Sri Siva Maha Puranam -- 5 By Pujya Guruvulu Brahmasri Chaganti Koteswara Rao Garu
రుద్రపశుపతి నాయనారు
అరువదిమంది నాయనార్లలో రుద్రపశుపతి నాయనారు ఒకరు. సన్యాసి కూడా రుద్రం చదవాలి. అభిషేకం చేయకపోయినా రుద్రం పారాయణ చేస్తే వెంటనే పాపములు పటాపంచలు అవుతాయి. రుద్రపశుపతి నాయనారుకి ఒక లక్షణం ఉండేది. ప్రతిరోజూ కూర్చుని రుద్రాధ్యాయం చదువుతూ ఉండేవారు. అలా చదువుతున్నప్పుడు ఒక అనుమానం వచ్చింది. అందులో
‘యుధాయ చ సుధన్వనే చ నమ స్రుత్యాయ చ పథ్యా య చ నమః కాట్యాయ చ నీ ప్యాయ చ నమ స్సూద్యాయ చ సరస్యాయ చ నమో నా ద్యాయ చ వై శన్తాయ చ || నమః కూప్యాయ చావ ట్యాయ చ నమో వష్యా౯ య చావష్యా౯ య చ నమోమే ఘ్యాయ చ విద్యు త్యాయ చ నమ ఈద్ద్రియాయ చాతప్యాయ చ నమో వాస్తవ్యాయ చ వాస్తు పాయ చ || ఈ మాటలు ఉన్నాయి. ఇవన్నీ ఈశ్వరుడే అన్నాడు. అనగా నీరు, నీటిమీద నురుగు, చెట్టు, చెట్టు మీద పిట్ట చెట్టులో ఆకుపచ్చతనం ఈశ్వరుడు. నాయనారు తిరుమలయార్ ప్రాంతంలో ఉండేవారు. ఆయన ఈ రుద్రమును చదివి ఆకాశం ఈశ్వరుడు, మేఘం ఈశ్వరుడు, నీరు ఈశ్వరుడు, నురుగు ఈశ్వరుడు, చెట్టు ఈశ్వరుడు, పిట్ట ఈశ్వరుడు. కాబట్టి నేను ఇంట్లో కూర్చుని వీటన్నింటినీ చెప్తుంటే ఉపయోగం ఏమిటి? కాబట్టి నేను ఈశ్వరుడిలో చేరిపోయి ఈశ్వరానుభూతిని పొందుతాను’ అన్నాడు.
ఒకరోజున తెల్లవారుఝామున ఎవ్వరికీ చెప్పకుండా ఊరిబయటకు వెళ్ళి అక్కడ గల కొండమీద నుంచి ఒక సెలయేరు జాలువారుతున్న సెలయేట్లో నడుంలోతు నీళ్ళలో నిలబడ్డాడు. చల్లని నీటి స్పర్శకు ఈశ్వరుడు తనను కౌగలించుకున్న అనుభూతిని పొందారు. ఇవన్నీ ఈశ్వరుడు కదా! నేను ఈశ్వరుడిలో ఉన్నాను అని నమః ఫేన్యాయచ నమస్సికత్యాయ చ ప్రవా హ్యాయ చ’ అని పారాయణ చేసి బయటకి రాలేక రాలేక వచ్చేవాడు. ఒళ్ళు తుడిచేసుకుని పొడి బట్ట కట్టుకుని ఇంటికి వెళ్ళిపోయేవాడు. మరల మధ్యాహ్నం సంధ్యావందనం కోసం ఆ చెరువు దగ్గరకు వెళ్ళి నీళ్ళలో నిలబడి శివుని ధ్యానం చేసేవాడు. చుట్టూ కనిపిస్తున్న ప్రతివస్తువులో శివరూపమును చూసేవాడు. సాయంత్రం కూడా అదేనీటిలో అదే పరిస్థితి. ఇలా కొన్నాళ్ళు జరిగింది. చివరకు రానురాను ఆయనకు ఎవరు కనపడినా ఈశ్వరుడే కనపడేవాడు. ఆఖరికి దొంగ కనపడితే ‘నమః చోరాయచ’ అనేవాడు. అలా అంతటా ఈశ్వర దర్శనం చేస్తూ ఉండేవాడు. శంకరుడు ఇక నేను తప్ప ఇంకొకడు కనపడని నిన్ను నాలోకే తీసుకోవాలి అని నాయనారుని తనలోకి తీసుకున్నాడు. నాయనారు శివునిలో ఏకమయి పోయి తాను శివుడు అయిపోయాడు. దీనిని మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే నాయనారు భావనచేత మోక్షమును పొందినట్లుగా మనం గమనిస్తాము.
శం – భావయతి – మంచి భావములు ప్రవేశించి ఈశ్వరాభిముఖులై నిరతిశయ సుఖ స్వరూపమయిన శివునియందు కలిసి శివుడు అవుతారు. అటువంటి స్థితి కలగడం కోసమే మహానుభావుడయిన పరమాత్మ ఉపకారం చేశాడు. ఇటువంటి జ్ఞానమును శంభు స్వరూపం కటాక్షిస్తుంది. ‘శంభుః’ అన్న నామం, పరమశివుని రూపములలో ఆ శాంభవ స్వరూపం అంత గొప్పది అయింది. ఆ నామములు చెప్పుకుంటే చాలు ఉద్ధరణ కలుగుతుంది.
‘జ్ఞానదాతా మహేశ్వరః’ ఈశ్వరుని అనుగ్రహం వలన మాత్రమే జ్ఞానము కలుగుతుంది. ఆ జ్ఞానమును ఇచ్చేవాడికి మహేశ్వరుడు అని పేరు. శంభునామమును గట్టిగా పట్టుకుని ఆ నామముతో పిలిస్తే, ఆయన భావములను మార్చి మనసుని ఈశ్వరుని వైపు తిప్పుతాడు. సత్ప్రవర్తన కల్పిస్తాడు. చక్కని వ్యక్తిగా రూపు దిద్దుతాడు. ప్రతిరోజూ శంభు నామమును చెప్పుకుంటూ శంభు అనుగ్రహమును పొందాలి. ‘శం’ – ఈ లోకంలో సుఖము దగ్గర నుంచి నిరతిశయ సుఖం వరకు, ఊర్ధ్వలోక సుఖం వరకు ఎంత సుఖం ఉన్నదని అనుకుంటున్నారో అన్ని సుఖములను ఇవ్వడమును కామకోటని పిలుస్తారు. కామకోటి అనగా ఇక్కడ కోర్కెలను ఇవ్వడంతో మొదలుపెట్టి కోర్కెలు లేకుండా చెయ్యడం వరకు తీసుకువెళ్ళి, పుణ్యమును ఇచ్చి పుణ్యము వలన ఊర్ధ్వలోక ప్రాప్తి ఇచ్చి, మరల తిరిగి రానవసరం లేని పునరావృత్తి రహిత శాశ్వత శివసాయుజ్య స్థితి అనబడే మోక్ష స్థితి వరకు ఇవ్వగలిగిన అంచులన్నీ అమ్మవారి చేత పరిపాలించబడుతున్నాయి. ఆవిడ యవనిక ఎత్తి ఈ కామకోటిలో నిలబెడుతుంది. ఈ కోటిలో ఏ మెట్టుమీద నిలబడతారో దానికి తగినట్లుగా నిలబెట్టడానికి ఈ నామములు, ఈశ్వరానుగ్రహము రక్షిస్తాయి. రుద్రపశుపతి నాయనారు వృత్తాంతమే అందుకు ఉదాహరణ.
facebook.com/SriChagantiGuruvuGaariFollowersUnofficialPage
instagram.com/pravachana_chakravarthy
కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి