*సంక్షిప్త రామాయాణ పారాయణం*
*శ్రీరామనవమి వరకు*
🌸🌸🌸🌸
*2 వ రోజు*
🌸*అయోధ్య కాండ*🌸
****
శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం రఘుకులాన్వయ రత్నదీపం
ఆజానుబాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి.
****
కోసలదేశంలోని అయోధ్యా నగరం సర్వశోభాయమానంగా అలరారుతున్నది. మిథిలానగరం నుంచి వచ్చిన పెళ్లి వారందరికీ ఆతిథ్యాలు అందించారు. వశిష్ఠులవారి ఆదేశానుసారం నూతన దంపతులకు జరిపించవలసిన కార్యక్రమాలన్నీ జరిపించారు. పౌరులందరూ ఉత్సవాలు జరుపుకుని సంతోషసాగర తరంగాలలో తేలియాడుతున్నారు. ఒకనాడు భరతుడు, శత్రుఘ్నడు తమ తాతగారి వద్దకొంత కాలం ఉండి రావడానికి వెళ్లారు.
రోజులు ఆనందంగా గడిచిపోతున్నాయి. రాముడి శౌర్య ప్రతాపాలను ప్రజలు వేనోళ్ల కొనియాడుతున్నారు.
ఒకరోజు దశరథుడు మంత్రి, సామంత , పురోహిత, దండనాదులతో సమావేశం ఏర్పాటుచేశాడు. వయసు పైబడిన రీత్యా అగ్రజుడైన రామచంద్రునికి రాజ్యభారాన్ని అప్పగించి విశ్రాంతి తీసుకోవాలని ఉంది, మీ రేమంటారు అని అడిగాడు. మీరు అనుమతిస్తే త్వరలోనే శ్రీరామ పట్టాభిషేకం అన్నాడు.
ఆ మాట విన్నంతనే అందరూ శ్రీరామచంద్రమూర్తి రాజుకావాలన్న మా మనసులోని మాటనే మీరూ చెప్పారని సంతోషం వ్యక్తం చేశారు. దీనితో మహారాజు వారందరికీ అభివాదం చేసి కులగురువులు వశిష్ఠ వామదేవులవైపు చూసి పట్టాభిషేకానికి సుమూహూర్తం నిర్ణయించమని కోరాడు. అందుకు వశిష్ఠులవారు అప్పటికప్పుడే పుష్యమీ నక్షత్రయుక్త సుముహూర్తం నిర్ణయించి రేపే అభిషేకం అన్నాడు.
వెంటనే రామచంద్రుని సభామందిరానికి పిలిపించి పట్టాభిషేకం గురించి తెలియజేసి రాజధర్మాలు, సదా గుర్తుంచుకోవాలన్నాడు. భరతుడు నగరంలో లేని సమయంలోనే పట్టాభిషేకం జరిగిపోవాలన్నాడు.
రాముడు తండ్రికి పాదాభివందనం చేసి అక్కడి నుంచి వెళ్లి తల్లి కౌసల్యకు ఈ విషయం చెప్పాడు. పట్టాభిషేకానికి వ్రతదీక్షను తమచేత పూర్తిచేయించాల్సిందిగా కోరాడు.
కైక- దశరథుడి వరాలు.....
దేశవాసులంతా సంబరాలలో మునిగిపోయారు. అదే సమయంలో కైకేయి దాసి మంధర ఈ ఉత్సవాల హడావుడి చూసి పరిచారికను అడిగింది. రామచంద్రుల వారి పట్టాభిషేక సంరంభాల గురించి పరిచారిక తెలియజేసింది. వెంటనే మంథర కైకేయి మందిరానికి వెళ్లి, కైకేయిని ఉద్దేశించి, అంతా అయిపోయింది. రామచంద్రుడు రాజుకాబోతున్నాడు. ఇక నువ్వు నీ కుమారుడి బతుకు నాలాగే అంటూ విషం వెళ్ల గక్కింది. భరతుడు రాజు కావాలని నూరిపోసింది . దశరథడు గతంలో కైకేయికిఇచ్చిన రెండు వరాలు గుర్తుచేసింది. ఇప్పడు వరాలు తీర్చమని కోరమని చెప్పింది. కైకేయికి ముందు ఇష్టం లేకపోయినా మంథర మాటలు క్రమంగా పనిచేసి అలక మందిరం చేరింది. దశరధుడు అలక మందిరం చేరి విషయం తెలుసుకుని బాధపడ్డాడు. బ్రతిమాలాడు. కన్నీరు కార్చాడు. అయినా కైకేయి భరతుడి పట్టాభిషేకం జరగాలనిపట్టుబట్టింది. రాముడు 14 సంవత్సరాలు అరణ్య వాసం చేయాలని, నారబట్టలు కట్టి సంచరించాలని కోరింది.కైకేయి మాటలకుదశరథుడు మూర్ఛపోయాడు. మరోవైపు రామ పట్టాభిషేకానికి పనులుసాగుతున్నాయి. ఇంతలోనే కైకేయి రాముడిని పిలిపించి తండ్రిగారు తనకు ఇచ్చిన వరాల గురించి తెలియజేసింది. రాముడు అమ్మా....నాన్నగారు స్వయంగా ఈ విషయం చెప్తేనేను కాదంటానా..వారు ఆదేశిస్తే ప్రాణాలైనా విడవడానికి నేను సిద్ధమే కదా అని అన్నాడు. అమ్మా దీనికి ఇంత ఆలోచన ఎందుకు,వెంటనే వనవాసానికి బయలుదేరుతున్నాను అన్నాడు రాముడు.
లక్ష్మణుడికి ఈ వార్త తెలిసి ఉగ్రుడయ్యాడు. రాముడు శాంతపరిచాడు. కౌసల్యా మాత విషయం తెలుసుకుని తల్లడిల్లింది. అరణ్యవాసం తప్పదని రాముడు చెప్పాడు. లక్ష్మణుడు అన్నా నేను నీవెంటే అన్నాడు. సీతమ్మవారిని వద్దని వారించినా, ఒప్పుకోలేదు. అరణ్యవాసానికి సిద్ధమైంది.కులగురువులకు నమస్కారం చేసిరామచంద్రుడు తన నిర్ణయం తెలిపాడు. వారూ వద్దని వారించారు. అయినా రామచంద్రమూర్తి పితృవాక్య పరిపాలనే పరమధర్మంగా భావిస్తానని చెప్పి వారి నుంచి సెలవుతీసుకున్నాడు. అందరికీ నమస్కరించి సుమంత్రుడు తెచ్చిన రథంలో సీతా, రామ లక్ష్మణులు అరణ్యవాసానికి బయలుదేరారు.
*వనవాసం.....*
రథం కదులుతుంటే జనం ప్రాణాలు పైపైనే పోయినట్టు విలపిస్తున్నారు. కొందరు రామచంద్రడు లేని అయోధ్యలో ఉండలేమంటూ రథం వెంట బయలుదేరారు. జనం వెంట వస్తుండడంతో రాముడు రథం వేగం పెంచమని సుమంతుడికి సూచించాడు. అయినా కొందరు రథం వెంట పరుగులు తీస్తూనే ఉన్నారు. సాయంత్రానికి ఒక నది ఒడ్డుకుచేరి అక్కడ విశ్రమించారు. జనం కూడా అక్కడ విశ్రమించారు. రాత్రి పొద్దుపోయాక, సుమంత్రా ఈ జనం ఇలాగే నాతో అడవికి వచ్చేలా ఉన్నారు. అందువల్ల వారు నిద్రలో ఉండగానే మనం ఇక్కడి నుంచి వెళ్లిపోవడం ఉత్తమం అని చెప్పి రాత్రి వేళ రథాన్ని ఎక్కి అక్కడి నుంచి బయలు దేరారు. అలా వెళ్లి గంగా నదీ తీరం చేరారు. అక్కడ గుహుడు వారికి స్వాగతం పలికి ఆతిథ్యం ఇచ్చాడు. సుమంత్రుడికి చెప్పవలసిన జాగ్రత్తలుచెప్పి వీడ్కోలు పలికాడు రాముడు. సీతారామ లక్ష్మణులు గుహుడు ఏర్పాటుచేసిన పడవలో గంగానది దాటి అరణ్యంలోకి ప్రవేశించారు. వారు కంటికి కనిపించనంత దూరం వరకూ వారిని చూస్తేనే ఉండి వెనక్కు తిరిగివచ్చాడు గుహుడు.
సీతా,రామలక్ష్మణులు అలాఅరణ్య మార్గంలో ముందుకు సాగుతున్నారు. సర్యాస్తమయ వేళకు ప్రయాగకు సమీపంలో ని భరద్వాజ మహర్షి ఆశ్రమం చేరుకున్నారు. మహర్షికి నమస్కరించి వారి ఆతిథ్యం స్వీకరించారు. కోసలకు దగ్గరగా ఉండడంతో అక్కడ ఉండడం సరికాదని రామచంద్రుల వారుతలచారు. మహర్షులవారి ఆశీర్వచనం తీసుకుని అక్కడి నుంచి మాల్యవతీ తీరం చేరి చిత్రకూట ప్రాంతంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నారు.
అక్కడ అయోధ్యలో అంతా భారమైన హృదయంతో ఉన్నారు. సుమంత్రుడు రామచంద్రుని విడిచి అయోధ్యలో రాజమందిరానికి వెళ్లాడు. ఒంటరిగా వచ్చిన సుమంత్రుడిని చూసి దశరధుడు కన్నీరుమున్నీరై మూర్ఛపోయాడు. పుత్రశోకంతో దశరధుడు ఆ రాత్రి కన్నుమూశాడు. వెంటనే భరత, శతృఘ్నులను వశిష్ఠుల వారు, మంత్రులు పిలిపించారు. భరత శతృఘ్ణులు అయోధ్యప్రవేశిస్తూనే జరగరానిదేదో జరిగిందని గమనించారు. తండ్రిమరణవార్త విని తల్లడిల్లారు. తన పట్టాభిషేకానికి తల్లి వరాలు కోరిందని, సీతా,రామ లక్ష్మణులు అరణ్యవాసం చేస్తున్నారని తెలిసి ఉగ్రుడయ్యాడు. అన్నగారు లేని రాజ్యం తనకు వద్దన్నాడు. ఇలాంటి పాపిష్ఠిపని తాను చేయనని భరతుడు తల్లికి తెగేసి చెప్పాడు.
సర్వజనప్రియుడైన శ్రీరామచంద్రుడిని అడవి నుంచి తీసుకువచ్చి సింహాసనం ఎక్కిస్తానన్నాడు. వెంటనే తండ్రికి నిర్వహించవలసిన అంతిమ సంస్కారాలు నిర్వహించాడు.
మరునాడు రాజ్యాధికారులందరూ వచ్చి , రాజ్యం రాజులేకుండా ఉండరాదు కనుక రాజ్యభారం వహించాల్సిందిగా భరతుడిని కోరారు. వారి మాటలను భరతుడు సున్నితంగా తిరస్కరించాడు. జ్ఞానసమానులైన మీరు నా మనసు ఎరుగని వారు కారు. అన్నగారే రాజ్యభారం వహించాలని తెగేసి చెప్పాడు. అన్నగారిని తీసుకువచ్చి సింహాసనం పై కూర్చోబెట్టి నేను వనవాసం చేస్తాను. తక్షణం అన్నగారి వద్దకు వెళ్లేందుకు ఏర్పాట్లు చేయండి అన్నాడు.చతురంగ బలాలతో అయోధ్యావాసులతో కలసి భరతుడు శ్రీరామచంద్ర మూర్తిని తీసుకువచ్చేందుకు బయలుదేరాడు. గుహుడి సాయంతో గంగా నదిని దాటారు. అక్కడి నుంచి భరద్వాజ మహర్షి ఆశ్రమానికి వెళ్లారు. వశిష్టులవారిని ముందుంచుకుని భరద్వాజ మహర్షి వద్దకు వెళ్లాడు. ఏం నాయనా రాజ్య పాలన విడిచి ఇలా వచ్చావేం, నీ తండ్రి కామమోహితుడై కుమారుడిని అడవులకు పంపాడు. నీకు ఎదురులేకుండా ఉంటుందని వారిని వధించడానికి నీవు వెళ్లడం లేదు కదా అని భరద్వాజ మహర్షి అన్నాడు.
మహర్షి నోట ఆమాట రావడంతో భరతుడి కళ్లు అశ్రుపూరితాలయ్యాయి. నన్ను శంకిస్తున్నారా మహర్షీ అంటూ తలెత్త కుండా కంటతడి పెట్టి నిలబడ్డాడు. రామచంద్రమూర్తికి తిరిగి సింహాసనం అప్పగించేందుకు భరతుడు వచ్చాడని తెలిసి భరద్వాజ మహర్షి సంతోషించాడు. రాముడు చిత్రకూటంలో నివశిస్తున్నాడని చెప్పాడు. ఆ రాత్రి భరద్వాజ మహర్షి ఆతిథ్యం స్వీకరించి మరునాడు అందరూ శ్రీరామ దర్శనార్థం బయలు దేరారు. భరతుడి సేనలతో అరణ్యంలో అల్లకల్లోలం మొదలైంది. వన్యమృగాలు భయంతో పరుగులుతీస్తున్నాయి. ఈ అలికిడికి రాముడు, లక్ష్మణుడితో, లక్ష్మణా అడవి అల్లకల్లోలంగా ఉంది. ఏంజరుగుతున్నదో చూసిరా అని రాముడు, లక్ష్మణుడిని పంపాడు. అల్లంత దూరంలో కోసల దేశ సేన కంటపడింది. భరతుడు తమను చంపడానికే సేనావాహినిని తీసుకుని వస్తున్నాడని లక్ష్మణుడు భావించి అన్నగారికి విషయం నివేదించాడు. ఆదేశిస్తే భరతుడిని , అతని సేనలను బూడిద చేస్తానన్నాడు లక్ష్మణుడు. రాముడు ప్రశాంత చిత్తంతో లక్ష్మణుడిని శాంతింపచేశాడు.
భరతుడిని ఇలా అనుమానించడం తగదన్నాడు. ఇంతలోనే భరత ,శతృఘ్నులు పరివారంతో కూడి పర్ణశాల చేరుకున్నారు. శ్రీరామచంద్రమూర్తిని చూడగానే భరత,శతృఘ్ణులు పాదాలపై పడ్డారు. వారిని పైకి లేపి కుశల ప్రశ్నలు అడిగాడు. తండ్రి గారు ఎలా ఉన్నారని అడిగాడు రామచంద్రమూర్తి. రాజధర్మం సక్రమంగా నిర్వర్తిస్తున్నావా ...అని అడుగుతూ పోతున్నాడు. దుఃఖం పొంగిపొర్లుతున్న కంఠంతో ఇంకెక్కడి తండ్రి అన్నయ్యా, నీ వు వనవాసానికి వచ్చిన అనంతరం వారు కాలం చేశారు అని తండ్రి మరణవార్త చెవినవేశాడు. రాముడు లేచి పితృకర్మలు నిర్వహించాడు.
భరతుడు నెమ్మదిగా రామచంద్రమూర్తి వద్దకు చేరి అన్నయ్యా, అమ్మ మనసు మారింది. నువ్వు సింహాసనాన్నిఅధిష్ఠించి జనరంజకంగా పాలనచేయి అని ప్రాధేయపడ్డాడు. రాముడు అది సరికాదన్నాడు. తండ్రికి ఇచ్చిన మాట తప్పనన్నాడు. ఇంతలో జాబాలి లేచి ఈ లోకంలో ఎవడికి ఎవడు బంధువు, చనిపోయినవారి కి ఇచ్చిన మాట మీద ఇంత పట్టుదల ఎందుకు అంటూ హితవచనాలు చెప్పడానికి ప్రయత్నించాడు. రాముడు సున్నితంగా ఆమాటలను తిరస్కరించాడు. సత్యం ఒక్కటే లోకాన్ని రక్షిస్తుంది అని రాముడు సత్యంగొప్పదనాన్ని వివరించాడు. రాముడి మనసు మార్చడం ఎవరితరమూ కాదని నిశ్చయించుకున్నారు. ఇక చేసేది లేక భరతుడు రామపాదుకలు రాముడి ముందు పెట్టి, వీటిని పవిత్రం చేయి, ఈ పద్నాలుగేళ్లూ ఈ పాదుకలే రాజ్యపాలనం చేస్తాయి .నేను జటావల్కాలు ధరించి వాటిని పూజిస్తాను అన్నాడు. రాముడు అలాగేచేశాడు . భరతుడు ఆ పాదుకలనుతీసుకుని అయోధ్య చేరాడు. కొంతకాలానికి తన మకాం నందిగ్రామానికి మార్చాడు.
ఇక్కడ అరణ్యవాసంలో ఉన్న రామచంద్రమూర్తి చిత్ర కూటం విడిచి అత్రి మహర్షి ఆశ్రమ ప్రాంతానికివెళ్లారు. అత్రి మహర్షికి, అనసూయాదేవికీ వారు నమస్కరించారు. వారు సీతారామ లక్ష్మణులను ఆశీర్వదించి అక్కున చేర్చుకున్నారు. అనసూయాదేవికి సీతామాత పాదాభివందనం చేసి నిలబడింది. అనసూయాదేవీ సీతారామ కల్యాణ వైభవ ఘట్టాన్నిసీతాదేవి చేత చెప్పించుకుని విని సంతోషించింది. అనసూయాదేవి సీతామహాలక్ష్మికి వస్త్రాలు బహుకరించింది.వాటిని ధరించింది. ఆ రాత్రి అక్కడ విడిది చేసి మరునాడు వారు ముందుకు కదిలేందుకు సిద్ధమయ్యారు.
మీరు వెళ్లే దారిలో రాక్షసులు ఉంటారు జాగ్రత్త అంటూ మహర్షులు సూచన చేశారు. వారికి ప్రణమిల్లి సీతా,రామ లక్ష్మణులు అరణ్యమార్గంలో ముందుకు సాగారు.
****( అయోధ్యకాండ సమాప్తం)****
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి