12, ఏప్రిల్ 2022, మంగళవారం

పునర్జన్మలు - పరలోకాలు

 *పునర్జన్మలు - పరలోకాలు*



*నోట్ :- ఇది కేవలం ఒక అవగాహన కోసం మాత్రమే పోస్ట్ చెయ్యబడింది.*


👉 ఆత్మ ఒకటే . అదే జీవాత్మ ( జీవి యొక్క ఆత్మ) గా, పరమాత్మ ( భగవంతుని ఆత్మ..సర్వాత్మ) గా ఇలలో పిలవబడుతున్నది.


👉 పరిమిత తత్త్వం గల జీవాత్మ, అపరిమిత తత్త్వం గల పరమాత్మ లో కలవడమే లేక మార్పు చెందటమే మోక్షం అని ముక్తి అనీ చెప్పబడింది.


👉 ఆత్మ జీవాత్మ గా సుదీర్ఘ యాత్ర సాగించి చివరికి పరమాత్మ గా పరిణితి చెందటమే ప్రతీ ఆత్మ యొక్క ఏకైక లక్ష్యంగా ఉంది.


👉 ఆత్మ ( అద్వైత స్థితిలో) నిరాకారము, నిర్గుణమైనది. చేతనత్వం కలది. ఆత్మలోని తొలి మార్పు స్వయం జనితం. అదే ప్రేరణ. ప్రేరణే సంకల్పం ( ద్వైత స్థితి) . సంకల్పమే సృష్టి. సృష్టే ప్రకృతి ( స్త్రీ) - పురుషుల ( పురుషుడు) గుణములకు, ఉత్పత్తికి కారణం. వీటి విశాల స్వరూపమే విశ్వం. సమస్త దృశ్యాదృశ్య అండపిండ బ్రహ్మాండములకు నిలయం. అదే పరమాత్మ (ఆత్మ) విశ్వరూప సందర్శనం.


👉 పరమాత్మ నిరాకారం. నిర్గుణమైనప్పటికి పరిమిత తత్త్వం ( స్వయంజనితం) గల (పరమాత్మ అంశ అయిన) జీవాత్మ గా పరిణితి చెందినప్పుడు, జీవాత్మ సగుణమై ( పురుషత్వం) సాకారం ( శరీరం, ప్రకృతి తత్త్వం) పొంది ( స్వయంజనితం) జీవిగా బాసిస్తున్నది. 


👉 కనుక , ప్రతీ ప్రాణి ( ప్రాణం ఉన్న పదార్థం) కి ప్రాణం ( ఆత్మ) చేతనత్వం ( పురుషుడు) మరియు శరీరం అచేతన్వం ( స్త్రీ) ప్రకృతి. 


👉 శరీరానికి మూలం, ఆధారం ప్రాణమే. కారణం ప్రాణమే శరీరానికి ఉత్పత్తి చేయును. శిథిలమగునది శరీరం కాబట్టి శరీరం లేకున్నను ప్రాణం ఉంటుంది. కానీ ప్రాణం లేకుండా శరీరం ఉండదు. 


👉 జనించునది ( పుట్టునది) జన్మ. మారునది ( పరిణామం) మరణం. 


👉 పుట్టునది ప్రాణం. మారునది శరీరం, కానీ ప్రతీ ప్రాణికి మూలాధారమైన ఆత్మ మటుకు నిశ్చలం, నిర్వికారం అయి ఉంది.


👉 ప్రతీ జీవి జన్మించినప్పుడు నిరాకారమైన ప్రాణంతో ( చేతనత్వం) మరియు సాకారమైన శరీరంతో ( అచేతనత్వం) కూడి ఉండును. 


👉 ప్రతీ జీవి మరణించినప్పుడు శిథిలమైన స్థూల శరీరాన్ని వీడి, చైతన్యవంతమైన ప్రాణంతో ( ఆత్మతో) వెడలిపోవును.


👉 ఆత్మ బింబం. జీవాత్మ ప్రతిబింబం. ఆత్మ నిర్వికారము, జీవాత్మ సాకారం. ఆత్మ నిర్గుణం, జీవాత్మ సగుణము. ఆత్మ శాశ్వతం, జీవాత్మ అశాశ్వతం ( పరిణామం వలన) ఆత్మ మారనది, జీవాత్మ  మారునది (ఆత్మోన్నతి కోసం) . ఆత్మకు జన్మలేదు. జీవాత్మ కు జన్మకలదు. ఆత్మకు మరణం లేదు. జీవాత్మకు మరణం కలదు ( మార్పు) . ఆత్మ ప్రకృతికి లోబడదు. జీవాత్మ ప్రకృతికి లోబడుతుంది. ( సంకల్ప సహితం) 


👉 జీవి తనకు తాను స్మరించే నేను - యే జీవాత్మ, అదే ప్రకృతికి మూలాధారమైనది.


👉 నేను యే అహంభావం ( సగుణం) , అహంకారం ( దుర్గుణం) కు కారణం.


👉 నేను ( జీవాత్మ) లేనినాడు మిగిలింది నేనైన నేను ( జీవాత్మ గా ఉన్న పరమాత్మ) .


👉 నేను ( అహంభావం) ఆత్మ యొక్క నిజస్థితి ( పరమాత్మ తత్త్వం) .


👉 నేనే ( అహంకారం) ఆత్మ యొక్క మాయాస్థితి. అదే జీవాత్మ ( ప్రకృతి తత్త్వం) .


👉 జనన మరణ రూప శరీరం ( ప్రకృతి) ను తనకు తానుగా పొంది, నేను ( ఆత్మ- పురుషుడు- నిజస్థితి) నేనే ( జీవాత్మ- ప్రకృతి తత్త్వం- మాయా స్దితి) గా మారుతుంది. అదే జన్మ ( పుట్టుక).


👉 శరీరం (ప్రకృతి) ను తనకు తానుగా ఉత్పత్తి ( సంకల్పంతో) చేసుకొని జీవాత్మ (పురుషుడు) సశరీరధారియై జీవిగా సృష్టి లో విరాజిల్లుతోంది.


👉 అన్ని జీవములలో కెల్లా మానవ జీవమే శ్రేష్టంగా ఉండునది. ఆత్మోన్నతికి మానవ జన్మనే మూలాధారం. అదే మోక్షానికి సోపానం ముక్తికి మార్గం.

                       -:0:-

కామెంట్‌లు లేవు: