25, సెప్టెంబర్ 2021, శనివారం

మొగలిచెర్ల

 *స్వామి పెట్టిన ప్రసాదం..*


"అయ్యా..నన్ను గుర్తుపట్టావా?" అంటూ ఓ డెబ్భై ఏళ్ల పెద్దాయన మూడేళ్ళ క్రితం శ్రీ స్వామివారి ఆరాధన ఉత్సవం జరిగిన తెల్లవారి నేనూ , మా సిబ్బందీ..ఆ ఉత్సవం తాలూకు అలసట లో ఉన్న సమయం లో నా దగ్గరకు వచ్చి అడిగారు..


అప్పటికి ఇంకా శ్రీ స్వామివారి సమాధి దర్శనార్థం భక్తులు వస్తూనే ఉన్నారు..తలెత్తి చూసాను..గోళ్ళ వెంగయ్య గారు..స్వామి వారిని ప్రత్యక్షంగా చూసి, మాట్లాడి, స్వామివారితో కలిసి భోజనం కూడా చేసిన వ్యక్తి..


వారిని ఎలా మర్చిపోతాను? ఆమాటే అన్నాను..స్వచ్ఛంగా నవ్వారు..


"ఓ 50 కేజీలు బియ్యం తెచ్చాను..అన్నదానానికి ఉపయోగించు.."


 "మహానుభావుడు, నను పక్కన కూర్చోబెట్టుకుని, అన్నం పెట్టాడు..ఈ జన్మకు ఆయన చేతి ముద్ద తిన్నాను..అంతకంటే భాగ్యమా! ఇప్పటికి 45 ఏళ్ళు గడిచినా ఆయన సత్యంగా నవ్వినట్టే గుర్తుందయ్యా!" అంటూ కుర్చీలో కూర్చుంటూ చెప్పుకొచ్చారు..


దగ్గరగా జరిగి కూర్చుని, ఆయన చేతిని నా చేతిలో పెట్టుకుని అడిగాను, "మీ అనుభవాలు చెప్పండి"అని..వయోభారం వల్ల కాబోలు, నన్ను ఆసరాగా పట్టుకుని చెప్పడం మొదలెట్టారు..


"మొగలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామి వారు, మొగలిచెర్ల గ్రామానికి రాక మునుపు, లక్ష్మీ నృసింహ క్షేత్ర మైన మాలకొండలో తపస్సు చేసుకునేవారు..నేను శ్రీ చెక్కా కేశవులు గారు ఒక ఊరి వాళ్ళం..ఆయన ద్వారానే స్వామి పరిచయం అయింది..మీ నాయనా అమ్మా వాళ్ళు ముందునుంచే తెలుసుకానీ, స్వామి కాడికి రాబట్టినాకనే నాకు దగ్గరైనారు.." ఒక్కక్షణం చెప్పడం ఆపి, స్వామి వారి పటానికి నమస్కారం పెట్టుకున్నారు..


శ్రీ గోళ్ళ వెంగయ్య గారిది, ప్రకాశం జిల్లా పామూరు మండలం కంభాలదిన్నె గ్రామం..వ్యవసాయ కుటుంబం..మొదటినుంచీ దైవ భక్తి కొద్దిగా ఎక్కువే..స్వామి వారి శిష్యుడు, శ్రీ చెక్కా కేశవులు గారు శ్రీ దత్తాత్రేయ స్వామి వారి వద్దకు తాను వెళుతూ, వెంగయ్య గారిని కూడా తీసుకుని వెళ్లారు..ఆరోజు శనివారం..శనివారం రోజు మాలకొండకు భక్తుల తాకిడి ఎక్కువ కనుక, శ్రీ స్వామి వారు, తాను మామూలుగా తపస్సు చేసుకునే పార్వతీదేవి మఠం వద్ద కాకుండా, పై నున్న గుహలలోకి వెళ్ళిపోయి, అక్కడ తపస్సు చేసుకునేవారు..మాలకొండ మళ్లీ నిర్మానుష్యంగా మారిన తరువాతే, ఎప్పుడో రాత్రికి, తిరిగి మఠం వద్దకు చేరేవారు..వీళ్ళు వెళ్ళేసరికి, పార్వతీదేవి మఠం పూజారి గంగయ్య , "అయ్యా ఈరోజు స్వామి వారు ఇక్కడికి రారు కదా! మీరు అనవసరంగా వచ్చారే"అని అన్నారట..ఎంత ఆలస్యం అయినా పర్వాలేదు, ఆయన వచ్చేదాకా ఉంటాము అని కేశవులు గారు చెప్పారు..


మధ్యాహ్నం 3గంటలైంది..ఆకలేస్తోంది.. పూజారి గంగయ్య కూడా గుడి మూసేసి వెళ్లే సన్నాహాల్లో ఉన్నాడు..ఇక మనకు ఈరోజు ప్రాప్తం లేదు అనుకునే సమయంలో, ఆశ్చర్యకరంగా, స్వామి వారు, దిగంబరంగా, పైనుంచి దిగి వస్తూ , నేరుగా కేశవులు గారితో, "నన్ను ఇబ్బంది పెట్టినావే"అన్నారట..కేశవులు గారికి అర్ధం కాలేదు..మళ్లీ స్వామి వారే.."మీరొచ్చినారని అమ్మ చెప్పింది, మీరు ఆకలిగా ఉండారని కూడా అమ్మే చెప్పింది..ఇంక తపస్సు సాగలా..ఇదిగో లేచివచ్చాను.."


వింటున్న వెంగయ్య గారు చూస్తూ ఉన్నారు..ఆయన మాటల్లో చెప్పాలంటే, తనకేమీ తోచలేదట..స్వామి వారిని చూస్తుంటే, ఏదో తెలీని మైకం కమ్ముతోందట..


"అన్నం వండి ఉంది, అందరం తిందాము రండి, "అని స్వామి వారు చెప్పి, ఆకులిచ్చి, తానే గిన్నెలోంచి తీసి పెట్టారట..


అదిగో అలా మొదటి పరిచయం లోనే, స్వామి వారి అనుగ్రహం పొందిన ధన్యజీవి శ్రీ వెంగయ్య గారు..తరువాత స్వామి వారిని చాలా సార్లు కలిశారు..ఇప్పటికీ శ్రీ దత్తాత్రేయ స్వామి వారి మీద అచంచల భక్తి విశ్వాసాలతో ఉన్నారు..


"గుడిలో చాలా మార్పులు చేసినావు..వచ్చే, పోయే..భక్తులకు ఇబ్బందిలేకుండా చూడు..ఎంతోమంది వస్తుంటారు ఈ స్వామిదగ్గరకు..అందరికీ సౌకర్యంగా స్వామి దర్శనం అయ్యేటట్లు చూడు..ఇప్పుడు బాగానే ఉన్నదిలే.." అన్నారు..మందిరము అభివృద్ధి చెందుతున్నందుకు సంతోషించారు.. 


స్వామి వారి ఆరాధన సందర్భంగా వారి అనుగ్రహం పొందిన భక్తుని రాకతో, మాకందరికీ కొండంత తృప్తి కలిగింది..ఓపిక ఉన్నంతవరకూ మొగలిచెర్ల శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరానికి వస్తూ ఉండమని కోరాను.."ఆయనే రప్పించుకుంటాడులే..ఈరోజు నువ్వు పిలిస్తే వచ్చానా చెప్పు? మళ్లీ సమయం వస్తుంది, వస్తాను" అంటూ.."అన్నదానం బాగా చేస్తున్నారు..ఈ నలభై రోజులూ దీక్ష తీసుకున్న స్వాములందరికీ రెండుపూటలా ఆహారం పెట్టే ఏర్పాటు చేశావట కదా.. జాగ్రత్తగా అందరికీ కడుపునిండా పెట్టు" అని చెప్పి, స్వామి వారికి మళ్లీ నమస్కారం చేసుకుని వెళ్లారు..


ఇప్పటికీ సంవత్సరం లో రెండుసార్లు శ్రీ స్వామివారి సమాధిని దర్శించుకోవడానికి వస్తూ వుంటారు వెంగయ్య గారు..


సర్వం..

శ్రీ దత్త కృప.


(పవని నాగేంద్ర ప్రసాద్.. శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం...మొగలిచెర్ల గ్రామం... లింగసముద్రం మండలం... ప్రకాశం జిల్లా..పిన్:523114.

..సెల్..94402 66380 & 99089 73699)

కామెంట్‌లు లేవు: