25, సెప్టెంబర్ 2021, శనివారం

కోతి కథ

 ఒక ఊరిలో ఒక చెరువుండేదంట. చెరువు ప్రక్కన్నే ఒక చెట్టుండేదంట. చెట్టులో ఒక కోతి ఇల్లు కట్టుకొని ఉండేదంట. ఒక రోజు కోతికి పాయసం తాగాలనిపించింది. అక్కడ ఒక చోట బెల్లం ముద్దలు పడుతూ ఉండేవాళ్ళు. కోతి అక్కడికి పోయేసి, రెండు బెల్లం ముద్దలు ఎత్తుకునింది. ఒకటి ఎత్తుకుని, తినేసింది. ఇంకొకటి టెంకాయమానులో దాచి పెట్టేసింది.

 అక్కడే ఒక అవ్వ సామాన్లు ఎక్కువగా పెట్టుకొని అమ్ముతూ ఉండేది. కోతి అక్కడికి పోయి ఒక గుండా (పెద్ద గిన్నె) ఎత్తుకొనింది. రాళ్ళు పేర్చి పొయ్యి పెట్టేసింది. దాని మీద గుండా పెట్టింది. తరువాత అక్కడే ఉన్న కట్టెలు పేర్చి పెట్టేసింది. అన్నీ బాగా సమకూర్చుకుంది. "పొయ్యి వెలిగించటానికి అగ్గిపెట్టె కావాలి కదా!" అనుకుంది. అప్పుడు ఒక తాత కోతి ఉండే చెట్టు కిందికి వచ్చి, బీడీ తాగుతూ అగ్గిపెట్టెను ప్రక్కనే పెట్టేశాడు. కోతి వచ్చి మెల్లిగా అగ్గిపెట్టె ఎత్తుకొని వెళ్ళింది.

 ఇక కోతి సంతోషంగా కట్టెలని ముట్టించింది. కుండలోకి నీళ్ళు పోసింది. తర్వాత బెల్లం ముద్ద వేసింది. పాయసం పొంగు వచ్చింది; కానీ దాన్ని కలబెట్టేదానికి గంటె మాత్రం లేదు. అందుకని కోతి తన తోకతోనే కలబెట్టింది. ఇంక కోతికి మంట ఎత్తింది. అది అరుస్తూ, పొర్లుతూ, దొర్లుతూ, దారెంబడి పోతావుంటే దానికి నక్కబావ అడ్డం వచ్చినాడు: "ఏం కోతిబావా! అలా ఏడుస్తా వున్నావు?" అంటుందంట నక్క. "నాకు పాయసం తాగాలనిపించింది; పాయసం కలబెట్టేదానికి గంటె లేదు, అందుకని నా తోక ఎత్తి కలబెట్టాను. అబ్బా! మంట!" అంది కోతి. అప్పుడు నక్కబావ "సరే, మా ఇంటికి రా! మా భార్య దగ్గరికి వెళ్దాం. మా ఇంట్లో ఏవేవో ఐటాలు ఉన్నాయిలే" అన్నది. కోతికి చాలా సంతోషం వేసింది. సంతోషంలోతోక మంటను కూడా మర్చిపోయింది. ఇద్దరూ కలిసి నక్క ఇంటికి వెళ్ళారు. అప్పుడు నక్క బావ భార్యను పిలిచి-"కోతికి ఏమన్నా ఐటాలు పెట్టు" అన్నాడు. "నేను ఇంకా ఏమీ వంట చెయ్యలేదు, నువ్వు వెళ్ళి మునక్కాయలు కోసుకు రా, నీకు నచ్చేట్లు వంట చేసి పెడతాను " అన్నది నక్క భార్య కోతితో.

కోతి తొందర తొందరగా వెళ్ళి మున-క్కాయలు తెచ్చి ఇచ్చింది. నక్క భార్య వాటిని తీసుకొని లోపలికి వెళ్ళింది. నక్కబావ కోతితో ముచ్చట్లు పెట్టాడు. ఇంక ఘుమ ఘుమ వాసనలు మొదలు అయినాయి. కోతికి నోట్లో నీళ్ళూరుతున్నాయి. కడుపులోఎలుకలు పరుగెత్తుతున్నాయి. నక్క భార్య ఇంకా పిలవలేదు భోజనానికి.

"నేను వెళ్ళి చూసి వస్తాను" అని చెప్పి, లోపలికి వెళ్ళాడు నక్కబావ. వెళ్ళిన వాడు ఇంక వెనక్కి రాలేదు. కోతికి మళ్ళీ మంటెత్తుకునింది. ఆగలేక, మెల్లగా వంటగదిలోకి వెళ్ళి చూస్తే- ఏముంది?! అక్కడ నక్కబావ, అతని భార్య- ఇద్దరూ బాగా తినేసి, గుర్రుపెట్టి నిద్రపోతున్నారు! మునక్కాయల పిప్పి కుప్పలు కుప్పలుగా పడిఉంది! గుండా అంతా ఖాళీ! "జిత్తులమారిదాన్ని నమ్మటం నాదే బుద్ధి తక్కువ" అనుకొని, కోతి ఆకలితోనే ఇంటి దారి పట్టింది.

సేకరణ 

కామెంట్‌లు లేవు: