1, నవంబర్ 2022, మంగళవారం

శ్రీ కంచి పరమాచార్య వైభవమ్ -

 శ్రీ కంచి పరమాచార్య వైభవమ్ -

🙏


 చెన్నై - కంచి


ఒక ఆటోమొబైల్ ఇంజనీర్ తన జీవితంలో జరిగిన అనుభవాన్ని ఇలా పంచుకున్నాడు..


నేను చెన్నైలోని ఒక ప్రైవేటు కంపెనీలో ఆటోమొబైల్ ఇంజనీర్ గా పని చేస్తున్నాను. ఈ సంఘటన 2005లో నేను కుంభకోణం నుండి చెన్నైకు తిరుగుప్రయాణం చేస్తున్నప్పుడు జరిగింది. నేను నా కుటుంబంతో సహా వేసవి సెలవుల కొసం అక్కడికి వెళ్ళాము. మా బంధువుల ఇళ్ళకు వెళ్ళాము మరియు కుంభకోణంలో ఉన్న అన్ని దేవాలయాలను సందర్శించడం కూడా మా ప్రణాళికలో భాగమే. 


మా తిరుగు ప్రయాణం కోసం మే 24వ తేది ఉదయం 8 గంటలకు టికెట్స్ బుక్ చేసుకున్నాము. తమిళనాడులో ఉన్న పుణ్యక్షేత్రాలను సందర్శించడం చలా సంతోషం కలిగించే విషయం. తమిళనాడులో ఆలయ నగరముగా పేరుగాంచిన కుంభకోణంలోని దేవాలయాలు దర్శించడం నా చిరకాల వాంఛ.


మేము కుంభేశ్వర ఆలయం, సారంగపాణి ఆలయం మరియు శ్రీఒప్పిలిఅప్పన్ ఆలయాలు దర్శించాము. ఈ యాత్రలో చివరిగా కంచి మఠంను దర్శించటం మా ప్రణాళిక. మఠంలో ఉండగా నేను పొందిన అనుభూతి అనిర్వచనీయమైనది. మేము అక్కడ ఉండగా పరమాచార్య స్వామి వారి గురించి మఠం ధర్మకర్తలతో కొద్దిగా మాట్లాడాము. దాంతో నాకు వారి గురించి తెలుసుకోవాలని ఉత్సాహము మరియు ఆసక్తి కలిగి కొన్ని పుస్తకాలు తీసుకొన్నాను. తిరుగుప్రయాణంలో చదువుటకు నిశ్చయించుకున్నాను. 


ఆ రోజు రాత్రి నా కలలో మహాస్వామి వారు స్వప్న దర్శనమిచ్చారు. వారు నాతో,  "నా వద్దకు రండి" అని చెప్పారు. నేను మధ్యలోనే నిద్రలేచి సమయము చుస్తే ఉదయం 4 గంటలు. ఆ తరువాత నేను నిద్రపోలేదు స్వామి వారు నిద్రలో చెప్పిన దానిగురించే ఆలోచిస్తున్నాను. సుమారు ఉదయం 5:30 అప్పుడు నేను నా పిల్లలను భార్యను నిద్ర లేపి, సామాను సర్దుకొని తయారు అవ్వమన్నాను. ఎనిమిది గంటలకు మా తిరుగు ప్రయాణం కాబట్టి. అందరం అల్పాహారం ముగించుకొని మా అమ్మ, నాన్న మరియు బంధువులందరికి విడ్కోలు పలికి కారులో బస్సు ప్రాంగణానికి బయలుదేరాము. 


కారులో కూర్చున్న తరువాత నా భార్యతో, చెన్నైకి వెళ్ళేముందు కంచి వెళ్ళి కామకోటి మఠాన్ని దర్శించాలని ఉంది అని చెప్పాను. మరునిమిషములో మా ప్రణాళికను మార్చుకుని కంచి వెళ్ళాలని నిర్ణయించుకున్నాము. ఉదయం 7:30 ప్రాంతములో టికెట్ కౌంటరుకి వచ్చి కాంచీపురం వెళ్ళడానికి బస్సుల గురించి అడుగగా, 8:30కి ఉంది అని చెప్పారు. 


మేము చెన్నైకి పోయే బస్సు టికెట్స్ రద్దు చేసుకోవడం కుదరలేదు. కాంచీపురం బస్సు రావడంతో వెళ్ళి కంచి కామకోటి మఠంను సందర్శించాము. అక్కడకు వెళ్లగానే నా మనస్సుకు ఏదో తెలియని పులకరింతకలిగింది. అక్కడ చాల ఆహ్లాదంగా ప్రశాంతంగా అనిపించింది. ఒక గంటసేపు అక్కడ ఉండి మేము చెన్నైకి తిరుగు ప్రయాణం అయ్యాము. 


మేము ఇంటికి వెళ్ళాక T.V చూస్తే ఒక వార్తవిని చాలా ఆర్చర్యానికి లోనయ్యాము. మేము చెన్నై రావడానికి టికెట్స్ తీసుకున్న బస్సుకి ప్రమాదం జరిగి, దానిలో ప్రయాణిస్తున్న ప్రయాణికులకు తీవ్రమైన గాయాలు అయ్యాయి. ఇది చాలా విషాదకరమైన సంఘటన. 


కానీ నాకు ఇప్పటికి అర్థం కాని విషయం “హఠాత్తుగా ఎందుకు మా ప్రణాళిక మార్చుకున్నాము?” అని. ఆనాటినుండి నేను మహాస్వామి వారికి లొంగిపొయాను. నా జీవితాన్ని వారి పాదపద్మముల సేవకు అంకితం చెసాను. ఈరోజు వరకు లేవగానే నేను చేసే మొదటి పని పరమాచార్య స్వామి వారి పాద పద్మములు చూసి నమస్కరించడం. 


--- మూలం : స్వస్తిక్ టివి


అపార కరుణాసింధుం జ్ఞానదం శాంతరూపిణం

శ్రీ చంద్రశేఖర గురుం ప్రణమామి ముదావహం ।।

🙏

కామెంట్‌లు లేవు: