*25.09.2021 సాయం కాల సందేశము*
*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*
*ఏకాదశస్కంధము - ఎనిమిదవ అధ్యాయము*
*అవధూతోపాఖ్యానము - అజగరము మొదలుకొని పింగళము వరకు గల తొమ్మిదిమంది గురువుల కథలు*
🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉
*8.9 (తొమ్మిదివ శ్లోకము)*
*స్తోకం స్తోకం గ్రసేద్గ్రాసం దేహో వర్తేత యావతా|*
*గృహానహింసన్నాతిష్ఠేద్వృత్తిం మాధుకరీం మునిః॥12508॥*
తుమ్మెద ఒక్కొక్క పుష్పమునుండి కొద్దికొద్దిగా మకరందమును ఆస్వాదించుచు జీవించుచుండును. అట్లే ముని ఒక్కొక్క గృహమున మాధుకరవృత్తి ననుసరించి కొంచము కొంచముగా తన దేహమును పోషించుకొనుటకు మాత్రమే ఆహారమును స్వీకరింపవలెను. ఆ విధమును పాటించినచో అతని దేహయాత్ర కొనసాగును, ఆహార ప్రదానము చేయునట్టి గృహస్థునకు ఎట్టిబాధయు కలుగదు.
*8.10 (పదియవ శ్లోకము)*
*అణుభ్యశ్చ మహద్భ్యశ్చ శాస్త్రేభ్యః కుశలో నరః|*
*సర్వతః సారమాదద్యాత్పుష్పేభ్య ఇవ షట్పదః॥12509॥*
మధుపము (తుమ్మెద) పుష్పములు చిన్నవియైనను, పెద్దవియైనను వాటిలోని సారమును మాత్రమే గ్రహించును. ఆ విధముగనే ముని శాస్త్రములు అన్నింటినుండి సారమును మాత్రమే గ్రహింపవలెను.
*8.11 (పదకొండవ శ్లోకము)*
*సాయంతనం శ్వస్తనం వా న సంగృహ్ణీత భిక్షితమ్|*
*పాణిపాత్రోదరామత్రో మక్షికేవ న సంగ్రహీ॥12510॥*
*8.12 (పండ్రెండవ శ్లోకము)*
*సాయంతనం శ్వస్తనం వా న సంగృహ్ణీత భిక్షుకః|*
*మక్షికా ఇవ సంగృహ్ణన్ సహ తేన వినశ్యతి॥12511॥*
సన్న్యాసి భిక్షాటనకు వెళ్ళినప్పుడు తేనెటీగవలె సాయంకాలము కొరకుగాని, మరునాటికిగాని మిగుల్చుకొను ఉద్దేశ్యముతో భిక్షాన్నమును సమకూర్చుకొనుటకు యత్నింపరాదు. తన కరముగాని, ఉదరముగాని నిండునంతవరకే భిక్షను స్వీకరింపవలెను. అట్లుగాక తేనెటీగవలె అవసరమునకు మించి సంగ్రహించినచో తేనెటీగ తేనెతో సహా నశించినట్లు అతడు తన ఆహారమును కోల్పోవును. తానునూ ఆపదల పాలగును.
*8.13 (పదమూడవ శ్లోకము)*
*పదాపి యువతిం భిక్షుర్న స్పృశేద్ దారవీమపి|*
*స్పృశన్ కరీవ బధ్యేత కరిణ్యా అంగసంగతః॥12512॥*
భిక్షువు (సన్న్యాసి) కర్రతో చేయబడిన స్త్రీమూర్తినైనను పాదముతో సైతము స్పృశింపరాదు. అట్లు స్పృశించినచో అతడు ఆడు ఏనుగు సాంగత్య ప్రభావమున మగఏనుగువలె వ్యామోహములో పడిపోవును.
*గజ జిఘృక్షిభిః కాష్ఠతృణమృదాద్యా చ్ఛాతితగర్తో పరిస్థాపితయా|*
*దారుమయ్యాః కరిణ్యా అంగసంగాత్ యథా గర్తే పతితో బధ్యతే తద్వత్॥* (వీరరాఘవీయ వ్యాఖ్య)
మగ ఏనుగును బంధింపదలచినవారు ఒక పెద్దగోతిని త్రవ్వి దానిని కర్రలతో, గడ్డితో, మట్టితో కప్పివేసెదరు. దానిపై కర్రతో చేసిన ఒక ఆడు ఏనుగుబొమ్మను నిలిపెదరు. అంతట మగ ఏనుగు ఆడు ఏనుగుయొక్క సుఖస్పర్శకై ఆరాటపడుచు దానికడకు చేరును. అప్పుడు ఆ ఏనుగు గోతిలో పడిపోవును. పిమ్మట దానిని బంధింతురు.
*8.14 (పదునాలుగవ శ్లోకము)*
*నాఽధిగచ్ఛేత్స్త్రియం ప్రాజ్ఞః కర్హిచిన్మృత్యుమాత్మనః|*
*బలాధికైః స హన్యేత గజైరన్యైర్గజో యథా॥12513॥*
వివేకముగలవాడు ఎట్టి పరిస్థితిలోనైనను తరుణియొక్క రూపలావణ్యములకు ఆకర్షితుడై ఆమె దరికి చేరరాదు. అట్లొనర్చినవాడు తన మృత్యువును తానే కొనితెచ్చుకొనినట్లగును. గజము ఆడు ఏనుగును సమీపించినచో బలిష్ఠములైన ఇతర ఏనుగులు దానిని హతమార్చునుగదా!
*8.15 (పదిహేనవ శ్లోకము)*
*న దేయం నోపభోగ్యం చ లుబ్ధైర్యద్దుఃఖసంచితమ్|*
*భుంక్తే తదపి తచ్చాన్యో మధుహేవార్థవిన్మధు॥12514॥*
పరమలోభియైనవాడు తాను నానాకష్టాలుపడి కూడబెట్టిన ధనమును తాను అనుభవింపడు. ఇతరులకు దానము చేయడు. తేనెటీగలు శ్రమపడి కూడబెట్టిన ధనమును ఇతరులు అనుభవింతురు. ( *అర్థవిత్ = తద్ధనగ్రహణోపాయాభిజ్ఞ-* ఆ ధనమును కాజేయుటకు ఉపాయము ఎరిగినవాడు).
*దానము, భోగము, నాశము, పూనికతో మూడు గతులు భువి ధనమునకున్|*
*దానము భోగము నెఱుగని, దీనుని ధనమునకు గతి తృతీయమె పొసగున్॥*
ఎప్పుడైనను తాను సంపాదించిన ధనమును ఇతరులకు దానము చేయవలెను లేదా అనుభవింపవలెను. ఇతరులకు దానము చేయక, తాను అనుభవింపక ఉన్నచో, అది (ఆ ధనము) నశించుటయో, ఇతరుల పాలగుటయొ తథ్యము. (సుభాషిత - నీతి శతకము -ఏనుగు లక్ష్మణకవి)
*8.16 (పదహారవ శ్లోకము)*
*సుదుఃఖోపార్జితైర్విత్తైరాశాసానాం గృహాశిషః|*
*మధుహేవాగ్రతో భుంక్తే యతిర్వై గృహమేధినామ్॥12515॥*
పెక్కు తేనెటీగలు పలుదినములు ఎంతగానో ప్రయాసపడి తేనెను సమకూర్చుకొనును. తేనెలను సేకరించువాడు తేనెటీగల కష్టార్జితమును అవి అనుభవింపకముందే తాను తినివేయును. అట్లే సుఖజీవనమును కాక్షించు గృహస్థులు తాము అనుభవించుటకై దానిని (ధనమును) మిక్కిలి కష్టపడి సంపాదింతురు. వారి గృహములలోని అన్నపానాదులను వారు అనుభవింపకముందే బ్రహ్మచారులు మొదలగువారు తినివేయుదురు. దీనినిబట్టి చూడగా స్వార్థముకొరకై (కేవలము తమకొఱకై) సంపాదించుకొనిన వస్తువులు తమకు దక్కవు. కావున మానవుడు పరార్థదృష్టిగలిగి అనగా అంతయు భగవంతునిదే అను భావముతో దానిని సద్వినియోగము చేయవలెను. అప్పుడు అతని జీవితము సార్థకము అగును.
(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)
🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*
7702090319, 9505813235
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి