30, ఏప్రిల్ 2022, శనివారం

 🌹రామాయణానుభవం_ 36


ఆ రాత్రి గుహుడు భరతుడు సంభాషిస్తూ ఉన్నారు....

భరతుడు సీత రామ లక్షణుల గురించి అనేక రకాల ప్రశ్నలు వేసాడు....ఎక్కడ పడుకొన్నారు? ఏమేమి భుజించారు? వాటికి అన్నిటికీ గుహుడు తగిన విధం గా సమాధానము చెప్పాడు.....


*ధన్యః ఖలు మహాభాగో లక్ష్మణ శ్శుభలక్షణః*

*భ్రాతరం విషమే కాలే యో రామ మనువర్తతే.*

*సిద్ధార్థాఖలు వైదేహీ పతిం యా నుగతా వనమ్*


ఆహా సీతారాములకు ఎంతటి కష్టమును తెచ్చి పెట్టితిని! నా వంటి పాపి వేరొక్కడుండడు లక్ష్మణుడు ఎంతో ధన్యుడు. కష్టకాలమున రాముని వెంబడి ఉన్నాడు. భర్తను అనుసరించి

అరణ్యమునకు వచ్చిన సీతాదేవి సైతము ఎంతో ధన్యురాలు....


తెల్లవారింది. భరతుడు ముందుగా లేచాడు. శత్రుఘ్నుణ్ని మేల్కొల్పాడు. మన సైన్యాన్ని గంగ దాటిస్తాడు గుహుణ్ని పిలవ మన్నాడు. 


రాత్రి నేను నిద్రపోయానో. మేల్కొని ఉన్నానో తెలియడం లేదు. రాముణ్నే తలుచుకుంటూ గడిపేసాను- అని భరతుడు మాట్లాడుతూండగానే గుహుడు వినయంగా నమస్కరించాడు భరతుడు  గంగను దాటించమని అడిగాడు.....


వెంటనే ఐదు వందల నావలు సిద్ధమయ్యాయి. ఒక నావ గుహుడు స్వయం గా తెచ్చాడు భరతశత్రుజ్ఞుడు,ముగ్గురు రాణులు వశిష్ఠ పురోహితులు ఆ నావ ను అధిరోహించారు .ఇంకా మిగిలిన వారు కొంతమంది ఈదుకుంటు,కొంత మంది కుండలు లాంటివి కట్టుకొని ఈ దుతూ అవతలి ఒడ్డుకు చేరారు.


మొత్తం అందరూ క్షేమంగా అవతలి గట్టు ఎక్కారు. ప్రయాణం సాగించి ప్రయాగవనం చేరుకున్నారు. భరద్వాజాశ్రమానికి క్రోశం దూరంలో సైన్యాన్ని ఆపి భరతుడు అస్త్రశస్త్రాలు విడిచి తెల్లని వస్త్రాలు ధరించి తన మంత్రులతో పురోహితులతో కలిసి నడిచి వెళ్ళాడు. వసిష్ఠులవారు ముందు నడిచారు. కొంతదూరం వెళ్ళాకమంత్రుల్ని కూడా ఆగిపొమ్మని తానొక్కడే వసిష్ఠునివెంట ఆశ్రమంలో కి వెళ్ళారు.


వసిష్ఠుణ్ని చూస్తూనే భరద్వాజుడు లేచి ఎదురు వచ్చాడు. శిష్యుల్ని అర్ఘ్యపాద్యాలు తెమ్మన్నాడు. తనకు సమస్క రిస్తున్న భరతున్న దశరధుడి కొడుకుగా గుర్తుపట్టాడు. అతిథిపూజలూ, మర్యాదలూ, కుశల ప్రశ్నలు అయ్యాయి.


రాజ్యం ఏలుకునే వాడివి. నువ్వు ఇటు రావడానికి పని ఏమిటి?


స్త్రీ కారణంగా నీ తండ్రి రాముణ్ని అడవులకు పంపేసాడు గదా ! పధ్నాలుగేళ్ళు వనవాసం చెయ్యమన్నాడట! ఆ రాజే

సౌమిత్రికీ ఇంకా అపకారం చేద్దామనీ రాజ్యాన్ని అకంటకం (శత్రురహితం) చేసుకుందామనీ నువ్వు బయలుదేరావా ఇప్పుడు?


ఈ ప్రశ్నలకు భరతుడు కదిలిపోయాడు. కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. నిబ్బరించుకుని నోరు విప్పాడు


భగవన్! తమరుకూడా నన్ను ఇలాగే భావిస్తే హతోఽస్మి. నాపట్ల ఏ దోషమూ లేదు. దయచేసి నన్నిలా శిక్షించ నేను లేనప్పుడు మా తల్లి చేసిన దానికి అన్నదానికి నేను బాధ్యుణ్ని కాను. వాటిని నేను సమ్మతించడం లేదు. రాముడి పాదాలకు నమస్కరించడానికి, అయోధ్యకు తిరిగి తీసుకువెళ్ళడానికి బ్రతిమాలుకోవడానికీ నేను బయలుదేరాను.

నన్ను నమ్మండి. కోపం విడిచిపెట్టి అనుగ్రహించండి. మహారాజయిన రాముడు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో దయతో నాకు తెలియజెయ్యండి.


భరతా! చాలా సంతోషంగా ఉందయ్యా! రఘువంశంలో పుట్టిన నీకు ఇది తగును. నీ మనస్సు నాకు ముందే తెలుసు అయితే దాన్ని దృఢపరచడానికి అన్నాను అంతే. నీ అన్నగారు చిత్రకూటపర్వతం మీద ఉంటున్నాడు. రేపు ఆక్కడికి వెడుదురుగాని ఈ రాత్రికి నువ్వూ నీ మంత్రులూ సైన్యమూ ఇక్కడే విడిది చెయ్యండి.......

**


భర్వాద్వాజుని ఆజ్ఞ మేరకు భరతుడు కౌసల్య సుమిత్ర కైకేయి ఇతర మంత్రి పురోహితులు సైన్యం  అంత ఆ రాత్రి భారద్వాజాశ్రమం లో విడిది చేశారు.


భరద్వాజుడు తన తపశ్శక్తితో రాజభవనం సృష్టించాడు. అందులో రాజసింహాసనం కూడా ఉంది. భరతుడు మంత్రి పురోహితులతో ప్రవేశించాడు. రాజసింహాసనానికి ప్రదక్షిణం చేసి రాముణ్ని తలుచుకుంటూ నమస్కరించాడు. దానికి సమీపంలో ఉన్న మంత్రి పీఠం మీద కూర్చుని సింహాసనానికి వింజామరలు వీచాడు అదే తపశ్శక్తితో ఆ మహర్షి మొత్తం సైన్యానికి అత్యద్భుతమైనవిందు ఇచ్చాడు. గజాశ్వాలతో సహా కోరుకున్నది కోరుకున్నంతగా లభించింది. 

మద్యాలేమిటి మాంసాలేమిటి ఫలాలేమిటి- అన్నీ పుష్కలంగా లభించాయి. అప్సరసలు ఒక్కొక్క వ్యక్తి దగ్గర ఏడెనిమిది మంది నిలబడి కొసరి కొసరి  వడ్డించి తినిపించారు. వింజామరలతో గీతవాద్య నృత్యాలతో అలరించారు.

 (ఇదే 'భరద్వాజ విందుగా' ప్రసిద్ధికెక్కింది.) అయోధ్యా లేదు. అరణ్యమూ లేదు- ఇక్కడే ఉండిపోతాం. రామభరతులకు జయమగుగాక అంటూ సైనికులు కేరింతలు కొట్టారు. అందరికీ అదొక స్వప్నంలా అనిపించింది. నందనవనంలో దేవతలలాగా ఆనందించారు. రాత్రి క్షణంలో గడిచిపోయింది. అప్సరసలు భరద్వాజుడి దగ్గర సెలవు తీసుకొని వెళ్లిపోయారు.


తెల్లవారుతూనే భరతుడు భరద్వాజుడి దర్శనానికి వెళ్ళాడు. అగ్నిహోత్రం నిర్వహించి ఆ మహర్షి తన పర్ణశాలనుంచి ఇవతలకు వచ్చాడు. తమరు ఆనుమతిస్తే ఇక బయలుదేరతాను. రాముణ్ని చేరుకోవాలి, దయచూడండి. రాముడి ఆశ్రమం ఇక్కడికి ఎంతదూరమో, ఏది మార్గమో సెలవివ్వండి- అని భరతుడు ప్రార్ధించాడు. మహర్షి సవివరంగా చెప్పాడు.


బయలుదేరబోతూ కౌసల్యాసుమిత్రలు వచ్చి మహర్షికి పాదాభివందనం చేసారు. తన కోరిక తీరకపోగా, లోక గర్తితురాలైన కైకేయి సిగ్గుపడుతూనే మహర్షికి సాష్టాంగపడి ప్రదక్షిణంగా వచ్చి భరతుడి వెనక్కాల దీనంగా నిలబడింది. ఈ తల్లులలో ఎవరు ఎవరో తెలియగోరాడు మహర్షి


శోకంతో ఉపవాసాలతో చిక్కి శల్యమైపోయిన ఈ దీనురాలు- ఈ దేవత - పట్టమహిషి పురుషోత్తముడు  అయిన రాముని కన్నతల్లి, కౌసల్యాదేవి. ఆమె ఎడమబుజాన్ని ఆనుకుని వాడిపోయిన పువ్వులా ఉన్నదేవి- సుమిత్ర మహావీరులూ పత్యవరాక్రములూ అయిన లక్ష్మణశత్రుఘ్నులకు జన్మనిచ్చిన భాగ్యశాలిని. రామలక్ష్మణుల వనూసానికీ, దశరథుడి ప్రాణత్యాగానికి కారణభూతురాలై అహంకారమూ ఐశ్వర్య కామమూ మూర్తీభవించిన దుష్టురాలు ఈమె కైకేయి. ఈవిడే నా తల్లి, నా దుఃఖానికి మూలకారణం. పాపాత్మురాలు- అంటూ భరతుడు గద్గదస్వరంలో వివరించాడు. అతడి కళ్ళు ఎరుపెక్కాయి ఆయాసపడుతున్నాడు. అలిగిన పాములా బుసకొడుతున్నాడు.


భరతా! కైకేయిని దోషిణిగా చూడకు. రామవనవాసం శుభదాయకమే అవుతుంది. - అని ధైర్యం చెప్పి సాగనంపాడు భరద్వాజుడు.


చిత్రకూటంవైపు ప్రయాణం సాగింది. భరతుడి మనస్సు తేలికపడింది. కొంత దూరం ప్రయాణించిన తరవాత- భరద్వాజుడు వర్ణించి చెప్పిన ప్రకృతి దృశ్యాలు కనిపించడంతో ఇదే చిత్రకూటమని భరతుడు నిర్ధారణకు వచ్చాడు వసిష్ఠులవారితో అదే అన్నాడు. ఆ వనం అయోధ్యలా భాసించింది భరతుడి కంటికి. సైన్యాన్ని విడిది చేయించాడు.


అల్లంతదూరంలో కొందరికి పొగ కనిపించింది. మనుష్యులు లేనిదే అగ్ని ఉండదు. అగ్ని లేనిదే పాగరాదు కాబట్టి రామలక్ష్మణులు అక్కడ ఉండి ఉంటారు అనుకున్నారు. లేదా మరెవరైనా తపస్వులు ఉండి ఉండవచ్చు

సైనికులారా! మీరంతా ఇక్కడే ఆగిపొండి, నేనూ వసిష్ఠుడూ సుమంత్రుడూ వెడతాం- అని భరతుడు ఆజ్ఞాపించి ఆ

పొగవైపే చూస్తూ నడక సాగించాడు......

కామెంట్‌లు లేవు: