11, ఏప్రిల్ 2022, సోమవారం

రాజకుమారీ! విను.

 ॐ  సీతాదేవికి ఉపదేశం పేరుతో, అనసూయ తెల్పిన లోకహితం 

  


రాజకుమారీ! విను. 

    తల్లిదండ్రులు, సోదరులు, అందఱూ హితాన్ని గూర్చేవారే.  సహృదయులే కానీ, 

    వీరందఱూ కొంత పరిమితి వఱకే మేలు చేకూర్చగలరు. 

    కానీ పతి అపరిమిత సుఖాలనిస్తాడు. అంతేకాదు, మోక్షప్రాప్తికి తోడ్పడతాడు. కనుక పతికి సేవలొనర్పని సతి నిజంగా అధమురాలు. 

    ఆపదలయందే ధైర్యము, ధర్మము, మిత్రుడు, భార్య -  వీరికి పరీక్ష జరుగుతుంది. 

    వృద్ధుడు, రోగి, మూర్ఖుడు, నిర్ధనుడు, అంధుడు, బధిరుడు, కోపిష్ఠి, అతిదీనుడూ - ఐన పతిని గూడ అవమానపఱచు స్త్రీ నానావిధ నరకయాతనలూ పొందుతుంది. 

    త్రికరణశుద్ధిగా పతిపాదములను సేవించడమే స్త్రీకి ఏకైక ధర్మము, వ్రతము, నియమము. 


    ప్రపంచమున పతివ్రతలు నాలుగు విధాలుగా ఉంటారు.  

1. తన పతిని దప్ప కలలో కూడా పరపురుషుని స్మరింపని స్త్రీయే "ఉత్తమ పతివ్రత" యని వేదాలు, పురాణాలు తెలుపుతాయి. సజ్జనులు కూడా వక్కాణిస్తారు. 

2. పరపురుషుని తన సొంతసోదరుని/తండ్రిని/కుమారునివలే భావించే స్త్రీ మధ్యమ శ్రేణికి చెందిన పతివ్రత. 

3. తన ధర్మాన్ని విచారించి, తన వంశమర్యాదలను పాటించి, మనో నిగ్రహం కలిగియుండే స్త్రీ తృతీయ శ్రేణికి చెందినదని వేదాలు పేర్కొంటున్నాయి. 

4. గత్యంతరంలేని కారణాన భయంచే పతివ్రతగా ఉండే స్త్రీ ప్రపంచంలో "అధమాధమురాలు" అని ఎఱగాలి. 

    పతిని మోసగిస్తూ, పరపురుషుని ప్రేమించే స్త్రీ అనేక కల్పాలవరకూ రౌరవాది నరకయాతనలకు గురవుతుంది. 

    కోటి జన్మలవఱకూ ప్రాప్తించే దుఃఖాలని కూడా సరకుచేయకుండా, క్షణికసుఖానికై కక్కుర్తిపడే స్త్రీ "కులట" అనబడుతుంది. 

    మోసం, కపటం లేకుండా పతివ్రతాధర్మాలను పాటించే స్త్రీ అనాయాసంగానే పరమపదాన్ని పొందుతుంది. 

    పతికి ప్రతికూలంగాసంచరించే స్త్రీ, మఱుజన్మలో చిన్న వయస్సులోనే వైధవ్యాన్ని పొందుతుంది. 

    స్త్రీ పతిసేవా పరాయణయై ఆయన సంరక్షణలో ఉన్నచో ఆమె పవిత్రతకు ఏమాత్రం భంగం వాటిల్లదు. 

    లేనచో స్త్రీ ప్రకృతిననుసరించి, ఆమె పవిత్రతను కోల్పోయే ప్రమాదముంది. 

    పతి సేవలో ఆమెకు సద్గతి లభిస్తుంది. 

    తన పాతివ్రత్య ప్రభావంచే తులసి ఈ నాటికీ శ్రీహరికి అత్యంత ప్రీతిపాత్రమైనది. లోకంలో పూజలందుకొంటోంది. వేదాలు ఆమె కీర్తిని గానం చేస్తాయి. 


    సీతా! విను. 

    నీ నామాన్ని స్మరించిన స్త్రీలెల్లరూ పాతివ్రత్య ధర్మాలను పాటిస్తారు. 

    నీవు శ్రీరామునికి ప్రాణప్రియమైనదానవు. 

    ఈ పతివ్రతా ధర్మాలని లోకహితార్థమై నీకు తెలిపాను. 


चौपाई 


मातु पिता भ्राता हितकारी। मितप्रद सब सुनु राजकुमारी।।

अमित दानि भर्ता बयदेही। अधम सो नारि जो सेव न तेही।।

धीरज धर्म मित्र अरु नारी। आपद काल परिखिअहिं चारी।।

बृद्ध रोगबस जड़ धनहीना। अधं बधिर क्रोधी अति दीना।।

ऐसेहु पति कर किएँ अपमाना। नारि पाव जमपुर दुख नाना।।

एकइ धर्म एक ब्रत नेमा। कायँ बचन मन पति पद प्रेमा।।

जग पति ब्रता चारि बिधि अहहिं। बेद पुरान संत सब कहहिं।।

उत्तम के अस बस मन माहीं। सपनेहुँ आन पुरुष जग नाहीं।।

मध्यम परपति देखइ कैसें। भ्राता पिता पुत्र निज जैंसें।।

धर्म बिचारि समुझि कुल रहई। सो निकिष्ट त्रिय श्रुति अस कहई।।

बिनु अवसर भय तें रह जोई। जानेहु अधम नारि जग सोई।।

पति बंचक परपति रति करई। रौरव नरक कल्प सत परई।।

छन सुख लागि जनम सत कोटि। दुख न समुझ तेहि सम को खोटी।।

बिनु श्रम नारि परम गति लहई। पतिब्रत धर्म छाड़ि छल गहई।।

पति प्रतिकुल जनम जहँ जाई। बिधवा होई पाई तरुनाई।। 

   Ramacharitamanas Aranya Kanda 5/3-10  


दोहा/सोरठा  


सहज अपावनि नारि पति सेवत सुभ गति लहइ।

जसु गावत श्रुति चारि अजहु तुलसिका हरिहि प्रिय।।5(क)।।

सुनु सीता तव नाम सुमिर नारि पतिब्रत करहि।

तोहि प्रानप्रिय राम कहिउँ कथा संसार हित।।5(ख)।।  


    ఇది అసలైన భారతీయత. 

    ప్రస్తుతం నేతిబీరకాయలో నెయ్యి అయింది కదా! 


                              =x=x=x=  


  — రామాయణం శర్మ  

          భద్రాచలం

కామెంట్‌లు లేవు: