🌹రామాయణానుభవం_ 40
జాబాలి చేసిన నాస్తిక వాదాన్ని ఖండిస్తూ సమాధానం చెబుతున్నాడు రాముడు....
మహర్షి! నాకు ప్రియం చేద్దామనే ఉద్దేశంతో నువ్వు ఇలా ప్రసంగించావు. అకార్యాన్ని కార్యంగా, అపధ్యాన్ని పథ్యంగా ప్రతిపాదించావు.
*భవాన్మే ప్రియకామార్థం వచనం యదిహోక్తవాన్.*
*అకార్యం కార్యసఙ్కాశమపథ్యం పథ్యసమ్మతమ్*
దేనిమీదా ప్రమాణబుద్ధిలేని మనిషి పాపాలు చేస్తాడు. శీల భ్రష్టుడు అవుతాడు. సమాజంలో గౌరవం కోల్పోతాడు. కులీనుడో అకులీనుడో - కులంతో ప్రమేయం లేదు. ధీరుడో భీరువో - దానితోనూ నిమిత్తం లేదు. వాడు శుచియా అశుచియా (మంచివాడా? చెడ్డవాడా?) అనేది వాడి శీలమే చాటిచెబుతుంది.
లోకం కన్నుగప్పి దుర్జనుడు సజ్జనుడుగా చెలామణి కావాలనుకుంటే ఆ అభినయం సాగదు.
కార్యాకార్య విచక్షణులు
ఉంటారు. వారు పసిగట్టి నిందిస్తారు. నువ్వు చెప్పినట్టుగా పరోక్షాన్ని వెనక్కు పెట్టి, ప్రతిజ్ఞను విడిచిపెట్టి నేను లోకానికి ఏమి ఉపదేశం ఇవ్వగలను? ఎవరికి ఆదర్శంగా నిలవగలను? స్వర్గం పొందగలనా? లోకులు స్వతంత్రులు. రాజునుబట్టే వారి నడవడికా ఉంటుంది. రాజులు ఎలా ఉంటే ప్రజలు అలా ఉంటారు.
సత్యమే సనాతనం. సత్యమే రాజవృత్తం. అంచేత రాజ్యమంటే సత్యస్వరూపం, సత్యంలోనే లోకం బతుకుతోంది (సత్యే లోకః ప్రతిష్ఠితః). ఋషులూ దేవతలూ సత్యమే గొప్పదన్నారు. సత్యవాదికే గౌరవమన్నారు. అదే పరమ ధర్మం. అదే స్వర్గ హేతువు. సత్యమే పరమేశ్వరుడు. అన్నీ దానిమీద ఆధారపడినవే. సత్యంకన్నా గొప్పది మరొకటి లేదు. యజ్ఞాలూ యాగాలూ దానాలూ, ధర్మాలూ, వేదాలూ తపస్సులూ అన్నీ సత్యప్రతిపాదకాలే. కాబట్టి
సత్యపరులం కావాలి.
బ్రతికున్నంతసేపూ భూమి, కీర్తి, యశస్సు, లక్ష్మి ఇవన్నీ పురుషుణ్ని ప్రలోభపెడతాయి. పరలోకానికి ఉపకరించేదీ అక్కడ నిన్ను సేవించేదీ సత్యం ఒక్కటే.
సత్యము, ధర్మము, పరాక్రమము, భూతదయ, ప్రియ వక్తృత్వము, ఆతిథిపూజ - ఇవ్వి స్వర్గప్రాప్తికి సోపానాలని పెద్దలు
చెబుతున్నారు.
వారే పూజ్యులు, వారే పెద్దలు - అని రాముడు రోషంగా మాట్లాడాడు.
రఘురామా ! నేను నాస్తికుణ్ని కాను. నాస్తిక వచనాలు చెప్పను. కానీ సమయాన్ని సమీక్షించి నేను ఆస్తికుణ్నీ ఇప్పుడు ధర్మసంకట పరిస్థితి వచ్చింది. అందుకని నిన్ను రాజ్యానికి మరల్చడం కోసం నాస్తిక వచనాలు పలికాను. అంతే సుమా - అన్నాడు జాబాలి
*న చాపి కాలోయ ముపాగతశ్శనైర్యథా మయా నాస్తికవాగుదీరితా.*
*నివర్తనార్థం తవ రామ కారణాత్ ప్రసాదనార్థం చ మయైతదీరితమ్*
రామునికి కోపం వచ్చిందని వసిష్ఠుడూ గ్రహించాడు. రామా ! జాబాలికి అన్నీ తెలుసు. కేవలం నిన్ను మరల్చడానికే ఇలా మాట్లాడాడు.శాంతించు రామచంద్రా అన్నాడు విశిష్టుల వారు......
**
జాబాలి చేసినది నాస్తిక వాదం కాదని ,రాముణ్ణి శాంతిప చేసాడు వశిష్ఠుడు.
ఒక్కసారి నీ వంశచరిత్రను గుర్తు తెచ్చుకో. ఎంతటి మహానుభావులు అయోధ్యను పరిపాలించారో గమనించు అంటూ మొత్తం వంశక్రమాన్ని తెలియజేశాడు.
రామా! ఈ భూమండలమును వైవస్వతమనువు ఇక్ష్వాకువున కిచ్చినాడు. ఇక్ష్వాకువు అయోధ్యకు మొదటి రాజు. *ఇక్ష్వాకు వంశక్రమము*
ఇక్ష్వాకు, కుక్షి , వికుక్షి , బాణుడు, అనరణ్యుడు, పృథు, త్రిశంకువు, దుందుమారుడు, మాంధాత,
సుసంధికి ఇద్దరు కొడుకులు ధ్రువసంధి ,ప్రసేనజిత్తు
ధ్రువసంది కొడుకు
భరతుడు , అసితుడు, సగరుడు, అసమంజుడు, అంశుమంతుడు, దిలీపుడు, భగీరథుడు , కుకుత్సుడు, రఘువు , ప్రవృద్ధుడు , శంఖణుడు, సుదర్శనుడు, అగ్నివర్ణుడు , శీఘ్రగుడు, మరువు, ప్రశుశ్రుకుడు, అంబరీషుడు, సహుషుడు,
నాభాగుడు కి ఇద్దరు కుమారులు అజుడు ,సుప్రతుడు
అజుడి కొడుకు
దశరథుడు
రామా! వంశక్రమేణ ఈ రాజ్యము దశరథునికి సంక్రమించినది. ఆ దశరథుడికి రాముడు అను పేరుగల జ్యేష్ఠపుత్రుడు గా ఉన్నావు.
ఇక్ష్వాకువంశంలో జ్యేష్టుడే మహారాజు.నువ్వు
ఉండగా కనిష్ఠుడికి పట్టాభిషేకం ఎలా జరుగుతుంది? ఈ సనాతన ధర్మాన్ని వంశాచారాన్నీ భంగపరచకు. దశరథుడిలాగే ధర్మబద్ధంగా సమృద్ధమైన ఈ సామ్రాజ్యాన్ని పరిపాలించు.
*స రాఘవాణాం కులధర్మమాత్మనః సనాతనం నాద్య విహన్తుమర్హసి.*
*ప్రభూతరత్నామనుశాధి మేదినీం ప్రభూతరాష్ట్రాం పితృవన్మహాయశః*
పుట్టిన ప్రతిమనిషికీ ముగ్గురు గురువులుంటారు- తల్లి, తండ్రి, ఆచార్యుడు.
తండ్రి జన్మనిస్తే అచార్యుడు ప్రజ్ఞను ఇస్తారు. అందుకే గురువు అయ్యాడు. నేను నీ తండ్రికీ నీకూ గురువును. నేను చెప్పినట్టు చెయ్యి. గురువుగారి ఆజ్ఞను తిరస్కరించకూడదు అనే మాటకు అనుగుణంగా వర్తించు. నాయనా! ఈ సభాసదులెవ్వరూ సన్మార్గాన్ని విడిచిపెట్టినవారు కారు. నీ తల్లిమాటనైనా ఆలకించు. యాచిస్తున్న భరతుడి మాటను చెల్లించి నీ ధర్మాన్ని నువ్వుపాలించు.
వసిష్ఠులవారు మృదువుగా మధురంగా ఎంతగానో నచ్చజెప్పారు. అయినా రాముడు అంగీకరించలేదు.
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి