25, సెప్టెంబర్ 2021, శనివారం

కౌన్సిలింగ్

 మావయ్య గారు .... రేపు ఆదివారం మీ స్నేహితులతో ప్రోగ్రాంలు ఏవీ పెట్టుకోకుండా కొంచెం ఇంటి దగ్గరే ఉండండి ... బుజ్జి గాణ్ణి కౌన్సిలింగ్ కి తీసుకెళ్లాలి .... సైక్రియాటిస్టు ఎవరో బాగా చూస్తారట ... ఆదివారం వెల్దామన్నారు .... మీ అబ్బాయి ... .... మళ్ళా మీరు మర్చిపోతారేమోనని ముందే చెప్పమన్నారు .... చిరునవ్వుతో సున్నితంగా చెబుతా ఉంటే .... సుబ్బారావు గారు ఆమె వంక అయోమయంగా చూస్తూ .... 

                  అదేంటమ్మా .... బుజ్జిగాడు బాగానే ఉన్నాడుగా ... వాణ్ణి కౌన్సిలింగ్ కు ఎందుకూ .... అందులోకి .... సైక్రియాటిస్టు దగ్గరకు ... అన్నారు కోడలివంక చూస్తూ ..... అదికాదు మావయ్య గారు ... ఈ మధ్య వాడు చాలా డల్ గా ఉంటున్నాడు ... ఏమడిగినా బుర్ర ఊపటమే గానీ మాట్లాడడు ..... వాడు మాట్లాడకపోతే నాకు పిచ్చెక్కెటట్టుంది.... దానికి తోడు కొంచెం ఊబ కాయం వస్తున్నాది కూడాను .... అన్నాది బాధ పడుతూ .... 

                  సుబ్బారావు గారు ..... కొడుక్కి కోడలికి అనేకసార్లు చెప్పారు .... పిల్లల్ని అస్తమానం చదువు చదువు అంటూ సతాయిస్తూ ..... ఆటపాటలకు పోనీయకుండా .... తమ ఈడు పిల్లలతో కలవనీయకుండా నిర్బంధిస్తే .... వాళ్లలో చలాకీతనం తగ్గిపోయి .... సృజనాత్మకత లోపించి .... రేప్పొద్దున్న రోబోల్లా తయారవుతారు .... వాళ్ళను అల్లరి చెయ్యనివ్వాలి .... తప్పులు చెయ్యనివ్వాలి .... కింద పడితేనే కదా పైకి ఎలా లేవాలో తెలుస్తాది .... మిమ్మల్ని మేము ఎలా పెంచామో వాళ్ళని కూడా అలాగే పెరగనివ్వండి ..... చీటికీ మాటికి వాడి భవిష్యత్తుని బైనాక్యూలర్స్ లో చూట్టం మానుకోండి ..... అంటూ ఎన్ని సార్లు చెప్పినా .... వినిపించుకోరు .... పైపెచ్చు .... అప్పట్లో మీరు .... ఇప్పటి తల్లిదండ్రుల్లా కేర్ తీసుకుని పెంచి ఉంటే ....నా తెలివితేటలకు .... నేను జిల్లా కలెక్టర్ అయ్యేవాణ్ణి ... అంటూ ఎద్దేవా చేస్తాడు ... కొడుకు రాఘవ .... 

                   ఆదివారం నాడు ... మొగుడు పెళ్ళాం .... బుజ్జి గాణ్ణి తీసుకుని హాస్పిటల్ కి వెళ్లారు .... సుబ్బారావు గార్ని ఇంటికి కాపలా పెట్టి .... సైక్రియాటిస్టు హాస్పటల్ ఖాళీగా ఉంటాదేమో.... ఒక గంటలో వెళ్లి వచ్చేయొచ్చు .... అనుకున్న రాఘవకి ... అక్కడ జనాల్ని చూసేసరికి మతిపోయింది ....ముందే అపాయింట్మెంట్ తీసుకోనందుకు బాధపడ్డాడు .... 

                      చింతపండు రాఘవ గారంటే మీరేనా సార్ .... అంటూ స్లిప్ పట్టుకుని అడుగుతున్న నర్సు ని .... డాక్టర్ గారు రమ్మంటున్నారు .... అనేసరికి .... ఆశ్చర్యంగా భార్యను, బుజ్జిగాణ్ణి తీసుకుని .... డాక్టర్ గారి రూంలోకి ప్రవేశించిన రాఘవని .... రారా చింతపండు .... స్లిప్ లో ఇంటిపేరు రాయించటం మంచిదయ్యింది .... గుర్తుపట్టావా ... నేన్రా కస్తూరి గాణ్ణి ... అంటూ సీట్లోంచి లేచి ఆలింగనం చేసుకున్న డాక్టర్ గార్ని చూసి ఆశ్చర్యపోయాడు రాఘవ ..... 

             నువ్వా కస్తూరి .... నేమ్ ప్లేట్ లో ..

.. కె. సుధాకర్ అని ఉంది ..... ఎంత అల్లరి చేసేవాడివి .... ఎన్ని ఆటలాడివాడే వాడివి .... డాక్టర్ అవుతావని కల్లో కూడా అనుకోలేదురా .... అంటూ ఇంకా ఆశ్చర్యంలోంచి తేరుకోని రాఘవని చూసి పెద్దగా నవ్వేస్తూ ..... 

            వీడేనా ... మీ వాడు .... ఏం పేరు నాన్నా .... అంటూ బుజ్జిగాడికి షేక్ హ్యాండ్ ఇస్తూ .... ముభావంగా ఉంటాడు ... ఏమడిగినా నోటితో కాకుండా తల అడ్డంగానో నిలువుగానో ఆడిస్తాడు .... దీనికితోడు కొత్తగా ఊబకాయం తగలడుతోంది .... కార్పొరేట్ స్కూల్లో ..ఏసి రూముల్లో చదువుతున్నాడు.. 

మార్కులు మాత్రం తెగ వచ్చేస్తున్నాయి .... ఇంట్లో చిన్న పని కూడా చెప్పరు .... బయటకెళ్ళి ఉల్లిపాయలు కూడా కొనలేడు ... ఒక వేళ వెళ్లినా ..... ఉల్లిపాయలు డజనెంత అని అడుగుతాడు ..... 

                తాను చెప్పకుండానే .... బుజ్జిగాడికున్న కంప్లయింట్లు అన్నీ ఏకరువుపెడుతున్న డాక్టర్ని చూసి మూర్ఛపోయినంత పని చేశాడు రాఘవ ..... 

                ఇప్పుడు నా దగ్గర కొచ్చిన పిల్లలందరికీ ఇదే కంప్లయింట్ రాఘవా ..... ఇదంతా ఇప్పటి పేరెంట్స్ తమ పిల్లల భవిష్యత్తుని ఇప్పటినుంచే .... కాదు .... ఇక్కడ్నుంచే బైనాక్యూలర్ లో చూట్టం వల్ల వచ్చిన రుగ్మత .... వాళ్ళని పిల్లల్లా కాకుండా ఫౌల్ట్రీ లో కోడి పిల్లల్లా పెంచుతున్నారు .... దీనికి మందూ లేదు .... ట్రీట్మెంటూ లేదు .... అచ్చం మనల్ని .... మన తల్లిదండ్రులు ఎలా పెంచారో .... మనం ఎలా పెరిగామో .... అలా పెంచటమే .... పెరగనివ్వటమే.... అంటూ ....రాఘవ భార్య కేసి చూస్తూ .... సెకండ్ ఒపీనియన్ కి .... వేరే డాక్టర్ దగ్గిరకు వెళ్లకండమ్మా ..... నన్ను నమ్మండి ... ప్లీజ్ ..... నేను వీడు అన్నట్టు చిన్నప్పుడు అల్లరి చిల్లరిగా తిరిగినా బాగానే చదువుకున్నాను .... నవ్వుతూ అంటున్న డాక్టర్ని చూసి భార్య భర్తలిద్దరూ నవ్వేశారు .....

కామెంట్‌లు లేవు: