శు భో ద యం🙏
శారదా దేవి దివ్య స్వరూపం!
ఉ: " అంబ! నవాంబుజోత్పల కరాంబుజ శారద! చంద్ర చంద్రికా
డంబర చారుమూర్తి; ! ప్రకట స్ఫుట భూషణ రత్నదీపికా
చుంబిత దిగ్విభాగ , శ్రుతి సూక్తి వివిక్త నిజప్రభావ, భా
వాంబర వీధి విశ్రుత విహారిణి! నన్ గృపజూడు భారతీ!
హరివంశము- అవతారిక - ఎఱ్ఱాప్రగ్గడ ;
(నవాంబుజోజ్జ్వలయనిపాఠాంతరము)
మాత సరస్వతిని కవులందరూ స్మరించారు. కానీ , కవిత్రయంలో తృతీయుడు ఎఱ్ఱన ప్రస్తుతించిన తీరు అబ్బురమైనది.
ఆమూర్తిలోని అంతస్ఫూర్తి ,నింత గొప్పగా ఆవిష్కరించిన కవి మరియొకఁడు కానరాడు. బాహిర స్వరూపము నొక్కింత తడవుచు ఆతల్లి యక్షరామృత వితరణా శీలమును యెఱ్ఱన యీపద్యమున రూపు గట్టించినాడు.
కఠినపదములకు అర్ధము:- అంబుజము-పద్మము; ఉత్పలము-కలువ; చంద్రిక-వెన్నెల; చారు మూర్తి- మనోహరాకారము కలది; రత్నదీపిక- రత్న దీపము; చుంబిత -ముద్దిడుకొను ; శ్రుతి-వేదము; సూక్తి-మంచిమాట;
వివిక్త- విశ్లేషణ;( కాళీప్రదేశమని మరొక అర్ధముంది) భావాంబరము- మనస్సనే యాకాశము; విశ్రుత విహారిణి: ప్రసిధ్ధినొందిన విహారముగలది;
అప్పుడే వికసించిన పద్మములను,కలువలను బోలిన కరములు గలదానా! చంద్రుని వెన్నెలను బోలిన మనోహర స్వరూపిణీ! ఆభరణములందు గల దీప సదృశములగు రత్నకాంతులను దిగంత పరివ్యాప్త మొనరించుదానా! వేదవాక్యములయందు నిరూపింపబడు మహా ప్రభావ శాలినీ! హృదయాకాశమునందు స్వేఛ్ఛావిహారమొనరించు మాతా!
భారతీ! నన్ను దయజూడుము; అని భావము.
ఈపద్యంలో 1 నవాంబుజోత్పల కరాంబుజ!
2భూషణ రత్నదీపికా చుంబిత దిగ్విభాగ!
3 శ్రుతి సూక్తి వివిక్త నిజప్రభావ!
4 భావాంబర వీధి విశ్రుత విహారిణి! అనే యీనాల్గు విషయాలూ విశ్లేషింప దగినవి.
మొదటిది: ఆమె కరములు అంబుజములట! అంబుజములు రెండురకములు .పగటికి తామరలు పద్మములు.రేయికి కలువలు. ఆమెహస్తము లీ రెంటిని బోలి యుండునట. రేయింబవళ్ళు ఆమెచేతులకు పని. యేమిపని? జ్ఙానామృతమును పంచుపని.అక్షరామృతమునందించుపని, పద్మమునందు మకరంద ముండును.మాత సరస్వతి హస్తమున జ్ఙానామృతముండును. దానినామె నారాధించువారికి రేయింబవళ్ళు వితరణ మొనర్చును. ఆహా! ఎఱ్ఱనగారి యూహ యెంత గొప్పది!!!
ఇఁక రెండవ యంశము: ఆమెభూషణములు రత్నదీపములట!ఔను రత్నదీపికలే! శ్రుతులే యామెకు నిజభూషణములు. వాటిప్రభావము విశ్వ వ్యాప్తమేగదా! భారతీయ జ్ఙాన వికాసమునకు వాని వెలుగులే యాధారము.
3శ్రుతి సూక్తి వివిక్త నిజప్రభావ! వేద సూక్తుల యందు ఆమెప్రభావము అడుగడుగునా ప్రస్ఫుట మగుట మనకు విదితమే" అక్షరం పరమంపదం"- ఆఅక్షరమైన పరంబ్రహ్మ స్వరూపావిష్కరణకు అక్షరం అవసరంగదా! ఆఅక్షరమే ఆమెరూపము, ఆమెస్వభావము, ఆమెప్రభావము.
4 భావాంబర వీధి విశ్రుత విహారిణి! హృదయాకాంశంలో తిరుగు లేని సంచారంచేసే తల్లి.ఆమాట నిజమే!
కానీ, భావాంబరమని " అంబర"- శబ్దాన్ని యెఱ్ఱన ప్రయోగించుటలో నేదో ప్రత్యేకత యున్నది. అంబరము అనుపదమునకు
ఆకాశము అను నర్ధమేగాక వస్త్రము అను నర్ధముకూడా ఉన్నది. హృదయమనే కేన్వాసుపై చెరగని ముద్రవైచుకొని యెటుబోయిన నటువచ్చు(మూవీ) స్వరూపముగలదట! ఈచిత్ర మెంత చిత్రము!
మనము మరియొక దాని నుపేక్షించితిమి ." శారద చంద్ర చంద్రికా డంబర చారుమూర్తి" శరత్కాలమునందలి చంద్రుని వెన్నెలనుదలపించు చల్లని మనోహర రూపిణి! మాత సరస్వతి చల్లనిది. ఆమెకరుణ సూర్యాతపమువంటిదికాదు, చంద్రాతపమును బోలి చల్ల నిది. వెన్నెలను జ్ఙానముగా పెద్దల సూచన! అందుచేత చల్లగ మెల్లగ జ్ఙాన సంపదను యిచ్చుతల్లీ!యని కవియను చున్నాడు.
ఇటులీ పద్యము అనవద్యము హృద్యమునై చదువుల తల్లి యంతః సత్త్వమును వ్యక్తమొనర్చు
పరమామ్నాయ సదృశమై యొప్పారు చున్నది.
స్వస్తి! 🙏🙏🙏🙏🌷🌷🌷🌷🌷🌷🌷🌷🌷👏🌷🌷🌷🌷🌷👏
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి