22, మార్చి 2026, ఆదివారం

నాదరూపా

 🌹నాదరూపా🌹


నాదరూపముగా ప్రకటితమవుతున్న మహాశక్తినే నాదరూపా అంటున్నాం. 

నాదము ఈ సృష్టి అంతా ఎల్లెడలా నిండి వుంది. ప్రకృతి అంతా నాదమయం. 

రోదసి నిత్యమూ చేస్తున్న శబ్దము ఓంకారము అని శాస్త్రజ్ఞులు తెలుసుకుని ప్రకటించారు కూడా. 

అమ్మవారిని ఓంకార పంజర శుకీమ్ అని కీర్తిస్తాం. ఓంకారమనే నాదపంజరంలో 

ఆ కీరవాణి మన హృదయాలలోనే వుంది. వాయువు స్పర్శ లేకుండా పుట్టే ధ్వనిని 

అనాహతము అంటారు. ఆ శబ్దం హృదయపద్మం దగ్గర పుడుతుంది.

హృదయనాద రూపంలో ప్రతి జీవుడిలో కూడా ఆ అమ్మ ఉనికి తెలుస్తూనే ఉంటుంది.

శంకరుడికి కూడా తనువెల్లా నాదమే అని త్యాగరాజు కీర్తించాడు, 'నాద తనుమనిశం శంకరం' అని. 

శ్రీకృష్ణుడు కూడా తన వేణునాదం ద్వారా ఆబాలగోపాలాన్నీ ఆకట్టుకుని, గోపికా వల్లభుడయ్యాడు. 

నారదుడు, తుంబురుడు మొదలైన వారు, నాదోపాసన చేసి ఆ స్థాయిని అందుకున్నారు. 

అమ్మ నాదరూపిణి, అమ్మని "నాదబిందు కళాది నమో నమః" అని అరుణగిరినాథర్ కీర్తించాడు.

పరా, పశ్యంతీ, మధ్యమా, వైఖరీ అని వాక్కు నాలుగు విధములు. 

ఈ నాలుగు కలిసి ఒక్కటిగా నాదమవుతున్నాయి. ప్రాణంలో వాయువు కదలుతున్నప్పుడు

వచ్చేవే ఈ నాదాలు. హంసోపనిషత్తు ప్రకారము నాదములు పది. 

అవి, చిణీ, చిణిచిణీ, ఘంటా, శంఖ, వీణా, తాళ, వేణు, భేరీ, మృదంగ, మేఘ నాదాలు. 

నాదస్థానము సూక్ష్మతమమైనది. దానిని అందుకోవటానికి ఉపాసన కావాలి. 

ఎవరు ఏ నాదంలో ఆ అమ్మ అనుభూతిని పొందుతారో ఆ నాదమే అమ్మ. 

నాదరూపంలో అందరీనీ తరింపచేస్తున్న, ఆ నాదరూప కు వందనం.🌹 


🌹 నామరూప వివర్జితా🌹


నామ రూపములు రెండిటినీ త్యజించినది ఆ అమ్మ, అని ఈ నామానికి అర్ధం. 

ఎవరి గురించైనా తలచుకోవాలంటే, మొదటిలో నామం, రూపం అవసరం. 

సాధన చేస్తూ ఉంటే, ఆ రెండూ అవసరం లేదు. తలిస్తే చాలు తలపున ప్రత్యక్షమయ్యే 

జనని ఆ జగన్మాత. మన అమ్మ పేరు చెప్తేనే అమ్మ మనకు గుర్తు వస్తుందా, అక్కర్లేదే. 

అమ్మ, నాన్న అని అనుకోంగానే వాళ్ళు మనసులో మెదలటం లేదూ. అమ్మని పేరుతో 

పిలుస్తున్నామా, రూపాన్ని చూసే అమ్మ అంటున్నామా, నిత్యం చూసేవారిని చూడటానికి 

నామరూపాలు అవసరం లేదు. ముఖం కేసి చూసి మాట్లాడినా కూడా, ధ్యాస ఆ ముఖం మీద 

ఉండదు కదా. అదే విధంగా ఆ జగన్మాత విషయంలో కూడా అంతే. కొన్నింటికి నామం వుండి 

రూపం ఉండదు, కొన్నింటికి రూపం వుండి నామం ఉండదు. అమ్మకు ఆ రెండూ లేవు.  

కేవలము ఉండుట మాత్రమే ఉన్నది. దేనికీ కట్టుబడని, ఆ నామరూప వివర్జిత కు వందనం. 🌹


🌹హ్రీంకారీ🌹


హ్రీం అనేది ఆ తల్లి బీజాక్షరం. హ్రీః అంటే లజ్జ, సిగ్గు.

అమ్మని ఈ నామంలో హ్రీంకారీ అంటున్నామంటే, సిగ్గును కలుగచేస్తున్న తల్లి అని భావం. 

హకారం సృష్టి శక్తినీ, రకారం స్థితి శక్తినీ, ఈకారం లయ శక్తినీ సూచిస్తాయి. 

హ్రీం శబ్దములోనే హరి నామం కూడా వుంది. తద్వారా, హరి కూడా అమ్మే అని తెలుస్తోంది. 

హ్రీంకారము రూపాన్ని ఇస్తుంది, ఆ రూపానికి అందాన్నిస్తుంది, దానికి ప్రకాశాన్నిస్తుంది. 

హిరణ్యానికి ఆ కాంతులు, ఆ వర్ణాలు ఈ అమ్మ వలననే వచ్చాయి. హిరణ్మయి అంటేనే అమ్మ. 

సూర్యుడికి కూడా ఆ బంగరు కిరణాలు ఈ అమ్మ నుంచే వచ్చాయి. 

హిరణ్మయం అంటే అంతా అమ్మే అని చెప్పటం. 

శ్రీ సూక్తం కూడా 'హిరణ్యవర్ణాం హరిణీం' అనే ప్రారంభం అవుతుంది. 

సహజంగా ఉండాల్సిన సిగ్గు రూపంలో అందరిలోనూ ఉంటున్న, ఆ హ్రీంకారి కి వందనం. 🌹🌹🌹🙏🙏🙏🌹🌹🌹

కామెంట్‌లు లేవు: