధ పడే 

నిన్ను లాలనగా 

దగ్గరికి తీసుకుని 

తన ఎంగిలి కంచంలోని గోరుముద్దని ప్రేమగా నీకు పెట్టి నువ్వు తింటుంటే చూసి మురిసిపోయే

మరో అమ్మ..నీ ముద్దుగుమ్మ!


తన ఆటపాటలతో 

నిను మురిపించే చిన్నారి..

బుడిబుడి అడుగులతో పరిగెత్తుకొచ్చి 

నిన్ను హత్తుకునే పొన్నారి..

తన చిన్ని చిన్ని 

ఆనందాలను 

నీతో పంచుకునే చిట్టితల్లి..

ఒకనాటికి కన్యాదాన ఫలంతో నిన్ను ఋషిని చేసే దేవత..

అత్తింటికి వెళ్తూ 

నీవైపు చూసే ఆ కళ్ళు..

కన్నీటి సెలయేళ్ళు..

ఓ జన్మకు సరిపడే 

అనుభూతికి ఆనవాళ్లు..

అప్పుడు ఆ బుట్టబొమ్మ 

కన్నీటి చారికకు 

ఓ ఫోటో తీసి 

నెగటివ్ ని పాజిటివ్ గా 

మారిస్తే కనిపించే అక్షరాలు..

నాన్నా..ఐ మిస్ యు.. 

నీ జన్మకు 

అంతకు మించిన బాధ..

మరొకటి ఉండేనా

అది నీ నుదుటిన 

నీ బిడ్డ రాసిన 

అనుభవాల

అనుభూతుల గాథ..

ఓ దృశ్యకావ్యమే కదా..

నిజానికి అదే కదా 

నీ అసలు కథా..


ఇప్పుడిప్పుడు ఆమెకు ప్రభుత్వాలు ఇమ్మంటున్నాయేమో

ఆస్తిలో వాటా..

అది లేకపోయినా..

ఇవ్వకపోయినా

కూతురు తీసుకుంటుంది 

నీ బాధల్లో వాటా..

కొడుకు పంచుకునేది 

నీ అంతస్తు..

ఆడపిల్ల కోరుకునేది 

మాత్రం నీ శ్రీరస్తు..

అందుకే ఇప్పుడు 

చాలామంది 

తల్లిదండ్రల వానప్రస్థం 

కూతురి సన్నిధిలోనే శుభమస్తు!


       daughter"s day               

             శుభాకాంక్షలతో

     *సురేష్ కుమార్ ఎలిశెట్టి*

          9948546286

కామెంట్‌లు లేవు: