*కనువిప్పు..*
రెండుమూడేళ్ల క్రితం ఏప్రిల్ నెలలో ఒక శనివారం నాడు సాయంత్రం ఐదు గంటల సమయం లో మొగిలిచెర్ల అవధూత శ్రీ దత్తాత్రేయ స్వామివారి మందిరం ముందు ఒక కారు వచ్చి ఆగింది..అందులోనుండి తెల్లని దుస్తులు వేసుకున్న ఒక పెద్దమనిషి..ఆయన భార్యా దిగారు..ఇద్దరూ వయసులో పెద్దవారే..ఆయన కారు నుంచి క్రిందకు దిగగానే..ముందు స్వామివారి మందిరం చుట్టూ ఉన్న పరిసరాలను నిశితంగా చూసారు..అప్పటికి స్వామివారి మందిరం వద్ద సిమెంట్ రోడ్లు లేవు..మందిరం ముందు ఉన్న ఖాళీ స్థలమంతా మట్టి తోనే ఉండేది..ఒక్కక్షణం ఆయన ముఖం లో కొద్దిగా అసహనం కనబడింది.."సరస్వతీ..చూసుకొని నడువు..ఇక్కడ పెద్ద శుభ్రం గా లేదు..జాగ్రత్త.." అని తన భార్యతో చెప్పి మందిరం లోపలికి వచ్చారు..
కాళ్ళూ చేతులు కడుక్కొని..చేతులు వెనక్కు పెట్టుకొని..ఒక్కొక్క అడుగు జాగ్రత్తగా వేస్తూ..మెల్లిగా మందిరం లోపలి ప్రాంగణం అంతా ప్రదక్షిణగా తిరిగారు..ఆయన భార్య మాత్రం ..నమస్కారం చేసుకుంటూ..మధ్య మధ్యలో "దిగంబరా..దిగంబరా.." అంటూ తిరుగుతున్నది..ఒక ప్రదక్షిణ పూర్తి చేసిన తరువాత..మా సిబ్బంది కూర్చున్న టేబుల్ వద్దకు వచ్చి.."ఇక్కడ నిర్వహణ చేసే వారు ఎవరు?..ఎక్కడుంటారు..?" అని అడిగారు..మా సిబ్బంది నా వైపు చూపించారు..నా వద్దకు వచ్చారు..కూర్చోమని చెప్పాను..ఇద్దరూ కూర్చున్నారు.."మీరు..?..ఇక్కడా...?" అని సందేహంగా అడిగారు..నేను ధర్మకర్త గా ఉన్నాననీ..నాపేరు ప్రసాద్ అనీ చెప్పాను.."ఓహో..అలాగా.." అని.."మాది హైదరాబాద్ అండీ..అక్కడే స్థిరపడ్డాము..నేను సెంట్రల్ గవర్నమెంట్ లో అధికారిగా చేసి రిటైర్ అయ్యాను..పిల్లలు కూడా ఇతర దేశాల్లో వున్నారు..మాలకొండ చూద్దామని వచ్చాము..అక్కడ ఈ గుడి గురించి చెప్పారు..ఈవిడ నా భార్య సరస్వతి..తనకు అవధూత లన్నా..దత్త సంప్రదాయం అన్నా..భక్తి ఎక్కువ..తరచూ గాణుగాపురం వెళ్లి వస్తుంటాము..మాలకొండకు దగ్గరే కదా అని చూడాలని వచ్చాము..పర్లేదు సుమారైన క్షేత్రం గానే ఉంది..మాలకొండ వద్ద నుంచీ గమనిస్తున్నాను..చాలామంది కాషాయ వస్త్రాలు ధరించి వున్నారు..ఏదైనా దీక్ష తాలూకు వ్యక్తులా..ఇక్కడ చూస్తే..మొత్తం ఈ గుడి ప్రాంతం అంతా ఈ స్వాములతో నిండి పోయివున్నది..ఏమిటి ప్రత్యేకత..?" అని అడిగారు..
"ఇది దత్త దీక్షా సమయం..ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసం బహుళ పక్షం లో సుమారు పది పదిహేను వందలమంది దత్తదీక్ష తీసుకొని..నలభైరోజులూ నియమంగా వుండి..వైశాఖ శుద్ధ సప్తమి రోజు దీక్ష విరమణ చేస్తారు..దీక్ష సమయం లో ప్రతి శనివారం నాడు స్వాములందరూ మాలకొండకు వెళ్లి..అక్కడ దర్శనం చేసుకొని..సాయంత్రం ఇక్కడ వైభవంగా జరిగే పల్లకీసేవ లో పాల్గొనడానికి వస్తారు..ఈరోజు కూడా అదే జరిగింది..కాకుంటే..మీరెప్పుడూ చూడలేదు కనుక..మీకు కొత్తగా అనిపించి ఉంటుంది.." అన్నాను.."స్వామివారి పల్లకీసేవ ఎన్ని గంటలకు?" అని ఆయన భార్య అడిగారు.."ఏడు గంటలకు మొదలు అవుతుంది..రాత్రి తొమ్మిది వరకూ కొనసాగుతుంది.." అన్నాను.."ఏమండీ..అవధూత మందిరం అంటున్నారు..ఎలాగూ ఇంతదూరం వచ్చాము..పల్లకీసేవ చూసి వెళదాము.." అని ఆవిడ ఆయనను అడిగింది.."రాత్రికి ప్రయాణం కష్టం సరస్వతీ..ఇక్కడ రాత్రికి పడుకోవడానికి ఒక రూము వుంటే..అలానే వుందాము.." అన్నారు.."మీకోసం ఒక రూమ్ ఇస్తాను.." అని చెప్పి..మా సిబ్బందికి చెప్పి..వాళ్లకు వసతి చూపించాను..
ఆ రోజు పల్లకీసేవ లో ఆ దంపతులు పాల్గొన్నారు..దీక్షలో ఉన్న స్వాములు..ఇతర భక్తులూ..సుమారు వెయ్యిమంది పైగా ఆరోజు పల్లకీసేవ లో పాల్గొని తరించారు..పల్లకీసేవ అనంతరం..ఆ దంపతులు నా వద్దకు వచ్చారు.."ప్రసాద్ గారూ..సాయంత్రం కారు దిగినప్పుడు నాలో ఒక చులకన భావం ఏర్పడింది..ఈ పల్లెటూరు దగ్గరకు వచ్చామే..ఇక్కడ ఏముంది?..అనుకున్నాను..ఆ భావం పూర్తిగా తొలగిపోయింది..ఎంత వైభవంగా జరిగిందో పల్లకీసేవ..ఇంత భక్తి పారవశ్యాన్ని ఇదే చూడటం..నాకు కళ్ళకు నీళ్లు వచ్చాయి..ఇక మా ఆవిడ ఉద్వేగానికి హద్దు లేదు..పల్లకీ తోపాటు ప్రదక్షిణ చేస్తూ..దత్తా..దత్తా..అని కేకలు పెట్టింది..చాలా గొప్పగా ఉంది.." అన్నారు.."రేపుదయం కూడా హారతులు చూడండి..ఆతరువాత స్వామివారి సమాధి దర్శించుకొని తిరిగి వెళ్ళండి.." అన్నాను..
ఆ ప్రక్కరోజు ఆదివారం ఉదయం స్వామివారి ప్రభాతసేవ కూడా అత్యంత భక్తి తో చూసారు..విశేష హారతుల అనంతరం..స్వామివారి సమాధి దర్శించుకొని ఇవతలికి వచ్చి.."ప్రసాద్ గారూ..మాకు గొప్ప అనుభూతి కలిగింది..మాటల్లో చెప్పలేము..మళ్లీ మళ్లీ ఇక్కడకు వస్తాము..ఒక కోరిక అనుకున్నాము..ఈ దత్తదీక్ష ల సమయం లో ఇక్కడవున్న స్వాములకు ఉచితంగా ఆహారం ఏర్పాటు చేస్తున్నారని రాత్రి మీ అర్చకస్వాములు చెప్పారు..ఎవరైనా దాతలు వుంటే సహకరించమని కూడా చెప్పారు..మా దంపతులం ఒక నిర్ణయానికి వచ్చాము..ఈ దీక్ష ల సమయం లో మీకు వీలున్న ఏదేని రెండు శనివారాల్లో అన్నప్రసాదానికి అయితే ఖర్చు మేము ఇస్తాము..ఎంత అవుతుందో చెప్పండి..మాకు కూడా స్వాములకు సేవ చేసుకునే అవకాశం ఇవ్వండి..ఇది మా ప్రార్ధన అనుకోండి.." అన్నారు..ఖర్చు వివరం చెప్పాను..వెంటనే ఇచ్చేసారు.."ప్రసాద్ గారూ వచ్చే ఏడు..ఆపై సంవత్సరం కూడా..ఈ దత్తుడి దయవల్ల మాకు ఆయుష్షు ఆరోగ్యం ఉన్నంత కాలం ఈ క్షేత్రం లో దత్తదీక్ష ల సమయం లో రెండు శనివారాల అన్నప్రసాదం వ్యయం మేమే భరిస్తాము.." అని..నా రెండు చేతులూ పట్టుకున్నారు.."ముందు చులకనగా అనుకున్నాను కానీ స్వామివారు నాకు కనువిప్పు చేశారు..అందుకోసమే మమ్మల్ని రాత్రి ఇక్కడ ఉంచారేమో..వీలున్నప్పుడల్లా ఇక్కడికి వచ్చి..స్వామివారి దర్శనం చేసుకొని వెళతాము.." అన్నారు..
ఆనాటినుండి ప్రతి ఏడూ దత్తదీక్ష సమయం లో రెండు శనివారాల నాటి అన్నప్రసాదం ఖర్చుకు ఆ దంపతులు విరాళం ఇస్తూ వున్నారు..సంవత్సరం లో కనీసం రెండుసార్లు స్వామివారి సన్నిధికి వచ్చి..దర్శించుకొని వెళుతున్నారు..
సర్వం..
శ్రీ దత్తకృప!
(పవని నాగేంద్ర ప్రసాద్..శ్రీ దత్తాత్రేయ స్వామి మందిరం..మొగలిచెర్ల గ్రామం..వయా కందుకూరు..లింగసముద్రం మండలం..ప్రకాశం జిల్లా..పిన్ : 523114..సెల్..94402 66380 & 99089 73699).
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి