*శ్రీమాత్రేనమః*
*శ్రీలలితా సహస్రనామ భాష్యము*
*1000వ నామ మంత్రము* 25.9.2021
*ఓం లలితాంబికాయై నమః*
కిరణరూపులగు నవావరణ దేవతలను అతిక్రమించి ఉపరిభాగమందు దేదీప్యమానమైన కాంతిప్రకాశంతో భాసిల్లు లలితాపరమేశ్వరికి నమస్కారము.
సుకుమార, లాలిత్యములతో విరాజిల్లు జగన్మాతకు నమస్కారము.
తేజస్సు, లాలిత్యము, మాధుర్యము, గాంభీర్యము, విలాసము, శోభ, స్థైర్యము, ఔదార్యము అను ఎనిమిదిగుణములతో తేజరిల్లు జగదాంబికకు నమస్కారము.
సృష్టి, స్థితి,లయలను తన క్రీడావిలాసములుగా కొనసాగించు పరమేశ్వరికి నమస్కారము.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి *లలితాంబికా* యను ఐదక్షరముల (పంచాక్షరీ) నామ మంత్రమును *ఓం లలితాంబికాయై నమః* అని ఉచ్చరించుచూ, అత్యంత భక్తి శ్రద్ధలతో ఆ జగన్మాతను ఆరాధించు భక్తులను, ఆ పరమేశ్వరి అనంతజ్ఞానసంపన్నులుగను, అచంచలమైన ధ్యానదీక్షాపరులుగను, ధర్మబద్ధులుగను ప్రవర్తిల్లజేసి తరింపజేయును.
శ్రీలలితా సహస్ర నామావళి యందలి మొదటి మూడు నామములు శ్రీమాత యొక్క సృష్టిస్థితిలయలు చేయునదిగా చెప్పి ఆ తరువాత అమ్మవారు *పంచకృత్యపారాయణ* గా తెలియజేయబడినది. సృష్టి, స్థితి, లయ, తిరోధాన, అనుగ్రహములు అనునవి పంచకృత్యములు. లలితా సహస్ర నామావళి యందలి మొదటి తొమ్మిది వందల తొంబై తొమ్మిది నామములు అమ్మవారు విశేషముగా కీర్తింపబడినది. ఈ వెయ్యవ నామము అమ్మవారి తొమ్మిదివందల తొంబైతొమ్మిది నామములలో తెలుపబడిన కార్యములన్నియు విశేష్యమయిన శ్రీమాతగా చేసిన లలితయు, మరియు అంబికయు అయిన లలితాంబిక అని అనవచ్చును. ఆ తల్లి సకలలోకములను అతిక్రమించి ప్రకాశించినది అగుటచే ఆ తల్లి లలిత అను నామము కలిగినది. ఆవరణదేవతలు అందరూ కిరణస్వరూపులు. అమ్మవారు వీరినందరినీ అతిక్రమించి పైన బిందుస్థానమునందు ప్రకాశించుచున్నదని లలిత పదమునకు అర్థము. లలిత అను శబ్దమునకే అనేకార్థములు ఉన్నవి ఆ అర్థములన్నియు ఆ పరమేశ్వరికి ఉండుటచే ఆ తల్లి *లలితాంబికా* యని అనబడినది. ఇంకను చెప్పాలంటే శోభ, విలాసము, మాధుర్యము, గాంభీర్యము, స్థైర్యము, తేజస్సు, లాలిత్యము, ఔదార్యము అనునవి పురుషులకు ఉండవలసిన లక్షణములని పెద్దలు చెప్పగా, లాలిత్యము దానితో బాటు సౌకుమార్యము స్త్రీ లక్షణములు. ఈ లక్షణములు అమ్మవారికి ఉన్నవి. అందుచే ఆ అమ్మ *లలితాంబికా* యని అనబడినది. *మనోరూపేక్షు కోదండా* యని పదియవ నామములో చెప్పియుండుటచే, ఆ అమ్మ మనస్సు చెఱకు విల్లువంటిది. అనగా అమ్మవారి విల్లు చెఱకు అయితే, ఆ చెఱకు వింటికి బాణాలు పుష్పాలు. ఈ విల్లు, ఆ బాణాలు లాలిత్యానికి ప్రతీకలు గనుక, అవి చేతబూనిన ఆ పరమేశ్వరి *లలితాంబిక* యని అనబడినది. అమ్మవారి పాదాల కాంతి సరోజములను (తామరపూలను) ధిక్కరించుటకూడా ఆ తల్లి పాదాల లాలిత్యమును తెలియజేయుటచే శ్రీమాత *లలితాంబికా* యని అనబడినది. అమ్మ స్థూలరూపము ఆ పాదమస్తకమూ సౌకుమార్యముగా వివరించబడియుండుటచే అవన్నియు లాలిత్యమునకు ప్రతీకలగుటచే పరమేశ్వరి *లలితాంబికా* యని అనదగినది. *లలితాంబిక* యనునది ఐదక్షరములు అయినను, బ్రహ్మకంఠంనుండి వెలువడిన *ఓం* కారము, మంగళమైనది గనుక, ఓంకారము లేక మంత్రం సత్ఫలితాన్ని ఇవ్వదు గనుక ఈ నామ మంత్రమునకు *ఓం* చేర్చగా, ఆ నామము ఆరక్షరాల నామ మంత్రమై *ఓం లలితాంబికా* యని అనబడినది.
జగన్మాతకు నమస్కరించునపుడు *ఓం లలితాంబికాయై నమః* అని యనవలెను.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మహాగణపతి, బాల, శక్తిపంచాక్షరీ, పంచదశీ మంత్రోపదేశము, ఆంగ్లభాషలో అనర్గళ వాక్పటిమ ప్రదాతలు, నా జీవన వృత్తికి, ప్రవృత్తికి మార్గదర్శకులైన, కుర్తాళం మౌనస్వామి వారి ప్రియశిష్యులు, నాతొలిగురువర్యులు, కీ.శే కొండాకోటయ్య మహనీయుల అనుగ్రహముతోను, ఎనిమిది నెలలు(1977లో) తన పాదసేవాభాగ్యంతో నన్ను పునీతులను చేసిన జిల్లెళ్ళమూడి అమ్మ అనుగ్రహముతోను భాస్కరరాయలు వారి సౌభాగ్యభాస్కరము, మరియు కొందరు ఆధ్యాత్మికవేత్తల వ్యాఖ్యానముల పరిశీలనతోను అక్కడక్కడ భాస్కరరాయలు వారి శ్లోకములు మరియు ఆది శంకరాచార్యుల సౌందర్యలహరి శ్లోకములు తీసుకుంటూ, నా స్వీయ వివరణతో ఈ వ్యాఖ్యాన పుష్పాన్ని జగజ్జనని ఇచ్చిన ప్రసాదంగా భావిస్తూ అందరికీ పంచుతున్నాను. ఇచ్చిన పేరాలు, శ్లోకాలు జగజ్జనని ప్రసాదపుష్పంగా భావిస్తున్నాను. ఇందులో వ్యాఖ్యాన పంక్తులు గాని, శ్లోకాలు మొదలైనవన్నియు అమ్మవారి నుండి లభించిన ప్రసాద పుష్పము యొక్క దళములుగా భావించుచున్నాను. అట్టి పుష్పమునుండి ఏమి తొలగించిననూ ఆయా దళములు త్రుంచిన దోషమవుతుంది. జగన్మాత భక్తులయిన వారు యథాతథముగా ఎంతమందికి ఈ పుష్పాన్ని పంపిననూ సంతోషమే.
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
*పసుమర్తి వేంకట దుర్గా సుబ్రహ్మణ్యం* 7702090319, 9505813235
🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹🌹
మీకు, మీకుటుంబ సభ్యులకు శుభోదయ శుభాభి వందనములు🌹🌹🌹🌹🌹🌻🌻🌻🌻🌸🌸🌸🌸💐💐💐
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి