22, మార్చి 2026, ఆదివారం

రామాయణం -8 )

 శ్రీరామ (15 )


               ( వాల్మీకి రామాయణం -8 )


🙏 శ్రీరామ జయరామ జయజయరామ 🙏 సర్వే జనాః సుఖినో భవన్తు 🙏


  (22-3-'26 ' ఉదయం ' పోష్టు తరువాయి భాగము)


బ్రహ్మదేవుని ఆజ్ఞానుసారం వాల్మీకి మహర్షి 

" రామాయణము " ను, శ్రీరామ పట్టాభిషేకం వరకు ఆరు కాండలలోను, తరువాత జరిగిన వృత్తాంతమును ఉత్తర కాండలోను, వివరిస్తూ, మొత్తం ఏడు కాండములలో, ఐదు వందల సర్గలలో,ఇరువది నాలుగు అక్షరములతో కూడిన గాయత్రీ మహామంత్రమును పొందుబరుస్తూ, ఇరువది నాలుగు వేల శ్లోకములలో ఆ మహా కావ్యమనే కల్పవృక్షమును సృష్టించాడు.


చరితవ్రతుడైన ఆ వాల్మీకి మహర్షి ఈ కావ్యమును "రామాయణము" "మహత్తరమైన సీత చరిత్ర" "పౌలస్త్య వధ" అనే మూడు పేర్లతో రచించాడు.


రావణాసురుని సంహరించిన పిదప, అయోధ్యా నగరంలో పట్టాభిషిక్తుడై, రాముడు రాజ్యపాలన చేస్తుండంగా వాల్మీకి మహర్షి ఈ రామాయణ మహా కావ్యాన్ని రచించారు.

రాముడి రాజ్యపాలన మొదలై దాదాపు పదివేల సంవత్సరములు గడిచిపోయినవి.

శ్లో// దశవర్షసహస్రాణి గతాని సుమహాత్మనోః /

ప్రాప్తయోర్వివిధాన్ భోగా నతీతః శిశిరాగమః //

(సీతారాములు గార్హస్థ్యసుఖముల ననుభవించుచుండగా పదివేల సంవత్సరములు గడిచెను.

శిశిర ఋతువు గడచిపోయినది)

సీతాదేవి గర్భందాల్చినది.

గర్భిణియైన సీత కోరిక తీర్చాలని రాముడు

 " కిమిచ్ఛసి వరారోహే కామః కః క్రియతాం తవ "

(ఓ !సీతా ! నీకు ఏమి కోరిక ఉన్నది. నేను నీ కోరిక ఏది తీర్చవలెను ?)

అన్నాడు.

సీత చిరునవ్వుతో," తపోవనములు చూడాలని,

మహాఋషుల పాదాల దగ్గర కొన్నాళ్ళు ఉండాలని కోరికగా ఉన్నది " అని చెప్పింది.

రాముడు " అలాగే, రేపు తప్పక పంపెదను " అన్నాడు.

ఆ మరుసటిరోజే ఒక విచిత్రం సంభవించింది. 

" రావణుని అంతఃపురంలో సంవత్సరం పాటు ఉన్న సీతాదేవి పాతివ్రత్యాన్ని కొందరు అయోధ్యావాసులు శంకిస్తున్నట్లు "

గూఢచారులు రామునితో చెప్పారు.

హతాశుడైన రాముడు తన మూలంగా ఇక్ష్వాకు వంశం అపకీర్తి పాలు కాకూడదనుకున్నాడు.

 ప్రజాభీష్టానికి తలయొగ్గాడు.

సీత పాతివ్రత్యం విషయంలో వ్యక్తిగత అభిప్రాయమును,తన సౌఖ్యాన్ని తృణీకరించాడు.

ప్రజల అభీష్టాన్ని మన్నించడమే ప్రజాపాలకుడిగా తన కర్తవ్యమని భావించిన రాముడు గర్భవతిగా ఉన్నప్పటికీ సీతాదేవిని అరణ్యాలకు పంపాడు.


వాల్మీకి మహర్షి ఆమెకు తన ఆశ్రమంలో ఆశ్రయమిచ్చాడు.

ఆమెకు జన్మించిన లవ,కుశులకు తాను రచించిన రామాయణాన్ని ఉపదేశించాడు.

వేదశాస్త్రములను అభ్యసించినవారు, గాంధర్వవిద్యా నిపుణులు అయిన ఆ ఇద్దరు బాలురూ అనేక ఋషి సమూహాల ఎదుట ఆ రామాయణాన్ని మధురంగా గానం చేస్తుండే వారు.

వారి గాన మాధుర్యానికి శ్రోతలు ఆనంద తన్మయులయ్యే వారు.

ఈ మాట రాముని చెవిన పడింది.

వారిని రాజసభకు ఆహ్వానించి రామాయణం గానం చేయించాడు.

సభాసదులతో ,

" ఓ ! జనులారా ! వీరిరువురూ మునులే అయినను రాజలక్షణములతో ప్రకాశించుచున్నారు.

గాయకులైనను తపస్సంపన్నులు.

వీరు గానము చేయనున్న సీతాచరితము నాకు ఊరట కలిగించునది యగుటచే శ్రేయస్కరము.

సావధాన చిత్తులై వినుడు "

అన్నాడు.

మనశ్శాంతి పొందవలె ననెడు అభిలాషచే

ఆ గానమునందు ఆసక్తచిత్తుడై ముందు చెప్పబోయే విధంగా తన్మయత్వంతో రామాయణాన్ని వినసాగాడు.


 లవ కుశులు రామాయణ గాథ ఇలా గానంచేయడం ప్రారంభించారు.


                రామాయణ గాథ.



" ఇక్ష్వాకు వంశీయుడైన దశరథ మహారాజు అయోధ్య రాజధానిగా కోసలదేశాన్ని ప్రజారంజకంగా పాలిస్తున్నాడు.


కౌసల్య, సుమిత్ర, కైకేయి, ఆయన ధర్మపత్నులు.


వారికి సంతానం లేదు.


సంతానం కోసం కులగురువైన వసిష్ఠ మహర్షి, అమేయ తపస్సంపన్నుడైన ఋష్యశృంగ మహర్షుల ఆధ్వర్యంలో ధశరథుడు అశ్వమేధ యాగము, పుత్రకామేష్టి, నిర్వర్తించాడు.


అదే సమయంలో లోక కంటకుడైన రావణుడు పెట్టే బాధలు భరించలేని దేవతలు శ్రీ మహావిష్ణువును శరణు వేడుకున్నారు.


శ్రీమహావిష్ణువు వారికి అభయం ఇచ్చాడు.


శ్లో// భయం త్యజత భద్రంవో హితార్థం యుధి రావణమ్/

సపుత్ర పౌత్రం,సామాత్యం,సమిత్ర,జ్ఞాతి,బాన్ధవమ్/

హత్వా క్రూరం దురాత్మానం దేవర్షీణామ్ భయావహమ్/

దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ/

వత్స్యామి మానుషే లోకే పాలయన్ పృథివీ మిమామ్//


(దేవతలారా! భయం విడిచి పెట్టండి. మీకు క్షేమమగు గాక! క్రూరుడు,దురాత్ముడు, దేవతలకు ఋషులకు,బాధ కలిగిస్తున్న ఆ రావణుని, సపుత్ర,పౌత్ర, అమాత్య, మిత్ర జ్ఞాతి,బాంధవ, సహితంగా వధిస్తాను.

పదకొండు వేల సంవత్సరములు భూలోకంలో నివసించి, భూమిని పాలిస్తాను).


ఈ విధంగా దేవతలకు అభయం ఇచ్చి, విష్ణు మూర్తి తాను మానవలోకంలో అవతరించుటకు తగిన స్థానమును గురించి ఆలోచించాడు.


 పుత్ర సంతానం కోసం "పుత్రకామేష్టి" అనే యజ్ఞము చేస్తున్న దశరథ మహారాజుకు పుత్రుడుగా జన్మించాలని సంకల్పించాడు.


శ్లో//తతః పద్మపలాశాక్షః కృత్వాత్మానం చతుర్విధమ్/

పితరం రోచయామాస తదా దశరథం నృపమ్//

(పద్మపత్రాక్షుడైన ఆ శ్రీమహావిష్ణువు అప్పుడు తనను నాలుగు విధములుగా చేసుకొని, దశరథుని తండ్రిగా చేసికొనుటకు సంకల్పించెను).


ఆ సమయంలో అత్యంత దీక్షా, నియమాలతో దశరథమహారాజు "పుత్రకామేష్టి" చేస్తున్నాడు.

అప్పుడు ఆ అగ్నికుండము నుండి గొప్ప తేజస్సుతో కూడిన "ప్రాజాపత్య పురుషుడు" ఆవిర్భవించాడు.

ఆయన చేతులలో వెండి పళ్ళెంతో మూత పెట్టబడిన ఒక బంగారు పాత్ర ఉంది.

 ఆ పాత్రలో దేవతలచేత నిర్మించబడిన "పాయసము" ఉన్నది.

ప్రాజాపత్య పురుషుడు ఆ పాత్రను దశరథునకు ఇచ్చి

" ఓ రాజా ! నీ యజ్ఞానికి దేవతలు సంతోషించారు.

ఈ పాయసమును నీ భార్యలచేత తినిపింపుము. మీకు సంతతి కలుగును " అని చెప్పి అంతర్థానం చెందాడు.

దశరథమహారాజు ఆ పాయసంలో సగభాగము పెద్ద భార్య "కౌసల్య" కు,

మిగిలిన సగంలో, సగభాగము రెండవ భార్య "సుమిత్ర"కు,

ఆ మిగిలిన భాగంలో, సగభాగము మూడవ భార్య 

"కైకేయి" కి,

మిగిలిన భాగం అంతా తిరిగి "సుమిత్ర" కు ఇచ్చాడు.

ఆ పాయసం సేవించిన ఆ రాణులు ముగ్గురు గర్భవతులై అప్పటి నుండి పన్నెండవ నెల అయిన "చైత్ర మాసం" శుక్లపక్షం లో పుత్రులను ప్రసవించారు.

 శుక్లపక్ష నవమీ తిథి యందు

దేవమాత అయిన "అదితి" అధిదేవతగా వున్న పునర్వసు నక్షత్రంలో,

సూర్యుడు, కుజుడు, గురువు, శుక్రుడు, శని అనే అయిదు గ్రహాలు తమ తమ ఉచ్చ రాశులలో ఉండగా,

మధ్యాహ్న కాలమున,

గురువు, చంద్రుడు కలిసి ఉన్న కర్కాటక లగ్నంలో,

జగన్నాధుడు,

సర్వ లోకముల చేత ఎల్లప్పుడూ నమస్కరింపబడే వాడు,

సమస్త శుభ లక్షణములతో కూడిన వాడు,

 శ్రీ మహావిష్ణు అవతారము, 

సౌభాగ్యంతో కూడుకొన్నవాడు, 

ఇక్ష్వాకు వంశ వర్ధనుడు, 

అయిన శ్రీరామ చంద్రుని, కౌసల్యాదేవి ప్రసవించింది.

తరువాత, పుష్యమీ నక్షత్రంతో కూడిన మీన లగ్నంలో కైకేయీ దేవి, భరతుడు అనే పుత్రుని ప్రసవించింది.

మరుసటి రోజు మధ్యాహ్నము, ఆశ్రేషా నక్షత్రముతో కూడిన, కర్కాటక లగ్నమందు,లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనే ఇద్దరు కవల పిల్లలను సుమిత్రాదేవి ప్రసవించింది.

అప్పుడు జగత్తంతా ఆనందపరవశమై పోయింది.

గంధర్వులు గానం చేశారు.

అప్సరసలు నృత్యం చేశారు.

దేవదుందుభులు మ్రోగినై.

ఆకాశం నుండి పుష్పవర్షం కురిసింది.

అయోధ్యానగరం ఉత్సవాలలో మునిగి పోయింది.


(సశేషం)

శుభమస్తు.

తూములూరి మధుసూదనరావు,

22-3-'26.

కామెంట్‌లు లేవు: