శ్రీశ్రీశ్రీ
*సంక్షిప్త రామాయణ పారాయణం*
*శ్రీరామ నవమి వరకు*
****
*3 వ రోజు*
*అరణ్య కాండ*
శ్రీరాఘవం దశరథాత్మజ మప్రమేయం
సీతాపతిం, రఘుకులాన్వయరత్నదీపం
ఆజానుభాహుం అరవింద దళాయతాక్షం
రామం నిశాచర వినాశకరం నమామి
****
*శ్రీరామ రామ రామేతి* *రమేరామే మనోరమే*
*సహస్రనామ తత్తుల్యం* *రామనామ వరాననే*
****
*దండకారణ్య ప్రవేశం.....*
అత్రి మహర్షి ఆశ్రమం నుంచి బయలుదేరిన సీతారామ లక్ష్మణులు దండకారణ్యంలోకి ప్రవేశించారు. అక్కడ మహర్షుల ఆశ్రమాలు సందర్శిస్తూ ముందుకు కదులుతున్నారు. శ్రీరామచంద్రా ఈ దుర్గమారణ్యంలోనూ రాక్షసుల బారి నుంచి మమ్మల్ని రక్షించాల్సింది నువ్వే అంటూ మునులు శ్రీారామచంద్రుడిని కోరారు.వారి వద్ద సెలవుతీసుకుని భీకరారణ్యం మధ్య సీతారామ లక్ష్మణులు సాగుతున్నారు. ఇంతలో విరాధుడనే రాక్షసుడు ఒక్క ఉదుటున వారిమీద దాడి చేతి సీతమ్మను పిడికిట బంధించాడు.వాడిపై ఎన్ని అస్త్రాలు ప్రయోగించినా వాడు చావలేదు. ఆ దశలో వాడిని కాలికిందవేసి తొక్కి గొయ్యి తీయించి అందులో పూడ్చిపెట్టడానికి రామలక్ష్మణులు సిద్ధమయ్యారు. అప్పుడు తెలుసుకున్నాడు విరాధుడు,....వచ్చిన వాడు రామచంద్రమూర్తి అని, ఆయన చేతిలో తనకు శాపవిమోచనమని తెలుసుకున్నాడు .
శాపవిమోచనం పొందిన విరాధుడు రామచంద్రమూర్తికి నమస్కరించి గంధర్వలోకానికి వెళ్లాడు. సీత ఊ పిరి పీల్చుకున్నది. అక్కడి నుంచి వారు శరభంగ మహర్షి ఆశ్రమానికి , అటు నుంచి సుతీక్షణుడి ఆశ్రమానికి వెళ్లారు. వారి దర్శనం చేసుకుని అటునుంచి అగస్త్యులవారి ఆశ్రమానికి వెళ్లారు. అగస్త్యులవారి సూచన మేరకు వారు గోదావరి తీరంలోని పంచవటి వైపు అడుగులు వేస్తున్నారు.
*జటాయువు....*
ఇంతలో మహాకాయుడైన జటాయువు సీతారామ లక్ష్మణులకు తారసపడ్డాడు. రాముడిని చూసి నాయనా నేను మీ తండ్రి దశరధుడికి స్నేహితుడిని. మా అన్న సంపాతి. మీ నాన్న గారు పుత్రులు కలగాలని పుత్రకామేష్ఠి యాగం చేసేటపుడు వారిని చూశాను. ఇప్పుడు పుత్రశోకంతో వారు మరణించారని తెలుసుకున్నాను, అంటూ దశరథ మహారాజు చేసిన అద్భుత పుత్రకామేష్ఠి యాగం, ఆ యాగఫలితంగా దశరథ తనయుల జననం గురించి ఆ నాటి ఆయాగ విశేషాల గురించీ కళ్లకు కట్టినట్టు సీతారామ లక్ష్మణులకు తెలియజేశాడు. మిత్రుడైన దశరథ మహారాజు కుమారులు కనుక ఈ అరణ్యంలోవారికి రక్షణగా ఉంటానని అన్నాడు జటాయువు.
*పర్ణశాల...*
గోదావరి నదీతీరంలో పంచవటి సుందర ప్రదేశంలో అన్నగారి ఆదేశం మేరకు లక్ష్మణుడు అందమైన పర్ణశాలను నిర్మించాడు. కాలం గడుస్తోంది. ఒకరోజు సీతారామ లక్ష్మణులు మాట్లాడుకుంటుండగా రావణాసురుని సోదరి శూర్పణఖ అనే రాక్షసి అక్కడ ఊడిపడింది. రాముడి అందానికి ముగ్థురాలైంది. నిన్ను భర్తగా పొందాలను కుంటున్నాను అన్నది.రాముడు కాదనేసరికి లక్ష్మణుడి వెంట పడింది. చివరకు శూర్ఫణఖ ముక్కూ చెవులను కోసి లక్ష్మణుడు దానిని అక్కడి నుంచి పంపించివేశాడు. శూర్పణఖకు జరిగిన పరాభవంతో తమపైకి వచ్చిన శూర్ఫణఖ సోదరులు ఖర,దూషణాదులను, అక్కడి రాక్షసమూకను రాముడు మట్టుపెట్టాడు. రావణాసురుడి కి విషయం తెలసింది.అతిలోక సుందరి సీతను తెచ్చుకోమని శూర్పణఖ రావణుడికి నూరిపోసింది.
*మారీచుడు.....*
శూర్పణఖ మాటలు విన్న రావణాసురుడు సీతాపహరణానికి ప్రణాళిక రచించాడు. అందుకు సాయం కోరి మారీచుడి దగ్గరకు వచ్చాడు. . అయితే రాముడి దెబ్బ ఏమిటో విశ్వామిత్ర మహర్షియాగ సమయంలోనే రుచి చూసి ఉన్న మారీచుడు, రాముడితో యుద్ధం కొని తెచ్చుకుని వంశ నాశనానికి పాల్పడకు అని హెచ్చరించాడు. సీతాపహరణ పాడు ఆలోచనను విరమించుకోమన్నాడు. రాముడు మానవ మాత్రుడు అన్నాడు. రావణా, నువ్వు రాముడిని తక్కువగా అంచనా వేస్తున్నావు. నీ వంశం సర్వనాశనం కావడానికే నీకు ఇలాంటి ఆలోచనలు వస్తున్నట్టున్నాయి. ఇక నిన్ను ఎవరూ రక్షించలేరు అన్నాడు.
*రామో విగ్రహవాన్ ధర్మః*
*సాధుః సత్యపరాక్రమః*
*రాజా సర్వస్యలోకస్య*
*దేవానాం మఘవానివ ॥*
శ్రీరాముడంటే ఏమిటో ఒక్క శ్లోకంలో నే కళ్లకు కట్టాడు *మారీచుడు:*
“శరీరము ధరించి దిగివచ్చిన ధర్మమే రామచంద్రమూర్తి.
సకలప్రాణికోటికి హితవుకలిగించే సాధుజీవనుడు. అతని పరాక్రమానికి తిరుగులేదు. దేవేంద్రుడు దేవతలకు ప్రభువైనట్టే, ఈ సమస్త చరాచరసృష్టికి ప్రభువైన పరమాత్మ ఈ శ్రీరాముడు”
రాముడు మూర్తీభవించిన ధర్మం. అతనితోపెట్టుకోకు అని హిత వచనాలు పలికాడు.
అయినా రావణుడు వినిపించుకోలేదు. నీ దగ్గర హితవచనాలు చెప్పించుకోవడానికి రాలేదన్నాడు రావణుడు.
అప్పుడు మారీచుడు ,లంకేశ్వరా....
*సులభాః పురుషా రాజన్* *సతతం ప్రియవాదినః*
*అప్రియస్య చ పథ్యస్య వక్తా* *శ్రోతాచః దుర్లభాః*
ఈలోకం చాలా చిత్రమైనది,
చుట్టూ చేరి , మన మనసుకు నచ్చే విధంగా తియ్యతియ్యగా ఉండే మాటలు మాట్లాడేవాళ్లు చాలామందే దొరుకుతారు. అవి మనకు ఇష్టం గా ఉంటాయి. కానీ మనసుకు కష్టమైనా మంచి చెప్పేవాడు ఒక్కడూ దొరకడు. దొరికినా మనం వాటిని పట్టించుకోం. అవి మనకు ఏనాడూ రుచించవు. ఇక నేను చేసేది ఏమీ లేదు అన్నాడు.
రావణుడి మాట వినకుంటే అతని చేతిలో చావు తప్పదని గ్రహించిన మారీచుడు, రావణుడి చేతిలో చావడం కన్న ,ఆ చావు ఏదో రామచంద్ర మూర్తి చేతిలో చనిపోయినా పుణ్యం వస్తుందనుకున్నాడు .మారీచుడు మాయా బంగారు లేడి రూపంలో పర్ణశాల వద్ద తిరిగి మాయం కావడానికి అంగీకరించాడు. అలా పర్ణశాల వద్ద తిరుగుతున్న మాయా లేడిని సీతమ్మవారు వచూశారు. ఇంత అందమైన లేడి చెంగు చెంగున గెంతులు వేస్తూ మన పర్ణ శాలలో ఉంటే ఎంతో బాగుంటుంది కదా అని రామలక్ష్మణులతో సీతమ్మవారు అన్నారు. లక్ష్మణుడు ఇది మారీచుడి మాయ. ఇలాంటి విద్యలు వాడికి బాగా తెలుసు మనం జాగ్రత్తగా ఉండాలి అన్నాడు. అయినా సీతమ్మవారు బంగారు లేడి గురించి చెబుతూనే ఉన్నారు. ఇంతగా ఆ లేడిపై సీతమ్మవారు మనసుపడ్డారు కనుక దానిని తీసుకురావాలని రామచంద్రమూర్తి నిర్ణయించుకున్నాడు. రాక్షసుడైతే వధిస్తాను, లేడి అయితే తెస్తానంటూ రాముడు బయలుదేరాడు, అది చిక్కినట్టే చిక్కి పొదలమాటున జారుకుంటున్నది అలా రాముడిని అడవిలో చాలా దూరం తీసుకువెళ్లింది. ఇక తప్పదనుకుని రాముడు బాణం సంధించాడు. పెద్ద పెట్టున హా లక్ష్మణా.... హా సీతా అని అరుస్తూ మాయా మారీచుడు నేలకూలాడు. మారీచుడు ఇలా తన గొంతుకతో హా లక్ష్మణా...హా సీతా అని కూలబడడం వెనుక ఏదో జరగరానిది జరగబోతున్నదని రాముడు వెంటనే పర్ణశాలకు వస్తున్నాడు. ఇంతలో హా లక్ష్మణా ...హా సీతా అన్న ఆర్తనాదం విన్న సీతమ్మతల్లి కలవర పడింది. భర్తకు ఏదో అపాయం జరిగిందని భావించి, లక్ష్మణుణ్ణి ఉన్నఫలంగా బయలుదేరి వెళ్లమనింది. లక్ష్మణుడు ఇదంతా మాయా లేడి నాటకంలో భాగమని, ఇది రాక్షస మాయ అని శ్రీరామచంద్రమూర్తికి భూ మండలం లో తిరుగేలేదని చెప్పాడు. అన్న ఆర్తనాదం వినిపించినా కదలకుండా కూర్చున్న నీకంటె శత్రువు మరొకడు లేదని సీతమ్మ వారు నిందించారు. ఈ సీత, రామచంద్రమూర్తి సొంతం. ప్రాణాలైనా విడుస్తాను కాని మరొకరికి దక్కను అన్న మాటలకు లక్ష్మణుడు నిశ్చేష్ఠుడయ్యాడు. సీతామాత పాదాలకు నమస్కరించి సమస్త దేవతలకు నమస్కరించి, వనదేవతలారా మీరే సీతామాతకు రక్ష అన్నాడు తగినజాగ్రత్తలు చెప్పి పర్ణశాల వెలుపలకు రావద్దని సూచించి లక్ష్మణ రేఖను గీచి, అన్నయ్య కోసం బయలుదేరాడు.
ఇదే అదనుగా రావణాసురుడు పర్ణశాల ప్రాంగణంలో అడుగుపెట్టాడు. సాధువు రూపంలో వెళ్లి , సీతమ్మను లక్ష్మణ రేఖ దాటి వెలుపలకు రప్పించి ఉన్నఫళంగా అపహరించి గగనమార్గాన బయలుదేరాడు.
ఈ హఠాత్పరిణామానికి మూర్ఛపోయిన సీతామహాసాధ్వి ఆ తర్వాత తేరుకుని రావణా నీ ప్రాణాలమీద ఆశవదులుకోనే ఈ పనిచేశావా. రాముడు నిన్ను నీ వంశాన్ని సర్వనాశనం చేస్తాడు. కోరి ప్రాణాలమీదికి తెచ్చుకుంటున్నావు అని హెచ్చరించింది. రావణుడు ఆ మాటలను తేలికగా కొట్టిపారేశాడు . లక్ష్మణా నిన్ను ఎన్ని మాటలు అన్నానయ్యా అందుకే అనుభవిస్తున్నాను. రామా , లక్ష్మణా ...రక్షించండి అంటూ సీత వేడుకుంటూ ఉంది. వనదేవతలారా నా దీన స్థితిని రామ లక్ష్మణులకు తెలియజేయండి అంటూ పెద్దగా అరుస్తూ ఏడుస్తూ ఉంది.
*జటాయువు.....*
సీతాదేవి ఆర్తనాదాలు జటాయువు చెవిలో పడ్డాయి. జరగరానిది జరిగిందని గ్రహించిన జటాయువు వాయువేగంతో గగనతలానికి వెళ్లి గమనించాడు. రావణాసురుడు సీతమ్మవారిని అపహరించుకుపోతున్నాడని గ్రహించి రావణాసురుడితో భీకరంగా తలపడ్డాడు. రావణాసురుడు జటాయువు రెక్కలు తెగనరికి ముందుకు సాగాడు. జటాయువు కుప్పకూలాడు.
రావణాసురుడు సీతమ్మను తీసుకుని గగన మార్గంలో సాగుతున్నాడు. కిందికి చూస్తే ఐదుగురు వానరులు ఒక కొండపై మాట్లాడుకుంటూ కనిపించారు. వారిని చూడగానే సీతమ్మవారు తన ఆభరణాలను మూటగట్టి వారి వద్ద వదిలింది. మళ్లీ ఎవరో మహిళను రావణాసురుడు అపహరించుకుపొతున్నాడని వానరులు గుర్తించారు. అలా పంపా మార్గాన సాగి సముద్రం దాటి తనతో తెచ్చుకున్న తనమృత్యుదేవతను అంతఃపురంలో దింపి ఆమె చుట్టూ కాపలాఉంచాడు రావణాసురుడు. ఆమె మనసు మార్చమని సేవకులను పురమాయించాడు. ఇవేవీ పనిచేయలేదు.సీతమ్మవారిఇక 12 మాసాలు గడువు ఇచ్చాడు. తననుస్వీకరించడమా లేక తనకు ఆహారంగా మారడమా తేల్చుకోమన్నాడు.
*రామ విరహం....*
రాముడు మారీచుడిని సంహరించి పర్ణశాల వైపు వస్తున్నాడు. అపశకునాలు గోచరించాయి. మారీచుడి అరుపు విని లక్ష్మణుడు సీతను విడిచి రావడం లేదు కదా . రాక్షసులనుంచి సీతకు ఏ ఆపదా కలగకుండు గాక అని మనసులో అనుకుంటూ వేగంగా అడుగులు ముందుకు వేస్తున్నాడు. ఎదరుగా లక్ష్మణుడు కనిపించాడు. రాముడి గుండె గుభిల్లుమనింది. లక్ష్మణా ఈ అరణ్యంలో సీతను ఒంటరిగా విడిచి వచ్చావా అన్నాడు. జరిగిన విషయం అన్నకు చెప్పి ఇద్దరూ వేగంగా పర్ణశాలకు వచ్చారు.పర్ణశాలలో సీతమ్మ కనిపించలేదు. చుట్టూ గాలించారు. అయినా కనిపించలేదు. లక్ష్మణా , సీత లేకుండా నేను బతకలేను అన్నాడు రాముడు. అన్నయ్యా నీవే ఇలా అయిపోతే ఎలా అంటూ ధైర్యవచనాలు చెప్పాడు. జంతువులు తినేశాయో, రాక్షసులు అపహరించారు ఏమీ తెలియని అయొమయ స్థితి. ఇద్దరూ ధైర్యం తెచ్చుకుని సీత జాడ తెలుసుకునేందుకు ముందుకు సాగుతున్నారు. ఇంతలో రెక్కలు తెగి కొన ఊపిరితో ఉన్న జటాయువు వారికి కనిపించాడు. జటాయువు జరిగిన విషయం చెప్పాడు. రావణుడు సీతను అపహరించాడని చెప్పి కన్నుమూశాడు . జటాయువుకు అంతిమ సంస్కారాలు నిర్వహించి స్నేహధర్మం నిర్వర్తించాడు రాముడు. అక్కడ నుంచి మతాంగాశ్రమం దాటి ముందుకుసాగుతున్న వారిపైకి కబంధుడనే రాక్షసుడు రామలక్ష్మణులను పిడికిట బంధించడానికి ప్రయత్నించాడు. వాడి రెండు చేతులనూ తెగనరికేశారు. వాడొక గంధర్వుడు. శాపవశంతో రాక్షసుడయ్యాడు. కబంధుడికి శాపవిమోచనం కలిగింది. అప్పుడు ఆ గంధర్వుడు మీ కష్టాలు త్వరలోనే తొలగి పోతాయి. మీకు ఒక మంచి స్నేహితుడు అవసరం . ఇక్కడికి దగ్గరలో రుష్యమూక పర్వతంపై సుగ్రీవుడనే వానర రాజు ఉన్నాడు . అతనితో మైత్రి మీకు శుభాన్ని చేకూరుస్తుంది అని చెప్పి మాయమయ్యాడు.
*శబరి.....*
కబంధుడు చెప్పిన దిక్కుగా రామలక్ష్మణులు నడుస్తున్నారు. మార్గమధ్యంలో ఒక ఆశ్రమం కనిపించింది. అది శబరి ఆశ్రమం. రామచంద్రమూర్తి కోసమే వేయి కళ్ళతో ఎదురు చూస్తున్నది. రామచంద్రుడికి అతిథి సత్కారాలు చేసింది. నాయనా రామచంద్రా నీ దర్శనంతో నా తపస్సు ఫలించింది అనింది. అక్కడ కొంత సేపు విశ్రమించి సప్త సాగర తీర్థంలో స్నానం చేసి పితృదేవతలకు తర్పణాలు విడిచారు.
మనసు కుదుటపడినట్టు అనిపించింది. చెడ్డ రోజులు దాటి అంతా శుభం జరగబోతున్నదన్న సూచనుల కనిపిస్తున్నాయని రాముడు లక్ష్మణుడుతో అన్నాడు.అలా మాట్లాడుకుంటూ వారు రుష్యమూక పర్వతం వైపు ప్రయాణం సాగిస్తున్నారు. అల్లంత దూరంలో రుష్యమూక పర్వతం కనిపిస్తోంది.........
*******
ఆపదా మపర్తారం దాతారం సర్వసంపదామ్
లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహమ్.
****
శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే
సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే
****
**** (అరణ్యకాండ సమాప్తం)****
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి