30, ఏప్రిల్ 2022, శనివారం

 🌹రామాయణానుభవం_ 37


చిత్రకూట పర్వతం సమీపం లో సైన్యాన్ని ఆపి  భరతుడు విసిష్ఠుడు సుమంత్రుడు కొంత మంది అనుచరులతో చిత్రకూటం వైపు నడవ సాగారు...


ఆ పర్వతంమీద, ఆ వనంలో శచీదేవేంద్రులలాగా నివసిస్తున్నారు సీతారాములు. సీతా!రాజ్యం పోయిందని కానీ, మిత్రులు లేకపోయారనిగానీ నా మనస్సు బాధపడడం లేదు. ఈ గిరిసౌదర్యం ఈ వనసౌందర్యం అన్నింటినీ మరిపిస్తున్నాయి. మరీ మురిపిస్తున్నాయి. 


స్నానాదులు ముగించి సీతారాములు ఆ కొండచరియలో ఒకచోట కూర్చున్నారు. అంటు అంతలో కీ సైన్యఘోష వినిపించింది. ఆకాశంలో కి రేగిన దుమ్ము కనిపించింది. భయపడిన మృగాల అరుపులు వినిపించాయి. లక్ష్మణా ఆ శబ్దం ఏమిటి త్వరగా చూసిరమ్మన్నాడు రాముడు.


అన్నయ్యా ! నువ్వు కవచం ధరించు. ధనుస్సును సంధించు అంటూ చెట్టుమీదనుంచే పెద్దగా అరిచాడు.ఆ సైన్యం ఎవరిదో గమనించమన్నాడు రాముడు. అప్పటికే లక్ష్మణుడు కోపంతో మండిపోతున్నాడు. సర్వసైన్యాన్నీ బూడిదచెయ్యగలిగిన అగ్నిలాగా ప్రజ్వరిల్లుతున్నాడు.


సంపన్న రాజ్యానికి పట్టాభిషిక్తుడై కైకేయి కొడుకు భరతుడు మనల్ని చంపడానికి వస్తున్నాడు. అదిగో కోవిదారధ్వజంతో అతడి రథం, గజాశ్వరథ పదాతి సైన్యం అదిగో. ఎవడికోసం మనకు ఈ అరణ్యవాసం సంప్రాప్తమయ్యిందో ఆ భరతుడు - మన శత్రువు- దొరికాడు. వీడు వధ్యుడు. భరతుణ్ని చంపడంలో ఏ దోషమూ లేదు. మనకు పూర్వాపకారి. అతణ్ని చంపడం అధర్మం కానేకాదు. పైగా ఇప్పుడు ఇలా అధర్మపరుడయ్యాడు. వీడు చస్తే మొత్తం రాజ్యం నువ్వే ఏలుకుందువుగాని, నేనే వీణ్ని సంహరిస్తాను.రాజ్య కాముకు రాలైన కైకేయి కి దుఃఖం రుచి చూపిస్తాను. అసలు కైకేయిని కూడా చంపేస్తాను. దాన్ని దాని నేస్తాలనూ బంధువులనూ చంపేస్తాను. ఈ భూమికి పట్టిన కాలుష్యం తొలగిస్తాను. ఇన్ని రోజులూ నాలోనే అణచుకున్న కోపాగ్నిని శత్రుపైన్యాలమీదకు విరజిమ్ముతాను. ఈ అడవి అంతా శత్రురక్తప్రవాహాలతో తడుపుతాను. నా చేతిలో చచ్చి పడిన ఏనుగుల్నీ గుర్రాల్ని భటుల శరీరాల్నీ ఈ అడవి జంతువులు వీక్కుతింటాయి. ససైన్యంగా భరతుణ్ని చంపి నా ధనుర్బాణాల ఋణం తీర్చుకొంటాను.....


లక్ష్మణుడు కోపంతో ఊగిపోతున్నాడు. రాముడు చల్లార్చి ప్రశాంతంగా నచ్చచెప్పాడు లక్ష్మణా ! భరతుడే స్వయంగా వస్తే ధనుస్సుతో పని ఏముంది? భరతుణ్ని సంహరించి ఆ అపవాదుతో పాందే రాజ్యం

నాకెందుకు? బంధువులు మిత్రులూ నాశనం పొందాక లభించే ద్రవ్యం విషంలాంటిది. అటువంటిదాన్ని నేను స్వీకరించను ధర్మార్థకామాలూ రాజ్యమూ ఏదయినా మీకోసం మాత్రమే నేను కోరుకొనేది. నేను రాజ్యంచేస్తే అది కేవలం మీ సుఖంకోసమే అధర్మంతో మొత్తం భూగోళమే నాకు కైవసమయినా, ఇంద్రపదవి లభించినా అవి నాకు వద్దు. మీ ముగ్గురూ లేని ఏ సుఖమూ నాకు వద్దు. భరతుడు నాకు ప్రాణప్రియుడు. వంశధర్మం తెలిసినవాడు. మనం తాపసులమయ్యామనీతెలిసి చూడటానికి వస్తున్నాడని నా అభిప్రాయం. 


భరతుడిది స్నేహంతో నిండిన మనస్సు. శోకంతో నిండిన హృదయం. మనల్ని చూడటానికే వస్తున్నాడు. మరొకటి కానేకాదు. తనతల్లి చేసిన పనిని నిందించి, పరుషంగా మాట్లాడి, తండ్రిని అనునయించి ఇటు వస్తున్నాడు. రాజ్యం నాకు ఇవ్వడానికే వస్తున్నాడు. మనస్సులో కూడా మనపట్ల అప్రియం ఆచరించడు. ఎప్పుడయినా నీకు అప్రియం చేసాడా? ఎందుకని ఇప్పుడు భరతుడికి భయపడుతున్నావు? శంకిస్తున్నావు? నిష్ఠురంగా మాట్లాడకు. అప్రియంవలకకు. భరతుణ్ని అంటే నన్ను అన్నట్టే. ఎంత ఆపదవచ్చినా పుత్రులు తండ్రిని చంపుతారా?, ప్రాణంతో ప్రాణమైన సోదరుణ్ని సోదరుడు చంపుతాడా?


సౌమిత్రీ! రాజ్యం కారణంగా నువ్వు ఇలా మాట్లాడుతున్నావేమో ! ఒకమాట చెబుతాను విను - రాజ్యం నీకు ఇచ్చెయ్యమని భరతుడికి చెబుతాను. తప్పకుండా ఒప్పుకుంటాడు. సరే అంటాడు

ధర్మశీలుడైన రాముడు ఇంతఘాటుగా మాట్లాడేసరికి లక్ష్మణుడు సిగ్గుపడిపోయాడు. తన శరీరంలోకి తానే కుంచించుకుపోయాడు. రాముడు గమనించాడు......

**


సైన్యాన్ని ఆపి భరతుడు శతృజ్ఞుడితో గుహుడితో మంత్రి పురోహిత లతో చిత్రకూటం మొత్తం వెతుకు తున్నాడు.


సర్వసుఖాలు విడిచిపెట్టి, అన్ని కోరికలూ పరిత్యజించి లో కనాథుడైన మా అన్న శ్రీరాముడు ఈ అరణ్యంలో నివసిస్తున్నాడు. మునిలా జీవిస్తున్నాడు. కనిపించిన వెంటనే సీతారాముల పాదాలమీద పడిపోతాను. బ్రతిమాలుకుంటాను - అని తనలో తానే మాట్లాడేసుకుంటూ, పెల్లుబుకుతున్న దుఃఖాన్ని ఆపుకుంటూ భరతుడు పరిగెడుతున్నాడు. ఎట్ట ఎదుట అపూర్వశోభతో పర్ణశాల కనిపించింది. విశాలంగా ఉంది. దర్భలతో కప్పిన యజ్ఞవేదికలా ఉంది. ధనుర్బాణాలు ఒకవైపున కనిపిస్తున్నాయి. శత్రువులకు దుర్నిరీక్షమై మృగరాజులు నివసించే గుహలా ఉంది.


ఆ పర్ణశాల నట్టనడుమ విశాలమైన వేదిక. దాని ఎట్ట ఎదుటహోమాగ్నికుండం. భరతుడు క్షణకాలం నిలబడిపరిశీలనగా చూసాడు. ఆ వేదికమీద జటామండలధారియై రాముడు కూర్చుని ఉన్నాడు. నారచీరలు ధరించి అగ్నితేజంతో విరాజిల్లుతున్నాడు. సమస్తభూమండలానికీ ప్రభువు కాదగిన ధర్మాత్ముడు- శాశ్వతుడైన బ్రహ్మలా దర్భాసనం మీద కూర్చున్నాడు సీతాలక్ష్మణులు ఇరువైపులా ఉన్నారు. భరతుడు దర్శించాడు. 


శోకమోహాలు పెల్లుబికాయి. ఆపుకోలేకపోయాడు. నావల్ల కదా ఈ మహానుభావుడికి ఈ దురవస్థ వచ్చింది అని విలపిస్తూ పరుగుపరుగున వెళ్లి కాళ్ళ మీద పడ్డాడు. ఆర్యా! ఆర్యా ! అంటున్నాడే తప్ప మరొకమాట పలకలేకపోతున్నాడు. శత్రుఘ్నుడూ అలాగే వచ్చి కాళ్ళ మీద పడ్డాడు. ఇద్దరినీ లేవనెత్తి కౌగిలించుకొని రాముడు కన్నీరు పెట్టుకున్నాడు. సుమంత్రుడూ గుహుడూ వచ్చి పాదాభివందనం చేసారు. నలుగురి ముఖాలూ కన్నీరుతో నిండాయి


ఇది చూచిన ప్రకృతికూడా విలపించింది.

రాముడు భరతుని శిరస్సు మూర్కొన్నాడు. ఒడిలో కూర్చోబెట్టుకున్నాడు. 


నాయనా! తండ్రిగారు ఎలా ఉన్నారు? నువ్వు ఇటు అడవులకు ఎందుకు వచ్చావు? తండ్రిగారు జీవించి ఉంటే నువ్వు ఇటు రావలసిన పని ఉండదే ! చాలాకాలానికి నిన్ను చూసాను. దశరథుడు క్షేమమేనా? మన కులగురువు వసిష్ఠులవారు కుశలమేనా? తల్లులు ముగ్గురూ సుఖంగా ఉన్నారా? మంత్రి పురోహితాదులను జాగ్రత్తగా చూసుకుంటున్నావా? వాళ్ళు నిద్రపోతూంటేమేల్కొల్పుతున్నావా? అర్ధరాత్రిపూట ఆర్థిక విషయాలను చర్చిస్తున్నావా? మంత్రాంగాన్ని శ్రద్ధగా కాపాడుతున్నావా? 

నీ రహస్యాలోచనలు రాజ్యంలో పొక్కడం లేదుకదా?

 తక్కువ ఖర్చుతో ఎక్కువ ప్రయోజనాలను సాధించే పనులే చేస్తున్నావా పొడిగించడం లేదుకదా? నువ్వు చేసిన మంచిపనులే తెలుస్తున్నాయా, చెయ్యబోయేవి కూడా సామంతులకు తెలిసిపోతున్నాయా? 


వెయ్యిమంది మూర్ఖుల్ని సంప్రదించడంకన్నా ఒక పండితుణ్ని సంప్రదించడం మంచిది. అదే చేస్తున్నావా? మేధావి, సమర్థుడు శూరుడు, విచక్షణుడు అయిన అమాత్యుడు ఒక్కడుంటే చాలు. రాజుకు సకలసంపదలూ చేకూర్చిపెదతాడు. ఇది గుర్తించావా ఏ పనికి ఎవరు అర్హులో గమనించి ఆ పనికి వారినే నియమిస్తున్నావా? వంశపారంపర్యంగా వస్తున్న మంత్రుల్లో శ్రేష్ఠుల్ని శ్రేష్ఠమైన

కార్యాలకే వినియోగిస్తున్నావా?


 ఐశ్వర్యమదమత్తుడై భృత్యుల్ని దూషించే శూరుణ్ని శిక్షిస్తున్నావా? లేకపోతే దెబ్బతింటావు సుమా!


వృద్ధులనూ, బాలురనూ, వైద్యులనూ ఇంకా ఇటువంటి ముఖ్యులనూ త్రికరణశుద్ధిగా గౌరవిస్తున్నావా?

 గురువృద్ధ తాపస, దేవతాదుల్ని నిత్యం నమస్కరిస్తున్నావా? ధర్మార్థకామాలను పరస్పర వైరుధ్యం లేకుండా పాటిస్తున్నావా? విభజించుకుని సకాలంలో సేవిస్తున్నావా? 

పౌరులూ జానపదులూ బ్రాహ్మణులూ నీకు సుఖం కలగాలని ఆశీర్వదిస్తున్నారా?.


రాముడు ఇలా ప్రశ్నల వర్షం కురిపించాడు. భరతుడు క్లుప్తంగా సమాధానం చెప్పాడు


అగ్రజా ! అసలు ధర్మమే లేని నాకు రాజధర్మంతో పని ఏమిటి? మన వంశంలో ఒక శాశ్వత ధర్మం ఉంది. జ్యేష్ఠుడు

ఉండగా కనిష్ఠుడు రాజు కావడానికి వీలులేదు. అందుచేత అయోధ్యకు బయలుదేరు. పట్టాభిషేకం జరిపించుకో. నువ్వు నాకు • దేవుడవు. పురుషోత్తముడవు. నేను కేకయ దేశంలో ఉండగా, నువ్వు అడవులకు రాగా మహారాజు దివంగతుడయ్యాడు.


ఈ మాట వినడం తో మొదలు నరికిన చెట్టులా ఒరిగిపోయాడు. సోదరులు ముగ్గురు విలపించారు. సీతాదేవి దుఃఖించింది......


[అయోధ్యా కాండ 100 వ సర్గ లో భరథుడిని ప్రశ్నించే నెపం తో అనేక రాజ ధర్మాలను ప్రశ్నల రూపం లో అడుగుతాడు రామచంద్రుడు.

దీనిని *కశ్చిత్ సర్గ* గా ప్రసిద్ధి.

రాజ్య పరిపాలనకు సంబందించిన అనేక విషయాలను ప్రస్తావించాడు.]

కామెంట్‌లు లేవు: