12, ఏప్రిల్ 2022, మంగళవారం

ప్రాణహితకు పుష్కరశోభ*

 *ప్రాణహితకు పుష్కరశోభ*


13-04-2022 నుండి  25-04-2022 వరకు ప్రాణహిత పుష్కరాలు.


ఎప్పుడూ ఎడతెగక పారే నదులున్నచోట నివసించమని శాస్త్రోక్తి. అందుకే పూర్వం మన మహర్షులు, పూర్వీకులు నదుల చుట్టూ తమ జీవనాన్ని ఏర్పరచుకొన్నారు. జీవ నదులు మనకు భగవంతుడు ప్రసాదించిన ప్రకృతి సంపదలు. సనాతన సంస్కృతీ, సంప్రదాయాలన్నీ నదులతో పెన వేసుకొన్నవే. ఆ నదుల వల్లనే మనం తినడానికి కావలసిన ధాన్యం లభిస్తోంది. అందుకుగాను నదులపై మనం చూపించే కృతజ్ఞతా భావ సమర్పణే పుష్కరం.


మన సంస్కృతిలో నదీ స్నానానికి విశేష స్థానం ఉన్నది. పర్వకాలాలలో, గ్రహణాదులలో, యజ్ఞయాగాది క్రతువుల ప్రారంభ, ముగింపు సందర్భాలలో ఇంకా అనేక చోట్ల నదీ స్నానాన్ని ఆచరించాలని ధర్మశాస్త్రం చెబుతోంది.


గురువు మేషరాశి మొదలుకొని పన్నెండు రాశులలో సంచరించే సమయంలో ఆయా నదులకు పుష్కరాలు ఏర్పడుతాయి. ఈ సమయంలో దేవతలకు గురువైన బృహస్పతితో పాటుగా పుష్కరుడు, మూడున్నర కోట్ల దేవతలందరూ ఆ నదిలో కొలువుంటారు. 


ఆ సందర్భంలో ఆయా నదులలో స్నాన, దాన, పిండ ప్రదానాది కర్మలను ఆచరించడం ద్వారా పాపాలన్నీ తొలగి పవిత్రతను పొందడమే గాక, పితృ దేవతలకు మోక్షాన్ని కలిగించినవారవుతారు. పుష్కర స్నానానికి అంతటి మహత్తు ఉన్నది.


ప్రస్తుతం గురువు మీనరాశిలో ప్రవేశించడం వలన ప్రాణహిత నదికి పుష్కరం ఏర్పడుతోంది. ఈ సందర్భంలో పుష్కర స్నానాన్ని ఆచరించి విశేష ఫలితాలను పొందుదాం.


*శుభంభూయాత్*

కామెంట్‌లు లేవు: