30, ఏప్రిల్ 2022, శనివారం

 🌹రామాయణానుభవం_ 38


తండ్రి మరణ వార్త విని రాముడు మూర్ఛపోయాడు.సోదరులు ముగ్గురూ విలపిస్తున్నారు.సీత దుఃఖిస్తోంది. కొంతసేపటికి తెలివి తెచ్చుకున్న రాముడు...


వనవాసం ముగిసినా నేనింక అయోధ్యకు రాలేను. ఏమి ఉందని అయోధ్యకు రావాలి ! అక్కడ ఎవరు నన్ను ఓదారుస్తారు ! సీతా ! మీ మామగారు వెళ్ళిపోయారు. లక్ష్మణా! తండ్రిలేనివాడవయ్యావు. ఎంత దుఃఖవార్త చెప్పాడో చూడు ఈ భరతుడు - అంటూ విలపించాడు. మధ్య మధ్యలో సీతను తానే ఓదార్చాడు. తర్పణాలకు కావలసిన సంభారాలు తీసుకొని నదీతీరానికి సీతను ముందు నడవమన్నాడు. లక్ష్మణుణ్ని అనుసరించమన్నాడు. ఆ వెనక్కాల తాను బయలుదేరాడు. తండ్రిని తలుచుకుంటూ మందాకినికి చేరుకున్నాడు. అందరూ దక్షిణాభిముఖంగా నిలిచి తర్పణాలు విడిచిపెట్టారు. రాముడు దోసిట్లోకి నీళ్ళు తీసుకుని - తండ్రీ! రాజశార్దూలా ! నేను ఇస్తున్న ఈ విమల జలతర్పణం పితృలోకంలో నీకు చెందుగాక- అక్షయమగుగాక అని వదిలిపెట్టాడు.


ఇంగుదీబదరీ మిశ్రితమైన పిండాన్ని దర్భలమీద వదిలిపెట్టాడు. తండ్రీ! సంప్రీతుడవై ఇది భుజించు. మేము తింటున్నదే నీకు పెట్టాము. యదన్న: పురుషో భవతి తదన్నాస్తస్య దేవతాః అన్నారు కదా ! అంటూ రోదించాడు.


అందరూ మళ్ళీ పర్ణశాలకు చేరుకున్నారు. బోరున విలపించారు. ఆ రోదన ధ్వనులు అడవిలో మారుమ్రోగాయి భరతుడు రాముణ్ని కలుసుకున్నాడని సైనికులు గ్రహించారు. రాముణ్ని చూడాలని ఆశ్రమంవైపు పరుగులు తీసారు. రథాశ్వగజసైన్యమంతా రామాశ్రమం చేరుకుంది. అందరి ముఖాల్లోనూ కన్నీరే. రాముడు అందరినీ కౌగిలించుకున్నాడు. తండ్రిలా తల్లిలా ఆలింగనం చేసుకున్నాడు.


వసిష్ఠుడు ముందుండి రాజమాతలను తీసుకువస్తున్నాడు. మందాకినీ నదీతీరం చేరారు. ఈ నదీజలాలనే నీ కుమారుడు నా కుమారుడికోసం రోజూ తీసుకువెడుతూ ఉంటాడు కాబోలు అని కౌసల్య సుమిత్రతో అంది. దర్బలపై ఉంచిన పిండం చూసారు. ఇది రాముడు దశరథుడికి ఇచ్చింది. అంతటి మహారాజు నేలపై పెట్టిన ఇంగుదీ పిండాన్ని తినవలసి వచ్చిందా అని విలపించింది


ఆశ్రమం చేరుకున్నారు. సర్వభోగాలూ విడిచిపెట్టి తపస్విలా ఉన్నరాముణ్ణి చూస్తూనే రాజమాతలందరూ భోరున దు:ఖించారు. రాముడు అందరినీ ఓదార్చి పాదాభివందనం చేసాడు.


భరతా ! రాజ్యం వదిలిపెట్టి జటాజినధారివై ఈ అరణ్యానికి నువ్వు ఎందుకు వచ్చావో తెలుసుకోవాలని అన్నాడు రాముడు. భరతుడు నమస్కరించి సమాధానం చెప్పాడు


తండ్రిగారు పుత్రశోకంతో స్వర్గస్థులయ్యారు. నా తల్లి కైకేయివల్ల ఈ మహాపాపం జరిగింది. నరకానికి పోతుంది. నేను నీకు దాసుణ్ని. పట్టాభిషిక్తుడివై నన్ను అను గ్రహించు. ఈ తల్లులూ ఈ ప్రజలు అందరూ ఇందుకోసమే నీ దగ్గరకు వచ్చారు వంశక్రమాన్నీ ధర్మాన్ని ఆలోచించి అంగీకరించు. రాజ్యం గ్రహించి అనుగ్రహించు. భూదేవికి వైధవ్యం తప్పించు. ఈ మిత్రులందరితోనూ కలిసి నేను శిరసువంచి యాచిస్తున్నాను. నేను నీ శిష్యుణ్ని, నీ దాసుణ్ని, అనుగ్రహించు. పితృపితామహులనుంచీ అనుసరించి వస్తున్న ఈ పూజ్యులైన మంత్రిమండలి ప్రార్థనను తిరస్కరించకు.


భరతా ! నీవంటి ఉత్తముడు రాజ్యం కోసమని పాపం ఎలా చేస్తాడు ! నీవల్ల రవ్వంతకూడా దోషంలేదు. బాల్యంవల్ల నిందిస్తున్నావు కానీ కైకేయికూడా నింద్యురాలు కాదు. తండ్రిమీద నీకు ఎలాంటి గౌరవం ఎంతకాలం ఉంటుందో అలాంటి గౌరవమే అంతకాలమూ తల్లిమీదకూడా ఉండాలి. ధర్మశీలురైన తల్లిదండ్రులు ఇద్దరూ నన్ను అడవులకు పొమ్మన్నారు. నేను మరొకలా ఎలా చేస్తాను. నువ్వు అయోధ్యలో రాజ్యం చెయ్యాలి. నేను వల్కలాలు ధరించి అడవిలో ఉండాలి - ఇలా విభాగంచేసి ప్రజలందరి ఎదుటా నియమించి మహారాజు దివంగతుడయ్యాడు. 


ధర్మాత్ముడైన మహారాజు లోకగురువు. ఆయనే ప్రమాణం తండ్రి విభాగించి ఇచ్చింది ఇచ్చినట్టు స్వీకరించి అనుభవించడం మన కర్తవ్యం. నన్ను పధ్నాలుగేళ్ళు అరణ్యవాసం చెయ్యమన్నాడు అదే పరమాత్మకుకూడా ఇష్టమని విశ్వసిస్తున్నాను.


సూర్యాస్తమయ మయ్యింది. దుఃఖంతోనే రాత్రి గడిచిపోయింది.....


**

ఉదయం చేయవలసిన కృత్యాలు అన్నీ పూర్తి చేసుకొని  భరత శత్రుజ్ఞ వసిష్ఠులు అందరూ నిశ్శబ్దం గా ఉన్నారు...


కొంతసేపటికి భరతుడు


అన్నయ్యా ! మా అమ్మ నాకు ఇచ్చిన రాజ్యాన్ని నేను నీకు ఇచ్చేస్తున్నాను. అకంటకంగా పరిపాలించు. దీన్ని పరిపాలించే శక్తి నాకు లేదు. నువ్వుతప్ప మరొకడు సమర్థుడు కాదు. నీ పద్ధతిని నేను ఆనుసరించలేను. గుర్రాన్ని గాడిద  అనుసరించలేదు గరుత్మంతుణ్నీ పక్షి అనుసరించలేదు. ఎల్లప్పుడూ ఇతరులకు ఉపయోగపడుతాడో వాడి బ్రతుకు ధన్యం.  తాను నాటినమొక్కే పెరిగి పెద్దదయి మహావృక్షమై నాటినవాడికి అందకుండా పోతుంది. దాని పువ్వులూ పండులూ అతడి అనుభవానికి రావడంలేదు. ఇప్పటి పరిస్థితికి ఇది ఉపమానం. నువ్వు అర్ధంచేసుకోగలవు. 


ఆదిత్యుడిలాగా నువ్వు సింహాసనం మీద ఉంటే నీ వెనకాల మేమంతా మధించిన కుంజరాలుగా ఆదతాం. అంతపురస్త్రీు అనందిస్తారు. ప్రజలంతా సంతోషిస్తారు.(మొక్క నాటినవాడు దశరథుడు, మహావృక్షం రాముడు. పువ్వులూ పండ్లూ అభిషేక పరిపాలనలు) 


భరతుడి బాధను రాముడు గుర్తించాడు. దుఃఖాన్ని ఓదార్చాడు. ఆ ఆత్మజ్ఞాని గంభీరంగా ప్రసంగించాడు.


తమ్ముడూ ! మానవుడు దేనికి కర్తకాడు. అస్వతంత్రుడు. ఇతణ్ని ఎల్లవేళలా యముడు లాగుతూనే ఉంటాడు. నిధులు నశించిపోతాయి. ఎదుగుదలలు పతనమై పోతాయి. సంయోగాలు వియోగాలతో ముగుస్తాయి. జీవితానికి మరణమే ముగింపు.


ముగ్గిన ఫలాలకు రాలిపడటమొక్కటే భయం. పుట్టిన మనిషికి మరణమొక్కటే భయం. గట్టిగా కట్టిన ఇల్లు క్రమ క్రమంగా ఎలా శిధిలమవుతుందో శరీరంకూడా అలాగే జరామృత్యువులతో విశీర్ణం అయిపోతుంది. గ్రీష్మంలో సూర్యకిరణాలు నీటిని హరించినట్టు అహోరాత్రాలు ప్రాణుల ఆయుర్దాయాన్ని హరిస్తాయి. 


నిలబడినా నడుస్తున్నా ఆయుర్దాయం క్షీణిస్తూనే ఉంటుంది. నిన్ను నువ్వు తెలుసుకో. నీకోసం నువ్వు దుఃఖించు. పరితపించు. ఇతరుల గురించి ఎందుకు? జీవి మృత్యువుతోనే తిరుగుతూంటాడు మృత్యువుతోనే కూర్చుంటాడు. సుదీర్ఘంగా ప్రయాణంచేసి చిట్టచివరికి మృత్యువుతోనే నిష్క్రమిస్తాడు. 


ఈ మనుష్యులు సూర్యుడు ఉదయిస్తే సంతోషిస్తారు. అస్తమిస్తేనూ సంతోషిస్తారు. కానీ తమ జీవితం క్షయించిపోతోందని మాత్రం తెలుసుకోలేరు. కొత్తకొత్తగా ఋతువులు వస్తూంటే సంబరపడిపోతారే కానీ తమ ఆయుర్దాయం గడిచిపోతోందని గమనించరు


మన తండ్రి ధర్మాత్ముడు. రాజ్యాన్ని ధర్మబద్ధంగా పరిపాలించాడు. నిండు జీవితం గడిపాడు. యజ్ఞయాగాదులు చేసాడు.


పాపాలు తొలగించుకున్నాడు. స్వర్గానికి వెళ్ళిపోయాడు. జీర్ణదేహాన్ని విడిచిపెట్టి బ్రహ్మలోక విహారిణి అయిన దైవీ సమృద్ధిని పొందాడు. ఆయనగురించి దుఃఖించకూడదు. నీవంటి బుద్ధిమంతుడూ పండితుడు అసలు దు:ఖించకూడదు. ఇటువంటి అనేకదుఃఖాలు అన్నివేళలా ఎదురవుతుంటాయి. నీవంటి ధీరులూ ధీమంతులూ వీటిని పట్టించుకోకూడదు. వదిలెయ్యాలి స్వస్థత పొందు. దుఃఖం తొలగించుకో. అయోధ్యకు వెళ్ళు. తండ్రి ఆజ్ఞను పాటించు. నేనూ అంతే. తండ్రి శాసనాన్ని శిరసావహించి నెరవేరుస్తాను. దాన్ని తిరస్కరించడం నాకు న్యాయం కాదు. నీకూ న్యాయంకాదు. ....

కామెంట్‌లు లేవు: