26, సెప్టెంబర్ 2021, ఆదివారం

శ్రీలలితా సహస్రనామ భాష్యము*

 *శ్రీమాత్రేనమః*


*శ్రీలలితా సహస్రనామ భాష్యము*


*418వ నామ మంత్రము* 26.9.2021


*ఓం జడశక్త్యై నమః* 


జడాత్మకమైన ప్రకృతిని సృష్టించడానికి ఏర్పడిన మాయాపరిమాణ శక్తిస్వరూపిణి యైన జగన్మాతకు నమస్కారము.


శ్రీలలితా సహస్ర నామావళి యందలి *జడశక్తిః* అను నాలుగక్షరముల (చతురక్షరీ) నామ మంత్రమును *ఓం జడశక్త్యై నమః* అని ఉచ్చరించుచూ, ఆ పరమేశ్వరిని ఉపాసించు సాధకులను ఆ పరమేశ్వరి సకలచరాచరాత్మకమైన జగత్తును తెలియువారిగను, సకలజగత్తుల సృజనకు కారణమైనది పరమేశ్వరియే అనియు, అట్టి పరమేశ్వరిని ఉపాసించి అనంతమైన బ్రహ్మజ్ఞానసంపదలను పొందగలమను జ్ఞానసమృద్ధిని అనుగ్రహించును.


జగత్స్వరూపమును సృష్టించుటకు ఏర్పడిన మాయాపరిణామ శక్తినే జడశక్తి యని అందురు. ఈ జడశక్తియే జగత్స్వరూపముగా పరిణమించినది. సకలభావములకును శక్తులు లుండును. ఆ శక్తులన్నియు జ్ఞానముతోనే తెలిసికోదగినవి. పరమాత్మయొక్క చిచ్ఛక్తియందు అన్ని శక్తులు ఉండునని భావము. సృష్ట్యాది శక్తులు కూడా బ్రహ్మకు శక్తులే. అగ్నికి వేడి ఏవిధముగా సహజముగా నున్నదో అలాగే బ్రహ్మకు కూడా సృష్టికార్యము నెరవేర్చుటకు ఈ శక్తులు సహజముగా ఏర్పడినవి. బ్రహ్మ కేవలం నిమిత్తమాత్రము మాత్రమే. ప్రధానకారణము కాడు. మాయలోని సృజనశక్తులే ప్రధానకారణములగుచున్నవి. సృష్ట్యాది శక్తులు వస్తుకారణములు. దీనినిబట్టి జడశక్తి వస్తుకారణమైనది.


బ్రహ్మపదార్థము సకలశక్తుల సమ్మేళనము. సృష్టివిషయములో పరమాత్మ నిమిత్తకారణము తప్ప అన్యవిషయములకు సంబంధములేదు. వస్తుస్వరూపము వస్తువుయొక్క శక్తియే.


సకల శక్తులు పరమేశ్వరివే. చైతన్యశక్తి పరమేశ్వరియే. అలాగే జడశక్తియునూ పరమేశ్వరియే. గనుకనే ఇంతకుముందు *చిచ్ఛక్తి* అనబడినదియు, ఇప్పుడు *జడశక్తి* అనుబడునదియు కూడా పరమేశ్వరియే. అందుకే ఈ నామ మంత్రముద్వారా అమ్మవారిని *జడశక్తి* యని అన్నాము.


పరమేశ్వరికి నమస్కరించునపుడు *ఓం జడశక్త్యై నమః* అని యనవలెను.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹

 *పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235

🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹


మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐

కామెంట్‌లు లేవు: