25, సెప్టెంబర్ 2021, శనివారం

సంస్కృత మహాభాగవతం

 *25.09.2021 ప్రాతః కాల సందేశము*


*వేదవ్యాసుల వారి సంస్కృత మహాభాగవతం*


*ఏకాదశస్కంధము - ఎనిమిదవ అధ్యాయము*


*అవధూతోపాఖ్యానము - అజగరము మొదలుకొని పింగళము వరకు గల తొమ్మిదిమంది గురువుల కథలు*

🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉🕉

*బ్రాహ్మణ ఉవాచ*


*8.1 (ప్రథమ శ్లోకము)*


*సుఖమైంద్రియకం రాజన్ స్వర్గే నరక ఏవ చ|*


*దేహినాం యద్యథా దుఃఖం తస్మాన్నేచ్ఛేత తద్బుధః॥12500॥*


అవధూతయగు దత్తాత్రేయుడు పలికెను. "యదుమహారాజా! ప్రాణులకు ఇంద్రియములవలన కలిగే సుఖము స్వర్గమునందు లభించినట్లుగనే, నరకమునందు కూడా లభించును. కావున, వివేకవంతుడు ఇట్టి రహస్యమును గుర్తించి సుఖ-దుఃఖముల కొరకు ఆరాటపడకూడదు.


*8.2 (రెండవ శ్లోకము)*


*గ్రాసం సుమృష్టం విరసం మహాంతం స్తోకమేవ వా|*


*యదృచ్ఛయైవాపతితం గ్రసేదాజగరోఽక్రియః॥12501॥*


యోగియైన వాడు లభించిన ఆహారముతో సంతృప్తి పడవలయును. అది రుచికరమైనది కావచ్చును లేక రుచిలేనిది కావచ్చును. అది అధికముగా లభింపవచ్చును లేక స్వల్పముగా లభింపవచ్చును. కావున అతడు అజగరమువలె అప్రయత్నముగా లభించినదానిని అనుభవించి, ఉదాసీనుడై ఉండవలెను. 


*8.3 (మూడవ శ్లోకము)*


*శయీతాహాని భూరీణి నిరాహారోఽనుపక్రమః|*


*యది నోపనమేద్గ్రాసో మహాహిరివ దిష్టభుక్॥12502॥*


ఆహారము పెక్కుదినముల వఱకు దొరకకపోయినను దానికై ఎట్టి ప్రయత్నమూ చేయక అజగరము (కొండచిలువ) వలె నిరాహారముగా ఉండవలెను. ప్రారబ్ధానుసారముగ లభించిన ఆహారముతో సంతుష్టి నొందవలెను.


*8.4 (నాలుగవ శ్లోకము)*


*ఓజః సహో బలయుతం బిభ్రద్దేహమకర్మకమ్|*


*శయానో వీతనిద్రశ్చ నేహేతేంద్రియవానపి॥12503॥*


రాజా! శరీరమునందు మనోబలము, ఇంద్రియబలము, దేహబలము ఉన్నప్పటికిని, ఇంద్రియములు కార్యసాధకశక్తి కలవైనప్పటికిని, నిశ్చేష్టుడై యుండవలెను. నిద్రారహితుడైనను అజగరమువలె నిద్రించుచున్నట్లు ఉండవలెను. సాధకుడు ఇంద్రియసుఖములకై ఆరాటపడక అజగరము వలె ప్రాప్తించినదానితో తృప్తిపడియుండవలెను.


*8.5 (ఐదవ శ్లోకము)*


*మునిః ప్రసన్నగంభీరో దుర్విగాహ్యో దురత్యయః|*


*అనంతపారో హ్యక్షోభ్యః స్తిమితోద ఇవార్ణవః॥12504॥*


ముని సముద్రమువలె బయటికి ప్రసన్నుడుగాను, లోపల గంభీరుడుగాను ఉండవలెను. 'ఇతడు ఇట్టివాడు' అని ఇతరులకు బోధపడరాదు. మిగుల ప్రతిభాశాలియై యుండవలెను. అపారమైన శక్తిసామర్థ్యములు కలిగి యుండవలెను. కామక్రోధాదులచే చలింపరాదు. సముద్రమువలె ప్రశాంతముగా ఉండవలెను.


*8.6 (ఆరవ శ్లోకము)*


*సమృద్ధకామో హీనో వా నారాయణపరో మునిః|*


*నోత్సర్పేత న శుష్యేత సరిద్భిరివ సాగరః॥12505॥*


సముద్రములోనికి వర్షాకాలమున నదీప్రవాహములు ఎన్ని వచ్చి చేరినప్పటికిని అది తన చెలియలికట్టను (తన హద్దును) దాటదు. గ్రీష్మకాలమునందు శుష్కింపదు. అట్లే ముని సంపదలు సమృద్ధిగా లభించినప్పుడు పొంగిపోడు, లభింపనప్పుడు కృంగిపోడు. అతడు (ముని) విషయవాంఛారహితుడై తన మనస్సును భగవత్పరము కావించును. సముద్రమునుండి గ్రహింపవలసిన నీతి ఇదియే.


*8.7 (ఏడవ శ్లోకము)*


*దృష్ట్వా స్త్రియం దేవమాయాం తద్భావైరజితేంద్రియః|*


*ప్రలోభితః పతత్యంధే తమస్యగ్నౌ పతంగవత్॥12506॥*


మిడుత అగ్నిజ్వాలరూపమునకు ఆకర్షితమై మోహవశమున అందుపడిపోయి నశించును. అట్లే ఇంద్రియ సుఖలోలుడైన వ్యక్తి భగవన్మాయా ప్రభావమున స్త్రీరూపమునకు ఆసక్తుడై, ఆ వ్యామోహములో పడి, అంధకారమయమైన నరకకూపమున పడిపోవును.


*8.8 (ఎనిమిదవ శ్లోకము)*


*యోషిద్ధిరణ్యాభరణాంబరాదిద్రవ్యేషు మాయారచితేషు మూఢః|*

*ప్రలోభితాత్మా హ్యుపభోగబుద్ధ్యా పతంగవన్నశ్యతి నష్టదృష్టిః॥12507॥*


మానవుడు కామినీకాంచనములు, వస్త్రాభరణములు మొదలగు క్షణికములైన పదార్థములచే ఆకర్షింపబడి, మూర్ఖత్వముచే వాటిని పొందవలెనను ఆసక్తితో వివేకమును కోల్పోయి మిడుతవలె నశించును. ఐహికములైన క్షణికసుఖావేశములు పతన హేతువులు.


(శ్రీ వేదవ్యాసప్రణీత శ్రీమద్భాగవతమందలి ఏకాదశ స్కంధములోని ఎనిమిదవ అధ్యాయము ఇంకను కొనసాగును)


🙏🙏సర్వం శ్రీకృష్ణార్పణమస్తుi🙏🙏


*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం*

7702090319, 9505813235

కామెంట్‌లు లేవు: